అక్క మహాదేవి
అక్క మహాదేవి | |
---|---|
జననం | మహాదేవి 12వ శతాబ్దం ఉడుతడి, కర్ణాటక |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | శివభక్తురాలు |
గుర్తించదగిన సేవలు | అక్కమహాదేవి వచనములు |
తల్లిదండ్రులు | సుమతి, నిర్మలశెట్టి |
Parameters
అక్క మహాదేవి (Akka Mahadevi) (కన్నడ : ಅಕ್ಕ ಮಹಾದೇವಿ) ప్రసిద్ధిచెందిన శివ భక్తురాలు. గోదాదేవి వలెనే ఈమె శ్రీశైల మల్లీశ్వరున్నే తన పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించింది. ఈమె వీరశైవ ఉద్యమాన్ని స్థాపించిన బసవేశ్వరుని సమకాలికురాలు (12 శతాబ్దం). అక్క మహాదేవి కర్ణాటకలోని షిమోగా సమీపంలోని ఉడుతడి గ్రామంలో సుమతి, నిర్మలశెట్టి దంపతులకు జన్మించింది. పార్వతీదేవి అంశతో జన్మించినట్లు భావించిన తల్లిదండ్రులు మహాదేవి అని పేరుపెట్టారు. కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి బాల్యంలోనే శివదీక్ష, పంచాక్షరీ మంత్ర ఉపదేశం జరిగాయి.
ఉడుతడిని పాలించే రాజు కౌశికుడు ఒకనాడు నగరంలో ఊరేగుతుండగా, బాల్య చాపల్యంతో రాజును మేడలపై నుండి చూస్తూ ఉన్న బాలికలలో అందాల సుందరి మహాదేవి అతని కంటబడింది. వెంటనే ఎలాగైనా ఆమెను తన రాణిగా చేసుకోవాలని తలచి మంత్రిని మహాదేవి తల్లిదండ్రుల వద్దకు పంపాడు. వారు అంగీకరించకపోవడంతో మంత్రి వారిని అధికార దర్పంతో భయపెట్టాడు. తల్లిదండ్రుల అవస్థ గమనించిన మహదేవి ఒక ఉపాయ మాలోచించి, రాజు తాను విధించే మూడు కోర్కెలు చెల్లిస్తే తాను వివాహమాడగలనని, ఏ ఒక్కదానికి భంగం వాటిల్లినా తాను స్వతంత్రురాలినై వెళ్ళిపోతానని తెలిపింది. రాజు అంగీకరించడంలో మహాదేవి రాజ మందిరం ప్రవేశించి నిత్యం లింగపూజ చేస్తూ, గురు జంగములకు తోడ్పడుతూ, అనుభవ మంటపములో పాల్గొంటూ కాలం గడపసాగింది.
కొంత కాలానికి కౌశికుడు ఆమె వ్రతానికి భంగం కలిగించాడు. ఒకనాటి రాత్రి ఆమె పడకగదిలో నిద్రిస్తుండగా తమ కుటుంబ ఆరాధ్య గురువైన గురులింగదేవుడు వచ్చాడని తెలిసి ఆమె ఉన్నపాటున (దిగంబరిగా) బయటికి వచ్చి గురుదర్శనం చేసుకొనగా, వస్త్రాలు ధరించి రావలసిందిగా గురులింగదేవుడు ఆమెను ఆజ్ఞాపించాడు. ఆమె ధరిస్తున్న చీరను కౌశికుడు లాగేస్తూ, "పరమభక్తురాలివి గదా, నీకు వస్త్రం ఎందుకు?" అని అపహాస్యం చేస్తాడు. తక్షణం ఆమె నిడువైన కేశాలను మరింత పెద్దవిగా చేసి శరీరాన్ని కప్పివేసి గురుదర్శనం చేసుకుంటుంది. అప్పటినుండి అక్క మహాదేవి వస్త్రాలు ధరింపక జీవితాంతం కేశాంబరిగానే ఉండిపోయింది. రాజమందిరం నుండి బయటపడిన మహాదేవి అనేక కష్టాలను ఎదుర్కొని కళ్యాణ పట్టణం చేరుతుంది.
