Jump to content

కోనేరు రంగారావు కమిటీ

వికీపీడియా నుండి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూపంపిణీ కార్యక్రమాల అమలును పరిశీలించి, ఈ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీయే కోనేరు రంగారావు కమిటీ. ఆంధ్ర ప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కోనేరు రంగారావు అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటు కావడంతో దీన్ని కోనేరు రంగారావు కమిటీ అని పిలుస్తారు. ఈ కమిటీని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2004 డిసెంబరు 1 నాటి జీవో Ms.No.977, 2004 డిసెంబరు 23 నాటి జీవో Ms.No.1091 ల ద్వారా ఏర్పరచింది.

కమిటీ నేపథ్యం

[మార్చు]

2004 లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తరువాత, నక్సలైట్ల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేపట్టింది. వారిని చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చా వాతావరణం ఎక్కువ కాలం కొనసాగనప్పటికీ, జరిగిన కొద్ది చర్చలలోనే, భూపంపిణీని పరిశీలించేందుకు గాను ఒక కమిటీని ఏర్పాటుచెయ్యాలని నక్సలైట్లు డిమాండు చేసారు. ఈ చర్చల పర్యవసానమే కోనేరు రంగారావు కమిటీ.

కమిటీ లక్ష్యాలు

[మార్చు]

కింది లక్ష్యాలను నిర్దేశిస్తూ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పరచింది.

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూపంపిణీ కార్యక్రమాల అమలును పరిశీలించి, ఈ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన సూచనలు చెయ్యడం
  • భూపంపిణీని పటిష్ఠంగా అమలు జరిపేందుకుగాను సంబంధిత చట్టాలకు అవసరమైన సవరణలను, మార్పులను ప్రతిపాదించడం
  • వాటిని అమలు చెయ్యడంలో ఎదురుకాగల అడ్డంకులను తొలగించేందుకు నిర్ణీత కాలపరిమితితో కూడిన చర్యలతో సహా అవసరమైన సూచనలు చెయ్యడం.
  • ఈ కమిటీ చేసిన సూచనల అమలును పర్యవేక్షించడం

కమిటీ సభ్యులు

[మార్చు]

ఈ కమిటీలో కింది సభ్యులు ఉన్నారు.

  1. కోనేరు రంగారావు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పురపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి - కమిటీ అధ్యక్షుడు
  2. రెడ్యానాయక్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి - కమిటీ ఉపాధ్యక్షుడు
  3. టి.గోపాలరావు ఐ.ఏ.ఎస్ (రిటైర్డు) - కమిటీ సభ్యుడు
  4. పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రముఖ పాత్రికేయుడు (రిటైర్డు) - కమిటీ సభ్యుడు
  5. టి.పురుషోత్తమరావు, కాంగ్రెసు పార్టీ నేత - కమిటీ సభ్యుడు
  6. ఎ.రఘోత్తమరావు ఐ.ఏ.ఎస్, ఛీఫ్ కమిషనర్, భూ పరిపాలన - కమిటీ కన్వీనర్
  7. వి.నాగిరెడ్డి ఐ.ఏ.ఎస్, గిరిజన సంక్షేమ కార్యదర్శి - కమిటీ సభ్యుడు
  8. కె.రాజు ఐ.ఏ.ఎస్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి - కమిటీ సభ్యుడు

కమిటీ నివేదిక, పర్యవసానాలు

[మార్చు]

కమిటీ తన నివేదికను 2006లో ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం ఈ నివేదికను బహిర్గతం చెయ్యలేదు. దాని సూచనలను అమలు చెయ్యలేదు. వివిధ వర్గాల నుండి వచ్చిన వత్తిడి మేరకు ప్రభుత్వం ఈ నివేదికను 2007 మే 27 న బహిరంగపరచింది. కమీటీ మొత్తం 104 సూచనలతో నివేదికను తయారు చేసింది. ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా సి.పి.ఐ, సి.పి.ఎమ్ పార్టీలు ఈ నివేదిక అమలుకై వత్తిడి చేసాయి. తాము జరుపుతున్న భూపోరాటంలో భాగంగా ఈ నివేదిక అమలు డిమాండు కూడా చేర్చాయి. 2007 జూలై 28 న వామ పక్షాలు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బందు సందర్భంగా ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామంలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఏడుగురు మరణించి, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం వెంటనే కమిటీ సూచించిన వాటిలోంచి 74 సూచనలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆగష్టు 24 న మరో 18 సూచనలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

కమిటీ నివేదిక గురించిన వ్యాఖ్యలు

[మార్చు]
  • "ఇది ఆంధ్ర ప్రదేశ్ భూపరిపాలన శాఖ యొక్క పశ్చాత్తాప ప్రకటన"[1] - కె.బాలగోపాల్, పౌరహక్కుల నేత, నివేదిక తయారుచెయ్యడంలో కమిటీ యొక్క నిజాయితీని ప్రశంసిస్తూ.

మూలాలు, వనరులు

[మార్చు]
  1. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో కె.బాలగోపాల్ రాసిన వ్యాసం[permanent dead link]