Jump to content

హ్యారీ పాటర్

వికీపీడియా నుండి
(హ్యారి పాటర్ నుండి దారిమార్పు చెందింది)
హ్యారీ పాటర్ (Harry Potter)
జె.కె.రౌలింగ్ రచించిన హ్యారీ పాటర్ పుస్తకాల పరంపరలో మొదటి దైన Harry Potter and the Philosopher's Stone ముఖచిత్రం(British/Canadian/Australian/Irish/ Japanese/Taiwanese/African version).
కృతికర్త: జే. కే. రౌలింగ్
బొమ్మలు: థామస్ టాయ్‌లర్, క్లిఫ్ రైట్, గైల్స్ గ్రీన్‌ఫీల్డ్, జేసన్ కాక్‌క్రాఫ్ట్
దేశం: యునైటెడ్ కింగ్‌డమ్
భాష: ఇంగ్లీషు
విభాగం (కళా ప్రక్రియ): కాల్పనిక సాహిత్యం
ప్రచురణ: Bloomsbury, et. al.
విడుదల: 26 జూన్ 1997


హ్యారీ పాటర్ పుస్తకాలు ఇంగ్లండుకు చెందిన రచయత్రి జే. కే. రౌలింగ్ రచించిన ఫాంటసీ సాహిత్య పుస్తకాల వరుస. 1997లో మొదటి పుస్తకం హ్యారీ పాటర్ అండ్ ద ఫిలాసఫర్స్ స్టోన్ విడుదలతోనే ప్రపంచ వ్యాప్తంగా అనూహ్యమైన ప్రజాదరణ పొందింది. దీంతో హ్యారీ పాటర్ సినిమాలూ, వీడియో గేములూ, ఇతర వస్తువులకు కూడా మంచి ఆదరణ లభించింది. ఈ వరుసలో మొత్తం ఏడు పుస్తకాలున్నాయి. 2018 ఫిబ్రవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కన్నా ఎక్కువ ప్రతులు అమ్ముడయ్యి చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన పుస్తక శ్రేణిగా నిలిచాయి. ఈ పుస్తకాలు ఎనభై భాషల్లోకి అనువదించబడ్డాయి.[1]

కథలో చాలా భాగం హాగ్వార్ట్స్ మంత్ర తంత్రజాల పాఠశాలలో నడుస్తుంది. బాలుడైన హ్యారీ పాటర్‌కు క్షుద్రవిద్యలు నేర్చిన మంత్రగాడు వోల్డమోర్ట్‌తో జరిగిన పోరాటము ఈ కథలో ముఖ్యాంశము. ఏడవ పుస్తకం హ్యారీ పాటర్ ఆండ్ ద డెత్లీ హాలోస్ 2007 జూలై 21న విడుదలై సంచలనం సృష్టించింది. విడుదలైన రోజే ప్రతులన్నీ అమ్ముడైపోయి రికార్డులకెక్కింది.[2]

అన్ని పుస్తకాలను చిత్రాలుగా తెరకెక్కించారు. ఈ చిత్రాలను ప్రధానంగా డేవిడ్ హేమాన్ నిర్మించాడు. డేనియల్ రాడ్‌క్లిఫ్ (హ్యారీ పాటర్), రూపర్ట్ గ్రింట్ (రాన్ వీస్లీ), ఎమ్మా వాట్సన్ (హెర్మయనీ గ్రేంజర్)లు ప్రముఖ పాత్రలలో నటించారు. ఈ సిరీస్‌లో నలుగురు దర్శకులు పనిచేశారు: క్రిస్ కొలంబస్, అల్ఫోన్సో క్యూరాన్, మైక్ న్యూవెల్, డేవిడ్ యేట్స్. ఏడవ ఆఖరి నవల అయిన హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగం 2010 నవంబర్లో, రెండవది 2011 జూలైలో విడుదలయ్యాయి. [3] [4]

ఈ నవలల సాఫల్యం వలన, రౌలింగ్ సాహిత్య చరిత్రలోనే అత్యంత ధనవంతురాలైంది.[5] పుస్తకాలు, చలన చిత్రాల విజయంతో హ్యారీ పాటర్ ఫ్రాంచైజీని అదే ఫాంటసీ ప్రపంచం ఆధారంగా అనేక ఇతర రచనలతో విస్తరించారు. ఈ పుస్తకాల ఆధారంగా 2009లో చికాగోలో ఒక సంచార ప్రదర్శన, 2012లో లండన్లో ఒక స్టూడియో పర్యటన, హ్యారీ పాటర్‌పై జే. కే. రౌలింగ్ ఇచ్చే క్రొత్త ప్రకటనలు, సమాచారం ఉండే డిజిటల్ వేదిక విజార్డింగ్ వర్ల్డ్ డిజిటల్ మొదలైనవి ప్రారంభమయ్యాయి[6]. ఫన్టాస్టిక్ బీస్ట్స్ అండ్ వేర్ టు ఫైండ్ దెమ్‌ (2016), ఫన్టాస్టిక్ బీస్ట్స్: ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్ (2018) అనే రెండు క్రొత్త చలనచిత్రాలు ఈ ఫ్రాంచైజీలో (ఇదే ఫాంటసీ ప్రపంచంలో) విడుదలయ్యాయి.

