1920 మద్రాసు ప్రెసిడెన్సీ శాసనమండలి ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1920 మద్రాసు ప్రెసిడెన్సీ శాసనమండలి ఎన్నికలు
1920 నవంబరు 1923 →

98 స్థానాలు
మెజారిటీ కోసం 50 సీట్లు అవసరం
  First party Second party
 
Leader పి.త్యాగరాయ చెట్టి
Party జస్టిస్ పార్టీ స్వతంత్రుడు
Seats won 63 18
Percentage 64.29% 18.37%

Elected ఫస్ట్ మినిస్టర్ (ప్రధాన మంత్రి)

ఎ.సుబ్బారాయులు రెడ్డియార్
జస్టిస్ పార్టీ

భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా రాజ్యాధికార వ్యవస్థను స్థాపించిన తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీకి మొదటి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలు 1920 నవంబరులో జరిగాయి. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న కారణంగా భారత జాతీయ కాంగ్రెస్ ఎన్నికలను బహిష్కరించింది. బ్రాహ్మణేతర ఉద్యమం ప్రారంభ దశల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రధాన అంశం బ్రాహ్మణ వ్యతిరేకత. గణనీయమైన పోటీ లేకుండానే జస్టిస్ పార్టీ ఎన్నికలలో విజయం సాధించింది. ఎ. సుబ్బరాయలు రెడ్డియార్ ప్రెసిడెన్సీ ఫస్ట్ మినిస్టర్ (ప్రధాన మంత్రి) అయ్యాడు.[1][2]

1919 నాటి భారత ప్రభుత్వ చట్టం[మార్చు]

మోంటాగు-చెమ్స్‌ఫోర్డ్ నివేదిక లోని సిఫార్సుల ఆధారంగా, 1919 భారత ప్రభుత్వ చట్టం రూపొందింది. ఈ చట్టంతో రాష్ట్రాల శాసనమండలులను విస్తరించి, నామినేటెడ్ సభ్యులు, కంపెనీ అధికారుల కంటే ఎన్నికైన సభ్యుల సంఖ్యను పెంచారు. దీంతో రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ చట్టం భారతదేశంలో ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని తీసుకువచ్చినప్పటికీ, గవర్నరుకు అధిక అధికారాలు ఉన్నాయి. వివిధ పాలనాంశాలను కేంద్రానికి, రాష్ట్రాలకూ పంచింది. రాష్ట్ర మండళ్ళు ఆమోదించిన ఏ చట్టాన్ని అయినా గవర్నర్ జనరల్ త్రోసిరాజనవచ్చు. ఇది రాష్ట్రాలలో "పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వం" అనే భావనను తీసుకువచ్చింది. ప్రాంతీయ పాలనాంశాలను రెండు వర్గాలుగా విభజించారు - రిజర్వ్ చేయబడినవి, బదిలీ చేయబడినవి. విద్య, పారిశుధ్యం, స్థానిక స్వపరిపాలన, వ్యవసాయం, పరిశ్రమలు బదిలీ చేయబడిన సబ్జెక్టులు కాగా, న్యాయ, ఆర్థిక, రెవెన్యూ, గృహ వ్యవహారాలు రిజర్వ్ చేయబడిన సబ్జెక్టులు. బదిలీ చేయబడిన సబ్జెక్ట్‌లకు సంబంధించిన బడ్జెట్‌ను రాష్ట్ర శాసనమండలి నిర్ణయించవచ్చు. ఆ విషయాలతో వ్యవహరించే కార్యనిర్వాహక యంత్రాంగం ప్రాంతీయ శాసనసభ యొక్క ప్రత్యక్ష నియంత్రణలో ఉంచబడింది. అయితే, గవర్నరు, అతని కార్యనిర్వాహక మండలి పరిధిలోకి వచ్చిన రిజర్వ్‌డ్ సబ్జెక్టులపై ప్రాంతీయ శాసనసభ మంత్రులకు ఎటువంటి నియంత్రణ ఉండదు.[3][4][5][6] ఇది దేశంలో మొదటిసారిగా ద్విసభను, ప్రత్యక్ష ఎన్నికలనూ ప్రవేశపెట్టింది. ఆ విధంగా భారత శాసన మండలి స్థానంలో ఎగువ సభ (కౌన్సిల్ ఆఫ్ స్టేట్), దిగువ సభ (లెజిస్లేటివ్ అసెంబ్లీ) తో కూడిన ద్విసభ్య శాసన సభ ఏర్పడింది.

