సీత్ల
సీత్ల అమ్మ లంబాడీ గిరిజన ప్రజల దేవత. పశు సంపద కోసం, పశువుల ఆరోగ్యం కోసం తండా సౌభాగ్యం కోసం సీత్ల భవాని పూజ చేయడం లంబాడీల ఆనవాయితీ. కలరా వంటి మహమ్మారులు ప్రబలకుండా కాపాడుతుందని బంజారాల నమ్మకం.[1]
లంబాడీ సంస్కృతిలో సీత్ల అమ్మ[మార్చు]
తండాలో ఏ కార్యం జరిగినా పెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, త్వళ్జ, సీత్ల, మంత్రల్, హింగ్ల, ధ్వాళ్ ఆంగళ్, కంకాళీ.[2]
తండాలో ఉన్న పశువులు, గొర్లు, మేకలు, కోళ్లు, పశుసంపద పెరగాలని, దూళ్ళకు పాలు సరిపోను ఉండాలని గడ్డి బాగా దొరకాలని క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలని అటవీ సంపద తరగకూడదని, సీత్ల తల్లికి మొక్కులు తీర్చుకుంటారు.
సీత్ల భవానీ పండుగ[మార్చు]
సీత్ల భవాని పండుగ ప్రపంచం మొత్తంలో నివసిస్తున్న లంబాడీలు వారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ. ఇటువంటి పండుగ తెలుగు పండుగల్లో లేదు. ఈ పండుగ బంజారా ఔన్నత్యాన్ని చాటుతుంది. ఈ పండుగ పంటపొలాలు సాగుచేసే ప్రారంభంలో ప్రారంభమవుతుంది. దీనిని ఆషాఢ మాసంలో ఒక మంగళవారం జరుపుతారు. ఇది ప్రతీ సంవత్సర మంగళవారం నాడే జరపడం ఆనవాయితే. ఇది లంబాడీల పండుగలలో మొదటిది.
ఈ పండగలో భాగంగా తండాల సరిహద్దుల్లోని పొలిమేర, కూడలి వద్ద సీత్ల భవానిని ప్రతిష్టిస్తారు. పురుషులంతా డప్పు వాయిద్యాలు వాయిస్తూ కోళ్లు, మేకలతో, మహిళలు, యువతులు బోనాలు ఎత్తుకుని నృత్యాలు చేసుకుంటూ అమ్మవారిని ప్రతిష్టించిన ప్రదేశానికి వెళ్తారు.. ఈ క్రమంలో అందరు కలిసి పాటలు పాడుతారు. సీత్ల భవాని దగ్గరకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్లు, లాప్సి పాయసం సమర్పిస్తారు. కోళ్లు మేకలను బలి ఇచ్చి వాటి పైనుంచి పశువులను దాటిస్తారు. అలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండుతాయని బంజారా నమ్మకం. దేవతను పూజించే క్రమంలో పెద్ద మనిషిని పూజారిగా ఉంచి అతని చేతుల మీదగా కార్యక్రమం నిర్వహిస్తారు. ఎక్కువ పశు సంపద వృద్ధి చెందాలనీ, తండా ప్రజలందరినీ దేవత సల్లగా ఉండేలా దీవించాలనీ, పశువులకు ఎటువంటి రోగాలు రాకూడదనీ, ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉండాలనీ తండావాసులు వారి పశువులను ఒకేచోట చేర్చి అందరూ కలిసి భవాని దేవతను పూజిస్తారు. తండాలో ఉన్న పశువులు, గొర్లు, మేకలు, కోళ్లు, పశుసంపద పెరగాలనీ, దూడలకు పాలు సరిపోను ఉండాలనీ, గడ్డి బాగా దొరకాలనీ, క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలనీ, అటవీ సంపద తరగకూడదని మొక్కులు తీర్చుకుంటారు. [3]
మూలాలు[మార్చు]
- ↑ "బంజారా సంస్కృతి-సీత్లా భవాని పండుగ - Navatelangana". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-29. Retrieved 2020-06-27.
- ↑ "తొలకరి చినుకుల పండుగ ' తీజ్ '" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-29. Retrieved 2020-06-27.
- ↑ "బంజారా సంస్కృతి-సీత్లా భవాని పండుగ | జాతర | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2020-06-27.