ద్వీప వక్రతలు
లోతైన సముద్ర భాగాలలో సముద్ర కందకాలకు (Oceanic Trenches) లేదా సముద్రాంతర్గత పర్వత పంక్తులకు (Oceanic Ridges) సమాంతరంగా ఒక వక్రం (arc) రూపంలో ఏర్పడిన అగ్ని పర్వత దీవులను ద్వీప వక్రతలు (Island arc) గా పిలుస్తారు. ఇవి రెండు సముద్ర పలకల అభిసరణ సరిహద్దుల వద్ద ఏర్పడతాయి. ఇవి ద్వీప సమూహం (Archipelago) లో ఒక ప్రత్యెక తరగతికి చెందినవి.
లక్షణాలు
[మార్చు]- ఇవి ప్రాథమికంగా వక్రం లేదా చాపాకారంలో (arc shaped) వున్న సముద్ర దీవులు.
- సాధారణంగా ఇవి అగ్నిపర్వతాలను కలిగివుంటాయి. అయితే కొన్ని మాత్రం అగ్నిపర్వతీయం కానివి (Non volcanic) కూడా వుంటాయి. ఉదాహరణకు దక్షిణ ఏజియన్ ద్వీప వక్రతకు చెందిన దీవులు అగ్నిపర్వతీయమైనవి కావు. కనుక ద్వీప వక్రతలు అగ్ని పర్వతీయ (volcanic) మైనవి లేదా అగ్ని పర్వతీయం కానివి (Non volcanic) కూడా అయి వుండవచ్చు.
- ఇవి సముద్ర మట్టం పైన కనిపించ వచ్చు లేదా సముద్ర జలాలలో మునిగి వుండవచ్చు. ఉదాహరణకు జావా దీవులకు దక్షిణంగా వున్న ద్వీప వక్రతలు సముద్రజలాలలో మునిగి కనపడతాయి. జపాన్, తైవాన్ లకు మద్యన వున్న రుక్యు (Ryukyu) దీవులు సముద్ర జలాల పైన కనిపిస్తాయి
- రెండు సముద్ర పలకలు ఢీ కొన్నప్పుడు పలకల అభిసరణ సరిహద్దుల వద్ద ఇవి ఏర్పడతాయి.
- అభిసరణ పలక సరిహద్దుకు సమాంతరంగా వక్రం లేదా చాపం (Arc) ఆకారంలో ఏర్పడతాయి. ముఖ్యంగా ఇవి చొచ్చుకోనిపోయే పలక (Subducting plate) కు కుంభాకారంగా (Convex) అమరి వుంటాయి
- సముద్ర కందకాలకు (Oceanic Trenches) లేదా సముద్రాంతర్గత పర్వత పంక్తులకు (Oceanic Ridges) లకు సమాంతరంగా ఇవి ఏర్పడతాయి.
అగ్ని పర్వత వక్రత (Volcanic arc) లకు ద్వీప వక్రత (Island arc) లకు గల తేడాలు
[మార్చు]ఖండ, సముద్ర భూభాగాలపై చాపం (arc) ఆకారంలో ఏర్పడిన అగ్నిపర్వతాలను అగ్నిపర్వత వక్రత (Volcanic arc) గా వ్యవహరిస్తారు. అంటే ఇవి ఖండ అగ్నిపర్వతాలు (Continental volcanoes) కావచ్చు లేదా సముద్ర అగ్నిపర్వతాలు (Oceanic volcanoes) కావచ్చు. సాధారణంగా సముద్ర భూతలంపై చాపం (arc) ఆకారంలో ఏర్పడిన అగ్ని పర్వతాలను ద్వీప వక్రత (Island arc) గా వ్యవహరిస్తారు. సముద్ర భూతలంపై ఏర్పడినాయి కాబట్టి ఇవి ప్రాథమికంగా దీవులు. అయితే ఇవి సముద్రంలో మునిగి వుండవచ్చు లేదా సముద్ర జలాలపై తేలుతూ దీవుల వలె కనిపించవచ్చు.
అన్ని ద్వీప వక్రత (Island arc) లు, అగ్ని పర్వత వక్రత (Volcanic arc) లలో ఒక భాగంగా వుంటాయి. అంటే అగ్నిపర్వత వక్రత లలో భాగంగా ఈ ద్వీప వక్రతలే కాక ఇతర ఖండ భాగాలలో చాపం (arc) ఆకారంలో ఏర్పడిన అగ్నిపర్వతాలు కూడా వుంటాయి. కనుక అగ్నిపర్వత వక్రత (Volcanic arc) లన్నీ ద్వీప వక్రత (Island arc) లు కావు. కాని ద్వీప వక్రత (Island arc) లు అన్నీ అగ్ని పర్వత వక్రత (Volcanic arc) లే.
