ఒక్కడున్నాడు
ఒక్కడున్నాడు | |
---|---|
దర్శకత్వం | చంద్రశేఖర్ యేలేటి |
రచన | చంద్రశేఖర్ యేలేటి (కథ, చిత్రానువాదం), కొరటాల శివ (మాటలు) |
నిర్మాత | చెర్రీ |
తారాగణం | తొట్టెంపూడి గోపీచంద్, నేహా జుల్కా |
ఛాయాగ్రహణం | గుమ్మడి జయకృష్ణ |
కూర్పు | మోహన్ రామారావు |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | మార్చి 3, 2007 |
భాష | తెలుగు |
ఒక్కడున్నాడు 2007 లో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన సినిమా.[1] ఇందులో గోపీచంద్, నేహా జుల్కా ప్రధాన పాత్రలు పోషించారు.
కథా గమనం
[మార్చు]వెంకటేశ్వరా బ్యాంక్ పెట్టిన సుమన్ దాన్ని చాలా వృద్ధిలోకి తెస్తాడు. కానీ కొందరు బ్యాంక్ డైరెక్టర్ల మోసం వలన బ్యాంక్ దివాళా తీస్తుంది. ఇవేమీ తెలియని అతని కొడుకు కిరణ్ విదేశాల్లో హాయిగా జల్సా చేస్తుంటాడు. అతని క్రెడిట్ కార్డులన్నీ ఒక్కసారిగా పనిచేయడం మానేయడంతో తండ్రికి ఫోన్ చేస్తాడు. మాట్లాడుతున్న తండ్రి గొంతులో భయాన్నీ వణుకునీ గమనించి అనుమానంతో వెంటనే ఇండియాకు బయలుదేరుతాడు. ఇండియాలో అడుగుపెట్టిన కిరణ్ తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జనం తండ్రిని తిట్టుకోవడం చూస్తాడు. తండ్రిని బెయిల్ మీద బయటకు తెచ్చి బ్యాంక్ ఖాతాదారులకు డబ్బు తిరిగిచ్చేయాలని తండ్రితో ఆలోచిస్తాడు. సెంట్రల్ మినిస్టర్ పి.ఏ. (తనికెళ్ళభరణి) ఒకతను బ్యాంకులనుండి 100 కోట్ల రుణం ఇప్పించగలడని తండ్రి చెప్పడంతో అతని వద్దకు వెళతారు తండ్రీ కొడుకులు. అతడు ఈ పని చేసేందుకు నాలుగు కోట్లు లంచం అడుగుతాడు. ఆ డబ్బు కావాలంటే బొంబాయిలోని తమ గెస్ట్ హౌస్ అమ్మేద్దామని అంటాడు కిరణ్. తను ఆపని ఎప్పుడో చేశానని ఆడబ్బు రావడానికి ఆర్నెల్లు సమయం పడుతుందనీ చెపుతాడు. డబ్బు తొందరగా వచ్చేందుకు ఆ డీల్ చేస్తున్న గౌతమి అనే అమ్మాయిని కలసి డబ్బు తొందరగా వచ్చే ఏర్పాటు చేయమంటాడు. కానీ ఆ అమ్మాయి ముందు కిరణ్ పెద్ద నసగాడనుకుంటుంది. అతని పరిస్థితి తెలుసుకొన్నాక అతనికి సహకరిస్తుంది. ఇదంతా సినిమా ద్వితీయార్థంలో కిరణ్ గౌతమికి చెపుతాడు. దీనికి సంబంధం లేని ట్రాక్ ఒకదాంతో సినిమా మొదలవుతుంది. బాంబే బ్లడ్ అనే అరుదైన గ్రూప్ రక్తం ఒకతని తల్లికి కావలసి వస్తే తనదీ అదే గ్రూప్ కనుక తన రక్తం ఇస్తాడు కిరణ్. ఈ విషయం ముంబాయి డాన్ సోనాభాయ్ (మహేష్ ముంజ్రేకర్)కు తెలుస్తుంది. అతనికి గుండె సంబంధించిన ఒక సమస్య ఉంటుంది. పొట్టపై ఆక్సిజన్తో ఉన్న చిన్న బాక్స్ ద్వారా