ఎలా మొదలైందంటే

[మార్చు]

జె.కె.రౌలింగ్ 1990లో రద్దీగా ఉన్న ఒక రైల్లో మాంచెస్టర్ నుండి లండన్‌ వెళుతుండగా ఆమె మెదడులో హ్యారీ పాటర్ కథకు బీజం పడింది. ఒక చిత్తు కాగితంపై ఆ ఆలోచనలను రాసుకుంది. ఆ అనుభవం గురించి రౌలింగ్ వెబ్‌సైటులో ఇలా రాసింది:

"ఆరేళ్ళ వయసు నుంచీ రచనలు చేస్తున్నా కానీ ఒక ఆలోచన ఎప్పుడూ ఇంత ఉత్సాహాన్ని ఇవ్వలేదు. నాలుగు గంటల పాటు (రైలు ఆలస్యం అవడం వల్ల) దీని గురించే ఆలోచిస్తూ ఉంటే మెల్లగా ఈ కథలోని విషయాలు చాలా రూపు దిద్దుకున్నాయి. తాను ఒక మంత్రగాడు అనే విషయం తెలియని ఆ సన్నటి, నల్లని జుట్టుతో ఉండే (పాశ్చాత్య దేశాల లో నల్ల జుత్తు చాలా మందికి ఉండదు), కళ్ళద్దాలు పెట్టుకునే అబ్బాయి మెల్ల మెల్లగా నా మదిలో వాస్తవ రూపం దాల్చాడు".[7]

ఆ రోజు సాయంత్రమే ఆమె మొదటి నవల నమూనా, అనుకున్న ఏడు పుస్తకాల పాక్షిక వివరాలు, పాత్రలు, మంత్ర ప్రపంచ చరిత్ర, వివిధ పాత్రల జీవిత విషయాలు (బయోగ్రాఫికల్) రాయడం మొదలు పెట్టింది.[8]

అ తరువాత ఆరు సంవత్సరాల కాలంలో రౌలింగ్‌కు మొదటి బిడ్డ పుట్టడం, మొదటి భర్త నుండి విడాకులు పొందడం, పోర్చుగల్‌కు నివాసం మార్చుకోవడం జరిగాయి. వీటన్నటి మధ్యలో ఆమె ఫిలాసఫర్స్ స్టోన్ రాసింది.[9] ఆ తరువాత ఎడిన్‌బరోలో స్థిరపడిన రౌలింగ్ ఫిలాసఫర్స్ స్టోన్‌ను ఒక కాఫీక్లబ్‌లో కూర్చుని రాసింది. మంచి నర్సరీ (బాలల కేంద్రము) దొరక్కపోవడంతో ఆమె కూతురు కూడా ఆమెతోనే ఉండేది.

1996లో పూర్తైన హ్యారీ పాటర్ అండ్ ద ఫిలాసఫర్స్ స్టోన్ ప్రతులను ఏజంట్లకు పంపింది. ఆమె ప్రయత్నించిన రెండవ ఏజంటు క్రిస్టొఫర్ లిటిల్ అమెతో పని చెయ్యడానికి ఒప్పుకుని ఆమె ప్రతిని కొందరు ప్రచురణకర్తలకు పంపాడు. పన్నెండు మంది నిరాకరించిన తరువాత ఫిలాసఫర్స్ స్టోన్‌ను ముద్రించడానికి బ్లూమ్స్‌బరీ మొందుకు వచ్చి రౌలింగ్‌కు £3,000 అడ్వాన్స్ ఇచ్చింది.[10]

రాస్తున్నప్పుడు ఆమెకు పాఠకుల వయోపరిమితి దృష్టిలో లేదని రౌలింగ్ చెప్పినప్పటికీ, బ్లూమ్స్‌బరీ మాత్రం 9-11 సంవత్సరాల వయస్సు గల పిల్లలను దృష్టిలో ఉంచుకుని ముద్రించింది.[11] ముద్రణ సమయంలో, రౌలింగ్ పూర్తి పేరైన జోఆన్ రౌలింగ్ కాకుండా ఏదైనా లింగభేదం తెలియని కలము పేరు (జోఆన్ అంటే అమ్మాయి అని అందరికీ తెలుసు మరి) పెట్టుకోమని ప్రచురణ సంస్థ కోరగా (9-11 సంవత్సరముల బాలురు, ఒక స్త్రీ రచించిన పుస్తకాలు చదవరు అనే ఒక అపోహతో ) ఆమె జే. కే. రౌలింగ్ (జోఆన్ క్యాత్‌లీన్ రౌలింగ్) అనే పేరును ఎంచుకుంది.[12]

1997 జూన్‌ 26న బ్లూమ్స్‌బరీ యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొదటి హ్యారీ పాటర్ పుస్తకాన్ని విడుదల చేసింది. అమెరికాలో ప్రచురణ హక్కులను 1,05,00 డాలర్ల చారిత్రక మొత్తానికి దక్కించుకున్న స్కొలాస్టిక్ సంస్థ 1998 సెప్టెంబర్ 1న అక్కడ హ్యారీ పాటర్ అండ్ ద సార్సరర్స్ స్టోన్ పేరుతో మొదటి పుస్తకాన్ని విడుదల చేసింది. అమెరికా పాఠకులు "ఫిలాసఫర్" అనే పదాన్ని మంత్రతంత్రాలతో అన్వయించుకోరు అనే ఉద్దేశంతో ఆ పదాన్ని "సార్సరర్"గా మార్చారు. తరువాతి కాలంలో రౌలింగ్ ఈ మార్పు చేసి ఉండకూడదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఈ మొదటి పుస్తకాన్ని "హ్యారీ పోటర్ - పరుసవేది" పేరుతో రమాసుందరి తెలుగులోకి అనువదిస్తే మంజుల్ పబ్లిషింగ్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రచురించారు. దీనికి పెద్దగా జనాదరణ లభించకపోవడంతో తరువాతి హ్యారీ పాటర్ పుస్తకాలను తెలుగులోకి అనువదించలేదు.

