Jump to content

విద్యారణ్యుడు

వికీపీడియా నుండి
(శ్రీమాధవాచార్య విద్యారణ్యస్వామి నుండి దారిమార్పు చెందింది)

విద్యారణ్యుడు లేదా మాధవాచార్యుడు శృంగేరి శారదా మఠానికి 12వ పీఠాధిపతి. శంకరాచార్యుల తరువాత ఐదు శతాబ్ధాలకు (1380-1386) శారదా పీఠాన్ని అధిరోహించాడు. విజయనగర సామ్రాజ్య స్థాపనకు మూల ప్రేరకునిగా ప్రసిద్ధి చెందాడు. ప్రజలలో అధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి అవతరించిన మూర్తిగా విద్యారణ్యుడిని భావిస్తారు.

సన్యాసం స్వీకరణ

[మార్చు]

సన్యాస స్వీకారానికి ముందు విద్యారణ్యుని పేరు మాధవ. ఈ మాధవ ఇప్పటి వరంగల్లు (ఏలశిలా నగరం) లోని ఇద్దరు పేద నియోగి బ్రాహ్మణ సోదర బ్రహ్మచారులలో పెద్దవాడు. వీరిలో చిన్నవాడు జ్ఞానార్జన కోసం దేశాటన జరుపుతూ శృంగేరి చేరుకొంటాడు. అప్పటి శృంగేరి పీఠాధిపతి అయిన విద్యాశంకర తీర్థస్వామి ఆ బాలకునిలో ఉండే అధ్యాత్మిక భావానికి ముచ్చట చెంది, వానిలో ఉన్న ప్రతిభను గుర్తించి వాడికి సన్యాసం ఇస్తాడు. సన్యాసం ఇచ్చాక ఆయన పేరుని భారతీకృష్ణ తీర్థ స్వామిగా మారుస్తారు. ఇది ఇలా ఉండగా తన తమ్ముని వెదుక్కుంటూ మాధవ శృంగేరి చేరుతాడు. తన తమ్ముడు సన్యాసం తీసుకోవడం, భారతీకృష్ణ తీర్థగా మారడం తెలుసుకొంటాడు, తానూ సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు అతని తమ్ముడైన భారతీతీర్థ తన గురువైన అప్పటి పీఠాధిపతి అయిన విద్యాశంకరస్వామిని ఒప్పించి మాధవకు సన్యాసం ఇప్పిస్తాడు. విద్యాశంకర స్వామి మాధవకు సా.శ. 1331 సంవత్సరంలో సన్యాసం ఇచ్చి విద్యారణ్య అని నామకరణం చేస్తారు. విద్యారణ్య అంటే అరణ్యం వంటి జ్ఞానం కలవాడు అని అర్థం.

వయస్సులో చిన్నవాడైనప్పటికీ సన్యాసం ముందు స్వీకరించడంవల్ల భారతీకృష్ణ తీర్థ ముందు పీఠాధిపత్యం చేయగా, ఆ తరువాత, ఆయన తరువాత సన్యాసం తీసుకొన్న విద్యారణ్యుడు శృంగేరి శారదా పీఠాన్ని అధిరోహిస్తాడు.

దేశాటన

[మార్చు]

సన్యాసం తీసుకొన్నాక, విద్యారణ్యుడు కాశీ, బదరీకి తీర్థయాత్రకు వెడతాడు. అక్కడ నుండి వేదవ్యాసుల మార్గదర్శకత్వములో బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ శ్రీ విద్య గ్రహిస్తాడు. ఉత్తర భారత యాత్ర పూర్తి చేశాక తిరిగి దక్షిణ భారత దేశానికి వచ్చి హంపి సమీపంలో ఉన్న మాతంగ పర్వతం వద్ద యోగ నిష్ఠలో కొంత కాలం గడిపాడు. అలా కాలం గడుపుతున్న సమయములో ఒక రోజు భారద్వాజస గోత్రీకుడైన మయన కుమారులు మాధవ, సాయనలు విద్యారణ్యుడి దర్శనం చేసుకొంటారు. అప్పుడు విద్యారణ్యుడు తాను అసంపూర్తిగా రచించి వదిలి పెట్టిన వేదభాష్యాలను పూర్తి చేయమని వారితో చెబుతాడు. ఆ వేదభాష్యాలకు వారి పేర్లు పెట్టమనికూడా చెబుతాడు.ఆవిధంగా అవి సాయనీయం, మాధవీయం అని ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ తరువాతి కాలంలో వీరు హరిహరరాయలు, బుక్క రాయలు ఆస్థానంలో మంత్రులుగా పనిచేశారు.విద్యారణ్య తిరిగి కాశీ యాత్ర వెళ్ళారు