ఉదాహరణకు ఆండీస్, మధ్య అమెరికా, కెనడియన్ పర్వత శృంఖలాలలో అధిక భాగం అగ్నిపర్వత వక్రత (Volcanic arc) గా పిలవబడుతుంది. కాని వాటిని ద్వీప వక్రత (Island arc) లుగా వ్యవహరించరు. కారణం అవి ఖండాలపై ఏర్పడి వున్నాయి కనుక. అయితే సముద్ర భూతలంపై చాపం (arc) ఆకారంలో ఏర్పడిన ద్వీప వక్రత (Island arc) లు అన్నీ అగ్నిపర్వతీయమైనవి కాకపోవచ్చు.
ఉదాహరణకు మధ్యధరా సముద్రంలోని దక్షిణ ఏజియన్ దీవులు ద్వీప వక్రత (Island arc) లో భాగం అయినప్పటికీ అగ్నిపర్వతీయ మైనవి కావు. వీటికి మరింత దక్షిణంగా వున్న హేల్లినిక్ దీవులు (క్రీట్ దీవులతో కూడినవి) ద్వీప వక్రత (Island arc) లో భాగం అయినప్పటికీ అగ్నిపర్వతీయమైనవి.
ద్వీప వక్రతల ఆవిర్భావం
[మార్చు]విరూపకారిక పలకల చర్య (Tectonic plate activity) వలన సముద్ర భూతలం మీద ద్వీప వక్రతలు ఆవిర్భవిస్తాయి. పలక విరూపణ సిద్ధాంతం ప్రకారం రెండు సముద్రపు పలకలు ఢీ కొన్నప్పుడు ఆ పలకల సరిహద్దు మండలంలో ద్వీప వక్రతలు ఏర్పడతాయి.
ద్వీప వక్రత (Island arc) లు రెండు సముద్ర పలకల అభిసరణం వల్ల ఏర్పడతాయి. సముద్ర పలకలు ఒకదానికొకటి ఎదురెదురుగా చలిస్తూ ఢీ కొన్నప్పుడు అభిసరణ సరిహద్దుల వద్ద, అధిక వేగంతో చలించే సాంద్రతర పలక వేరొక పలక లోనికి చొచ్చుకోనిపోతుంది. ఆ విధంగా భూ ప్రావారం లోనికి చొచ్చుకుపోయిన పలక లోని కొంత పటల (Crust) భాగం అధిక లోతుల వద్ద, అధిక ఉష్ణోగ్రతల వలన కరిగిపోతుంది. ఇలా కరిగిన పటలం మాగ్మా రూపంలో నిరంతరం పైకి ఉబికి వస్తుంది. పై పలక యొక్క అశ్మావరణం గుండా పైకి వచ్చిన ఈ మాగ్మా ఘనీభవించడం వలన ఒక వరుస క్రమంలో అగ్నిపర్వతాలు శృంఖలాల (Chains) వలె ఏర్పడ్డాయి. ఈ విధంగా అభిసరణ పలక సరిహద్దుకు సమాంతరంగా వక్రం లేదా చాపం (Arc) ఆకారంలో ఏర్పడిన అగ్నిపర్వత దీవుల వరుసను ద్వీప వక్రతలు (Island Arcs) గా పిలుస్తారు. ఇవి చొచ్చుకోనిపోయే పలక (Subducting plate) కు కుంభాకారంగా (Convex) వుంటాయి. ద్వీప వక్రత ఏర్పడిన ప్రాంతానికి అవతలివైపున అనగా చొచ్చుకుపోతున్న పలక దిశలో సముద్రంలో ట్రెంచ్ లనబడే లోతైన సముద్ర కందకాలు సబ్ డక్షన్ మండలానికి సమాంతరంగా ఏర్పడతాయి. సముద్ర భూతలంపైన ఏర్పడిన ద్వీప వక్రత లోని దీవులు సముద్రమట్టం పైన కనిపించవచ్చు. లేదా సముద్ర గర్భం లోనే దాగి వుండవచ్చు. సాధారణంగా ఈ ద్వీప వక్రతలు రెండు వక్రాలుగా ఏర్పడుతుంటాయి. ఈ రెండు వక్రతలకు మధ్య దూరం 50 నుంచి 150 కి.మీ. వరకూ ఉండవచ్చు. వీటిలో ఖండభాగం వైపు వున్న వక్రం లోని దీవులలో అగ్నిపర్వత ప్రక్రియ చాలా తీవ్రంగా వుంటుంది. మిగిలిన రెండవ వక్రంలోని దీవులలో అగ్నిపర్వత ప్రక్రియ దాదాపుగా కనిపించదు.
మెరియానా దీవులు, కురిల్ (కుర్లీ) దీవులు, అలూషియన్ దీవులు ద్వీప వక్రతలకు చక్కని ఉదాహరణలు.