రెండవ హ్యారీ పాటర్ పుస్తకమైన హ్యారీ పాటర్ అండ్ ద చేంబర్ ఆఫ్ సీక్రెట్స్ యూకేలో 1998 జులై 2న, యూఎస్‌లో 1999జూన్ 2న విడుదలైంది. మూడవదైన హ్యారీ పాటర్ అండ్ ద ప్రిజనర్ ఆఫ్ ఆజ్‌కబాన్ 1999 జులై 8న యూకేలో విడుదలైంది. అదే సంవత్సరం సెప్టెంబర్ 8న యూఎస్‌లోనూ విడుదలైంది. తరువాతి పుస్తకం హ్యారీ పాటర్ అండ్ ద గాబ్లెట్ ఆఫ్ ఫైర్ను బ్లూమ్స్‌బరీ, స్కొలాస్టిక్ కలిసి ఒకేసారి 2000 జులై 8న విడుదల చేసాయి. ఐదవదైన హ్యారీ పాటర్ అండ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఫీనిక్స్ యూకే ముద్రణలో 766 పేజీలతో (యూఎస్ ముద్రణలో 870 పేజీలు) ఈ వరుసలోనే పెద్ద పుస్తకం. ఇది ప్రపంచవ్యాప్తంగా 2003 జూన్ 21న విడుదలైంది. 2005 జులై 16న హ్యారీ పాటర్ అండ్ ద హాఫ్ బ్లడ్ ప్రిన్స్, 2007 జులై 21న చివరిదైన హ్యారీ పాటర్ అండ్ ద డెత్లీ హాలోస్ విడుదల అయ్యాయి. చివరి పుస్తకంలోని చివరి అధ్యాయం (ఉపసంహారం) 1990 ప్రాంతాల్లోనే పూర్తైందని రౌలింగ్ చెప్పింది.

హ్యారీ పాటర్ విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాకుండా వాణిజ్యపరంగానూ అత్యంత విజయవంతమైన పుస్తకాల సరణిగా నిలిచింది. ఈ విజయంలో ప్రచురణ సంస్థల మార్కెటింగ్ పాత్ర కొంత ఉండగా, పాఠకుల నోటి మాట ప్రచారం (ముఖ్యముగా యువకులలో) కూడా పెద్ద పాత్ర పోషించింది. యువత ఇంటర్నెట్, వీడియో గేములపై మక్కువ చూపుతూ పుస్తక పఠనానికి దూరమౌతున్న కాలంలో వారిని పుస్తకాల విడుదల కోసం ఆతృతగా ఎదురు చూసేలా చేసింది హ్యారీ పాటర్. ప్రచురణకర్తలు మొదటి మూడు పుస్తకాలను వెంట వెంటనే విడుదల చేసి పాఠకులలో ఉత్సాహం తగ్గకుండా చూసుకున్నారు.[13] ఈ పుస్తకాలు పిల్లలనే కాకుండా పెద్దలను కూడా ఆకట్టుకోవడంతో వీటిని రెండు వేర్వేరు ముఖచిత్రాలతో విడుదల చేసారు (చిన్న పిల్లల కోసం ఒక రకమైన బొమ్మ, పెద్దల కోసం ఇంకొకటి).[14] అనేక భాషలలోకి అనువదించడం వలన కూడా ఈ సరణికి జనాదరణ పెరిగింది. ఒక పుస్తకం విడుదల అయ్యేదాకా కథను గుప్తంగా ఉంచడం కోసం ఆంగ్లంలో విడుదల అయిన తరువాత మాత్రమే ఇతర భాషల అనువాదాలు మొదలయ్యేవి. అందువల్ల ఆంగ్ల పుస్తకాలు అందుబాటులోకి వచ్చాక కూడా ఇతర భాషా పాఠకులు వీటిని చదవడానికి కొన్ని నెలల పాటు వేచి చూడాల్సి వచ్చేది. అలా వేచి ఉండలేని అభిమానులు ఆంగ్ల పుస్తకాలనే కొనేయడం వల్ల వాటి అమ్మకాలు మరింత పెరిగేవి. ఈ పరిస్థితి వల్లనే ఆర్డర్ ఆఫ్ ద ఫీనిక్స్ పుస్తకం ఫ్రాన్స్‌లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో మొట్టమొదటి స్థానం దక్కించుకున్న తొలి ఆంగ్ల పుస్తకంగా నిలిచింది.[14]

చెరుపు (స్పాయిలర్) హెచ్చరిక: నవల చదవ గోరిన వారు/సినిమా చూద్దామనుకున్న వారు ఈ క్రింది భాగాన్ని చదవ వద్దని మనవి. కథ వివరాలు తెలుపుతూ, ఉత్కంఠ లేకుండా చేసే అవకాశం ఉంది.

కథాంశం (ప్లాట్) క్లుప్తంగా

[మార్చు]

హ్యారీ పాటర్ అనే అబ్బాయి జీవితం చుట్టూ తిరిగే కథ ఇది. మొదటి పుస్తకంలో హ్యారీ తన పెద్దమ్మ, పెదనాన్నలైన డర్స్లీలతో వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉంటాడు. వాళ్ళకు కూడా హ్యారీ వయసు అబ్బాయి ఉంటాడు. వారు ముగ్గురూ హ్యారీని చిన్న చూపు చూస్తూ యాతనలు పెడుతూ ఉంటారు. హ్యారీకి 11 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు తను ఒక మంత్రగాడనే విషయం తెలుసుకుంటాడు. హ్యాగ్రిడ్ అనే ఒక మహాకాయుడు కలిసి హ్యారీకి హాగ్వార్ట్స్ మంత్ర తంత్రజాల పాఠశాలలో చదువుకోడానికి స్వీకారపత్రం ఇచ్చి హ్యారీ గతం గురించీ, తన తల్లితండ్రుల గురించీ డర్స్లీలు దాచిన విషయాలన్నీ చెప్తాడు. తన తల్లితండ్రులు లిల్లీ పాటర్, జేమ్స్ పాటర్లు కూడా తన లానే మాంత్రికులనీ, హ్యారీ పసి వయసులో ఉండగానే వారిని లార్డ్ వోల్డ్‌మార్ట్ అనే దుష్ట మాంత్రికుడు చంపేశాడనీ తెలుసుకుంటాడు. హ్యారీని కూడా చంపడానికి ప్రయత్నించినప్పుడు తన మంత్రం తన మీదే తిరగబడి వోల్డ్‌మార్ట్ అంతమయ్యాడు. ఈ సంఘటనలో హ్యారీ, కేవలం నుదుటిపై మెరుపు అకారపు మచ్చతో బయటపడతాడు. ఆ మంత్ర ప్రపంచంలోని వారు వోల్డ్‌మార్ట్‌ని అంతం చేసిన వాడిగా పసివాడైన హ్యరీని చూసారు. అందువల్ల హ్యారీ ఊహ తెలియని వయసులోనే మంత్ర ప్రపంచంలో ప్రసిద్ధుడయ్యాడు.

