ఎం.ఆర్.పాట్నీ
ఎం.ఆర్.పాట్నీగా ప్రసిద్ధి చెందిన మోతీలాల్ పాట్నీ,[1] హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, సాతంత్ర సమరయోధుడు. ఈయన సికింద్రాబాదులో స్థాపించిన పాట్నీ మోటర్స్ షోరూం వల్లనే ఈ ప్రాంతానికి ప్యాట్నీ (ప్యాట్నీ సర్కిల్) అనే పేరు వచ్చింది.
ఎం.ఆర్.పాట్నీ, 1927లో సికింద్రాబాదు లోని అప్పటి కింగ్స్ వే (ప్రస్తుత రాష్ట్రపతి రోడ్డు), ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్ (పస్తుత సరోజినీ దేవి రోడ్డు) కూడలిలో పాట్నీ మోటర్స్ అనే కార్ల షోరూంను ప్రారంభించాడు. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కోసం ప్రత్యేకమైన లిమోజిన్ కారును తయారు చేసిన ఆటోమొబిల్ ఇంజనీర్ ఆయన. అప్పట్లో బ్రిటిషువారి స్థాయిలో ఇక్కడ ఈ కార్ల షోరూం ఉండేది. ఈ షోరూంలో ఇంగ్లీషు కార్లతో పాటు, మోటరు సైకిళ్ళు, ట్రాక్టర్లను కూడా అమ్మేవారు.[2] 4900 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న షోరూంలో బ్రిటిషు ప్రమాణాలకు అనుగుణంగా ఒక వర్క్‌షాపు కూడా ఉండేది. స్వాత్రంత్ర్యం పూర్వపు ఆస్టిన్ కార్లు 1200 హాలీ సిక్కాలకు (1800 రూపాయలు) అమ్మేవారు. దానితో పాటు ఒక ట్యాంకు నిండా పెట్రోలు ఉచితంగా ఇచ్చేవారు.[3]
ఎం.ఆర్.పాట్నీ, 1941 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు స్థాపనలో విశేషమైన పాత్ర పోషించాడు. దీనికి అవసరమైన నిధులు సేకరించి, ఈ సంస్థ నిర్దేశక బృందానికి (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్) ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.[4] సింగరేణి కాలరీస్ నిర్దేశక బృందంలో, 1956 ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పోరేషన్ నిర్దేశక బృందంలో కూడా సభ్యుడిగా పనిచేశాడు.[5]
1942లో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో, బ్రిటిషు ప్రధాని చర్చిల్, కాంగ్రేసు మాత్రమే స్వాతంత్ర్యాన్ని కోరుతోంది, అది దేశప్రజలందరి అభిమతం కాదు, ముఖ్యంగా సంస్థానాల్లోని ప్రజలకు స్వాతంత్ర్యం పొందాలని లేదు అని వ్యాఖ్యానించినప్పుడు, దానికి జవాబుగా హైదరాబాదు రాజ్యంలోని 21 మంది స్థానిక ప్రముఖులు చర్చిల్‌ను ఖండిస్తూ ప్రత్యుత్తరం జారీ చేశారు. ఈ 21 మంది ప్రముఖులలో ఎం.ఆర్.పాట్నీ కూడా ఒకడు.[6]
ఎం.ఆర్.పాట్నీ 1960 సెప్టెంబరు 22 న మరణించాడు.[7] ఈయనకు మొదటి భార్యతో ఒక కుమారుడు జయకుమార్ ఎం.పాట్నీ, రెండవ భార్య గజరాబాయి ద్వారా సూరజ్ కుమార్, చందర్ కుమార్ అనే ఇద్దరు కొడుకులు కలిగారు.[7]
మూలాలు
[మార్చు]- ↑ Luther, Narendra (14 September 2006). Hyderabad: A Biography. OUP India. p. 296. Retrieved 12 September 2024.
- ↑ పి., జ్యోతి (1 July 2024). "ఆదాబ్ హైదరాబాద్ - 1". సంచిక తెలుగు సాహిత్య వేదిక. Retrieved 7 September 2024.
- ↑ "Patny Center, Secunderabad". Maverickvedam's Blog. Retrieved 7 September 2024.
- ↑ Investor's India Year Book. Place, Siddons and Gough. 1955. p. 32. Retrieved 7 September 2024.
- ↑ nvestors Encyclopaediawith Which Is Incorporated The Southern India Investor (1960). Kothari Amp Sons. 1960. p. 185,465. Retrieved 7 September 2024.
- ↑ N., Ramesan (1966). The Freedom Struggle in Hyderabad: 1921-1947 (PDF). Hyderabad: Committee for the Compilation of the History of Freedom Movement in India. p. 245. Retrieved 7 September 2024.
- ↑ 7.0 7.1 "Mrs. Gajarabai M. Patny And Ors. vs Patny Transport (Private) Ltd". indiankanoon.org. Retrieved 7 September 2024.