హైకూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హైకూ అనునది ఆధునిక తెలుగు కవిత్వ ప్రక్రియ. జపనీ సాహిత్యంలో విశేష ఆదరణ పొందిన ఈ ప్రక్రియ తెలుగులోకి దిగుమతి అయింది.

నిర్మాణం[మార్చు]

హైకూ మూడు పాదాలలో పదిహేడు 'మాత్రలు ' ( సిలబుల్స్) కలిగిన త్రిపద. మొదటి పాదంలో ఐదు, రెండో పాదంలో ఏడు, మూడో పాదంలో ఐదు చొప్పున మాత్రలు ఉంటాయి.

ప్రత్యేకత[మార్చు]

సాధారణ విషయాలలో అద్భుతాన్ని చూపగల ప్రక్రియ. ఏ ఆలోచన చేయకుండా ఒక దృశ్యాన్నో, సంఘటననో చూసి కవి మెరుపు వేగంతో చెప్పే ప్రక్రియ. మానవాత్మనీ, భూమ్యాకాశాల్ని, వెలుగునీడలను ఒకే స్నాప్ షాట్ లో పట్టే ప్రక్రియ అంటారు ప్రముఖ సాహితీకారులు వాడ్రేవు చినవీరభద్రుడు. కొలనులోకి రాయి విసిరితే వృత్తాలు వ్యాపించినట్లు హైకూ పాఠకునిలో ఆలోచనాతరంగాలను సృష్టిస్తుంది.

తెలుగు హైకూల చరిత్ర[మార్చు]

తెలుగులో హైకూలను పరిచయం చేసింది ఇస్మాయిల్ (కవి) గారు[1]. 1991లో పెన్నా శివరామకృష్ణ ' రహస్యద్వారం ' పేరుతో తొలి తెలుగు హైకూ కవిత్వ సంపుటిని తీసుకవచ్చాడు. "చినుకుల చిత్రాలు" (2000), "సులోచనాలు" (2006) పేర్లతో మరో రెండు హైకూ సంకలనాలను కూడా పెన్నా శివరామకృష్ణ ప్రచురించాడు. ప్రపంచంలోని, భారతదేశంలోని వివిధ భాషలలో వచ్చిన కొన్ని హైకూలను తెలుగులోనికి అనువదించి "దేశదేశాల హైకూ" (పాలపిట్ట బుక్స్ ప్రచురణ, 2009) అనే మరో అనువాద రచనను కూడా పెన్నా శివరామకృష్ణ వెలువరించాడు. "ప్రపంచ వ్యాప్త కవితా ప్రక్రియ హైకూ", "హైకూ - స్వరూప స్వభావాలు" అనే శీర్షికలతో పెన్నా శివరామకృష్ణ రాసిన రెండు వ్యాసాలు కూడా "దేశదేశాల హైకూ" పుస్తకంలో ప్రచురింపబడినాయి. 1994లో గాలి నాసరరెడ్డి జపాన్ హైకూలను తెలుగులోకి అనువదించారు. ప్రస్తుతం తలతోటి పృథ్విరాజ్ ' ఇండియన్ హైకూ క్లబ్ ' ని స్థాపించి ఈ ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించి, విరివిగా రాస్తున్నారు. హైకూ సంకలనాలు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. బి.వి.వి. ప్రసాద్, లలితానంద ప్రసాద్, వెంకటరావు, హైకూ వరలక్ష్మి మొదలగు తెలుగు కవులు హైకూలు రాస్తున్నారు.

కొన్ని హైకూలు[మార్చు]

సమీక్షకుడు

పచ్చిపాల మీగడ

వెతికే అత్త

- పెన్నా శివరామకృష్ణ

వర్షం

క్షణం పూచే నీటిపూలతో

ఊరునిండిపోయింది

- బి.వి.వి. ప్రసాద్

వాగు ప్రవాహానికి

అన్నీ కొట్టుకపోతున్నాయి

చంద్రుడు తప్పించి

-తలతోటి పృథ్విరాజ్

01) పూలవనం ఆ యింటాయనిదే!/సీతాకోక చిలుకలుమాత్రం/తోటమాలి నేస్తంలైనాయి. 02) జన్మనిచ్చిన ఋణం తీర్చుకుంటున్నాయి/రాలిపడిన ఆకులు/ఎరువై చెట్టుకు బలాన్నిస్తున్నాయి. 03) మింగేస్తుంది/నోరు తెరుచుకున్న కొండ/రోజుకో సూర్యుడ్ని... 04) రోజుకో సూర్యుడ్ని/మింగబట్టేనేమో.../అగ్నిపర్వతమయింది 05) చినుకు ముద్దుకు/ సిగ్గుతో ముడుచుకుంటోంది/ టచ్మీనాట్ 06) చలికి వణుకుతున్నా సరే.../తెల్లరేదాక నదిని ఈదుతూ/పున్నమి చంద్రుడు! 07) గూటికి చేరి/మళ్ళీ ఎగిరెళ్తూ పక్షులు-/సూర్య గ్రహణం! 08) ప్రత్యక్షమయ్యాయి/తప్పిపోయాయనుకున్న గొర్రెలు/దిగుడు బావిలోంచి! 09) ఆస్వాదించేందుకు/వచ్చి వెళ్తున్నాయి పక్షులు-మంచెపై/డబ్బా గలగలల సంగీతం కోసం! 10) పోటా పోటీతో/మేల్కొల్పు గీతం/కాకులూ ...కోళ్ళూ. 11) మంటలతో అడవి./పాపం గడ్డి పొదల్లో/పక్షుల పొద రిళ్ళూ...పిల్లలు 12) చినుకుల రాయబారితో/నింగికి నేలతల్లి ప్రత్యుత్తరం/పుడమి పరిమళం! ~ డా. తలతోటి పృథ్వి రాజ్ " రోజుకోసూర్యుడు..."కవితా సంపుటినుండి

మూలాలు[మార్చు]

  1. తెలుగు సాహిత్య చరిత్ర, రచన:డాక్టర్ ద్వా.నా.శాస్త్రి, విశాలంధ్ర ప్రచురణలు, 2001, పుట-315
"https://te.wikipedia.org/w/index.php?title=హైకూ&oldid=2127348" నుండి వెలికితీశారు