హాగ్వార్ట్స్ పాఠశాలలో చేరిన హ్యారీని మొదటి రోజు సార్టింగ్ హ్యాట్ గ్రిఫిండార్ హౌస్‌లో చేరుస్తుంది. అక్కడ హ్యారీకి పేద మాంత్రికుల కుటుంబానికి చెందిన రాన్ వీస్లీ, మాంత్రికులు కాని (మగుల్) తల్లితండ్రులకు పుట్టిన హెర్మయనీ గ్రేంజర్‌లతో స్నేహం కుదురుతుంది. వీరు ముగ్గురికి స్లిదరిన్ హౌస్‌కు చెందిన డ్రేకో మాల్ఫాయ్‌తో శత్రుత్వం మొదలౌతుంది. ఈ పుస్తకంలో దర్శనమిచ్చే ఇతర ముఖ్య పాత్రలు హాగ్వార్ట్స్ ప్రధానాధ్యాపకుడు ఆల్బస్ డమ్బుల్డోర్, పోషన్స్ అధ్యాపకుడు సెవెరస్ స్నేప్, డిఫెన్స్ అగెన్స్ట్ ద డార్క్ ఆర్ట్స్ అధ్యాపకుడు క్విరినస్ క్విరెల్. వోల్డ్‌మార్ట్ పూర్తిగా అంతమవ్వలేదనీ, బలహీనమైన ఆత్మ రూపంలో మిగిలి ఉన్నాడనీ, క్విరెల్ సాయంతో ఫిలాసఫర్స్ స్టోన్‌ను సొంతం చేసుకుని దాని సాయంతో తన శరీరాన్ని తిరిగి పొందడానికి పన్నాగం పన్నాడనీ పుస్తకం చివర్లో హ్యారీ, వోల్డ్‌మార్ట్‌లు తలపడినప్పుడు తెలుస్తుంది.

చేంబర్ ఆఫ్ సీక్రెట్స్లో హ్యారీ హాగ్వర్ట్స్‌లో గడిపిన రెండో సంవత్సరం సంగతులు ఉంటాయి. ఒక గుర్తు తెలియని మృగం ఏదో పాఠశాలలోని పిల్లలపై దాడులు చేసి వారు శిలల్లాగా బిగుసుకుపోయేలాగా చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మగుల్ తల్లిదండ్రులు ఉన్న పిల్లలే లక్ష్యంగా దాడులు చేస్తుంది. యాభై ఏళ్ళ క్రితం హాగ్వార్ట్స్‌లో జరిగిన దాడులకు దగ్గరగా, ఎక్కడుందో తెలియని ఒక రహస్య గది (చేంబర్ ఆఫ్ సీక్రెట్స్‌)కి సంబంధం ఉన్నట్టు ఉంటాయి ఈ దాడులు. చాలా అరుదైన, దుష్ట శక్తులకు సూచన అయిన పాములతో మాట్లడగల సామర్థ్యం తనకి ఉన్నట్టు హ్యరీ తెలుసుకుంటాడు. హెర్మయనీపై దాడి, రాన్ చెల్లెలు జిన్నీ అపహరణల తరువాత వారిని కాపాడటానికి హ్యారీ, రాన్ కలిసి ఆ రహస్య గది ఆచూకీ కనిపెట్టి లోపలికి వెళ్తారు. వోల్డ్‌మార్ట్‌కి తన తల్లి పెట్టిన పేరు టామ్ మార్వోలో రిడిల్ అనీ, రిడిల్ హాగ్వార్ట్స్‌లో చదివిన కాలంలో తన జ్ఞాపకాలను భద్రపరిచిన డైరీ ఇప్పుడు జిన్నీని ఆవహించిందనీ హ్యారీ తెలుసుకుంటాడు. రిడిల్‌గా రహస్య గదిని తెరిచి దానిలోని మృగాన్ని (బాసిలిస్క్ పాము) విద్యార్థులపై దాడులకు ఉసిగొల్పిన వోల్డ్‌మార్ట్, ఇప్పుడు తన డైరీ ద్వారా జిన్నీని ఆవహించి తన చేత రహస్య గదిని తెరిపించాడు. వందల ఏళ్ళు బ్రతికే బాసిలిస్కుకు తన కళ్ళలోకి నేరుగా చూసిన వారిని చంపే, పరోక్షంగా (ప్రతిబింబాన్ని) చూసిన వారిని శిలలుగా మార్చేసే శక్తి ఉంటుంది. డమ్బుల్డోర్ పెంపుడు ఫీనిక్స్ అయిన ఫాక్స్, గ్రిఫిండార్ ఖడ్గాల సాయంతో హ్యారీ బాసిలిస్క్‌తో పాటు రిడిల్ డైరీని కూడా అంతం చేస్తాడు.

