సాత్పురా పర్వత శ్రేణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాత్పురా పర్వత శ్రేణి
పచ్‌మఢీ లోయ
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు1,350 మీ. (4,430 అ.)
నిర్దేశాంకాలు22°27′2″N 78°22′14″E / 22.45056°N 78.37056°E / 22.45056; 78.37056
భౌగోళికం
Topographic map of India showing the Satpura range in the Central region (Corrigendum: East flowing northern river incorrectly labelled "Yamunda" is the Yamuna, East flowing southern river incorrectly labelled "Tapti" is the Krishna; east flowing southern river incorrectly labelled "Kasveri", is the Kavery)

సాత్పురా పర్వత శ్రేణి మధ్య భారతదేశంలోని కొండల వరుస. గుజరాత్ రాష్ట్రానికి తూర్పున, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల సరిహద్దు మీదుగా ఛత్తీస్‌గఢ్ వరకు ఈ శ్రేణి సాగుతుంది. ఈ శ్రేణి, దీనికి ఉత్తరాన ఉన్న వింధ్య శ్రేణికి సమాంతరంగా ఉంటుంది. ఈ రెండు తూర్పు-పడమర శ్రేణులు భారత ఉపఖండాన్ని ఉత్తర భారతదేశంలోని ఇండో-గంగా మైదానం, దక్షిణాన దక్కన్ పీఠభూమిగా విభజిస్తున్నాయి. నర్మదా నది సాత్పురా శ్రేణికి ఈశాన్య చివర ఉన్న అమర్ కంటక్‌ వద్ద ఉద్భవించి, సాత్పురా, వింధ్య శ్రేణుల మధ్య ఉన్న పల్లపు భాగంలో ప్రవహించి, సాత్పురా శ్రేణి యొక్క ఉత్తర వాలున పారుతుంది. అక్కడి నుండి పశ్చిమాన అరేబియా సముద్రం వైపు ప్రవహిస్తుంది. తపతి నది సాత్పురా యొక్క తూర్పు-మధ్య భాగంలో ఉద్భవించి, మధ్యలో ఈ శ్రేణిని దాటి, సూరత్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. తపతి నది జన్మస్థానమైన ముల్తాయ్ అమర్ కంటక్ నుండి 465 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ శ్రేణికి తూర్పు చివర, సాత్పురా శ్రేణి ఛోటానాగపూర్ పీఠభూమిలో ఉన్న కొండలను కలుస్తుంది. సాత్పురా శ్రేణి ఒక హోర్‌స్ట్ పర్వతం. దీనికి ఉత్తరాన నర్మదా గ్రాబెన్, దక్షిణాన తపతి గ్రాబెన్ ఉన్నాయి. [1] [2]

పద చరిత్ర

[మార్చు]

సాత్పురా మొదట సంస్కృత పదం " శతపురా"నుండి వచ్చింది, దీని అర్థం "వంద పర్వతాలు".

భౌగోళికం

[మార్చు]

శ్రేణి లోని తూర్పు భాగంలో వర్షపాతం, పశ్చిమ భాగం కంటే ఎక్కువ. తూర్పు శ్రేణి, తూర్పు కనుమలతో కలిసి, తూర్పు ఎత్తైన ప్రాంతాలు తేమ ఆకురాల్చే అడవుల పర్యావరణ ప్రాంతంగా ఉన్నాయి . పొడిగా ఉండే పశ్చిమ భాగం, నర్మదా లోయ పశ్చిమ వింధ్య శ్రేణితో కలిసి, నర్మదా లోయ ఆకురాలు అడవుల పర్యావరణ పరిధిలో ఉన్నాయి.

నర్మద, తపతి నదులు అరేబియా సముద్రంలోకి ప్రవహించే ప్రధాన నదులు. నర్మద తూర్పు మధ్యప్రదేశ్ లో ఉద్భవించి, వింధ్య శ్రేణి, సత్పురా శ్రేణిల మధ్య ఉన్న ఇరుకైన లోయ గుండా ప్రవహిస్తుంది. ఇది ఖంబాట్ గల్ఫ్‌లోకి ప్రవహిస్తుంది. తపతి నర్మదకు 80 నుండి 100 కి.మీ. దూరంలో దక్షిణాన నర్మదకు సమాంతరంగా ప్రవహిస్తుంది. ఇది మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి ఖంబాట్ గల్ఫ్‌లో కలుస్తుంది.

