శివదేవయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శివదేవయ్య 13వ శతాబ్దానికి చెందిన సంస్కృతాంధ్ర కవి.

విశేషాలు

[మార్చు]

ఇతడు కాకతీయ చక్రవర్తులు గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల ఆస్థానంలో మహామంత్రిగా ఉన్నాడు.[1] [2]ఇతడు గొప్ప విద్వాంసుఁడు, రాజ్యతంత్రజ్ఞుఁడు. ఇతనికి సంస్కృతాంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు ఉంది. గోళకీ మఠాధిపతి అయిన విశ్వేశ్వర శంభువు ఇతని గురువు. మనుమసిద్ధికి తిరిగి రాజ్యాధికారం కట్టబెట్టడంలో ఇతడు తిక్కనకు మిక్కిలి సహకరించాడు.

రచనలు

[మార్చు]

పురుషార్థసారము

[మార్చు]

నూట అరవయ్యేళ్ల కాకతీయ సామ్రాజ్య చరిత్రలో సగానికి సగం కాలం మంత్రిగా వ్యవహరించిన శివదేవయ్య తన పరిపాలనానుభవ సారాన్నే ‘పురుషార్థ సారం’గా రచించివుంటాడని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ కావ్యం అలభ్యం. కానీ ఇందులోని తొంభై పద్యాలను పందొమ్మిది శీర్షికల క్రింద పదునాలుగవ శతాబ్దానికి చెందిన మడికి సింగన తన సకలనీతి సమ్మతం అనే పుస్తకంలో ఉదహరించాడు. ఈ పద్యాల్లో ఎన్నో జాతీయాలూ, నానుడులూ, పలుకుబళ్లూ కనిపిస్తాయి. ప్రజల్ని రక్షించకపోగా, వాళ్లను దోచుకుతినే పాలకులను విమర్శిస్తూ ఆయన ఓ పద్యం చెప్పాడు. ఇలాంటి వాడు, కుప్పల్ని తగలపెట్టి పేలాలు ఏరుకుతినే బాపతని శివదేవయ్య చీత్కరించుకున్నాడు. పాలకుల సుగుణాల జాబితా తయారుచేస్తూ అందులో ‘నాస్తిక ఖల సంగవర్జ’నాన్ని కూడా చేర్చాడు. పురుషార్థసారంలోని పద్యాలు మడికి సింగన సకలనీతి సమ్మతంలోనే కాకుండా పదహారో శతాబ్దానికి చెందిన లింగమగుంట తిమ్మన్న సంకలించిన ‘బాలబోధచ్ఛందం’లోనూ, అదే శతాబ్దానికి చెందిన పొత్తపి వెంకటరమణ కవి కూర్చిన ‘లక్షణ శిరోమణి’లోనూ కనిపిస్తున్నాయి.[2] దీనిని బట్టి ఈ గ్రంథం ఆ కాలంలో చాలా ప్రసిద్ధమయి ఉంటుందని ఊహించవచ్చు.

శివదేవ శతకం

[మార్చు]

"శివ దేవధీమణీ" అనే మకుటంతో ఇతడు ఈ శతకాన్ని రచించాడు.

అందులోని ఒక పద్యం మచ్చుకు[2]:

అరయగ పిన్ననాట సిరియాళుడనై, యెలప్రాయమందు సుం
దరుడను నంబియై, పదను తప్పిన గుండయగారి చందమై
ధర చరియింపగల్గిన తథాస్తు! వృథా పరిపాక రూప దు
ష్కర జననం బిదేమిటికి గాలుపనే శివదేవ ధీమణీ

ప్రస్తావనలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. కందుకూరి వీరేశలింగం పంతులు (1978). ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము. రాజమహేంద్రవరము: హితకారిణీ సమాజము. p. 136. Retrieved 9 April 2024.
  2. 2.0 2.1 2.2 మందలపర్తి కిశోర్ (15 April 2018). "సంస్కృతాంధ్ర కవితావళికెల్ల పితామహుడు!". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 9 April 2024.