నియోజకవర్గాలు[మార్చు]

మద్రాసు శాసన మండలిలో గవర్నరు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లోని ఎక్స్ అఫిషియో సభ్యులతో పాటు మొత్తం 132 మంది సభ్యులు ఉన్నారు. 132 మందిలో, 98 మంది ప్రెసిడెన్సీ లోని 61 నియోజకవర్గాల నుండి ఎన్నికయ్యారు. నియోజకవర్గాలు మూడు విభాగాలున్నాయి - 1) మహమ్మదీతేర-పట్టణ, మహమ్మదీయేతర గ్రామీణ, బ్రాహ్మణేతర పట్టణ, మహమ్మదీయ-పట్టణ, మహమ్మదీయ-గ్రామీణ, ఇండియన్ క్రిస్టియన్, యూరోపియన్, ఆంగ్లో-ఇండియన్ 2) భూస్వాములు, విశ్వవిద్యాలయాలు, ప్లాంటర్లు వర్తక సంఘాలు (సౌత్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ & నట్టుకోట్టై నగరతార్ అసోసియేషన్) వంటి ప్రత్యేక నియోజకవర్గాలు 3) ప్రాదేశిక నియోజకవర్గాలు. 28 నియోజకవర్గాలు బ్రాహ్మణేతరులకు రిజర్వ్ చేసారు. 29 మంది సభ్యులను నామినేట్ చేసారు. వీరిలో గరిష్ఠంగా 19 మంది ప్రభుత్వ అధికారులు, 5 గురు మహిళలు, 5 గురు పరైయర్, పల్లర్, వల్లువర్, మాల, మాదిగ, సక్కిలియార్, తొట్టియార్, చెరుమాన్, హోలెయ వర్గాలకు, ఒకరు " వెనుకబడిన మార్గాలకు" చెందినవారు. కార్యనిర్వాహక మండలి సభ్యులతో సహా, శాసనసభ మొత్తం బలం 134.[7][8][9]

ఓటర్లు, పోలింగు[మార్చు]

మొదటి సాధారణ ఎన్నికలు 1920 నవంబరులో జరిగాయి [10] ఎన్నికల సమయంలో, మద్రాసు ప్రెసిడెన్సీలో 4 కోట్ల జనాభా ఉంది. ఆస్తి అర్హతల ఆధారంగా వోటుహక్కు ఇచ్చారు.[11] 1,248,156 మంది వ్యక్తులు ఓటు వేయడానికి అర్హులు కాగా, వీరిలో 3,03,558 మంది ఓటు వేశారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న కారణంగా భారత జాతీయ కాంగ్రెస్ ఎన్నికలను బహిష్కరించింది. కొన్ని నియోజకవర్గాల్లో 12% కంటే తక్కువ పోలింగ్ నమోదైందని, ఏ నియోజకవర్గాల్లోనూ 25% కంటే ఎక్కువ పోలింగ్ కాలేదని ది హిందూ నివేదించింది.[3] మద్రాసు నగరంలో అత్యధికంగా 52% పోలింగ్ నమోదైంది. సాంప్రదాయకంగా బ్రాహ్మణ ప్రాంతం అయిన మైలాపూర్‌లో ఇంకా ఎక్కువ పోలింగ్ నమోదైంది. వర్షం, వరదల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం వైవిధ్యంగా ఉంది. ప్రెసిడెన్సీలో సగటున 24.9% పోలింగ్ నమోదైంది. బ్రిటిషు పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ, అయితే, రాజకీయ స్పృహ పెరిగిందనడానికి ఇది నిదర్శనమని మద్రాస్ మెయిల్ పేర్కొంది.[12]

ఫలితాలు[మార్చు]

పెద్దగా పోటీ లేకపోవడంతో, జస్టిస్ పార్టీ 63 సీట్లు గెలుచుకోగలిగింది.[13] పార్టీల వారీగా ఎన్నికైన, నామినేటైన సభ్యులు:[12][14]