విజయనగర సామ్రాజ్య స్థాపన

[మార్చు]

అప్పటి ఢిల్లీ సుల్తాను దక్షిణ భారతదేశం పై యుద్ధం చేసి హరిహర రాయలు, బుక్కరాయలు లను బందీచేసి, ఖైదుగా ఢిల్లీ తీసుకెళ్ళుతాడు. బుక్కరాయలు, హరిహర రాయలలను ఇస్లాం మతం తీసుకోవాలని బలవంత పెడుతాడు. కాని వారు ససేమిరా అని నిరాకరించడముతో ఢిల్లీ సుల్తాను వారిరువురి విక్రమ, ప్రరాక్రమాలను చూసి వారిద్దరినీ దక్షిణభారతదేశంలో దండయాత్రలు నిరోధించడానికి సేనాధిపతులగా చేసి పంపుతాడు. వారిరువురు ఇదే అవకాశంగా తీసుకొని తమకు తాము స్వాతంత్ర్యం ప్రకటించుకొని తమకు స్వప్నములో వచ్చిన మార్గదర్శకత్వం ప్రకారం మతంగ పర్వతం మీద తపస్సు చేసుకొంటున్న విద్యారణ్యుని వద్దకు వెళ్ళి తమ గురించి చెబుతారు. విద్యారణ్యుడు వారిద్దరిని ఆశీర్వదించి, తుంగభద్ర నదికి కుడి వైపు సామ్రాజ్యస్థాపన చెయ్యమని సూచిస్తాడు. ఆ తరువాత వారు సామ్రాజ్యాన్ని తుంగభద్రానదికి ఎడమ వైపుకు కూడా విస్తరిస్తారు. రాజ్యం ఎడమ వైపుకు విస్తరణ జరిగినప్పుడు విద్యారణ్యుని గౌరవార్థంగా రాజధానికి విద్యానగరం అని పేరు పెడతారు. విద్యారణ్యుడు వారికోసం హంపినగరం రూపానికి శ్రీచక్రము ఆధారంగా ప్రణాళిక తయారుచేస్తాడు. నగర మద్యంలో విరూపాక్ష దేవాలయము ఉండేలాగ, కోటకు 9 గుమ్మాలతో నగరాన్ని నిర్మిస్తాడు. ఆ సామ్రాజ్యానికి రాజధాని పేరు క్రమంగా విజయనగరం (విజయాన్ని ప్రసాదించే నగరం కాబట్టి) గా మారుతుంది. సా.శ.1336 రాగి ఫలకం ఆధారంగా "విద్యారణ్యుడి ఆధ్వర్యములో హరిహర రాయలు సింహాసనం అధిష్టించాడు" అని తెలుస్తోంది. విద్యారణ్యుడు హరిహరునికి ఆత్మ విద్య బోధించి "శ్రీమద్రాజాధిరాజ పరమేశ్వర అపరిమిత ప్రతాపవీర నరపతి" అనే బిరుదాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు శృంగేరీ శారదా పీఠం పీఠాధిపతి బిరుదులలో "కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య" కూడా చేర్చి చెబుతారు.

