సాయి బ్రహ్మానందం గొర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాయి బ్రహ్మానందం గొర్తి తెలుగు రచయిత, సంపాదకుడు. కథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు వంటి ప్రక్రియల్లో ఇతను రచనలు చేశాడు. తానా పత్రికకు సుదీర్ఘకాలంగా సంపాదకునిగా వ్యవహరిస్తున్నాడు. ఆటా నవలల పోటీకి జ్యూరీ సభ్యునిగా, పలు సాహిత్య కార్యక్రమాల నిర్వాహకునిగా వ్యవహరిస్తున్నాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

సాయి బ్రహ్మానందం కోనసీమ అంబేద్కర్ జిల్లా కేంద్రమైన అమలాపురంలో జన్మించాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న సాయి బ్రహ్మానందం 1991లో ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు.[1]

సాహిత్య కృషి[మార్చు]

చిన్నతనంలో పాఠశాల విద్యతో పాటుగా దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు నిర్వహించే హిందీ పరీక్షలన్నీ పూర్తిచేశాడు. ఈ క్రమంలో అతనికి హిందీ సాహిత్యంతో పరిచయం, ఆసక్తి ఏర్పడింది. పాఠశాల దశలో తెలుగు, హైస్కూలు దశలో సంస్కృతం బోధించిన ఉపాధ్యాయుల పాఠాల వల్ల తెలుగు, సంస్కృత భాషల సాహిత్యంపైన బ్రహ్మానందానికి చిన్ననాటే అభిరుచి ఏర్పడింది. నాటకాలు రాయడం, వాటిని ప్రదర్శించడం, తాను రాసిన కథలను ఆంధ్రపత్రిక, బాలప్రభ వంటి పత్రికలకు పంపగా వారు ప్రచురించడం వంటివాటితో రచనా వ్యాసంగంలో పాఠశాల దశలోనే అడుగుపెట్టాడు.[1]

రచనలు[మార్చు]

సాయి బ్రహ్మానందం గొర్తి పలు కథలు, నవలలు, వ్యాసాలు రాశాడు.

నవలలు[మార్చు]

  • నేహల: క్రీ.శ.1350-1400 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యానికి, బహమనీ సుల్తానులకు మధ్య జరిగిన సంఘర్షణలు నేపథ్యంగా చరిత్రలో ఒక చిన్న వాక్యానికి పరిమితమైపోయిన నేహల అన్న పాత్ర జీవితాన్ని విస్తరించి సాయి బ్రహ్మానందం చారిత్రక నవలగా నేహల అన్న నవల రాశాడు.[2][3]
  • యథార్థ చక్రం: అశ్వఘోషుడు రచించిన సంస్కృత కావ్యం సౌందర నందము ఆధారంగా చేసుకుని సాయి బ్రహ్మానందం రాసిన నవల ఇది.[4]
  • అంతర్జ్వలన: అమెరికాకు వెళ్ళి విద్యార్థిగా, ఉద్యోగిగా, ఒక కంపెనీకి అధిపతిగా ఎదిగిన ఒక ప్రవాసాంధ్రుని పాత్ర జీవితంలోని వెలుగునీడలని చిత్రీకరిస్తూ సాయి బ్రహ్మానందం రాసిన నవల అంతర్జ్వలన.[5] ఈ నవలను సంస్కృతంలోకి "అంతర్జ్వలనమ్" పేరిట టి. జనార్దనరావు అనువదించగా సంస్కృత భారతి పత్రికలో సీరియల్‌గా ప్రచురితమైంది.[6]. గౌరీ కృపానందన్ ఈ నవలను తమిళంలోకి అనువదించారు. ఉల్ముగమ్ (తమిళ అనువాదం)

కథలు[మార్చు]

సాయి బ్రహ్మానందం రాసిన అనేక కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇతను తాను రాసిన కథలతో మూడు సంపుటులు ప్రచురించాడు.