మూడవదైన ప్రిజనర్ ఆఫ్ ఆజ్‌కబాన్ కరడుగట్టిన నేరస్థుడైన సిరియస్ బ్లాక్ ఆజ్‌కబాన్ జైలు నుంచి తప్పించుకోడంతో మొదలౌతుంది. సిరియస్ బ్లాక్ వోల్డ్‌మార్ట్‌కి సన్నిహితుడనీ, హ్యారీ తల్లిదండ్రులను చంపేందుకు సహాయం చేశాడనీ, ఇప్పుడు హ్యారీని చంపడానికే జైలు నుంచి తప్పించుకున్నాడనీ హ్యారీ తెలుసుకుంటాడు. బ్లాక్‌ను వెతికి పట్టుకునేందుకు ఆజ్‌కబాన్ రక్షకభటులైన డెమెంటర్లు హాగ్వార్ట్స్‌ను తనిఖీ చేస్తూ కాపలా కాస్తూ ఉంటారు. డెమెంటర్లు ఉన్న చోట సంతోషం ఆవిరైపోయి నిరాశ, నిస్పృహలు అలముకుంటాయి. హ్యారీ మిగిలిన వారి కంటే ఎక్కువగా డెమెంటర్ల వల్ల ప్రభావితం అవుతాడు. వాటిని ఎదుర్కోడానికి తన స్కూల్లో కొత్త అధ్యాపకుడైన రీమస్ లుపిన్ సహాయం తీసుకుంటాడు. లుపిన్ హ్యారీకి డెమెంటర్లను ఎదుర్కొనేందుకు పాట్రొనస్ మంత్రాన్ని నేర్పిస్తాడు. ఒక రాత్రి రాన్‌ను ఒక పెద్ద నల్ల కుక్క ష్రీకింగ్ ష్యాక్‌లోకి లాక్కుపోతుంది. ష్రీకింగ్ ష్యాక్ దెయ్యల కొంపగా ప్రసిద్ధి. హ్యారీ, హెర్మయనీలు రాన్ కోసం అందులోకి వెళ్తారు. అక్కడ ఆ నల్ల కుక్కే సిరియస్ బ్లాక్ అని తెలుసుకుంటారు. ఇంతలో అక్కడికి లుపిన్ వచ్చి సిరియస్, హ్యారీ తండ్రి అయిన జేమ్స్‌కు మంచి స్నేహితుడనీ, తను జేమ్స్‌ను వోల్డ్‌మార్ట్‌కు పట్టివ్వలేదనీ చెప్తాడు. ఆ పని మరో స్నేహితుడైన పీటర్ పెటిగ్రూ అనే వాడు చేసి సిరియస్‌ను ఇరికించాడని చెప్తాడు. పీటర్ ఇప్పుడు రాన్ పెంపుడు ఎలుక అయిన స్కాబర్స్‌గా తలదాచుకుంటున్నాడని కూడా చెప్తాడు. అధారాలతో సహా పెటిగ్రూ దొరికాడు కాబట్టి, ఇక సిరియస్ పైన పడిన అభియోగాలను తుడిచెయ్యొచ్చని ష్రీకింగ్ ష్యాక్ నుంచి తిరిగి బయలుదేరుతారు. అదే సమయంలో పౌర్ణమి చంద్రుడు ఉదయించడం వల్ల లుపిన్ వేర్‌వుల్ఫ్‌గా మారతాడు. సిరియస్ కుక్కగా మారి లుపిన్ వెంట పడతాడు. ఇంతలో డెమెంటర్లు సిరియస్‌ను చుట్టుముడతాయి. సిరియస్‌ను కాపాడేందుకు హ్యారీ ప్రయత్నిస్తూ అలసిపోయి కుప్పకూలిపోతూ ఉండగా, జేమ్స్‌ను పోలిన ఒక వ్యక్తి దుప్పి ఆకారంలోని పాట్రొనస్‌ను వదిలి వారిని కాపాడటం లీలగా చూస్తాడు. కథలో మున్ముందు తెలుస్తుంది... హ్యారీ తనని తనే చూసుకుని తన తండ్రి అనుకున్నాడు అని. హెర్మయనీ దగ్గర ఉన్న టైం టర్నర్ అనే పరికరం ద్వారా వారిద్దరూ సమయాన్ని వెనక్కి తిప్పి సిరియస్‌ని డెమెంటర్ల నుంచి కాపాడతారు. కానీ ఆ గందరగోళంలో పీటర్ పెటిగ్రూ తప్పించుకుంటాడు.

వోల్డ్‌మార్ట్ పునరుద్భవం

[మార్చు]

గాబ్లెట్ ఆఫ్ ఫైర్ పుస్తకం హాగ్వార్ట్స్‌లో హ్యారీ నాలుగవ సంవత్సరంలో జరిగిన సంఘటనల సమాహారం. ఆ సంవత్సరం హాగ్వార్ట్స్‌తో పాటు బౌబేటన్స్, డర్మ్‌స్ట్రాంగ్ అనే రెండు మంత్ర తంత్రజాల పాఠశాలల మధ్య ట్రైవిజార్డ్ పోటీలు హాగ్వార్ట్స్ వేదికగా జరుగుతాయి. అర్హులైన పోటీదారుల్లోంచి ఒక్కో పాఠశాల నుంచి ఒక్కో ఛాంపియన్‌ను గాబ్లెట్ ఆఫ్ ఫైర్ అనే కప్పు ఎన్నుకోవలసి ఉండగా, హాగ్వార్ట్స్ నుంచి సెడ్రిక్ డిగ్గరీతో పాటు వయసు రీత్యా అసలు అర్హుడే కాని హ్యారీ కూడా అనూహ్యంగా ఎన్నికౌతాడు. ఇందులో హ్యారీ ప్రమేయం లేకపోయినా తనే ఏదో పథకం వేసి ఎన్నికయాడని భావించిన రాన్, హ్యారీపై కోపంతో దూరంగా ఉంటాడు. ఛాంపియన్‌లు తమ శారీరక, మనోబలాలను పరీక్షించే పోటీల్లో తలపడుతూ చివరి పోటీలో ఒక మంత్రాల వ్యూహంలోకి ప్రవేశిస్తారు. అందులో దాగి ఉన్న ట్రైవిజార్డ్ కప్‌ను మొదట పట్టుకున్నవారే విజేత. హ్యారీ, సెడ్రిక్ ఒకేసారి కప్ వద్దకు చేరి దాన్ని పట్టుకున్న వెంటనే అది వారిని ఒక స్మశానానికి తీసుకుపోతుంది. అక్కడ అప్పటికే హ్యారీ కోసం ఎదురుచూస్తున్న పెటిగ్రూ సెడ్రిక్‌ని చంపి హ్యారీ రక్తం సాయంతో ఆత్మ రూపంలో ఉన్న వోల్డ్‌మార్ట్‌కు శరీరాన్ని తిరిగి ఇస్తాడు. వోల్డ్‌మార్ట్ తిరిగి రాగానే తన పాత అనుచరులందరూ (డెత్ ఈటర్లు) సమావేశమౌతారు. హ్యారీ వారందరి మధ్య వోల్డ్‌మార్ట్‌తో ద్వంద్వ యుద్ధం చేసి తప్పించుకుని తిరిగి సెడ్రిక్ దేహంతో సహా హాగ్వార్ట్స్ చేరుతాడు. అక్కడ జరిగిన విషయం అంటా తెలుస్తుంది - హాగ్వార్ట్స్‌లో ఆ సంవత్సరం కొత్తగా చేరిన అధ్యాపకుడు మ్యాడ్ ఐ మూడీ లాగా మారువేషంలో వచ్చిన బార్టీ క్రౌచ్ జూనియర్ అనే డెత్ ఈటర్ వోల్డ్‌మార్ట్‌ను తిరిగి మునుపటిలా శక్తిమంతంగా చేయడం కోసం పథకం వేస్తాడు. దీనిలో భాగంగానే హ్యారీని ట్రైవిజార్డ్ ఛాంపియన్‌గా ఎంపికయ్యేలా చేసి పోటీల్లో సహాయం చేస్తూ, కప్‌ను పట్టుకునేందుకు సహకరిస్తాడు. ఆ కప్‌ను పోర్ట్‌కీగా మార్చి, హ్యారీ పట్టుకున్న వెంటనే వోల్డ్‌మార్ట్ వేచి ఉన్న స్మశానానికి హ్యారీని తీసుకుపోయేలా చేస్తాడు.