పర్యావరణం

[మార్చు]

సాత్పురా శ్రేణిలో ఎక్కువ భాగం అటవీప్రాంతం. ఇటీవలి దశాబ్దాల్లో ఈ ప్రాంతం క్రమంగా అటవీ నిర్మూలనకు గురైనప్పటికీ గణనీయమైన స్థాయిలో అడవులు ఇంకా ఉన్నాయి. ఈ అడవి అనేక అంతరించిపోతున్న, ప్రమాదంలో ఉన్న జాతులకు ఆవాసం. వీటిలో బెంగాల్ పులి (పాన్థెర టైగ్రిస్ టైగ్రిస్), బారాసింఘా [3], గౌర్, దోల్ (కుయన్ అల్పినస్), ఎలుగుబంటి (మెలర్సస్ ఆర్సినస్), chousingha (టెట్రాసెరస్ క్వాడ్రికార్నిస్ ), బ్లాక్ బక్ ( యాంటిలోప్ సెర్వికాప్రా ) ఉన్నాయి.

అయితే, సాత్పురా శ్రేణిలో ఇప్పుడు అనేక పులుల సంరక్షణ వనాలున్నాయి. ఒకానొకప్పుడు, ఈ ప్రాంతాన్ని ఏనుగులు సింహాలు పాలించాయి. [4]

కన్హా, పేంచ్, గుగమల్, సాత్పురా జాతీయ ఉద్యానవనాలు, పచ్‌మఢీ బయోస్పియర్ రిజర్వ్, మెల్ఘాట్ టైగర్ రిజర్వు, బోరి రిజర్వ్ ఫారెస్ట్ సహా అనేక రక్షిత ప్రాంతాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.

సాత్పురా ఫౌండేషన్ ఈ ప్రాంతంలో పరిరక్షణ ప్రయత్నాలను సమన్వయం చేసే ఒక క్షేత్ర స్థాయి సంస్థ. ఇది అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నుండి, చెట్ల నరికివేత, వేటల నుండి సవాళ్లను ఎదుర్కొంటోంది.

పౌరాణిక ప్రశస్తి

[మార్చు]

హరివంశ పురాణం ప్రకారం ఆ పర్వతం క్రింద "సత్పూర్" అనే భూగర్భ నగరం ఉంది. అది రాక్షసుల నగరం. వారిని బయటకు రానీయకుండా ఉండటానికి శ్రీకృష్ణుడు ఆ నగర ద్వారాలను మూసేసాడు.

పర్యాటకం

[మార్చు]

సత్పురా శ్రేణిలోని జాతీయ ఉద్యానవనాలు, హిల్ స్టేషన్లు, వన్యప్రాణి రిజర్వులు, పట్టణాలు ఏటా వందల వేల మంది సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. తూర్పు నుండి పడమర దిశగా కొన్ని ప్రదేశాల జాబితాని కింద ఇచ్చాం:

  • అమర్‌కంటక్ అనేది ఆధ్యాత్మిక యాత్రా స్థలం. దీన్ని తీర్థ రాజంగా భావిస్తారు. మధ్య ప్రదేశ్, అనుప్పూర్ లో ఇదొక నగర పంచాయతీ. అమర్‌కంటక్ ప్రాంతం ఒక ప్రత్యేకమైన సహజ ప్రకృతి వారసత్వ ప్రాంతం. వింధ్య సాత్పురా శ్రేణులు కలిసే ప్రదేశం. ఇక్కడే నర్మదా నది, సోన్ నది, జోహిలా నది ఉద్భవించాయి. 15 వ శతాబ్దపు ప్రసిద్ధ భారతీయ ఆధ్యాత్మిక కవి కబీర్ ఇక్కడే కబీర్ చాబుత్రాపై ధ్యానం చేసినట్లు చెబుతారు. [5]
  • బాందవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనం, మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ జాతీయ ఉద్యానవనాలలో ఒకటి. ఇది అమర్‌కాంటక్‌కు ఉత్తరాన, మధ్య ప్రదేశ్‌, ఉమారియా జిల్లాలో సాత్పురా శ్రేణికి సమీపంలో ఉంది. 105 చ.కి.మీ. విస్తీర్ణంతో 1968 లో బాంధవ్‌గఢ్‌ను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. దీని బఫర్, ఉమారియా, కట్నీ జిల్లాల్లోని అటవీ విభాగాలలో 437 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం ఈ ప్రాంతంలోని ప్రముఖ కొండ పేరు మీదుగా వచ్చింది. ఇది లంక (సిలోన్) పై నిఘా ఉంచడానికి రాముడు తన సోదరుడు లక్ష్మణుడికి ఇచ్చినట్లు చెబుతారు. అందువల్లనే దీనికి బాంధవ్‌గఢ్ అనే పేరు వచ్చింది. ఈ పార్కులో పెద్ద జీవవైవిధ్యం ఉంది. బాంధవ్‌గఢ్ లో పులి జనాభా సాంద్రత భారతదేశంలోనే అత్యధిక సాంద్రతల్లో ఒకటి. ఈ ఉద్యానవనంలో చిరుతపులు, వివిధ జాతుల జింకలు ఉన్నాయి. రేవాకు చెందిన మహారాజా మార్తాండ్ సింగ్ 1951 లో ఈ ప్రాంతంలో మొదటి తెల్ల పులిని స్వాధీనం పట్టుకున్నాడు. మోహన్ అనే పేరున్న ఈ తెల్ల పులి దేహం, ఇప్పుడు రేవా మహారాజుల ప్యాలెస్‌లో ప్రదర్శనలో ఉంది.
  • కన్హా నేషనల్ పార్క్ ఒక జాతీయ ఉద్యానవనం. మధ్యప్రదేశ్ లోని మాండ్లా, బాలాఘాట్ జిల్లాల పరిధిలో ఉన్న పులి సంరక్షణ రిజర్వు. దీన్ని 1 జూన్ 1955 న ఏర్పాటు చేసారు. నేడు ఇది 940 చ.కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది. చుట్టుపక్కల ఉన్న బఫర్ జోన్‌తో కలిపి దీని విస్తీర్ణం 1,067 చ.కి.మీ. ఇది మధ్య భారతదేశంలో అతిపెద్ద జాతీయ ఉద్యానవనం. ఈ ఉద్యానవనంలో రాయల్ బెంగాల్ పులి, చిరుతపులులు, ఎలుగుబంటి, బరాసింగ్, భారతీయ అడవి కుక్కలు ఉన్నాయి. కన్హా లోని పచ్చని సాల, వెదురు అడవులు, పచ్చికభూములు, లోయలు "జంగిల్ బుక్" నవల రాసేందుకు రుడ్‌యార్డ్ కిప్లింగ్‌కు ప్రేరణనిచ్చాయి.
  • పేంచ్ జాతీయ ఉద్యానవనం సాత్పురాకు దక్షిణాన ఉంది. ఈ ప్రాంతం గుండా ప్రవహించే పేంచ్ నది పేరు దీనికి పెట్టారు. ఇది భారతదేశంలో 19 వ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వు. దీనిని 1992 లో ఏర్పాటు చేసారు. ఇందులో ఉష్ణమండల తేమ ఆకురాల్చే అడవులున్నాయి. ఇది మధ్యప్రదేశ్‌లో శివ్‌నీ, చింద్వారా జిల్లాల్లో ఉంది. పెంచ్ నేషనల్ పార్కు 758 చ.కి.మీ. బ్విస్తీర్ణంలో ఉంది. దాని సహజ సంపద, గొప్పతనం యొక్క వివరణ ఐన్-ఇ-అక్బరీలో కనిపిస్తుంది. పెంచ్ టైగర్ రిజర్వ్ దాని పరిసరాలు రుడ్‌యార్డ్ కిప్లింగ్ రచన ది జంగిల్ బుక్ కు నేపథ్యం.
  • సాత్పురా శ్రేణిలో ఉన్న పెద్ద పట్టణాల్లో చింద్వారా ఒకటి. ఇది ఒక పీఠభూమిపై ఉంది, చుట్టూ పచ్చని పొలాలు, నదులు, సాగౌన్ చెట్లు ఉన్నాయి. చింద్వారా చుట్టూ విభిన్న వృక్ష, జంతుజాలాలతో ఉన్న దట్టమైన అడవి ఉంది. పేంచ్, కన్హాన్‌లు చింద్వారా లోని రెండు ముఖ్యమైన నదులు. చింద్వారా పట్టణం, చింద్వారా జిల్లాలోని మునిసిపాలిటీ. ఇది జిల్లా ముఖ్య పట్టణం. ప్రక్కనే ఉన్న నాగ్‌పూర్, జబల్‌పూర్ నుండి రైలు, రోడ్డు ద్వారా చింద్వారా చేరుకోవచ్చు.
