Jump to content

శ్రీరామచంద్ర

వికీపీడియా నుండి
శ్రీరామచంద్ర
2010లో శ్రీరామచంద్ర
జననం
మైనంపాటి శ్రీరామచంద్ర

(1986-01-19) 1986 జనవరి 19 (వయసు 38)
అద్దంకి
వృత్తిసినీ నేపథ్య గాయకుడు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్
తల్లిదండ్రులు
  • ప్రసాద్ (తండ్రి)
  • జయలక్ష్మి (తల్లి)

మైనంపాటి శ్రీరామచంద్ర సినీ నేపథ్య గాయకుడు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్. 2010 లో సోనీ టివి నిర్వహించే ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో విజేతగా నిలిచాడు.[1][2]

జీవిత విశేషాలు

[మార్చు]

శ్రీరామచంద్ర పూర్తి పేరు మైనంపాటి శ్రీరామచంద్ర. సొంతవూరు ప్రకాశం జిల్లాలోని అద్దంకి. తండ్రి ప్రసాద్ హైకోర్టులో న్యాయవాది. అమ్మ జయలక్ష్మి గృహిణి. హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఎలాంటి సంగీత అనుభవం లేని కుటుంబమైనప్పటికీ రామచంద్రకు చిన్నప్పటి నుంచీ సంగీతమంటే ప్రాణం. మామయ్య సి. వెంకటాచలం మెగాస్టార్స్ పేరుతో ఆర్కెస్ట్రా నిర్వహించేవాడు. చిన్నారి శ్రీరామ్ ఆయనతో కలిసి కచేరీలకు వెళ్లేవాడు. అలా ఎనిమిదేళ్లకే రవీంద్రభారతి వేదికపై తొలి పాట పాడాడు. ఆ ఆసక్తి సాధనతో రాటు దేలింది. హైదరాబాద్ సిస్టర్స్‌లో ఒకరైన హరిప్రియ దగ్గర ఐదేళ్లు కర్నాటక సంగీతం, పాశ్చాత్య సంగీత గురువు పాల్ అగస్టీన్ దగ్గర రెండేళ్లు వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాడు. ముంబైలో ఉన్నపుడు కొన్నాళ్లు గౌతం ముఖర్జీ మాస్టారి దగ్గర హిందుస్థానీ సంగీత సాధన చేశాడు. ఆ తరువాత శ్రీ భక్త రామదాసు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో చేరాడు.

గాయకుడిగా

[మార్చు]

శ్రీరామచంద్ర 2005 నుంచే పాటలు పాడుతున్నాడు. 2010లో ఇండియన్ ఐడల్‌లో విజయం సాధించడంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇండియన్ ఐడల్‌లో పాల్గొన్న సమయంలో గెస్ట్‌లుగా వచ్చిన పలువురు ఆయన పాటలకు మంత్రముగ్ధులై ప్రశంసిస్తే మరికొందరు ఆయనతో కలసి స్టెప్పులేశారు. ఇంకొందరు తమకు ఇష్టమైన పాటను పాడించుకున్నారు. సంజయ్‌దత్, జాన్ అబ్రహాంలతోపాటు హేమమాలిని, బిపాసా బసు, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా లాంటి సుందరాంగులు శ్రీరామ్ గాత్రానికి జోహార్లు పలికారు. అనూమాలిక్, సంగీత దర్శకుడు సలీం మర్చంట్‌లాంటి వారి నుంచి ఎన్నో ప్రశంసలందుకున్నారు. ఆయన పాడిన పాటలెన్నో విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఎన్నో విజయవంతమైన సినిమా పాటలు శ్రీరామచంద్ర ఖాతాలో ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఆయన పాటలు పాడారు. ఇప్పటి వరకూ అన్ని భాషల్లో కలిపి రెండొందలకు పైగా పాటలు పాడాడు. స్లోగా సాగే యుగళగీతాలు పాడడంలో శ్రీరామచంద్రది ప్రత్యేకశైలి.

నటుడిగా

[మార్చు]

శ్రీరామచంద్ర గాయకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన సత్తా చాటుకున్నారు. ఆయన శ్రీ జగద్గురు ఆది శంకరా, ప్రేమ గీమ జాన్‌తా నయ్.[3] చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. సల్మాన్‌ఖాన్‌తో కలసి సుజుకీ అడ్వైర్టెజ్‌మెంట్‌లోనూ నటించారు. పలువురు నటులకు డబ్బింగ్ కూడా చెప్పారు.

ప్రత్యేకతలు, విజయాలు

[మార్చు]
  • ఫైనలిస్ట్, ఫస్ట్ రన్నరప్ జోజీత వోయి సూపర్‌స్టార్-2 (2012),
  • ఈటీవీ నిర్వహించిన ఒక్కరే పాటల పోటీల విజేత (2008),
  • స్టార్‌ప్లస్ వాయిస్ ఆఫ్ ఇండియా సెమీ ఫైనలిస్టు (2007),
  • ఈటీవీ సై ఫైనలిస్టు. (2006-07)
  • సంగం కళా గ్రూప్ పోటీల్లో మొదటిస్థానం. (2006)
  • బిగ్ ఎఫ్.ఎం. పోటీల్లో వాయిస్ ఆఫ్ ఆంధ్రగా ఎంపిక.
  • రిలాక్స్ సాంగ్స్ పోటీల్లో రన్నరప్,
  • ఆంధ్రరాగం పోటీలో విజేత
  • సింగపూర్, దుబాయ్, లండన్‌లతో పాటు ఇప్పటికి 200కు పైగా స్టేజీ షోలు.

అందుకున్న అవార్డులు

[మార్చు]
  • లతా మంగేష్కర్ అవార్డు,
  • పి.బి.శ్రీనివాస్ అవార్డు;
  • ఘంటశాల అవార్డు,
  • గామా-2011 అవార్డు,
  • దైనిక్ ప్రయుక్తి అవార్డు

మూలాలు

[మార్చు]
  1. "Hyderabad's Sreeram wins Indian Idol". ndtv.com. 15 August 2010. Retrieved 7 February 2011.
  2. IANS (16 August 2010). "Sreeram wins 'Indian Idol 5'". The Times of India. Retrieved 7 February 2011.
  3. Sakshi (16 August 2013). "'ప్రేమా గీమా జాన్‌తా నయ్'". Sakshi. Archived from the original on 26 జూన్ 2021. Retrieved 26 June 2021.