వోల్డ్‌మార్ట్ తిరిగి వచ్చిన తరువాత మంత్ర ప్రపంచంలో జరిగిన సంఘటనలతో ఐదవదైన ఆర్డర్ ఆఫ్ ద ఫీనిక్స్ మొదలౌతుంది. మాంత్రికుల పాలనా యంత్రాంగం (మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్) వోల్డ్‌మార్ట్ తిరిగి వచ్చాడనే విషయాన్ని ఒప్పుకోడానికి నిరాకరిస్తుంది. హ్యారీ ఒక్కడే ఆ విషయానికి సాక్షి గనుక అతన్ని ఒక వెర్రివాడిగా చిత్రీకరించడానికి చూస్తుంది. డమ్బుల్డోర్ నాయకత్వంలో ఆర్డర్ ఆఫ్ ద ఫీనిక్స్ అనే ఒక రహస్య సంఘాన్ని పునరుద్ధరిస్తారు. ఇదివరలో వోల్డ్‌మార్ట్ పూర్తి శక్తిమంతంగా ఉన్న సమయంలో ఈ ఆర్డర్ సభ్యులు వోల్డ్‌మార్ట్ అరాచకాలను ఎదుర్కొనేందుకు పోరాడేవారు. ఇది ఇష్టం లేని మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్ డమ్బుల్డోర్‌పై నిఘా పెట్టడం, హాగ్వార్ట్స్‌ను తమ అదుపులో ఉంచుకోడం కోసం డొలోర్స్ అమ్బ్రిడ్జ్‌ను హై ఇన్క్విజిటర్‌ హోదాలో నియమించి పలు ప్రత్యేక అధికారాలు ఇస్తుంది. అమ్బ్రిడ్జ్‌ డిఫెన్స్ అగెన్స్ట్ ద డార్క్ ఆర్ట్స్ అధ్యాపకురాలిగా ఉంటూ పిల్లలు దుష్ట శక్తుల నుంచి తమని తాము రక్షించుకోవాల్సిన అవసరం లేదనీ, అలాంటి విషమ పరిస్థితులు తమ సమాజంలో ప్రస్తుతం లేవనీ, అలా నేర్చుకోవాలనుకునే వారికి హాగ్వార్ట్స్‌లో స్థానం లేదనీ చెప్తుంది. దీనికి ప్రతిగా హ్యారీ, రాన్, హెర్మయనీలు 'డమ్బుల్డోర్స్ ఆర్మీ' పేరుతో ఒక రహస్య గుంపును సృష్టించి అందులో చేరిన సభ్యులతో కలిసి తమకు తామే స్వీయ సంరక్షణ నేర్చుకుంటూ ఉంటారు. హ్యారీకి పదే పదే మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్‌లో ఉన్న ఒక చీకటి వరండా కలలో కనిపిస్తూ ఉంటుంది. చివరికి అక్కడ సిరియస్‌ని చిత్రహింసలు పెడుతున్నట్టు కలలో చూస్తాడు. వెంటనే తన స్నేహితులతో కలిసి సిరియస్‌ను కాపాడటానికి మినిస్ట్రీ చేరితే అది మొత్తం వోల్డ్‌మార్ట్ తనని అక్కడికి రప్పించడానికి వేసిన కుట్ర అని తెలుసుకుంటాడు. అక్కడ డెత్ ఈటర్లు హ్యారీ, తన స్నేహితులపై దాడి చేస్తారు. ఆర్డర్ ఆఫ్ ద ఫీనిక్స్ సభ్యులు సమయానికి చేరుకుని వారిని కాపాడుతారు, కాని ఆ పోరులో సిరియస్ మృతి చెందుతాడు. చివర్లో డమ్బుల్డోర్, వోల్డ్‌మార్ట్ మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. ఆ సమయంలో మినిస్ట్రీ ఉద్యోగులు వచ్చి వోల్డ్‌మార్ట్‌ను కళ్ళారా చూస్తారు. అక్కడ భద్రపరిచి ఉన్న ఒక జోస్యం తాలూకు రికార్డు కోసమే మినిస్ట్రీ కేంద్రంగా ఇంత గొడవ జరుగుతుంది. ఆ జోస్యం హ్యారీ వోల్డ్‌మార్ట్‌లను ఉద్దేశించి చెప్పినది. దాని సారాంశం ఈ పుస్తకంలో బహిర్గతం అవుతుంది: వీరిద్దరిలో ఎవరో ఒకరు మరొకరి చేతిలో అంతం అవ్వాలి.

