భారత ప్రభుత్వ చట్టం 1919

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారత ప్రభుత్వ చట్టం 1919
పూర్తి శీర్షికభారత ప్రభుత్వానికి సంబంధించి మరిన్ని అంశాలను పొందుపరచడం.
ఉల్లేఖనం9 & 10 Geo. 5 c. 101
తేదీలు
రాచరికపు ఆమోదం పొందిన తేదీ1919 డిసెంబరు 23
ఇతర శాసనాలు
Repealed byStatute Law (Repeals) Act 1976
స్థితి: Repealed

భారత ప్రభుత్వ చట్టం 1919 అనేది యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంటు జారీ చేసిన చట్టం. భారత ప్రభుత్వంలో భారతీయుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు దీన్ని రూపొందించారు. భారతదేశానికి సంబంధించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎడ్విన్ మోంటాగు, వైస్రాయి చెమ్స్‌ఫోర్డ్ లు తమ నివేదికలో సిఫార్సు చేసిన సంస్కరణలను ఈ చట్టంలో పొందుపరిచారు. ఈ చట్టం 1919 నుండి 1929 వరకు పదేళ్లపాటు వర్తిస్తుంది. దయగల నిరంకుశత్వానికి (అధికారులు తమను తాము మెరుగుపరుచుకునే చర్య) ముగింపు పలికి భారతదేశంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రారంభించడానికి ఈ చట్టం గుర్తు. దీన్ని రూపొందించిన 10 సంవత్సరాల తరువాత దీన్ని సమీక్షించేందుకు సైమన్ కమిషన్ ఏర్పాటు చేసారు.

ఈ చట్టంపై 1919 డిసెంబరు 23 న రాజ ముద్ర పడింది. అదే రోజున చక్రవర్తి భారతదేశానికి సంబంధించిన పార్లమెంటరీ చట్టం ఉద్దేశ్యాన్ని సమీక్షిస్తూ ఒక ప్రకటనను జారీ చేశాడు:

"1773, 1784 చట్టాలు ఈస్టిండియా కంపెనీ క్రింద ఒక సాధారణ పరిపాలనను, న్యాయ వ్యవస్థనూ స్థాపించడానికి రూపొందించబడ్డాయి. 1833 చట్టం భారతీయులకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలకు తలుపులు తెరిచింది. 1858 చట్టం కంపెనీ నుండి పరిపాలనను రాజ్యానికి బదిలీ చేసింది. నేడు భారతదేశంలో ఉన్న ప్రజా జీవితానికి ఇది పునాదులు వేసింది. 1861 చట్టం ప్రాతినిధ్య సంస్థల విత్తనాన్ని నాటింది. 1909 చట్టం ఈ విత్తనానికి జీవం పోసింది. ఇప్పుడు చట్టంగా మారిన ఈ బిల్లు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధికి ప్రభుత్వంలో ఖచ్చితమైన వాటాను అప్పగిస్తుంది. ఇకపై పూర్తి బాధ్యతాయుతమైన ప్రభుత్వానికి మార్గాన్ని చూపుతుంది" [1]

ఈ చట్టం ప్రధాన ప్రావిన్సులకు ద్వంద్వ ప్రభుత్వాన్ని (" డయార్కీ ") అందించింది. అటువంటి ప్రతి ప్రావిన్స్‌లో, ప్రభుత్వ పాలన లోని కొన్ని అంశాల - "బదిలీ చేయబడిన జాబితా" - నియంత్రణను ప్రావిన్షియల్ కౌన్సిల్‌కు జవాబుదారీగా ఉండే మంత్రుల ప్రభుత్వానికి ఇవ్వబడ్డాయి. 'బదిలీ చేయబడిన జాబితా'లో వ్యవసాయం, స్థానిక ప్రభుత్వాల పర్యవేక్షణ, ఆరోగ్యం, విద్య ఉన్నాయి. ప్రావిన్షియల్ కౌన్సిల్‌లను విస్తరించారు.