  • సరిహద్దు: సాయి బ్రహ్మానందం రాసిన కథల్లో కొన్నిటిని 2008లో సరిహద్దు పేరిట కథా సంపుటిగా ప్రచురించాడు. ఇది అమెరికా తెలుగు రచయితలు ప్రచురించిన కథా సంపుటుల్లో ముఖ్యమైనవాటిలో ఒకటిగా అమెరికా తెలుగు కథా సాహిత్యంపై పరిశోధన చేసిన డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్ పేర్కొన్నాడు.[7]
  • కోనసీమ కథలు: పుట్టిపెరిగిన కోనసీమ ప్రాంతం చుట్టూ రాసుకున్న కథలు కోనసీమ కథలుగా 2011లో ప్రచురించాడు.[8] ఈ కథలన్నీ కోనసీమకే పరిమితమవుతూ 1985కి పూర్వం నాటి రచయిత బాల్యం, విద్యాభ్యాసం నాటి జ్ఞాపకాల చుట్టూ ఉంటాయి.[9]
  • క్విల్ట్: 27 కథలున్న ఈ సంపుటిలో 20 వరకూ రచయిత అమెరికాలోని తెలుగువాళ్ళు జీవితాల చుట్టూ అల్లుకున్న డయాస్ఫోరా కథలు. ఈ కథల్లో అమెరికాలోని తెలుగు జీవితాలతో పాటుగా అమెరికా జీవితాన్ని, వైవిధ్యభరితమైన అక్కడ సంస్కృతిని ఈ కథల్లో అనేకం చూపిస్తాయి.[9]

నాటకాలు[మార్చు]

సాయి బ్రహ్మానందం పద్యనాటకాలు, సాంఘిక నాటకాలు, హాస్యనాటికలు వంటి అనేక రచనలు చేశాడు. 2005లో నంది నాటకోత్సవాల్లో ఇతను రాసిన "పంచమధర్మం" అన్న పద్యనాటకాన్ని నవోదయా ఆర్ట్స్ అకాడమీ బృందం ప్రదర్శించి ప్రత్యేక ప్రశంస పొందింది.[10] ఇతను రాసిన పలు నాటకాలు భారతదేశంలోనూ, అమెరికాలోనూ పలు కార్యక్రమాల్లో ప్రదర్శించారు.[1]

వ్యాసాలు[మార్చు]

ఇతను 2008లో సుప్రసిద్ధ కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు త్యాగరాజు గురించి ప్రచారంలో ఉన్న విషయాలను ఖండిస్తూ, చారిత్రక దృక్కోణం నుంచి మనకు తెలియని మన త్యాగరాజు పేరిట ఈమాట పత్రికలో వ్యాస పరంపర రాశాడు.[1][11] దీనితో పాటు నాటక రంగాన్ని గురించి, సంగీతం గురించి వివిధ వ్యాసాలు రాశాడు.[12]

ఇతర సాహిత్య కృషి[మార్చు]