ఆరవదైన హాఫ్ బ్లడ్ ప్రిన్స్లో స్నేప్ చిరకాల స్వప్నమైన డిఫెన్స్ అగెన్స్ట్ ద డార్క్ ఆర్ట్స్ అధ్యాపకుడు అవుతాడు. అతను అప్పటి దాకా బోధించిన పోషన్స్ చెప్పడానికి హొరేస్ స్లగ్‌హార్న్ హాగ్వార్ట్స్‌లో చేరతాడు. హ్యారీకి 'హాఫ్ బ్లడ్ ప్రిన్స్'కు చెందిన ఒక పాత పోషన్స్ పుస్తకం దొరుకుతుంది. అందులో ఆ హాఫ్ బ్లడ్ ప్రిన్స్ రాసిన ఎన్నో ఉపాయాలూ, కిటుకుల వల్ల హ్యారీ పోషన్స్‌లో మునుపెన్నడూ లేనంత మెరుగైన ప్రదర్శన ఇస్తాడు. వోల్డ్‌మార్ట్‌ను ఎదుర్కొనేందుకు హ్యారీని సన్నద్ధం చేయడం కోసం డమ్బుల్డోర్ వోల్డ్‌మార్ట్ జీవితం గురించిన ముఖ్యమైన విశేషాలను హ్యారీకి పెన్సీవ్‌లో చూపిస్తూ చెప్తాడు. వోల్డ్‌మార్ట్ స్లగ్‌హార్న్ పూర్వ విద్యార్థి అనీ, అతను తన ఆత్మను ముక్కలు చేసి పలు వస్తువుల్లో దాచి హార్‌క్రక్స్‌లను తయారు చేసాడనీ స్లగ్‌హార్న్ ద్వారా తెలుసుకుంటాడు హ్యారీ. హ్యారీ, డమ్బుల్డోర్ కలిసి వోల్డ్‌మార్ట్ హార్‌క్రక్స్ ఒకదాన్ని నాశనం చేయడానికి ఒక రహస్య సరోవరానికి వెళ్తారు. ఆ పని పూర్తిచేయగలుగుతారు కానీ డమ్బుల్డోర్ బాగా బలహీనపడతాడు. వారు తిరిగి హాగ్వార్ట్స్ చేరుకునేప్పటికి మాల్ఫాయ్ డెత్ ఈటర్లను స్కూల్లోనికి తీసుకువచ్చి దాడికి దిగితాడు. ఆర్డర్ ఆఫ్ ద ఫీనిక్స్ సభ్యులకూ డెత్ ఈటర్లకూ మధ్య పోరు జరుగుతుంది. స్నేప్ డమ్బుల్డోర్‌ను చంపడంతో పుస్తకం ముగుస్తుంది. చివర్లో స్నేపే హాఫ్ బ్లడ్ ప్రిన్స్ అని తెలుస్తుంది.

చివరి పుస్తకమైన డెత్లీ హ్యాలోస్‌లో వోల్డ్‌మార్ట్ మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్‌నూ, హాగ్వార్ట్స్‌నూ తన ఆధీనంలోకి తీసుకుంటాడు. హ్యారీ, రాన్, హెర్మయనీలు వేసవి సెలవుల తరువాత స్కూలుకు తిరిగి వెళ్ళకుండా వోల్డ్‌మార్ట్ హార్‌క్రక్స్‌లను వెతికి పట్టుకుని నాశనం చేసే పనిలో నిమగ్నం అవుతారు. వారు తమ ప్రయాణంలో డెత్లీ హ్యాలోలనే మృత్యువును జయించగల వస్తువుల గురించి తెలుసుకుంటారు. వోల్డ్‌మార్ట్ హార్‌క్రక్స్‌గా వారు భావిస్తున్న ఒక లాకెట్ కోసం మినిస్ట్రీ ఆఫ్ మ్యాజిక్‌లోకి జొరబడి దాన్ని దొంగిలిస్తారు కానీ దాన్ని నాశనం చేసే ఉపాయం దొరకదు. హ్యారీ పుట్టిన ఊరైన గాడ్రిక్స్ హాలోకు వెళ్తారు. అక్కడ వోల్డ్‌మార్ట్ పెంపుడు పాము అయిన నాగిని వారిపై దాడి చేస్తుంది. ఒక అడవిలో ఒక జింక ఆకారంలోని పాట్రొనస్ వచ్చి వారిని గ్రిఫిండార్ ఖడ్గం దగ్గరికి తీసుకు వెళ్తుంది. దానితో లాకెట్‌ను ధ్వంసం చేస్తారు. గ్రిన్‌గాట్స్ బ్యాంకులో ఉన్న ఒక హార్‌క్రక్స్‌ను దొంగిలించి వారు ముగ్గురూ హాగ్వార్ట్స్ చేరుకుంటారు. అక్కడ హాగ్వార్ట్స్ అధ్యాపకులూ, పిల్లలూ, ఇంకా వోల్డ్‌మార్ట్‌కి వ్యతిరేకంగా పోరాడదలచిన వారందరూ ఏకమై డెత్ ఈటర్లతో భీకర యుద్ధం చేస్తారు. వోల్డ్‌మార్ట్ మతిలేని భయంతో స్నేప్‌ను చంపేస్తాడు. స్నేప్ కొన ఊపిరితో ఉండగా అక్కడికి చేరుకున్న హ్యారీకి తన జ్ఞాపకాలను ఇస్తాడు. హ్యారీ వాటిని పెన్సీవ్‌లో చూసి ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు - స్నేప్ ఎప్పుడూ డమ్బుల్డోర్ వైపే ఉన్నడనీ, డమ్బుల్డోర్ పథకంలో భాగంగానే వోల్డ్‌మార్ట్ దగ్గర పని చేసి డమ్బుల్డోర్‌నే చంపాడనీ, ఇంకా హ్యారీ కూడా వోల్డ్‌మార్ట్ హార్‌క్రక్స్‌ల్లో ఒకడనీ. తను అంతం అయితేనే వోల్డ్‌మార్ట్ అంతం అవుతాడనే విషయం గ్రహించి హ్యారీ తన తాను వోల్డ్‌మార్ట్‌కు త్యాగం చేస్తాడు. వోల్డ్‌మార్ట్ హ్యారీని చంపి సంబరాలు చేసుకుంటుండగా హ్యారీ అనూహ్యంగా తిరిగి బ్రతుకుతాడు. వరిద్దరి మధ్య జరిగిన పోరులో వోల్డ్‌మార్ట్‌ను హ్యారీ ఓడిస్తాడు.