గుండెకు సరఫరా జరుగుతుంటుంది. అతనికీ అదే గ్రూప్ రక్తం కలిగిన మనిషి కావాలి గుండె మార్పిడి కోసం. సోనాబాయ్ కి కిరణ్ గుండె కావాలి. అయితే రక్తం కావాలనే నెపంతో కిరణ్ ని తీసుకొచ్చి మత్తుమందిస్తారు. మత్తులోకి జారేముందు కిరణ్కు 'పారిపో నిన్ను చంపేస్తారూ అని అరచేతిలో రాసి చూపిస్తాడు సోనాబాయ్ తమ్ముడి కొడుకు (రాహుల్ దేవ్). అప్పుడు సోనాబాయ్ కి బీపీ బాగా పెరగటంతో ఆపరేషన్ 24 గంటలు వాయిదా వేస్తారు. మత్తునుండి బయటకు వచ్చిన కిరణ్ అందరినీ చితకతన్ని అక్కడినుండి పారిపోతాడు. అప్పడినుండి అతని మనుషులు కిరణ్ కోసం వేటాడుతుంటారు. అయితే కనిపించిన ప్రతి సారి వాళ్లను తన్నుతూనే ఉంటాడు కిరణ్. కిరణ్ గురించి వాకబు చేసిన సోనాబాయ్ తనకు గుండెనిస్తే కిరణ్ కి కావలసినంత డబ్బిస్తానంటాడు. దానికి సరేనన్న కిరణ్ ఆపరేషన్ ముందే డబ్బు ముట్ట చెప్పాలని షరతు విధిస్తాడు. సరేనని చెప్పిన సోనాబాయ్ ఆఖరి నిముషంలో డబ్బు కోసం వచ్చిన కిరణ్ ని ప్లేట్ ఫిరాయించి బంధించాలని చూస్తారు. అక్కడ జరిగిన పోరాటంలో సోనాబాయ్ ని అడ్డు పెట్టుకొని డబ్బుతో తప్పించుకొన్న కిరణ్ ఆఖరి క్షణంలో సోనాబాయ్ గుండెకు ఆక్షిజన్ సరఫరా జరిగే ట్యూబు పీకేసి డబ్బుతో గౌతమిని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతాడు. ఆక్సిజన్ అందక కొంత సేపట్లో సోనాబాయ్ మరణిస్తాడు.
తారాగణం
[మార్చు]- కిరణ్ గా తొట్టెంపూడి గోపీచంద్
- నేహా జుల్కా
- కృష్ణుడు (నటుడు)
- సోనాభాయ్ గామహేష్ మంజ్రేకర్
- సోనాభాయ్ కుడిభుజంగా నాజర్
- కిరణ్ తండ్రిగా సుమన్
- తనికెళ్ల భరణి
- బ్రహ్మానందం
- గిరిబాబు
- హేమ
పాటలు
[మార్చు]- అడుగడుగునా పడిపోయినా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి ,గానం: కీరవాణి, సునీత
- మనకక్కర లేదు, రచన: అనంత శ్రీరామ్ , గానం.దేవిశ్రీ ప్రసాద్
- అబ్బో వాడెంటో , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు , గానం.నాని, గీతా మాధురి
- ఐ సే ఎంజాయ్, రచన: అనంత్ శ్రీరామ్, గీతా మాధురి
- ఇవాళ నా పిలుపు , రచన: అనంత శ్రీరామ్ , గానం.శ్రేయాఘోషల్
చిత్ర విశేషాలు
[మార్చు]- చిత్రానువాదం, టేకింగ్, కెమెరా పనితనం విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
- హిందీ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ ప్రతినాయక పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ జి. వి, రమణ. "సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 27 December 2017.