పార్టీ ఎన్నికైనవారు నామినేటైన, ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం
జస్టిస్ పార్టీ 63 0 63
భారత జాతీయ కాంగ్రెస్ పోటీ చేయలేదు పోటీ చేయలేదు పోటీ చేయలేదు
స్వతంత్ర (రాజకీయవేత్త) 18 0 18
మంత్రి వ్యతిరేకి 17 0 17
అధికారులు 0 11 11
నాన్-అఫీషియల్స్ 0 18 18
మొత్తం 98 29 127

జస్టిస్ పార్టీకి 18 మంది ఎన్నుకవని సభ్యుల మద్దతు తమకు ఉందని ప్రకటించింది. దాంతో మండలిలో దాని బలం 81 కి చేరుకుంది.[10]

విశ్లేషణ[మార్చు]

కింది పట్టికలో వివిధ సామాజిక వర్గాల వారీగా సభ్యుల సంఖ్యను చూడవచ్చు.[12][14]

పార్టీ ఎన్నికైనవారు నామినేటైన, ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం
బ్రాహ్మణులు 17 5 22
బ్రాహ్మణేతరులు 57 8 65
అణగారిన తరగతులు 0 5 5
మహమ్మదీయులు 13 1 14
భారతీయ క్రైస్తవులు 5 1 6
యూరోపియన్లు, ఆంగ్లో-ఇండియన్లు 6 9 15
మొత్తం 98 29 127

పి. రాజారామన్ ప్రకారం, జస్టిస్ పార్టీ విజయానికి మూడు కారణాలున్నాయి - కాంగ్రెస్ ఎన్నికల బహిష్కరణ, తీవ్రమైన ప్రత్యర్థి లేకుండా జస్టిస్ పార్టీని విడిచిపెట్టడం, జస్టిస్ నాయకుల తీవ్రమైన ప్రచారం, బ్రాహ్మణేతరులకు సీట్ల రిజర్వేషన్.[10]

ప్రభుత్వ ఏర్పాటు[మార్చు]

మొదట, గవర్నర్ విల్లింగ్‌డన్ ప్రభుత్వ ఏర్పాటుకు జస్టిస్ పార్టీ నాయకుడు, సంపన్నుడైన పి. త్యాగరాయ చెట్టిని ఆహ్వానించాడు. ప్రజల పన్నుల నుండి జీతం తీసుకోవడం ఇష్టం లేకపోవడంతో అతను దాన్ని తిరస్కరించాడు. తెలుగు సభ్యులైన ఎ. సుబ్బరాయలు రెడ్డియార్, రామరాయనింగార్ (పానగల్ రాజు), కూర్మా వెంకట రెడ్డి నాయుడులను మంత్రులుగా చేయాలని ఆయన సిఫార్సు చేశాడు. రెడ్డియార్ ప్రధాన మంత్రిగా, విద్య, పబ్లిక్ వర్క్స్, ఎక్సైజ్ & రిజిస్ట్రేషన్ శాఖల మంత్రిగా నియమితుడయ్యాడు. రామరాయనింగార్ స్థానిక స్వపరిపాలన & ప్రజారోగ్య శాఖ మంత్రి అయ్యాడు. వెంకట రెడ్డి నాయుడుకు డెవలప్‌మెంట్ పోర్ట్‌ఫోలియో లభించింది. 1920 డిసెంబరు 17న మంత్రులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. పెరుంగవూరు రాజగోపాలాచారి శాసన మండలి అధ్యక్షునిగా, ఎడ్విన్ పెరియనాయకం, ఆర్కాట్ రామసామి ముదలియార్ & పి. సుబ్బరాయన్‌లను కౌన్సిల్ కార్యదర్శులుగా నియమించారు. సీపీ రామస్వామి అయ్యర్‌ను అడ్వకేట్ జనరల్‌గా నియమించారు.[10][14] గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో సర్ లియోనెల్ డేవిడ్‌సన్ (హోమ్ సభ్యుడు), సర్ చార్లెస్ తోడ్‌హంటర్ (ఫైనాన్స్), ముహమ్మద్ హబీబుల్లా (రెవెన్యూ), ఎస్. శ్రీనివాస అయ్యంగార్ (లా) ఉన్నారు.[15] 1921 జూలై 11న, సుబ్బరాయలు రెడ్డియార్ ఆరోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో పానగల్ రాజా ప్రథమ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. AP పాత్రో అనే ఒరిస్సా న్యాయవాది విద్యాశాఖ మంత్రిగా నియమితుడయ్యాడు.[3][16][17] మండలి పదవీకాలం ముగియగానే 1923 సెప్టెంబరు 11న రద్దు చేసారు.

