శ్రీనివాస చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీనివాస చక్రవర్తి
జననంచక్రవర్తుల వెంకట శ్రీనివాస రంగ రాఘవాచార్యులు
మార్చి 13, 1911
గడ్డిపాడు, హనుమంతపురం అగ్రహారం, కృష్ణాజిల్లా
మరణంజూలై 28, 1976
హైదరాబాదు, తెలంగాణ
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ

శ్రీనివాస చక్రవర్తి (మార్చి 13, 1911 - జూలై 28, 1976) (చక్రవర్తుల వెంకట శ్రీనివాస రంగ రాఘవాచార్యులు). తెలుగునాట రంగస్థలి అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకుడు, నాటక విద్యాలయ ప్రధానాచార్యుడు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు.

జననం[మార్చు]

శ్రీనివాస చక్రవర్తి 1911, మార్చి 13కృష్ణాజిల్లా, హనుమంతపురం అగ్రహారంలో గడ్డిపాడు అనే గ్రామంలో జన్మించాడు.[1]

నాటకరంగం పట్ల ఎనలేని మక్కువున్న చక్రవర్తి మీజాన్‌ తెలుగుదేశం, నాట్యకళ పత్రికలలో ఆయన పనిచేశాడు. లొలొస్లివిస్కి, స్టానిప్లివిస్కి, ఠాగూర్, తుర్గినీస్‌, గొగోల్‌ వంటి రచయితల రచనలను ఆయన తెలుగులోకి తర్జుమా చేశాడు. ఆయన రాసిన నాటకరంగ విజ్ఞాన సర్వస్వం తెలుగు నాటకరంగాన్ని అధ్యయనం చేసేవారికి ఒక చక్కటి ప్రామాణిక గ్రంథంగా ఉపయోగపడుతుంది. అభినయం అన్న పేరుతో నటన గురించిన లాక్షణిక గ్రంథాన్ని రచించాడు. ప్రపంచప్రఖ్యాతుడైన నాటకరంగ ప్రముఖుడు స్టానిస్లవిస్కీ వ్రాసిన లక్షణ గ్రంథాన్ని కొంతవరకూ అనుసరిస్తూ, సంస్కృత నాటక సిద్ధాంతాల గురించి స్వతంత్రించి వ్రాస్తూ ఈ గ్రంథాన్ని ఆయన రచించారు.[2] రచయితగా, కళాకారునిగా, సాహితీ పబ్లికేషన్స్‌ వ్యవస్థాపకునిగా, విభిన్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన సవ్యసాచి శ్రీనివాస చక్రవర్తి. రవీంద్రుని రచనలను పెక్కింటిని ఆయన తెలుగులోకి అనువదించారు. బాలసాహిత్యం రాశారు. నాటకరంగమే ఊపిరిగా, రచయితగా, పాత్రికేయునిగా రాణించారు.

మీజాన్‌ తెలుగు పత్రిక సంపాదకులుగా, అడవిబాపిరాజు దగ్గర అసిస్టెంట్‌ ఎడిటర్‌గా కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలో తిరుమల రామచంద్ర, విద్వాన్‌ విశ్వం, రాంభట్ల కృష్ణమూర్తి, ఉపసంపాదకులుగా అక్కడ పనిచేసేవారు. చలనచిత్ర రంగంలో అలనాటి మేటి దర్శకుడు పుల్లయ్యకు చేదోడు వాదోడుగా కొంతకాలం ఉన్నారు. నిజాంకు వ్యతిరేకంగా నడిచిన మీజాన్‌ పత్రికలో సహాయ సంపాదకులుగా వ్యవహరించారు. విజయవాడ సాహితీ ప్రెస్సును స్థాపించారు. సాహితీ ప్రెస్‌లో భాగస్వామి రంగా చారి. ఆయనకు స్వయానా బావమరిది. కమ్యూనిస్టు పార్టీపై 1948-49లలో నిషేధం ఉండేది. రంగా చారి కనపడలేదని ప్రెస్‌లో ఉన్న శ్రీనివాస చక్రవర్తిని పోలీసులు తీసుకెళ్ళి వలయప్పన్‌ క్యాంప్‌లో నిర్బంధించారు. ఆయనను విడుదల చేయాలని మిత్రులు, శ్రేయోభిలాషులు తీవ్ర ఒత్తిడి తెచ్చిన ఫలితంగా మూడు రోజుల తరువాత విడుదల చేశారు.

