సి. సీత (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సి. సీత ప్రముఖ సినిమానటుడు నాగభూషణం సతీమణి. ఈమె సుమారు 3 దశాబ్దాలు సినిమాలు, నాటకాలలో నటించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈమె 1935లో సినిమా నటుడు, వస్తాదు, నిర్మాత, దర్శకుడు అయిన రాజా శాండో, మూకీ,టాకీల తొలితరం సినిమా నటి లీలాబాయిలకు జన్మించింది.[1]. ఈమె పూర్వీకుల స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ. తల్లిదండ్రులు ఇద్దరూ సినిమా రంగానికి చెందిన వారు కావడం వల్ల ఈమెకు చిన్నతనం నుండి సినిమా పరిశ్రమ, నటన పట్ల అవగాహన ఏర్పడింది. ఈమె శేషాద్రి అయ్యర్ వద్ద సంగీతం నేర్చుకుంది. మంచి కంఠస్వరం, గ్రహణశక్తి ఈమెను మంచి గాయనిగా తీర్చిదిద్దింది. ఈమె వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందింది. ఈమెకు నాలుగేళ్ల చిన్నవయసులోనే ముఖానికి రంగువేసుకుని సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత అనేక సినిమాలలో, నాటకాలలో నటించింది. ఈమెకు 1956లో ప్రముఖ నటుడు సి.నాగభూషణంతో వివాహం జరిగింది.

కుటుంబం

[మార్చు]

ఈమె కుటుంబంలో అందరూ సినిమా రంగానికి చెందిన వారే. ఈమె తల్లిదండ్రులు సినిమా నటీనటులు. భర్త సినిమా, నాటకాలలో రాటుదేలిన నటుడు. ఈమె వియ్యంకుడు ఎస్.డి.లాల్ ప్రముఖ సినిమా దర్శకుడు. కూతురు భువనేశ్వరి భర్త, ఎస్.డి.లాల్ తనయుడు మీర్ టెలివిజన్ రంగంలో ప్రముఖ కెమరామ్యాన్, దర్శకుడు, ఎడిటర్. ఈమె కుమారుడు సి.సురేంద్ర కూడా పేరొందిన కెమరామ్యాన్, టి.వి. నటుడు. ఇతడు భార్యాభర్తలు, ఆత్మ మొదలైన టెలివిజన్ సీరియళ్లలో నటించాడు.

సినిమా రంగం

[మార్చు]

సీత నాలుగేళ్ల ప్రాయంలో త్యాగభూమి అనే సినిమాలో తొలిసారి నటించింది. పన్నెండేళ్ల వయసులో చిత్తూరు నాగయ్య నటించిన యోగివేమన సినిమాలో మోహనాంగి చెల్లెలు కనకాంగిగా నటించింది. ఇంకా ఈమె నాటకాల రాయుడు, బికారి రాముడు, నేనేరా పులి, రియల్ స్టోరి తదితర చిత్రాలలో నటించింది. ఋతురాగాలు, శివలీలలు మొదలైన టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించింది.

నాటక రంగం

[మార్చు]

ఈమె చెన్నపురి ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ప్రదర్శితమైన మోహినీ రుక్మాంగద నాటకంలో ధర్మాంగద పాత్రను ఏడేళ్ల వయసులో అభినయించి ప్రేక్షకుల మెప్పును పొందింది. అప్పటి నుండి రంగూన్ రౌడీ, తులాభారం, చింతామణి మొదలైన నాటకాలలో ప్రదాన పాత్రలను పోషించింది. కలికాలం, పాపం పండింది, బికారి రాముడు మొదలైన నాటకాలలో నటించింది.

రక్తకన్నీరు

[మార్చు]

1958లో ఆవిర్భవించిన రక్తకన్నీరు నాటకం ఈమె జీవితంలో పెద్ద మలుపు తిప్పింది. తమిళంలో ఎం.ఆర్.రాధా విరివిగా ప్రదర్శించిన ఈ నాటకాన్ని పాలగుమ్మి పద్మరాజు తెలుగులోనికి అనువదించాడు. నాగభూషణం దీనిని రంగస్థలంపై రసవద్ఘట్టంగా తీర్చిదిద్దాడు. రక్తకన్నీరు నాటకంలో సుందరి పాత్రను ఈమె నటించేది. ఇది వాంప్ తరహా పాత్ర. హీరో నాగభూషణం భార్య ఇందిరను అలక్ష్యం చేసి సుందరి పంచన చేరతాడు. ఇందిర పాత్రను వాణిశ్రీ, శారద చాలాకాలం వీరి ట్రూపుతో కలిసి నటించారు. ఈమె వాణిశ్రీకి డైలాగులు పలకడంలో, వేషధారణ, ఆంగికాభినయంలో శిక్షణ ఇచ్చింది. రక్తకన్నీరు నాటకం విజయవంతం కావడానికి నాగభూషణం సతీమణిగా, నాటక సమాజం నిర్మాతగా ఈమె పాత్ర అదృశ్యమే అయినా ప్రముఖమైనది. రక్తకన్నీరు ప్రదర్శించబడిన 20 సంవత్సరాలు కూతురు భువనేశ్వరి పుట్టినప్పుడు రెండు నెలలు మినహాయిస్తే మిగిలిన అన్నిరోజులు ఈమె ఆ నాటకంలో ఇందిర పాత్రను పోషించింది. వెనుక వుండి నిర్వహణ పనులను అంకితభావంతో చూసుకున్నది.

మూలాలు

[మార్చు]
  1. పి.వి., రామ్మోహన్‌నాయుడు (5 May 2002). "రక్తకన్నీరు వెనక కథానాయిక" (PDF). వార్త. Retrieved 28 March 2017.[permanent dead link]