అదే సమయంలో, ప్రభుత్వంలోని అన్ని ఇతర అంశాలను ('రిజర్వ్‌డ్ లిస్ట్') వైస్రాయి నియంత్రణలోనే ఉంచారు. 'రిజర్వ్ చేయబడిన జాబితాలో' రక్షణ (సైన్యం), విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లూ ఉన్నాయి.

ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విస్తరించి, సంస్కరించారు. ఇది యావత్ భారతదేశానికి రెండు సభల శాసనసభగా మారింది. దిగువ సభ, 145 మంది సభ్యులతో కూడిన శాసనసభ. అందులో 104 మంది ఎన్నికైన సభ్యులు, 41 మంది నామినేట్ అయినవారూ ఉంటారు. వీరి పదవీకాలం మూడేళ్ళు. ఎగువ సభ అనేది కౌన్సిల్ ఆఫ్ స్టేట్, ఇందులో 34 మంది ఎన్నుకైన వారు, 26 మంది నామినేటెడ్ సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం ఐదేళ్ళు. [2]


చట్టం లోని ముఖ్య లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:

  1. ఈ చట్టానికి ప్రత్యేకంగా ఒక పీఠిక ఉంది. భారతదేశంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని క్రమంగా ప్రవేశపెట్టడమే బ్రిటిష్ ప్రభుత్వ లక్ష్యం అని దానిలో చెప్పారు
  2. ప్రాంతీయ స్థాయిలో డయార్కీ ప్రవేశపెట్టబడింది. డయార్కీ అంటే ద్వంద్వ ప్రభుత్వాల సమితి; ఒక దానికి జవాబుదారీ ఉండగా, మరొక దానికి జవాబుదారీ ఉండదు. ప్రాంతీయ ప్రభుత్వ అంశాలను రెండు గ్రూపులుగా విభజించారు. ఒకటి రిజర్వు చేయబడిన సమూహం, రెండవది బదిలీ చేయబడిన సమూహం. రిజర్వు చేయబడిన అంశాలు సంబంధిత ప్రావిన్సు గవర్నర్ నియంత్రణలో ఉంటాయి; బదిలీ చేయబడిన అంశాలు ప్రావిన్సులోని భారతీయ మంత్రులకు కేటాయించారు. [3]
  3. 1919 భారత ప్రభుత్వ చట్టం కేంద్ర, ప్రాంతీయ అంశాల వర్గీకరణ కోసం ఒక నిబంధనను రూపొందించింది. ఆదాయపు పన్నును కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉంచింది. అయితే, బెంగాల్, బొంబాయిలలో వారి అభ్యంతరాలను తీర్చడానికి, ఆదాయపు పన్నులో 25% భాగాన్ని వారికి కేటాయించాలనే నిబంధనను చేర్చారు.
  4. వైస్రాయి ఆమోదిస్తే తప్ప, శాసనసభ ఆమోదించిన మాత్రాన ఏ బిల్లూ ఆమోదం పొందినట్లు కాదు. అయితే వైస్రాయి మాత్రం శాసనసభ ఆమోదం లేకుండానే బిల్లులను ఆమోదించవచ్చు.
  5. ఈ చట్టం కేంద్ర శాసనవ్యవస్థలో రెండు సభలుంటాయని చెప్పింది. దిగువ సభ శాసనసభగా ఉంది, మూడు సంవత్సరాల పదవీకాలంతో 145 మంది సభ్యులు ఉంటారు (నేటి లోక్‌సభకు నమూనా) ; ఎగువ సభ అనేది ఐదు సంవత్సరాల పదవీకాలంతో 60 మంది సభ్యులతో శాసన మండలి (కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్) (నేటి రాజ్యసభకు నమూనా)
  6. భారతదేశంలో మొదటిసారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు ఈ చట్టం వీలు కల్పించింది.
  7. ఈ చట్టం ఆమోదించబడిన 10 సంవత్సరాల కాలం ముగిసాక ప్రభుత్వ పని తీరును సమీక్షించే ఒక చట్టబద్ధమైన కమిషన్‌ను ఏర్పాటు చేయాలనే నిబంధన కూడా చేర్చింది. 1927 నాటి సైమన్ కమిషన్ ఈ నిబంధన ఫలితమే.
  8. మతపరమైన ప్రాతినిధ్యం విస్తరించబడింది. సిక్కులు, యూరోపియన్లు, ఆంగ్లో-ఇండియన్లను కూడా చేర్చారు. ప్రభుత్వానికి నిర్దిష్ట కనీస "పన్ను" చెల్లించే వారికి మాత్రమే వోటు హక్కును కల్పించారు.
  9. వివిధ ప్రావిన్సుల మధ్య సీట్ల పంపకం జనాభా ప్రాతిపదికన కాకుండా, ప్రభుత్వం దృష్టిలో వాటి ప్రాముఖ్యత ఆధారంగా, కమ్యూనిటీల ఆధారంగా చేసారు. వోతు హక్కును నిర్ణయించడానికి ఆస్తి ప్రధాన ప్రాతిపదిక. ఆస్తి, పన్ను చెల్లించదగిన ఆదాయం & చెల్లించిన భూమి శిస్తు రూ. 3000 ఉన్నవారికి ఓటు హక్కు ఉంటుంది.
  10. కేంద్ర శాసనసభకు ఆర్థిక అధికారాలు కూడా చాలా పరిమితంగా ఇచ్చారు. బడ్జెట్‌ను వోటు వేయదగ్గవి, వోటు వెయ్యలేనివి అనే రెండు వర్గాలుగా విభజించారు. ఓటు వేయదగిన అంశాలు మొత్తం వ్యయంలో మూడింట ఒక వంతు మాత్రమే ఉంటాయి. ఇందులో కూడా, గవర్నర్-జనరల్ తన బాధ్యతలను నిర్వర్తించడానికి అవసరం అనుకుంటే, శాసనసభ తిరస్కరించిన లేదా తగ్గించిన ఏదైనా గ్రాంట్‌ను పునరుద్ధరించే అధికారం ఉంటుంది. ఆ విధంగా భారత ప్రభుత్వ చట్టం పాక్షికంగానే అధికారాన్ని ఓటర్లకు డైయార్కీ వ్యవస్థ ద్వారా బదిలీ చేసింది. ఇది ప్రావిన్సులను ఆర్థిక, సాధారణ పరిపాలన యూనిట్లుగా గుర్తించినందున, ఇది భారతీయ సమాఖ్యవాదానికి పునాదిని కూడా సిద్ధం చేసింది.