హనుమంతరాయ గ్రంథాలయం కార్యనిర్వాహక సభ్యులుగా కొంతకాలం పనిచేశారు. చైనాలో ఘర్షణ జరుగుతున్న సమయమది. ఎప్పటిలానే హనుమంతరాయ గ్రంథాలయానికి ఉదయమే ఆయన వెళ్ళి వస్తుండగా ఆయనను కమ్యూనిస్టు నాయకులు నండూరి ప్రసాదరావు అనుకుని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్ళి 2 గంటల పాటు వుంచారు. తరువాత పొరపాటును గ్రహించి క్షమాపణచెప్పి గౌరవంగా పంపించారు.

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మాస్కోలోని బోల్సియేన్‌ థియేటర్‌ చూడాలనేది ఆయన చివరి కోరిక. అందుకోసం రష్యా వెళ్ళాలని ఎంతగానో ప్రయత్నించారు. ఆయన మిత్రులు రాంభట్ల కృష్ణమూర్తి రాష్ట్ర ఇస్కస్‌ కార్యదర్శిగా వుంటూ ఆయన పేరు ఉదహరించకపోవడంతో రష్యా వెళ్ళలేక పోయారు. శ్రీనివాస చక్రవర్తిది ఆదర్శప్రాయమైన జీవితం. ఆయన తన జీవితాన్ని సమాజ అభ్యుదయానికి అంకితం చేశారు. చనిపోయిన తరువాత కూడా సమాజానికి ఉపయోగపడాలను కున్నారు. మరణానంతరం తన దేహానికి ఎలాంటి కర్మకాండలు చేయకుండా పరిశోధనల నిమిత్తం ఆసుపత్రికి అప్పగించాలని ఒక వీలునామా రాశారు. నేత్రాలను ఆసుపత్రికి దానం చేయాలని అందులో సూచించారు.

రచనలు[మార్చు]

యక్షగానం, కురవంజి, కలాపం, వీధినాటకం, పగటి వేషాలు, బుర్రకథ, తోలుబొమ్మలాట వంటి జానపదకళల మీద గ్రంథాలు రాయడంతోపాటు 70 పుస్తకాలు రాశాడు.

 1. అభినయం
 2. ఆంధ్రనాటక దర్శిని
 3. ఆంధ్రనాటక సమీక్ష
 4. తెలుగు నాటక కవులు
 5. నటన
 6. నాట్యశాల
 7. నాటక పోటీలు
 8. నటశిక్షణ
 9. ప్రాచీన పాశ్చాత్య నాటకరంగ చరిత్ర
 10. పతితజీవులు
 11. నీటికాకి
 12. జైత్రయాత్ర
 13. కిలాడి
 14. నందిని
 15. పోస్టాఫీసు
 16. అనాథబాలుడు
 17. పేకమేడలు
 18. మంత్రోదకం
 19. యవనిక

మరణం[మార్చు]

బాత్రూమ్‌లో పడిపోయి స్పృహలేని పరిస్థితిలో వుండగా హైదరాబాదు లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో చేర్పించారు. రెండురోజులు మృత్యువుతో పోరాడి చివరికి 1976, జూలై 28న కన్నుమూశాడు.

మూలాలు[మార్చు]

 1. శ్రీనివాస చక్రవర్తి, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 592.
 2. సుబ్బారావు, కొప్పరపు. అభినయం గ్రంథానికి పీఠిక.

ఇతర లంకెలు[మార్చు]