2023 విశాఖపట్టణం ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2023 విశాఖపట్టణం ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం
తేదీనవంబరు 19–20, 2023 (2023-11-19 – 2023-11-20)
ప్రదేశంవిశాఖపట్టణం ఫిషింగ్ హార్బర్, విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్, భారత దేశం
కారణంతెలియదు
మరణాలులేరు
గాయపడినవారులేరు
ఆస్తి నష్టం45 మర పడవలు పూర్తిగా దగ్ధం, 15 పాక్షికంగా దెబ్బతిన్నాయి. రూ. 30 - 35 కోట్లు (USD 3.6-4.2 మిలియన్లు) అంచనా నష్టం.

2023 విశాఖపట్టణం ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం అన్నది 2023 నవంబరు 19న రాత్రి భారత కాలమానం ప్రకారం 23:00 గంటలకు విశాఖపట్నం నగరంలోని ఫిషింగ్ హార్బర్‌లో జరిగని అగ్నిప్రమాద దుర్ఘటన. దీని కారణంగా 45 మర పడవలు పూర్తిగా దగ్ధం కాగా 15 పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఏ కారణంగా ప్రమాదం జరిగిందన్న అంశం తెలియరాలేదు, కారణాన్ని కనిపెట్టడానికి పోలీసు దర్యాప్తు జరుగుతోంది.

ఈ దుర్ఘటన వల్ల రూ. 30-35 కోట్ల (USD 3.6-4.2 మిలియన్ల) ఆస్తినష్టం వాటిల్లిందని అధికారులు అంచనావేశారు. పేరొందిన యూట్యూబర్, స్థానిక మత్స్యకారుడు అయిన లోకల్ బాయ్ నాని ఈ ప్రమాదానికి సంబంధం ఉందన్న అనుమానాలతో పోలీసులు మొదట అరెస్టు చేశారు. సీసీ టీవీ ఫుటేజి నానికి సంబంధం ఉందన్న సందేహాన్ని బలపరచడం లేదని పోలీసులు ప్రకటించారు. లోకల్ బాయ్ నాని ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించాడని తర్వాత పోలీసులు తెలిపారు.

2023 నవంబరు 26న వాసుపల్లి నాని, అతని మామ సత్యంలు ఈ ప్రమాదానికి కారకులని నిర్ధారించినట్టు ప్రకటించారు. పోలీసుల కథనం ప్రకారం నవంబరు 19 రాత్రి మద్యం మత్తులో ఉన్న వీరు సిగరెట్టును వెళ్తూ ఒక బోటులోకి విసిరేయడంతో వలలకు నిప్పు అంటుకుని ఈ ప్రమాదానికి దారితీసింది. పోలీసులు వారిద్దరిపై కేసును నమోదుచేయడాన్ని తప్పుపడుతూ, పోలీసులు అమాయకులను కేసులో ఇరికిస్తున్నారంటూ స్థానిక మత్స్యకార మహిళలు ఆందోళన చేపట్టారు.

ఈ ఘటనలో దెబ్బతిన్న 49 బోట్లు, ఇతర సామాగ్రి యజమానులకు పరిహారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.7.11 కోట్లు అందించింది. ప్రభుత్వ సాయం సరిపోదని విమర్శిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధితులకు చెరొక రూ.50 వేల సాయాన్ని అందించాడు.

సంఘటన[మార్చు]

2023 నవంబరు 19న రాత్రి 11 గంటల సమీపంలో విశాఖపట్టణం ఫిషింగ్ హార్బర్లో మంటలు చెలరేగాయి. ఒక్కో రోజున 750 బోట్లు ఉండే విశాఖ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల అంచనా ప్రకారం ఆనాటి రాత్రి దాదాపు 250 వరకూ బోట్లు లంగరేసి ఉన్నాయి. మంటలు వేగంగా పదుల సంఖ్యలోని బోట్లకు వ్యాపించాయి. ఈ క్రమంలో కొన్ని బోట్లలో సముద్రంలో ఉన్నప్పుడు వంటలు వండుకోవడానికి వాడే ఎల్పీజీ సిలిండర్లకి, కొన్ని బోట్లలో ఇంధన ట్యాంకులకు మంటలు అంటుకోవడం వల్ల అవి భారీ ఎత్తున శబ్దం చేస్తూ మంటలు ఎగజిమ్ముతూ పేలిపోయాయి. ఈ పేలుళ్ళు అగ్నిమాపక చర్యలకు ఆటంకమూ, తమ బోట్లను కాపాడుకోవడానికి మత్స్యకారులు చేపట్టిన పనులకు అడ్డంకి కలిగించడంతో ప్రమాదం విస్తరించడానికి కారణమయ్యాయి. నాలుగు గంటల పైచిలుకు ప్రయత్నించగా నవంబరు 20 తెల్లవారుజాము 4:30 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి.[1]