ప్రభావం[మార్చు]

1916లో ఉనికిలోకి వచ్చిన జస్టిస్ పార్టీ సామాజిక అభివృద్ధి, బ్రాహ్మణేతర విధానం లపై అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. ఇది 1937 ఎన్నికల వరకు మద్రాసును పరిపాలించింది (1926-30 మధ్య కలిగిన అంతరాయంతో). దాని విజయపు ప్రాముఖ్యతను తెలియజేస్తూ, భారత ప్రభుత్వ అధికారిక సమీక్ష (1921–22) ఇలా చెప్పింది:

భారతదేశ చరిత్రలో మొదటి సారిగా మద్రాసులోని అట్టడుగు కులాలు అగ్రవర్ణ మేధో ఆధిపత్యానికి వ్యతిరేకంగా తమను తాము నిలబెట్టుకుని, రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నాయి...ఇటీవలి రాజ్యాంగ మార్పుల ఫలితంగా, రాజకీయాలలో కులాధిపత్యానికి మొదటి దెబ్బ అది.[10]

మొదటి జస్టిస్ ప్రభుత్వం చేపట్టిన కొన్ని కార్యక్రమాలు శాశ్వత ప్రభావాన్ని చూపాయి. ఇప్పటికీ అవి ఏదో ఒక రూపంలో ఆచరణలో ఉన్నాయి. 1921 సెప్టెంబరు 16 న జస్టిస్ ప్రభుత్వం, తమ మొదటి మత ఉత్తర్వును (GO # 613) ఆమోదించింది, తద్వారా భారత శాసన చరిత్రలో రిజర్వేషన్లను చట్టబద్ధం చేసిన మొట్టమొదటి ఎన్నికైన సంస్థగా అవతరించింది. అప్పటి నుండి భారతదేశంలో ఇది ప్రామాణిక విధానంగా మారింది.[18][19][20] అదేవిధంగా, 1922 డిసెంబరు 18న ప్రవేశపెట్టిన హిందూ ఎండోమెంట్ చట్టం అనేక హిందూ దేవాలయాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలోకి తెచ్చింది. ఈ చట్టం, చివరికి 1925 లో రెండవ జస్టిస్ ప్రభుత్వం ఆమోదించింది. అనేక హిందూ మతపరమైన, ధార్మిక ధర్మాదాయ (HR & CE) చట్టాలకూ, తమిళనాడు రాష్ట్ర ప్రస్తుత విధానానికీ పూర్వగామిగా నిలిచింది.[20][21]

1919 నాటి భారత ప్రభుత్వ చట్టం మహిళలను శాసనసభ్యులు కాకుండా నిరోధించింది. 1921 ఏప్రిల్ 1న కౌన్సిల్‌లో తీర్మానం చేయడం ద్వారా మొదటి జస్టిస్ ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది. కౌన్సిల్‌లో సభ్యత్వానికి అర్హతల్లో లింగ తటస్థతను చేర్చారు. ఈ తీర్మానంతో 1926 లో డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి కౌన్సిల్‌కు నామినేట్ అయింది. ఆమె భారతదేశంలో ఏ శాసనసభలోనైనా సభ్యురాలు అయిన మొదటి మహిళ.[22] మధ్యాహ్న భోజన పథకం 1920లో శాసనమండలి ఆమోదంతో మద్రాస్ కార్పొరేషన్ ద్వారా మద్రాస్‌లోని థౌజండ్ లైట్స్‌లోని కార్పొరేషన్ పాఠశాలలో అల్పాహార పథకంగా ప్రవేశపెట్టబడింది. తర్వాత మరో నాలుగు పాఠశాలలకు విస్తరించారు. 1960లలో కె. కామరాజ్ ప్రవేశపెట్టిన ఉచిత మధ్యాహ్న భోజన పథకాలకు ఇది నాంది. 1980లలో ఎం.జి.రామచంద్రన్ దాన్ని విస్తరించాడు.[23]