విస్తరణ
[మార్చు]ద్వీప వక్రతలు ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో విస్తరించి ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ద్వీప వక్రతలలో అలూషియన్ దీవులు, కురిల్ దీవులు, రుక్యు దీవులు, ఫిలిప్పైన్ దీవులు, మెరియానా దీవులు, టోంగా దీవులు మొదలైనవి ముఖ్యమైనవి. మధ్యధరా సముద్రానికి చెందిన ఏజియన్ సముద్రం లోని హెల్లినిక్ దీవులు, హిందూ మహాసముద్రానికి చెందిన అండమాన్, నికోబార్ దీవులు, అట్లాంటిక్ మహాసముద్రానికి చెందిన కరేబియన్ సముద్రంలోని ఏంటిల్లస్ (Antilles) దీవులు ఇతర ద్వీప వక్రతలకు ఉదాహరణలు.
ఒఖొటోస్క్ సముద్రపు పలక (Okhotsk Plate) లోనికి పసిఫిక్ సముద్ర పలక వేగంగా చొచ్చుకొనిపోయినప్పుడు కురిల్ ద్వీప వక్రతలు ఏర్పడ్డాయి. కంచట్కా ద్వీపకల్పం (రష్యా) నుండి హోక్కైడో దీవి (జపాన్) వరకూ 1300 కి.మీ. పొడుగునా 50 పైగా దీవులతో ఒక వక్రం ఆకారంలో ఏర్పడినవే ఈ కురిల్ దీవులు. ఈ దీవులకు సమాంతరంగా, సముద్ర మట్టం నుండి 10,542 మీటర్ల లోతులో 'కురిల్-కంచట్కా ట్రెంచ్' ఏర్పడింది.
పసిఫిక్ సముద్రపు పలక, మెరియానా చిన్న సముద్ర పలక లోనికి చొచ్చుకొనిపోయినపుడు అగ్నిపర్వత దీవులు ఒక చాపం (arc) ఆకారంలో మెరియానా దీవులుగా ఏర్పడ్డాయి. ఈ ద్వీప వక్రతకు సమీపంలోనే ప్రపంచంలో అతిలోతైన సముద్ర కందకం ‘మెరియాన ట్రెంచ్’ (లోతు 11,034 మీటర్లు) ఏర్పడింది.
యురేషియా పలక లోనికి ఇండో-ఆస్ట్రేలియన్ పలక చొచ్చుకొనిపోయినప్పుడు అండమాన్ సముద్రంలో ఒక చాపం ఆకారంలో అండమాన్, నికోబార్ దీవులు ఏర్పడ్డాయి. వీటికి సమీపంలో ఉత్తర జావా ట్రెంచ్ కనిపిస్తుంది.
ఉత్తర అమెరికా పలక క్రిందకు ఫసిఫిక్ పలక చొచ్చుకొనిపోయినప్పుడు అలూషియన్ దీవులు ఏర్పడ్డాయి. 14 పెద్ద, చిన్న అగ్నిపర్వాతాలతో కూడి వున్న ఈ దీవులు అలస్కా ద్వీపకల్పం (యు.ఎస్.ఏ.) నుండి కంచట్కా ద్వీపకల్పం (రష్యా) వరకూ 1900 కి.మీ. పొడుగునా ఒక వక్రం ఆకారంలో ఉన్నాయి. ఈ దీవులకు సమాంతరంగా 'అలూషియన్ ట్రెంచ్' (అత్యధిక లోతు 7,822 మీటర్లు) ఏర్పడింది.
ప్యూర్టోరికో దీవి కరేబియన్ పలక-ఉత్తర అమెరికా పలక సరిహద్దుల వద్ద ఉంది. కరేబియన్ పలకను ఉత్తర అమెరికా పలక, దక్షిణ అమెరికా పలకలు ఢీ కొన్నప్పుడు ప్యూర్టోరికో దీవి, lesser Antillas దీవులతో కూడిన ఒక ద్వీప వక్రత ఏర్పడుతుంది. ప్యూర్టోరికో దీవికి ఉత్తరంగా ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ప్యూర్టోరికో ట్రెంచ్ ఏర్పడింది.
ఉదాహరణలు
[మార్చు]వీటిని కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- Island Arcs: Japan and Its Environs - A. Sugimura, S. Uyeda - Elsevier Scientific Publishing Company, online edition 2013, ISBN 9781483256931 [1][permanent dead link]
- Plate tectonics and crustal evolution, Condie, K.C. (1997). (4th ed), ISBN 978-0-7506-3386-4
- Encyclopedia of Islands, Rosemary G. Gillespie, D. A. Clague, University of California Press, [2], ISBN 9780520256491
- Majid Husain (2002) Fundamentas of Physical Geography (2nd ed)
వెలుపలి లింకులు
[మార్చు]- Island arc, arc, Encyclopedia of Britannica
- Island arcs, [3], Encyclopedia.com
- ISLAND ARC AND TRENCH, [4]
- island arcs, [5]
- Plate Tectonics: The Mechanism [6]
- Map of tectonic plates
ఈ వ్యాసాన్ని ఏ వర్గం లోకీ చేర్చలేదు. దీన్ని సముచిత వర్గం లోకి చేర్చండి. (ఆగస్టు 2018) |