జగద్గురువుల గొప్పతనం

[మార్చు]

విజయ నగర సామ్రాజ్య ప్రతిష్ఠాపన జరిగిన తరువాత విద్యారణ్యుడు తీర్థయాత్రలకు కాశీ వెళ్ళాడు. అదే సమయంలో విద్యాతీర్థస్వామి లంభిక యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు. తన గురువైన విద్యాతీర్థ స్వామి సమాధిపై బ్రహ్మాండమైన విద్యాశంకర దేవాలయం నిర్మాణాన్ని భారతీకృష్ణతీర్థ స్వామి ప్రారంభించాడు. బుక్కరాయలు, హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ, అజేయులుగా ఒక విజయం తరువాత మరో విజయాన్ని పొందుతారు.హరిహర బుక్కరాయలు విజయ పరంపరలో 1345 సంవత్సరం శృంగేరి చేరి భారతీకృష్ణుల ఆశీర్వచనాలు పొందారు. 1346 సంవత్సరములో శృంగేరికి వెళ్లి, భారతీకృష్ణతీర్థ స్వామి దర్శనం చేసుకొని కొంత భూమిని శ్రీపాదులకు దానంగా ఇచ్చారు.

విద్యారణ్యుడు కాశీలో ఉన్నందున, ఇక్కడ శృంగేరిలోని విషయాలు అన్నీ అతనికి, భారతీతీర్థ ఆజ్ఞతో శ్రీముఖంగా పంపిస్తారు. విద్యారణ్యుడు తన యాత్ర త్వరగా ముగించుకొని శృంగేరికి వస్తూ హంపిలో బస చేస్తాడు. అప్పుడు బుక్క రాయలు విద్యారణ్యుడితో పాటు ఉండి, అక్కడ విద్యారణ్యుడి కోసం విరూపాక్ష దేవాలయానికి ప్రక్కన మఠాన్ని ఏర్పాటు చేస్తాడు. భారతీతీర్థుడు విదేహ ముక్తి పొందిన తరువాత విద్యారణ్యుడు శృంగేరీ శారదా మఠం పీఠం అధిరోహించి, జగద్గురువుగా 1380 నుంచి 1386 వరకు ఆరు సంవత్సరాలు నిర్వహణ బాధ్యతలు చేబడతాడు.

విద్యారణ్యుడి గురించి

[మార్చు]

భారతీకృష్ణ తీర్థ శృంగేరి మఠాన్ని అధిరోహించి సా.శ. 1333 నుండి 1380 వరకు పరిపాలించారు. భారతీకృష్ణ తీర్థ స్వామి గురువుగారు సమాధిచెందిన ప్రదేశంలో శ్రీ విద్యాశంకర దేవాలయం నిర్మించడం మొదలుపెట్టారు. శృంగేరీ శారదామఠానికి పీఠాధిపతిగా 6 సంవత్సరాలు 1380-1386 వరకు ఉండి 1386 లో విదేహ ముక్తి పొందుతాడు. హరిహర రాయలు విద్యారణ్యుడి విదేహ ముక్తి విషయాన్ని తెలుసుకొని విద్యారణ్యపురం అనే పేరుతో ఒక అగ్రహారాన్ని శృంగేరి మఠానికి దానం ఇస్తాడు. విద్యారణ్యుడు గొప్ప విద్వాంసుడు, గొప్ప యోగి, శంకరుల కాలము తరువాత శంకరులంతటి వానిగా వర్ణించబడ్డాడు.

హరిహర రాయలు, బుక్క రాయలు విద్యారణ్యుడి గురించి రాగి ఫలకాలమీద చెప్పిన మాటలు

విద్యారణ్యుడు బ్రహ్మయా? కాని నాలుగు ముఖాలు కనిపించడం లేదే. విష్ణువా? నాలుగు చేతులు కనిపించడం లేదే. శివుడా? మూడో నేత్రం కనిపించడం లేదే. ఈ ప్రశ్నలు మమ్మల్ని వేధించగా మేము తెలుసుకొన్నది విద్యారణ్యుడు భగవంతుడు పంపిన ఒక అద్వితీya శక్తి అని.

(శృంగేరి ఫలకం హరిహర రాయలు II 1386 మే).