భారత జాతీయ కాంగ్రెస్ ఈ చట్టాన్ని తిరస్కరించింది. అయితే అన్నీ బెసెంట్, GS ఖపర్డే, బిపిన్ చంద్ర పాల్, సురేంద్రనాథ్ బెనర్జీ, తేజ్ బహదూర్ సప్రూ వంటి కొందరు నాయకులు ఈ చట్టాన్ని ఆమోదించారు. ప్రభుత్వంతో సహకరించడానికి సిద్ధమయ్యారు. వారు కాంగ్రెస్‌ను వీడారు. సురేంద్రనాథ్ బెనర్జీ, తేజ్ బహదూర్ సప్రూలు ఇండియన్ లిబరల్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేశారు. వారిని "లిబరల్స్" అని పిలుస్తారు. మదన్ మోహన్ మాలవీయ సంస్కరణలకు మద్దతు ఇచ్చాడు. ముహమ్మద్ అలీ జిన్నా భారత జాతీయ కాంగ్రెస్‌కు రాజీనామా చేశాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Ilbert, Sir Courtenay Peregrine. The Government of India. Clarendon Press, 1922. p. 125
  2. Uttamabahādura Siṃha, Administrative system in India: Vedic age to 1947, p. 204
  3. Government of India Act 1919