అమెరికాలో వివిధ తెలుగు సాహిత్య కార్యక్రమాలు, పత్రికలు నిర్వహణ విషయంలో నిర్వాహకునిగా, సంపాదకునిగా సాయి బ్రహ్మానందం కృషిచేశాడు. 2000 దశకంలో అనేక సంవత్సరాల పాటు కాలిఫోర్నియా సాహితీ సదస్సు నిర్వహణ బృందంలో వివిధ హోదాల్లో సదస్సు నిర్వాహణకు కృషిచేశాడు.[13][14][15] 2022లో జరిగిన అమెరికా తెలుగు రచయితల సదస్సు ప్రణాళికా బృందం సభ్యునిగా నిర్వహణలో పనిచేశాడు.[16] 2008లో అమెరికా తెలుగు రచయితల కథలతో కూడిన "వెన్నెల్లో హరివిల్లు" కథా సంకలనానికి ఇతను సంపాదకత్వం వహించి ప్రచురించాడు.[7][15] 2018 నుంచి తానా పత్రికకు, 2023లో 23వ తానా మహాసభల సందర్భంగా వెలువడ్డ సావనీర్ అయిన తెలుగు పలుకు సంకలనానికి సంపాదకత్వం వహించాడు.[17][18] వీటితో పాటుగా పలు సంవత్సరాలు తానా నవలల పోటీకి, ఆటా నవలల పోటీకి న్యాయనిర్ణేతగానూ వ్యవహరించాడు.[19]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 కథామంజరి, బృందం (సెప్టెంబరు 2023). "విశిష్ట అతిథి - సాయిబ్రహ్మానందం గొర్తి" (PDF). కథామంజరి.
  2. "Pustaka Parichayam Samkshipta Sameeksha". madhuravani. Retrieved 2023-01-10.
  3. సంచిక టీమ్ (2018-08-31). "నేహల – పుస్తక పరిచయం". సంచిక - తెలుగు సాహిత్య వేదిక. Retrieved 2023-01-10.
  4. గొర్తి, సాయి బ్రహ్మానందం (2006-05-01). "యథార్థ చక్రం – 1". ఈమాట (in Telugu). Retrieved 2024-04-14.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  5. కన్నెగంటి, చంద్ర; వేలూరి, వెంకటేశ్వర రావు (2015-10-15). "మరణానికి ముందు "అంతర్జ్వలనం"". సారంగ (in Telugu). Retrieved 2024-04-15.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  6. "अन्तर्ज्वलनम् - Book Details Samskrita Bharati". www-samskritabharati-in.translate.goog. Retrieved 2024-04-15.
  7. 7.0 7.1 తన్నీరు, కళ్యాణ్ కుమార్. "కథకు 52 ఏళ్ళు". madhuravani. Retrieved 2024-04-15.
  8. "చదివించే కథలు". EENADU. Retrieved 2024-04-15.
  9. 9.0 9.1 వాడ్రేవు, చినవీరభద్రుడు (2023-06-04). "కోనసీమనుంచి కాలిఫోర్నియా దాకా - నా కుటీరం". chinaveerabhadrudu.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-04-16.
  10. గేదెల, రామారావు (2006). "నంది 2005 పద్యనాటకాలపై సమీక్ష - పంచమధర్మం" (PDF). అభినయ: 6–8.
  11. గొర్తి, సాయి బ్రహ్మానందం (2008-09-01). "మనకు తెలియని మన త్యాగరాజు -1". ఈమాట (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-04-16.
  12. "ఈమాటలో సాయి బ్రహ్మానందం గొర్తి రచనల సూచిక". ఈమాట (in అమెరికన్ ఇంగ్లీష్). 2006-04-22. Retrieved 2024-04-16.
  13. "నాల్గవ కాలిఫోర్నియా సాహితీ సదస్సు". ఈమాట (in అమెరికన్ ఇంగ్లీష్). 2009-03-01. Retrieved 2024-04-16.
  14. గొర్తి, సాయి బ్రహ్మానందం (2008-05-02). "3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం". ఈమాట (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-04-16.
  15. 15.0 15.1 "కాలిఫోర్నియా సాహిత్య సదస్సు". తెలుగు వన్.{{cite web}}: CS1 maint: url-status (link)
  16. "మరచిపోలేని మలుపు డాలస్ సదస్సు! – సారంగ". magazine.saarangabooks.com. Retrieved 2024-04-16.
  17. tana.org https://tana.org/services/tana-patrika. Retrieved 2024-04-16. {{cite web}}: Missing or empty |title= (help)
  18. "TANASouvnir_2023c". tana.org. Retrieved 2024-04-16.
  19. NRI2NRI.COM (2022-12-29). "ఆటా మహాసభల పోటీలో గెలుపొందిన నవలకు కేంద్ర పురస్కారం, హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ప్రదర్శన - NRI2NRI.Com" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-04-16.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

20. ఉల్ముగమ్ (తమిళ అనువాదం)