జార్జ్ రెడ్డి
జార్జ్ రెడ్డి | |
---|---|
జననం | |
మరణం | 1972 ఏప్రిల్ 14 | (వయసు 25)
మరణ కారణం | హత్య |
జాతీయత | భారత దేశం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలంగాణలో విప్లవ వాద విద్యార్థిసంఘాల నాయకుడు |
తల్లిదండ్రులు | చల్లా రఘునాథరెడ్డి, లీలా వర్గీస్ |
జార్జ్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విప్లవవాద విద్యార్ధుల ఉద్యమ స్థాపకుడు. విద్యార్థి నాయకుడు.
జననం, కుటుంబం
[మార్చు]ఈయన 1947, జనవరి 15 న పాల్ఘాట్, కేరళలో చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రఘునాథరెడ్డి, ట్రావెన్కూరు ప్రాంతానికి చెందిన లీలా వర్గీస్ దంపతులకు జన్మించాడు. ఈయన తల్లితండ్రులు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో కలుసుకున్నారు. రఘునాథరెడ్డి బి.ఏ హానర్స్ చేయగా, లీలా వర్గీన్ రసాయనశాస్త్రంకీ డిగ్రీ పూర్తిచేసి, ఎం.ఏ చదివింది. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. పెద్దవాడైన డాన్ రెడ్డి బి.ఈడీ పూర్తిచేసి, ఒరిస్సాలో స్థిరపడ్డాడు. రెండవ కొడుకు కార్ల్ రెడ్డి ఐ.ఏ.ఎస్ అధికారి అయ్యాడు. కుమార్తె జాయ్ రెడ్డి, భాషాశాస్త్రంలో ఎం.ఏ చేసి మైసూరులోని భారతీయ భాషా అధ్యయన కేంద్రంలో పనిచేసింది. నాలుగవ సంతానం జార్జ్ రెడ్డి, చివరి వాడు సిరిల్ రెడ్డి.
విద్యాభ్యాసం
[మార్చు]జార్జ్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం బెంగుళూరు, చెన్నైలలో సాగింది. ఐదు, ఆరు, ఏడు తరగతులు క్విలాన్ జిల్లా తంగచ్చేరిలోని ఇన్‌ఫెంట్ జీసస్ ఉన్నత పాఠశాలలో, ఎనిమిది, తొమ్మిది తరగతులు చెన్నై ఎగ్మోరులోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో చదివాడు. ఆ తరువాత 1961-62లో కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్ ఉన్నత పాఠశాలలో కొన్నాళ్ళు చదివాడు. ఆ తరువాత కుటుంబం హైదరాబాదుకు మారింది. అక్కడ సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేశాడు. నిజాం కళాశాలలో పీ.యూ.సీ (ఇప్పటి ఇంటర్మీడియట్ తో సమానం) పూర్తి చేశాడు. 1964లో బీ.ఎస్సీ చేయటానికి ఉస్మానియా విశ్వవిద్యాలయపు సైన్సు కళాశాలలో చేరాడు. కానీ డిగ్రీ 2, 3వ సంవత్సరాలు మాత్రం నిజాం కళాశాలలో పూర్తిచేశాడు.
హైదరాబాదులోని నిజాం కళాశాలలో బియస్సీ (1964-67) డిగ్రీ చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ లో ఏం.ఎస్సీ చేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తూ పాక్షిక సమయంలో కొన్ని నెలల పాటు ఏ.వి.కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా పనిచేశాడు. పీహెచ్డీకి అనుమతి పొందాడు. జార్జి రెడ్డి బాక్సింగ్ చేసేవాడు. తీవ్ర పఠనాసక్తి కలవాడు. తను 25 ఏళ్ల వయసులో మరణించే నాటికి హేగెల్, మార్క్స్, ఫ్రాయిడ్ రచనలను చదివాడు.[1] భౌతిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క స్వర్ణపతకాన్ని సాధించాడు.[2] అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య (పి.డి.యస్.యు) ను స్థాపించాడు. పి.డి.యస్.యు భారతీయ కమ్యూనిస్టు పార్టీ (ఎంఎల్) కి విద్యార్థి విభాగంగా పనిచేస్తుంది.[3]
ఉద్యమ స్ఫూర్తి
[మార్చు]జార్జి తొలుత కాంగ్రేస్ పార్టీలోని యంగ్ టర్క్‌లను అనుసరించాడు. 1969-70ల నుంచి సోవియట్ యూనియన్ అండతో కాంగ్రేస్ పార్టీ పెట్టుబడిదారీ సంస్కరణ పంథావైపు నడిపించే ప్రయత్నం జరిగింది. అందుకోసం యంగ్ టర్క్‌లు కాంగ్రేస్ పార్టీలో యువబృందంగా అవతరించింది. ఫ్యూడల్ భూస్వాముల వ్యతిరేకంగా యంగ్‌టర్కుల తీవ్రవాద నినాదాలు జార్జిని ఆకర్షించాయి. వారు "సోషలిస్టు స్టడీ ఫోరం"గా ఏర్పడి సాగించిన ప్రచారాన్ని చిత్తశుద్ధిగా నమ్మాడు. తన స్నేహితుడు కె. శ్రీనాథ్ రెడ్డి యొక్క తండ్రి, కేంద్ర మంత్రి కె.వి.రఘునాథరెడ్డి ప్రోద్భలంతో కాంగ్రేస్ పార్టీ యొక్క విద్యార్థిసంఘమైన యూత్ కాంగ్రేసులో చేరాడు.[4] కానీ అవి కూడా పెట్టుబడిదారీ వ్యవస్థను కొత్తముసుగుతో పరిరక్షించే ఎత్తుగడగా త్వరలో అర్ధం చేసుకొని, దానిపై భ్రమలు వీడి విప్లవ పంథాను స్వీకరించాడు.[5]
మరణం
[మార్చు]1972 ఏప్రిల్ 14 సాయంత్రం ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో ఒంటరిగా ఉన్న జార్జిపై 30 మందికి పైగా దుండగలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మెట్లపై దాడిచేసి కత్తిపోట్లతో చంపేశారు.[6]
ఇతర వివరాలు
[మార్చు]ఈయన జీవితం ఆధారంగా 2019, నవంబరు 22న జార్జ్ రెడ్డి సినిమా వచ్చింది.[7]
మూలాలు
[మార్చు]- ↑ George Reddy remembered - The Hindu, April 15, 2012
- ↑ "'PDSU founder George Reddy was AP's Che Guevara' - Indian Express. Apr 15, 2012". Archived from the original on 2015-04-02. Retrieved 2014-10-17.
- ↑ నమస్తే తెలంగాణ, కాలమిస్టు (6 October 2012). "జార్జ్ అడుగు జాడల్లో." www.ntnews.com. వరవరరావు. Archived from the original on 19 నవంబరు 2019. Retrieved 19 November 2019.
- ↑ George (A Profile In Courage) - Srinath
- ↑ జార్జ్ రెడ్డి 40వ వర్ధంతి సందర్భంగా పి.ప్రసాదు వ్రాసిన వ్యాసం - సాక్షి పత్రిక
- ↑ "Keeping the Dream Alive: In Memory of George Reddy - Pradeep Burgula, Mission Telangana April 14, 2012". Archived from the original on 2015-04-02. Retrieved 2014-10-16.
- ↑ "Bio-pic | George Reddy | movie | directed by | Jeevan Reddy". Raatnam Media (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-08-02. Retrieved 2019-11-22.[permanent dead link]