సిమ్లా ఒప్పందం
సిమ్లా ఒప్పందం భారత పాకిస్తాన్ల మధ్య 1972 జూలై 2 న, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో కుదిరింది.[1] 1971 నాటి బంగ్లాదేశ్ యుద్ధంలో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిన తరువాత ఈ సంధి కుదిరింది. ఈ యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ గా పిలువబడే భూభాగం పాకిస్తాన్‌నుండి వేరుపడి బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. తొలుత బంగ్లా విముక్తి యుద్ధంగా మొదలైన ఈ యుద్ధంలో భారత్ తూర్పు పాకిస్తాన్ కు బాసటగా దిగడంతో ఇది భారత పాకిస్తాన్ యుద్ధంగా మారింది. సిమ్లా ఒప్పందాన్ని ఇరు దేశాల పార్లమెంట్లూ అదే సంవత్సరం ఆమోదముద్ర వేసాయి.
తమ సంబంధాలను విషమం చేస్తున్న ఘర్షణలకు అంతం పలకాలనే రెండు దేశాల నిశ్చయానికి ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. తమ పరస్పర సంబంధాలను మామూలు స్థాయికి తీసుకువెళ్ళడమే కాకుండా, భవిష్యత్తులో ఈ సంబంధాలను నిర్దేశించే సూత్రాలను కూడా ఈ ఒప్పందం నిర్వచించింది.[2]
వివరాలు
[మార్చు]భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ ఆలీ భుట్టో ల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.[3] భుట్టో కుమార్తె, తరువాతి కాలంలో పాకిస్తానుకు ప్రధాని అయిన బేనజీర్ భుట్టో కూడా తండ్రితో ఉంది. ఒప్పందం ద్వారా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉనికిని గుర్తించింది. ఈ ఒప్పందం జూలై 3 న రాత్రి 12:40 కి సంతకాలైనప్పటికీ అధికార పత్రాలన్నీ 1972 జూలై 2 తేదీతోనే ఉన్నాయి.[4][5]
ఒప్పందం లోని ప్రధాన అంశాలు:
- రెండు దేశాలు తమ వివాదాలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటాయి.[1][6] తరువాతి కాలంలో కాశ్మీరు సమస్యలో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని పాకిస్తాన్ ప్రతిపాదించినప్పటికీ, ఈ అంశం ఆధారంగానే భారత్ అంగీకరించలేదు.[7]
- 1971 డిసెంబరు నాటి సంధిరేఖను నియంత్రణ రేఖగా ఇరు దేశాలూ గుర్తించాయి. "ఏ భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, ఇద్దరిలో ఎవరూ కూడా ఏకపక్షంగా ఈ రేఖను మార్చేందుకు ప్రయత్నించకూడదు".[1][8] ఈ రేఖను ఆంతర్జాతీయ సరిహద్దుగా మార్చాలని రెండు దేశాల అధిపతుల ఆంతరంగిక సమావేశంలో అప్రకటిత ఒప్పందం కుదిరిందని భారత అధికారులు అన్నప్పటికీ పాకిస్తాన్ అధికారులు దాన్ని ఖండించారు.[9][10] ఈ రేఖను గుర్తించడంతో, భారత పాకిస్తాన్‌లలో ఐక్యరాజ్యసమితి సైనిక పరిశీలకుల బృందానికి (UNMOGIP) పాత్ర ఏమీ లేదని భారత్ చెప్పింది. 1949 లో జరిగిన కరాచీ ఒప్పందం ద్వారా ఏర్పడిన సంధిరేఖను ఈ బృందం పరిశీలిస్తూ ఉంటుంది. ఇప్పుడా రేఖయే లేదు కాబట్టి ఈ బృందం అవసరం లేదని భారత్ వాదన. అయితే, పాకిస్తాన్ వాదన ఇందుకు భిన్నంగా ఉంది. ఈ బృందం ఇప్పటికీ రెండు దేశాల్లోనూ ఉంది.[7]
ఈ ఒప్పందానికి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ 1972 జూలై 15 న ఆమోదముద్ర వెయ్యగా, [11] భారత లోక్‌సభ 1972 ఆగస్టు 2 న, రాజ్యసభ ఆ మరుసటి రోజున ఆమోదించాయి.[12] దాంతో ఈ ఒప్పందం 1972 ఆగస్టు 4 నుండి అమల్లోకి వచ్చింది.
ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించి, ఘర్షణల దాకా పోకుండా నివారించలేకపోయింది. 1999 నాటి కార్గిల్ యుద్ధం ఇందుకో ఉదాహరణ. 1984 లో ఆపరేషన్ మేఘదూత్‌లో భారత్ సియాచెన్ గ్లేసియరును పూర్తిగా ఆక్రమించుకుంది. ఈ ప్రాంతంలో నియంత్రణ రేఖను సిమ్లా ఒప్పందంలో నిర్వచించలేదు. అయితే పాకిస్తాన్ దీన్ని సిమ్లా ఒప్పందపు అతిక్రమణగా భావించింది.
ఢిల్లీ ఒడంబడిక
[మార్చు]ఢిల్లీ ఒప్పందం భారత, బంగ్లాదేశ్, పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రుల మధ్య ఢిల్లీలో 1973 ఆగస్టు 28 న కుదిరింది. దీని ప్రకారం మూడు దేశాలు యుద్ధ ఖైదీలను, పౌర ఖైదీలనూ ఇచ్చి పుచ్చుకుంటాయి.[13][14][15]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Simla Agreement". Bilateral/Multilateral Documents. Ministry of External Affairs, Government of India. Retrieved 27 September 2013.
- ↑ "Indo-Pak Shimla Agreement: 40 years later". IANS. IBN Live, CNN IBN. 2 July 2012. Archived from the original on 5 జూలై 2012. Retrieved 27 September 2013.
- ↑ "ఆంధ్రపత్రిక". pressacademyarchives.ap.nic.in. 1972-07-04. Archived from the original on 2020-10-21. Retrieved 2020-10-21.
- ↑ "Indo-Pak Shimla Agreement: 40 years later". IANS. IBN Live, CNN IBN. 2 July 2012. Archived from the original on 5 జూలై 2012. Retrieved 27 September 2013.
- ↑ "Relevance of Simla Agreement". Editorial Series. Khan Study Group. Archived from the original on 2 అక్టోబరు 2013. Retrieved 27 September 2013.
- ↑ Kapur, Shekhar (Narrator) (21 September 2013). "1971 Indo-Pak War". Pradhanmantri. episode 11. season 1. ABP News. http://www.newsbullet.in/video/india/45558-watch-pradhanmantri-episode-11-about-1971-indo-pak-war.[permanent dead link]
- ↑ 7.0 7.1 Press Trust of India (22 January 2013). "India spikes Pak call for third party mediation, says Simla Agreement tops all agendas". Indian Express. Retrieved 27 September 2013.
- ↑ "Relevance of Simla Agreement". Editorial Series. Khan Study Group. Archived from the original on 2 అక్టోబరు 2013. Retrieved 27 September 2013.
- ↑ "Indo-Pak Shimla Agreement: 40 years later". IANS. IBN Live, CNN IBN. 2 July 2012. Archived from the original on 5 జూలై 2012. Retrieved 27 September 2013.
- ↑ "Relevance of Simla Agreement". Editorial Series. Khan Study Group. Archived from the original on 2 అక్టోబరు 2013. Retrieved 27 September 2013.
- ↑ "ఆంధ్రపత్రిక". pressacademyarchives.ap.nic.in. 1972-07-16. Archived from the original on 2020-10-21. Retrieved 2020-10-20.
- ↑ "ఆంధ్రపత్రిక". pressacademyarchives.ap.nic.in. 1972-08-03. p. 5. Archived from the original on 2020-10-21. Retrieved 2020-10-21.
- ↑ Mark Cutts; Office of the United Nations High Commissioner for Refugees (2000). The State of the World's Refugees, 2000: Fifty Years of Humanitarian Action. Oxford University Press. pp. 73–. ISBN 978-0-19-924104-0. Retrieved 23 June 2012.
- ↑ Sukhwant Singh (19 July 2009). India's Wars Since Independence. Lancer Publishers. pp. 538–. ISBN 978-1-935501-13-8. Retrieved 23 June 2012.
- ↑ The office of the Foreign Minister, Government of Bangladesh. "The text of the Tripartite agreement at Delhi". Virtualbangladesh. Archived from the original on 23 జూన్ 2012. Retrieved 23 June 2012.