రోజంతా చేపలు పట్టడానికి ఉపయోగించినందువల్ల చాలా బోట్లలో ఆ పట్టిన చేపలు అలాగే ఉండిపోయాయి. తెల్లవారాకా చేపల మార్కెట్టుకు చేరి అమ్ముడుపోవాల్సిన ఈ చేపలు సైతం ప్రమాదంలో బోట్లతో సహా తగలబడిపోయాయి. పోలీసులు మొదట్లో 25 ఫిషింగ్ బోట్లు తలగబడిపోయి ఉంటాయని ప్రకటించగా, తర్వాత కొద్దిగంటలకు అధికారులు 43 ఫిషింగ్ బోట్లు పూర్తిగా దగ్ధమైపోయాయనీ, 15 బోట్లు తాత్కాలికంగా దెబ్బతిన్నాయిని పేర్కొన్నారు. ఈ దుర్ఘటన కారణంగా ఎవరి ప్రాణానికీ ప్రమాదం వాటిల్లలేదు.[2]

తదుపరి ఘటనలు[మార్చు]

దర్యాప్తు[మార్చు]

మంటలు ఎలా ప్రారంభమయ్యాయన్నది తెలియకపోవడం వల్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ అంశాన్ని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. యూట్యూబ్‌లో లోకల్ బాయ్ నానిగా సుప్రసిద్ధుడైన స్థానిక మత్స్యకారుడు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే యూట్యూబ్ లైవ్‌లో జరుగుతున్న అగ్నిప్రమాదాన్ని చూపించాడు. ఫిషింగ్ హార్బర్ వద్ద అతను తన స్నేహితులకు మద్యం పార్టీ ఇచ్చాడనీ, ఆ పార్టీలో జరిగిన వివాదంలో మద్యం మత్తులో బోటుకు నిప్పుపెట్టి ఉంటారనీ సందేహించిన పోలీసులు దర్యాప్తు కోసం నవంబరు 20న అతడిని అరెస్టు చేశారు.[2] ప్రాథమిక దర్యాప్తు తర్వాత లోకల్ బాయ్ నానికి ఈ కేసుతో ప్రమేయం లేదని సీసీటీవీ ఫుటేజి ఆధారాల ద్వారా తెలుస్తోందని పోలీసులు కొద్ది గంటల్లోనే ప్రకటించారు.[3][4] లోకల్ బాయ్ నాని ఈ పరిణామాల తర్వాత ఈ కేసు విషయంలో అక్రమంగా అతన్ని అరెస్టు చేశారని అతని కుటుంబ సభ్యులు, పోలీసులు తన పరువుకు నష్టం కలిగించారని రూ.20 లక్షలు ఇవ్వాలని నాని హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.[5][6] పోలీసులు తర్వాత మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు దర్యాప్తు కోసం లోకల్ బాయ్ నానిని అరెస్టు చేశామని, అతని ప్రమేయం లేదని తేలితే విడుదల చేసేవాళ్ళమని, ఈలోపే వారు హైకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు.[7]

నవంబరు 21న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్నిప్రమాద ఘటనను, దుర్ఘటన చుట్టూ ఉన్న అంశాలను దర్యాప్తుచేయడానికి రెవెన్యూ, అగ్నిమాపక సేవలు, మత్స్యశాఖ, పోలీసు విభాగాలతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీతో పాటుగా, క్రైమ్, టాస్క్ ఫోర్స్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) వింగ్స్‌కు చెందిన పోలీసు అధికారులతో కూడిన ఒక ప్రత్యేక టీమ్‌ని కూడా ఏర్పాటుచేసింది.[8]

నవంబరు 25న పోలీసులు కేసును ఛేదించామని, అగ్నిప్రమాద ఘటనకు అసలు కారణాన్ని కనుగొన్నామని ప్రకటించారు. పోలీసుల ప్రకారం విశాఖ హార్బర్ బోట్లలో వంటమనిషిగా పనిచేస్తున్న వాసుపల్లి నాని, అతని మామ, బోట్లలో వాచ్‌మాన్‌గా పనిచేస్తున్న సత్యం మద్యం మత్తులో ఈ ప్రమాదానికి కారణమయ్యారు. 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు మద్యంతోనూ, చేపలకూరతోనూ పార్టీచేసుకోవడానికి హార్బర్‌కి వచ్చిన వీరిద్దరూ, రాత్రి వరకూ తాగుతూనే ఉండి, సిగరెట్ తాగి 815 నెంబరు బోటుపై నిర్లక్ష్యంగా పడేశారనీ, దాని వల అంటుకుని పొగ, మంట రావడంతో భయపడి అక్కడ నుంచి పారిపోయారనీ పోలీసులు ప్రకటించారు. దారిలో వెళ్తూ కుక్కఅరుపు శబ్దంతో కూడిన తమ బండి హారన్ మోగించడంతో స్థానికులు విన్నారనీ, అది క్లూగా పనికివచ్చిందనీ, ఆపైన సీసీ టీవీ ఫుటేజి పరిశీలిస్తే ఇది నిర్ధారణ అయిందనీ వారు పేర్కొన్నారు. వీరిద్దరిపై ఐపీసీ 437,438, 285 సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే, అమాయకులైన వాసుపల్లి నాని, సత్యంలను ఇందులో ఇరికిస్తున్నారంటూ పోలీసులను విమర్శిస్తూ కొందరు మత్స్యకార మహిళలు విశాఖపట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.[7]