  • పచ్‌మఢీ అనేది మధ్యప్రదేశ్ లో ఉన్న హిల్ స్టేషన్. దానిలో అడవులు, జంతు సంరక్షణ, నదులు, రాతి భూభాగం వంటి అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఇది ట్రెక్కింగ్, ఫిషింగ్, సాహస క్రీడలకు ఇది కేంద్రం. దీనిని 'సాత్పురా రాణి' అని కూడా పిలుస్తారు. సినిమా షూటింగులకు గమ్యస్థానంగా మారింది. సాత్పూరా శ్రేణి లోని ఎత్తైన పర్వతం ధూప్‌గఢ్, పచ్‌మఢీ లోనే ఉంది.
  • సాత్పురా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ జిల్లాలో ఉంది. దీనికి సాత్పురా శ్రేణుల నుండి ఆ పేరు వచ్చింది. ఇది 524 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఈ జాతీయ ఉద్యానవన భూభాగం చాలా కఠినమైనది. ఇసుకరాతి శిఖరాలు, ఇరుకైన లోయలు, దట్టమైన అడవులూ ఉన్నాయి. సాత్పురా నేషనల్ పార్కు, ఒక ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థలో భాగం. జీవవైవిధ్యంలో చాలా గొప్పది. ఇక్కడ పులి, భారతీయ చిరుతపులి, సాంబార్, చిటల్, భేడ్కి, నీల్‌గాయ్, నాలుగు కొమ్ముల జింక, చింకారా, అడవి దున్న (గౌర్), అడవి పంది, అడవి కుక్క, ఎలుగుబంటి, బ్లాక్ బక్, నక్క, పోర్కుపైన్, ఎగిరే ఉడుత, ఎలుక జింక, ఇండియన్ జెయింట్ స్క్విరెల్, మొదలైన జంతువులు ఉన్నాయి. అనేక రకాల పక్షులు ఉన్నాయి. హార్న్‌బిల్‌లు, పీఫౌల్ ఇక్కడ కనిపించే సాధారణ పక్షులు. వృక్షజాలంలో ప్రధానంగా సాల, టేకు, టెండూ, ఫైలాంథస్ ఎంబికా, మాహువా, బెల్, వెదురు, గడ్డి, ఔషధ మొక్కలూ ఉన్నాయి.
  • బోరి వన్యప్రాణుల అభయారణ్యం మధ్యప్రదేశ్‌లో ఉంది. బోరి వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశపు పురాతన అటవీ సంరక్షణ, బోరి రిజర్వ్ ఫారెస్ట్, 1865 లో తేవా నది వెంట స్థాపించబడింది. ఈ అభయారణ్యం 518 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఇది సాత్పురా శ్రేణి ఉత్తర పాదాల వద్ద ఉంది. దీనికి ఉత్తరం, తూర్పున సాత్పురా జాతీయ ఉద్యానవనం, పశ్చిమాన తేవా నది సరిహద్దులుగా ఉన్నాయి. ఈ అభయారణ్యం, సాత్పురా నేషనల్ పార్కు, పచ్‌మఢీ అభయారణ్యం- ఈ మూడింటినీ కలిపి పచ్‌మఢీ బయోస్పియర్ రిజర్వ్ను అంటారు. ఈ అభయారణ్యంలో ఎక్కువగా మిశ్రమ ఆకురాల్చే అడవులు, వెదురు అడవులూ ఉన్నాయి. ఇక్కడ టేకు (టెక్టోనా గ్రాండిస్), ధోరా (అనోజిస్సస్ లాటిఫోలియా), టెండూ (డియోస్పైరోస్ మెలనోక్సిలాన్) వంటి వృక్షాలు ఉన్నాయి. పెద్ద క్షీరద జాతులలో పులి, చిరుతపులి, అడవి పంది, ముంట్జాక్ జింక, గౌర్ (బోస్ గారస్), చిటల్ జింక (యాక్సిస్ యాక్సిస్), సాంబార్ (సెర్వస్ యూనికోలర్), రీసస్ మకాక్స్ ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Valdiya, K. S. (2015-11-26). The Making of India: Geodynamic Evolution (in ఇంగ్లీష్). Springer. ISBN 9783319250298.
  2. Valdiya, K.S.; Sanwal, Jaishri (2017-01-01). Satpura Horst and Narmada–Tapi Grabens (in ఇంగ్లీష్). Vol. 22. pp. 237–247. doi:10.1016/B978-0-444-63971-4.00010-4. ISBN 9780444639714. {{cite book}}: |work= ignored (help)
  3. "Exploring the Jungles of Satpura". Retrieved 2 September 2019.
  4. "Archived copy". Archived from the original on 2013-08-11. Retrieved 2013-08-11.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Kabir Chabutra".