Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

హిల్డా మేరీ లాజరస్

వికీపీడియా నుండి
మద్రాసు వైద్యకళాశాలలో శాఖా అధిపతిగా ఉన్న సమయంలో హిల్డా మేరీ లాజరస్

హెచ్.ఎం.లాజరస్ లేదా హిల్డా మేరీ లాజరస్ (ఆంగ్లం: Hilda Mary Lazarus) (జనవరి 23, 1890 - జనవరి 23, 1978) ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు.

జననం

[మార్చు]

వీరు జనవరి 23, 1890 సంవత్సరంలో విశాఖపట్టణంలో జన్మించారు. వీరిది క్రైస్తవం స్వీకరించిన బ్రాహ్మణ కుటుంబం.[1]

1906లో మెట్రిక్యులేషన్ పరీక్ష పాసై 1911లో బి.ఎ. పట్టభద్రులయ్యారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1916లో ఎం.బి.బి.ఎస్. చదివారు. 1917లో లండన్ చేరిన అనంతరం విద్యాభ్యాసం కొనసాగించారు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంచే స్త్రీల వైద్యసేవల నిమిత్తం భారతదేశంలో తొలి వైద్యురాలిగా నియమితులయ్యారు. ప్రసూతి విభాగంలో సహాయకురాలిగా తొలి రెండు నెలలు పనిచేశారు. తరువాత కలకత్తాలోని డఫెరిన్ ఆసుపత్రికి బదిలీ అయ్యారు. అక్కడ 13 నెలలు ఆర్.ఎం.ఒ.గా సేవలందించి సూరత్ వెళ్ళారు. మూడున్నరేళ్ళ తరువాత విశాఖ డఫెరిన్ వైద్యాలయంలో చేరారు. విశాఖలో ప్రసూతి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి తెలుగులో బోధనకు అంకురార్పణ చేశారు. అలా విశాఖలో ఐదేళ్ళు, చెన్నైలో పన్నెండేళ్ళు, లేడీ హార్డింగ్ కళాశాల ప్రధానోపాధ్యాయినిగా మూడున్నరేళ్ళు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు.

రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా భారతీయ వైద్య సేవా విభాగంలో వనితా విభాగానికి అసిస్టెంటు డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించి 'తొలి భారతీయ మహిళా వైద్యులు' అని ప్రభ్యాతి గడించారు. ఈ కాలంలోనే హెల్త్ సర్వే,[2] డా. ఎ.లక్ష్మణస్వామి ముదలియార్ (మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్) కమిటీ-1959] లలో సభ్యురాలుగా వ్యవహరించారు.ఆ సమయంలో (1959) ఈమె కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఇలా ముప్పై ఏళ్ళు నిర్విరామ వైద్యసేవలందించి పదవీ విరమణ చేశారు.

తరువాత వెల్లూరు క్రైస్తవ వైద్య కళాశాలకు తొలి భారతీయ ప్రధానాచార్యగా బాధ్యతలు స్వీకరించి ఏడేళ్ళపాటు ప్రిన్సిపల్ గా, ఆసుపత్రి సూపరింటెండెంట్ గా, డైరెక్టర్ గా సేవలందించారు. తరువాత ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ వారి అభ్యర్ధన మేరకు 'ప్రసూతి గర్భ సంబంధ చికిత్సా శిక్షణ విభాగానికి డైరెక్టర్ గా, ఆచార్యులుగా పనిచేశారు. రెడ్ క్రాస్, క్షయ, వైద్యవిద్య కమిటీలలో ముఖ్య సలహాదారుగా వ్యవహరించారు. 1952లో కలకత్తాలో జరిగిన అఖిల భారత ప్రసూతి వైద్య గర్భ సంబంధ చికిత్సకుల 7వ జాతీయ సదస్సుకు అధ్యక్షత వహించారు.

విశాఖలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నాక శేష జీవితమంతా రోగుల కోసమే వెచ్చించారు. విశాఖ విక్టోరియా ఆసుపత్రిలో ఈమె గౌరవార్ధం 'లాజరస్ వార్డు'ను ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎం.ఎల్.సి., జిల్లా పరిషత్ సభ్యురాలిగా అవిరళ సేవలందించారు.

భారత ప్రభుత్వం ఈమెను 'పద్మశ్రీ' అవార్డుతో గౌరవించింది.

మరణం

[మార్చు]

ఈమె జనవరి 23, 1978 సంవత్సరంలో పరమపదించారు. ఈమె అవివాహిత.

మూలాలు

[మార్చు]
  1. The biographical dictionary of women in science. Vol. 2: L-Z edited by Marilyn Bailey Ogilvie, Joy Dorothy Harvey
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2012-04-17. Retrieved 2011-07-29.