పరిహారం[మార్చు]

ప్రభుత్వాధికారులు ఈ దుర్ఘటన వల్ల ప్రాథమికంగా రూ. 30-35 కోట్లు ఆస్తి నష్టం వాటిల్లివుంటుందని మొదటి రెండు మూడురోజుల్లో అంచనా వేశారు. ఇందులో బోట్లు, వాటిలోని సామాగ్రి మాత్రమే కాక చాలా బోట్లు చేపలవేటకు వెళ్ళి రావడంతో తర్వాతిరోజు మార్కెట్‌కు వెళ్ళాల్సిన పట్టిన చేపలు సైతం పెద్ద ఎత్తున తగలబడిపోయాయి.[2] ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రమాద స్థలానికి వచ్చి పరిశీలించి, పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నవంబరు 20న మత్స్యకారులు, సంబంధిత సంఘాలు ఆందోళన చేపట్టారు.[9] నవంబరు 23న ప్రభుత్వం ఈ దుర్ఘటన దెబ్బతిన్న 49 బోట్లు, ఇతర సామాగ్రి యజమానులకు కలిపి రూ.7.11 కోట్ల పరిహారానికి సంబంధించిన చెక్కు ఇచ్చింది. చేపలవేట ఆగిపోయి జీవనోపాధి కోల్పోయిన ఓడ కళాసీలు 400 మందిని గుర్తించి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ప్రకటించింది. ఫిషింగ్ హార్బరును ఆధునికీకరించడానికి రూ.150 కోట్లను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.[10]

ప్రభుత్వం మరింత న్యాయమైన పరిహారం, హార్బరును ఆధుకీకరించడానికి ఇంకా ఎక్కువ కేటాయింపులు చేయాలన్న బాధ్యతను గుర్తుచేయడానికని చెప్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నష్టపోయిన 49 బోట్ల వారికి పరిహారంగా చెరొక రూ.50 వేల చొప్పున చెక్కులను అందించాడు.[11]

ఇవీ చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Bureau, The Hindu (2023-11-20). "At least 25 mechanised fishing boats reduced to ashes in major fire at Vizag Fishing Harbour". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-11-21.
 2. 2.0 2.1 2.2 "విశాఖ హార్బర్ అగ్నిప్రమాదం: యూట్యూబర్ 'లోకల్ బాయ్ నాని' వల్లే 43 బోట్లు తగులబడ్డాయా?". BBC News Telugu. 2023-11-20. Retrieved 2023-11-21.
 3. ABN (2023-11-20). "AP NEWS: యూట్యూబర్ లోకల్ బాయ్ నాని హార్బర్ ప్రమాదానికి కారణo కాదని పోలీసుల నిర్ధారణ". Andhrajyothy Telugu News. Retrieved 2023-11-21.
 4. Telugu, ntv (2023-11-20). "Local Boy Nani: యూట్యూబర్ లోకల్ బాయ్ నాని నిర్దోషి.. తేల్చేసిన పోలీసులు.. ?". NTV Telugu. Retrieved 2023-11-21.
 5. ABN (2023-11-24). "Nani Press Meet: నేను బోట్లు కాల్చలే.. కాపాడాను: లోకల్ బాయ్ నాని". Andhrajyothy Telugu News. Retrieved 2023-11-26.
 6. "వైజాగ్ ఫిషింగ్‌ హార్బర్‌ లో అగ్ని ప్రమాదం..కీలక విషయం బయటపెట్టిన లోకల్ బాయ్ నాని". News18 తెలుగు. 2023-11-24. Retrieved 2023-11-26.
 7. 7.0 7.1 "'ఒక్క సిగరెట్ ముక్క 48 బోట్లను తగులబెట్టింది'...విశాఖ హార్బర్ ప్రమాదం కేసును ఛేదించామన్న పోలీసులు". BBC News తెలుగు. 2023-11-25. Retrieved 2023-11-26.
 8. Rao, V. Kamalakara (2023-11-21). "Committee to probe into fire mishap at Vizag fishing harbour". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-11-21.
 9. "Vizag: ఘటనాస్థలికి జగన్‌ రావాల్సిందే: 'ఫిషింగ్‌ హార్బర్‌' బాధితుల ఆందోళన". EENADU. Retrieved 2023-11-26.
 10. Rao, V. Kamalakara (2023-11-23). "Vizag fishing harbour fire victims get compensation of ₹7.11 crore". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-11-26.
 11. Gopal, B. Madhu (2023-11-24). "Pawan Kalyan gives away ₹50,000 each to victims of Vizag fishing harbour fire". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-11-26.