Jump to content

సంతోష్ శివన్

వికీపీడియా నుండి
సంతోష్ శివన్
2011 లో తన స్టూడియోలో సంతోష్ శివన్
జననం (1964-02-08) 1964 ఫిబ్రవరి 8 (వయసు 60)
విద్యాసంస్థఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)
మార్ ఇవనోయిస్ కాలేజ్, త్రివేండ్రం
వృత్తిసినిమాటోగ్రాఫర్, సినీ దర్శకుడు, నటుడు, నిర్మాత
బిరుదుఅమెరికన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ (ASC), ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ (ISC)
జీవిత భాగస్వామిదీప (m. 1993)
తల్లిదండ్రులుశివన్, చంద్రమణి
బంధువులుసంగీత్ శివన్ (సోదరుడు)

సంతోష్ శివన్ (జననం: 1964 ఫిబ్రవరి 8) ఒక ప్రముఖ భారతీయ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాత.[1] 2014 లో సంతోష్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రధానం చేసింది.[2] ఆయన ఇప్పటి దాకా 45 సినిమాలకు, 41 డాక్యుమెంటరీలకు పనిచేశాడు. ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ (ISC) సహ వ్యవస్థాపకుడు. సినిమాటోగ్రాఫర్ గా సంతోష్ కు ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. 2014 దాకా మొత్తం 11 జాతీయ పురస్కారాలు, 21 అంతర్జాతీయ పురస్కారాలు సొంతం చేసుకున్నాడు.

బాల్యం

[మార్చు]

సంతోష్ శివన్ ఒక కళాకారుల కుటుంబంలో జన్మించాడు. అతని తాత అతనికి చిన్నప్పటి నుంచే సంగీతం, చిత్రకళ బోధించేవాడు. అలా రాజా రవివర్మ చిత్రాల్ని పరిశీలించడం అలవాటు చేసుకున్నాడు. అతని నానమ్మ ఆ చిత్రపటాల వెనుక ఉన్న పురాణ గాథల్ని అతనికి వివరించేది. అలా అతని ఊహాశక్తి కూడా రూపుదిద్దుకుంది. తండ్రి ఖాళీ సమయాల్లో డాక్యుమెంటరీలు నిర్మించేవాడు. సంతోష్ సెలవుల్లో తన తండ్రికి ఇలాంటి కార్యక్రమాల్లో సహాయం చేసేవాడు. అలా తండ్రితో కలిసి దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతాలు సందర్శించడం అతనికి మంచి ఆసక్తికరంగా ఉండేది. ఇలా తిరుగుతున్నప్పుడే ఆయా ప్రదేశాల్లో జరిగిన జానపద కథల్ని గురించి తెలుసుకుంటూ ఉండేవాడు. తండ్రి శివన్ కూడా సినిమాటోగ్రాఫర్. సంతోష్ అన్న సంగీత్ శివన్ సినీ దర్శకుడు. తమ్ముడు సంజీవ్ శివన్. సంతోష్ తిరువనంతపురంలోని లొయోలా స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాడు.

కెరీర్

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

సంతోష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి శిక్షణ పొందాడు. ఇప్పటి దాకా 45కి పైగా సినిమాలు, 41 డాక్యుమెంటరీలు తీశాడు. అత్యధిక పురస్కారాలు పొందిన సినిమాటోగ్రాఫర్ కూడా ఈయనే. ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ సహ వ్యవస్థాపకుడు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా ఐదు జాతీయ పురస్కారాలు పొందాడు. అవి 1991 మలయాళ సినిమా పెరుంతచ్చన్, 1991లో మలయాళ సినిమా మోహినియాట్టం, 1996 లో వచ్చిన బహుభాషా చిత్రం కాలాపానీ, 1998లో తమిళ సినిమా ఇరువర్ (తెలుగులో ఇద్దరు), 1999లో హిందీ సినిమా దిల్ సే.

దర్శకుడిగా ఆయనకు మొట్టమొదట 1988లో స్టోరీ ఆఫ్ టిబ్లు అనే సినిమాకు జాతీయ పురస్కారం లభించింది. 1996 లో ఆయన రూపొందించిన హలో సినిమాకు 43వ జాతీయ చిత్రోత్సవాల సందర్భంగా ఉత్తమ బాలల చిత్రం పురస్కారం వచ్చింది.

1997లో సంతోష్ దర్శకత్వం వహించిన ది టెర్రరిస్ట్ అనే తమిళ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాకు 23వ కైరో అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పిరమిడ్ పురస్కారాలను గెలుచుకుంది. 1999లో ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ పురస్కారం గెలుచుకుంది. సూడాన్, సియాటిల్, టొరంటో చిత్రోత్సవాలలో ఈ సినిమాను అధికారికంగా ప్రదర్శించారు. 2000లో సంతోష్ రూపొందించిన మల్లి అనే చిత్రం ఉత్తమ పర్యావరణ చిత్రంగా జాతీయ పురస్కారం గెలుచుకుంది. ఇదే సినిమా పోలెండ్ లోనూ, లాస్ ఏంజిలస్ లో జరిగిన పోటీల్లో కూడా పురస్కారాలు గెలుచుకుంది.

మూలాలు

[మార్చు]
  1. Gulzar, Govind; Saiba Nihalani (2003). "Biography: Sivan, Santosh". Encyclopaedia of Hindi Cinema. Encyclopaedia Britannica (India). p. 633. ISBN 81-7991-066-0.
  2. "Padma awardees 2014". The Times of India. 25 January 2014. Retrieved 26 January 2014.