2012 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2012 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు 2012 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో తలెత్తిన వివాదం. ఇది ఐదుగురు క్రికెటర్లపై నిషేధానికి దారితీసింది. డబ్బులు తీసుకుని స్పాట్ ఫిక్సింగ్‌ చేయడానికి ఐదుగురు ఆటగాళ్లు సిద్ధపడ్డారని ఆరోపిస్తూ ఇండియా టీవీ అన్న హిందీ న్యూస్ ఛానెల్ ఒక స్టింగ్ ఆపరేషన్‌ను ప్రసారం చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది.[1] ఈ ఆపరేషన్ ఫలితంగా డెక్కన్ ఛార్జర్స్‌ జట్టుకు చెందిన టిపి సుధీంద్రపై జీవితకాల నిషేధం, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టుకు చెందిన శలభ్ శ్రీవాస్తవపై ఐదేళ్ల పాటు నిషేధం, పుణె వారియర్స్ ఇండియా జట్టుకు చెందిన మోహ్నీష్ మిశ్రాపైనా, కింగ్స్ లెవన్ పంజాబ్ ఆటగాడైన అమిత్ యాదవ్పైనా ఏడాది పాటు నిషేధం విధించారు. వీరితో పాటు 2012 సీజన్‌లో ఏ జట్టులోనూ ఆడని అభినవ్ బాలిపై ఏడాది నిషేధం విధించారు. స్టింగ్ ఆపరేషన్‌లో బాలి 2009 సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నట్టు పేర్కొన్నాడు.[2] స్టింగ్ ఆపరేషన్ ప్రకారం, కొంతమంది ఆటగాళ్లు ఆటగాళ్లకు వేలంలో అంగీకరించిన దానికంటే ఎక్కువ డబ్బు ఫ్రాంఛైజీల యజమానులు ఇచ్చినట్టు, అదంతా నల్ల డబ్బు అనీ చెప్పారు. [3]

స్టింగ్ ఆపరేషన్[మార్చు]

ఇండియా టీవీ రిపోర్టర్లు జంషద్ ఖాన్, సుశాంత్ పాఠక్ వివిధ జట్ల ప్రతినిధులుగా నమ్మించి ఈ స్టింగ్ ఆపరేషన్ చేశారు.[4] 2011 మే నెలలో ప్రారంభమైన ఈ ఆపరేషన్ తరువాతి సంవత్సరం ఏప్రిల్ వరకు కొనసాగింది.[4] ఆపరేషన్ ప్రకారం, తమకు ఫ్రాంఛైజీల వచ్చిన డబ్బు నల్లధనమని, తాను స్పాట్-ఫిక్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాననీ శ్రీవాస్తవ పేర్కొన్నాడు; అయితే, ఈ సంభాషణ మొత్తం ఆడియో టేప్‌లో మాత్రమే రికార్డ్ చేయబడింది. ఏ ఫ్రాంచైజీతోనూ పరిచయం లేని బాలి అనే వ్యక్తి 2009 సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్గొన్నట్లు పేర్కొన్నాడు.[2] ఆపరేషన్‌లో మిశ్రా తన ఫ్రాంచైజీ అయిన పూణే వారియర్స్ ఇండియా తనకు దాదాపు రూ. కోటీ 20 లక్షల నుండి రూ. కోటీ 40 లక్షల వరకూ డబ్బు ఇచ్చిందని పేర్కొన్నాడు. బీసీసీఐ ప్రకారం అతను అన్‌క్యాప్ అవ్వని ఆటగాడు కావడంతో రూ.30 లక్షలకు మించి మిశ్రాని పాడుకునే వీల్లేదు. దానితో ఇది బీసీసీఐ నియమావళికి విరుద్ధం.[3] బుకీగా నమ్మించిన రిపోర్టర్ కోరిక మేరకు టిపి సుధీంద్ర దేశవాళీ మ్యాచ్‌లో నో బాల్ వేశాడు.[2]

ప్రాథమిక విచారణ[మార్చు]

రవి సవానీ నేతృత్వంలో బీసీసీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. రవి అప్పటికి బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధిపతి కాగా అంతకుముందు ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి అధిపతిగా పనిచేశాడు.[1] ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా, "దోషిగా తేలిన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని" ఐపీఎల్ సిఫార్సు చేస్తుందని, ఐదుగురు ఆటగాళ్లను తక్షణమే అన్ని క్రికెట్ కార్యకలాపాల నుండి సస్పెండ్ చేసినట్లు" ప్రకటించాడు.[1] బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్. శ్రీనివాసన్ తమ సంస్థ అవినీతిని సహించదని పేర్కొన్నాడు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 CricketCountry Staff (15 May 2012). "BCCI suspends five players accused in spot-fixing". Cricketcountry.com. Archived from the original on 19 May 2012. Retrieved 15 May 2012.
  2. 2.0 2.1 2.2 Amol Karhadkar; Firoz Mirza (30 June 2012). "Day of shame for cricket's Youngistan". Hindustan Times. Mumbai. Archived from the original on 8 July 2012. Retrieved 6 July 2012.
  3. 3.0 3.1 "India TV sting reveals spot-fixing and black money in IPL". New Delhi: India TV. 16 May 2012. Retrieved 7 July 2012.
  4. 4.0 4.1 "10 lakh for no-ball: TV stings IPL underbelly". Mumbai Mirror. 15 May 2012. Archived from the original on 29 January 2013. Retrieved 7 July 2012.