అనుభవ మంటపానికి అధిపతి ప్రభుదేవుడు ఆమెను పరీక్షించి మంటప ప్రవేశం కల్పిస్తాడు. బసవేశ్వరుడు ఆమె తేజస్సుకు, వైరాగ్యానికి ముగ్ధుడైనాడు. అనుభవ మంటపంలోని వారందరూ ఆమెను అక్కగా భావిస్తారు. ఆనాటి నుండి ఆమె అక్క మహాదేవిగా ప్రఖ్యాతిచెందినది. ఆమె మహాలింగైక్యం కావాలని ప్రభుదేవునికి తెలుపుతుంది. అతడు శ్రీశైలంలో కదళీ వనంలోగల జ్యోతిర్లింగంలో ఐక్యం కావడం మంచిదని చెబుతాడు. ఎంతో కష్టపడి ఆమె శ్రీశైలం చేరుకుంటుంది. అనతికాలంలోనే ఆమె శ్రీశైల మల్లిఖార్జునిలో ఐక్యమైపోతుంది.
అక్క మహాదేవి వచనాలు కన్నడ సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆమె రచనలలో అక్కగళపితికే, కొరవంజి వచనార్ధ అన్నవి మిక్కిలి ప్రాచుర్యం పొందాయి. ఆమె వచనాలు గోదాదేవి తిరుప్పావైతో సాటిరాగలవి.
ఆమె తన వచనాల్లో వస్త్రధారణ గురించి ఇలా చెప్పింది:
“ | ఈ ప్రపంచమంతా ఆ దేవుడే నిండిపోయి ఉండగా,
తమ అంగవస్త్రం తొలగితే సిగ్గు పడతారెందుకో జనులు ? |
” |
“ | ప్రతి చోటా ఆ దేవుడి నయనమే వీక్షిస్తున్నప్పుడు,
నీవు దేనిని దాచగలవు ? |
” |
ఆమె ఇంకా ఇలా అంటుంది తన వచనాల్లో-
“ | ఆకలి వేస్తే భిక్షపాత్రలో అన్నముంది,
దాహం వేస్తే బావులు,చెరువులు,నదులున్నాయి, నిద్ర ముంచుకొస్తే శిథిలాలయా లున్నాయి, నా తోడు నువ్వున్నావు చెన్న మల్లికార్జునా ! |
” |
మూలాలు
[మార్చు]- అక్క మహాదేవి, దక్షిణాది భక్తపారిజాతాలు, శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.
బయటి లింకులు
[మార్చు]- అక్క ఎవరు?
- అక్క మహాదేవి
- కన్నడంలో అక్క వచనాలు
- అక్క మహాదేవి, పరిశుద్ధ యోగిని
- యోగిని అక్క మహాదేవి జీవతం, వీరశైవం వెబ్ సైట్ లో
- భూమిక పత్రికలో ఓ వచనంపై వ్యాసం
- అక్క మహాదేవి కన్నడ వచనాలను తెలుగులో అనువాదం చేసిన దీవి సుబ్బారావు గారి పుస్తక పరిచయం ఒరెమూనా బ్లాగులో
- అక్క మహాదేవి కన్నడ వచనాలను తెలుగులో అనువాదం చేసిన దీవి సుబ్బారావు గారి పుస్తక పరిచయం ఈ మాట పత్రికలో Archived 2008-11-20 at the Wayback Machine
- ఎ.వి.క్.ఎఫ్.లో అక్క మహాదేవి వచనాలు తెలుగు అనువాదం.
- Commons category link is on Wikidata
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- కర్ణాటక
- లింగాయత
- కన్నడ సాహిత్య వేత్తలు
- భారతీయ తత్వవేత్తలు
- భారతీయ మహిళా తత్వవేత్తలు
- కన్నడ కవులు
- భక్తి ఉద్యమం
- కర్ణాటక వ్యక్తులు