మూలాలు[మార్చు]

  1. "The Raja who became Chief Minister". The Hindu. 1 July 2016.
  2. "The Making of Adi Dravida Politics in Early Twentieth Century Tamil Nadu". Social Scientist. July 2011.
  3. 3.0 3.1 3.2 S. Krishnaswamy (1989). The role of Madras Legislature in the freedom struggle, 1861-1947. People's Pub. House (New Delhi). pp. 72–83.
  4. "The State Legislature - Origin and Evolution". Tamil Nadu Government. Archived from the original on 13 April 2010. Retrieved 17 December 2009.
  5. "Tamil Nadu Legislative Assembly". Government of India. Archived from the original on 2 January 2010. Retrieved 17 December 2009.
  6. Rajaraman, P. (1988). The Justice Party: a historical perspective, 1916-37. Poompozhil Publishers. p. 206.
  7. S. Krishnaswamy (1989). The role of Madras Legislature in the freedom struggle, 1861-1947. People's Pub. House (New Delhi). pp. 215–219.
  8. Mithra, H.N. (2009). The Govt of India ACT 1919 Rules Thereunder and Govt Reports 1920. BiblioBazaar. pp. 186–199. ISBN 978-1-113-74177-6.
  9. Hodges, Sarah (2008). Contraception, colonialism and commerce: birth control in South India, 1920-1940. Ashgate Publishing. pp. 28–29. ISBN 978-0-7546-3809-4.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 Rajaraman, P. (1988). The Justice Party: a historical perspective, 1916-37. Poompozhil Publishers. pp. 212–220.
  11. Mithra, H.N. (2009). The Govt of India ACT 1919 Rules Thereunder and Govt Reports 1920. BiblioBazaar. pp. 186–199. ISBN 978-1-113-74177-6.
  12. 12.0 12.1 12.2 Eugene F. Irschick (1969). Political and Social Conflict in South India; The non-Brahman movement and Tamil Separatism, 1916-1929. University of California Press. pp. 178–180.
  13. Most of the candidates did not declare their party affiliation before the election. Only after the results were announced they declared themselves as Justicites.Hamsapriya, A (1981). Role of the opposition in the Madras legislature 1921-1939 (PDF). Madras University. p. 73. Archived from the original (PDF) on 4 October 2011. Retrieved 1 August 2011.
  14. 14.0 14.1 14.2 Saroja Sundararajan (1989). March to freedom in Madras Presidency, 1916-1947. Madras : Lalitha Publications. pp. 329–332.
  15. The Times of India directory and year book including who's who. Bennett & Coleman Ltd. 1922. p. 55.
  16. Ralhan, O. P. (2002). Encyclopaedia of Political Parties. Anmol Publications PVT. LTD. pp. 179–80. ISBN 978-81-7488-865-5.
  17. Myron Weiner, Ergun Özbudun (1987). Competitive elections in developing countries. Duke University Press. p. 61. ISBN 0-8223-0685-9.
  18. "Tamil Nadu swims against the tide". The Statesman. Archived from the original on 14 January 2009. Retrieved 2009-12-22.
  19. Murugan, N. (9 October 2006). "RESERVATION (Part-2)". National. Archived from the original on 8 January 2009. Retrieved 2009-12-22.
  20. 20.0 20.1 Rajaraman, P. (1988). The Justice Party: a historical perspective, 1916-37. Poompozhil Publishers. pp. 255–260.
  21. "The Hindu Religious and Charitable Endowments Department". Department of HR & CE. Government of Tamil Nadu. Archived from the original on 2010-01-06. Retrieved 2009-12-26.
  22. Rajaraman, P. (1988). The Justice Party: a historical perspective, 1916-37. Poompozhil Publishers. p. 264.
  23. Rajaraman, P. (1988). The Justice Party: a historical perspective, 1916-37. Poompozhil Publishers. p. 237.