1974లో విద్యాభూషణ, విద్యావాచస్పతి ఇత్యాది బిరుదాంకితులు శ్రీ. టి.ఎన్.మల్లప్పగారు బెంగళూరు విశ్వవిద్యాలయము పక్షమున 'క్రియాశక్తి-విద్యారణ్యయ' అను గ్రంథమును ప్రకటించారు.అందు క్రియాశక్తియే విద్యారణ్యులు అని వాదించారు.క్రియాశక్తి పాశుపత కాలాముఖుడు ఒక కాశ్మీర బ్రాహ్మణుడు.అభినవ గుప్తాచార్య సిద్ధాంత ప్రచారకుడు.శుద్ధశైవుడు.కాశ్మీర బ్రాహ్మణులు షికారిపుర తాలూకలో కేదార మఠమును స్థాపించి కర్ణాటమున పాశుపత మతమును విశేష ప్రచారమునొనర్చిరి.బసవేశ్వరుడు, అతని అనుచరుల ప్రభావము వలన వీరందరు వీరశైవులలో కలిసిరి.13,14,15 శతాబ్దములలో వీరి మఠములు కొన్ని నామమాత్రముగా నిలిచినవి.ఈ శుద్ధశైవులు శంకరుల అద్వైత సిద్ధాంతానికి విరోధులు. శృంగేరీ 12వ పీఠాధిపతి అయిన విద్యారణులు పూర్వ మతమున బుక్కరాయల మంత్రి మాధవుడే సన్యసించి విద్యారణ్య నామమును స్వీకరించినని లోకప్రసిద్ధి.కాని ఆకాలమున క్రియాశక్తి శిష్యుడొకడైన మాధవుడు కలడు.ఈ ఇద్దరు మాధవులలో విద్యారణ్యులెవరనునది సమస్య. మల్లప్పగారు ఈ గ్రంథములో క్రియాశక్తి మాధవుడే విద్యారణ్యులని వాదించారు. కానీ అటుపై శ్రీ. ఆర్.చక్రవర్తి వీరు చిరకాల మైసూరు ఆర్కియాలజీ ఇలాకాలో పనిచేసిన ప్రముఖ ప్రరిశోధకలు వ్రాసిన "క్రియాశక్తి-విద్యారణ్యవిమర్స" అను గ్రంథమున కన్నడమున వ్రాసి అందు మల్లప్ప గారి వాదనను ఖండించి శ్రీశృంగేరీ అద్వైత సిద్ధాంత మహాసంస్థాపనమునకు చెందిన విద్యారణ్యులు క్రియాశక్తి భిన్నమహాపురుషులు అని నిర్ణయించారు.వీరి గ్రంథమున 19 అధ్యాయములును, 6 అనుబంధములు ఉన్నాయి.ఇందులో భరద్వాజ గోత్రీకుడైన మాధవుడు క్రియాశక్తి శిష్యుడని, ఆంగీరస గోత్రీకుడైన మాధవుడే శృంగీరీ మఠ 12వ గురువు అయిన విద్యారణ్యుడని వ్యాఖ్యానించారు.

మఠాలు

[మార్చు]

భారతీతీర్థులు ప్రారంభించిన మఠాలు విద్యారణ్యుడి ఆద్వర్యములో చక్రవర్తుల దానములవలన సిరులతో తులతూగాయి . దక్షిణ భారతదేశం నలుమూలల శృంగేరి శారద మఠానికి అనుబంధంగా ఉప మఠాలుగా వెలశాయి. శృంగేరికి 6 మైళ్ళ దూరంలో ఉన్న హరిహరపురంలో ఒక మఠం ప్రారంభించబడింది. దానికి శ్రీరామచంద్ర సరస్వతి మొదటి పీఠాదిపతి. తిరుమట్టురు మఠం ( తీర్థహళ్ళి తాలూకా, తరువాత కూడాలి మఠం తర్వాతి కాలములో శృంగేరి మఠం ఆధ్వర్యంలో ప్రారంభించబడ్డాయి. హరిహర రాయలు శృంగపుర, విద్యారణ్యపురాలను అగ్రహారాలుగా ఇచ్చాడు. రాకుమారుడు చినరాయలు (విరుపాక్ష రాయలు) సత్యతీర్థుని ముణియూరు మఠానికి ఉదారంగా విరాళాలు ఇచ్చి ఆదరించాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

సూచికలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]