మాయా ప్రపంచము

[మార్చు]
గ్రంధాలపై ఆధారించిన చలన చిత్రాలలో చూపబడిన హాగ్వార్ట్స్ స్కూల్.

హ్యారీ వెళ్ళిన మాయా ప్రపంచము, మామూలు ప్రపంచానికి దూరంగా ఉన్నపటికీ, మన ప్రపంచముతో చాలా దగ్గర సంబంధము కలిగి ఉంటుంది. నార్నియా ప్రపంచములో ప్రత్యేక విశ్వము, లార్డ్ ఆఫ్ ది రింగ్స్లో మిడిల్ ఎర్త్ ఒక గొప్ప గతముగా ఉండగా, హ్యారీ పాటర్ లోని మంత్ర ప్రపంచము మన పక్కన ఉండి, మాంత్రికులు సాధారణమైన పనులు చేస్తూ ఉంటారు. చాలా సంస్థలు, లండన్ వంటి నగరాలు గుర్తింప బడేవిగా ఉంటాయి. విడి విడిగా దాగి ఉన్న వీథులు,ఎవ్వరూ చూడని పురాతన బార్లు, మ్యాజిక్ తెలియని వారికి (మగుల్) కనబడని ఒంటరి భవనాలు,కోటలు ఉంటాయి. మంత్ర శక్తి నేర్చుకునే దాని కన్నా పుట్టుకతో వచ్చేదే ఎక్కువ. హాగ్వార్ట్స్ స్కూల్ కు వెళ్ళడము ఆ విద్యను వశపరుచుకోవడానికి. చాలా మంది మంత్రగాళ్ళకు పుట్టుక తోనే మంత్ర శక్తి ఉంటుంది కనుక వారికి మగుల్ ప్రపంచము ఉందని తెలియదు. (మగుల్ ప్రపంచము కూడా మామూలు ప్రపంచము లాగానే కనపడుతుంది.) అయినా కాని మ్యాజిక్ ప్రపంచము, దానిలోని విచిత్ర వస్తువులు చాలా సాధారణంగా చూపించబడ్డాయి. కథలో ముఖ్య విషయము ఏమిటంటే మ్యజిక్, మామూలు వస్తువులను పక్క పక్కను చూపించడము. కథలలో పత్రలన్ని మ్యజిక్ పరిసరాల్లో సాధారణ జీవితాలు సాధారణ సమస్యలతో గడుపుతారు.

పుస్తకాల వరుస

[మార్చు]
  1. Harry Potter and the Philosopher's Stone (June 26 1997) (titled Harry Potter and the Sorcerer's Stone in the United States)
  2. Harry Potter and the Chamber of Secrets (July 2 1998)
  3. Harry Potter and the Prisoner of Azkaban (September 8 1999)
  4. Harry Potter and the Goblet of Fire (July 8 2000)
  5. Harry Potter and the Order of the Phoenix (June 21 2003)
  6. Harry Potter and the Half-Blood Prince (July 16, 2005)
  7. Harry Potter and the Deathly Hallows (July 21, 2007)

మూలములు

[మార్చు]
  1. The Pottermore News Team (1 February 2018). "500 million Harry Potter books have now been sold worldwide". Pottermore. Archived from the original on 14 March 2018.
  2. "Final 'Potter' launch on July 21". CNN. 2007-02-01. Archived from the original on 2007-02-10. Retrieved 2007-02-12.
  3. https://www.latimes.com/archives/la-xpm-2010-nov-07-la-et-1107-harry-potter-20101107-story.html
  4. https://www.wsj.com/articles/SB10001424052748703567304575628783648960748
  5. Watson, Julie and Kellner, Tomas. "J.K. Rowling And The Billion-Dollar Empire". Forbes.com, 26 February 2004. Accessed 19 March 2006.
  6. "Wizarding World: The Official Home of Harry Potter". www.wizardingworld.com (in ఇంగ్లీష్). Retrieved 2021-06-27.
  7. Rowling, J.K. "Biography". JKRowling.com. Archived from the original on 2008-12-17. Retrieved 2006-05-21.
  8. "J.K. Rowling interview transcript, The Connection". Quick Quote Quill. October 12, 1999.
  9. "Barnes & Noble.com". Archived from the original on 2007-03-11. Retrieved 2007-02-24.
  10. Lawless, John. "Nigel Newton". BusinessWeek Online. Retrieved 2006-09-09.
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-24. Retrieved 2007-02-24.
  12. Savill, Richard. "Harry Potter and the mystery of J K's lost initial". The Daily Telegraph. Archived from the original on 2006-09-07. Retrieved 2006-09-09.
  13. "Books' Hero Wins Young Minds". New York Times. Jul 12, 1999.
  14. 14.0 14.1 "OOTP is best seller in France - in English!". BBC. July 1, 2003.

అధికారిక వెబ్ సైటులు

[మార్చు]