Jump to content

కె.వి.రఘునాథరెడ్డి

వికీపీడియా నుండి
కొల్లి వెంకట రఘునాథరెడ్డి
కె.వి.రఘునాథరెడ్డి


పదవీ కాలం
14 ఆగష్టు 1993 – 27 ఏప్రిల్ 1998
ముందు బి.సత్యనారాయణ రెడ్డి
తరువాత అఖ్లకుర్ రహ్మాన్ కిద్వాయి

వ్యక్తిగత వివరాలు

జననం (1924-09-24)1924 సెప్టెంబరు 24 / 1924, సెప్టెంబరు 24
మరణం 2002 మార్చి 4/2002, మార్చి 4
మతం హిందూమతం

కొల్లి వెంకట రఘునాథరెడ్డి ( 1924 సెప్టెంబరు 4[1] – 2002 మార్చి 4),[2] కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి. ఇతను 1990 నుండి 1993 వరకు త్రిపుర గవర్నరుగానూ, [3] 1993 నుండి 1998 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నరుగానూ, 1997 జనవరి 31 నుండి ఫిబ్రవరి 12 వరకు, మరళా 1997, డిసెంబరు 13 నుండి 1998 ఏప్రిల్ 27 వరకు ఒడిశా గవర్నరుగా పనిచేశాడు.[4] కేంద్ర కార్మిక శాఖా మంత్రిగా కూడా పనిచేశాడు.[5]

నెల్లూరు జిల్లాకు[6] చెందిన రఘునాథరెడ్డి లక్నో విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివి, మద్రాసు, గుంటూరులలో ప్రాక్టీసు చేశాడు. ఇతను క్రిమినల్ లా మీద వ్రాసిన పుస్తకం అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రామాణిక పాఠ్యపుస్తకం అయ్యింది.

రఘునాథరెడ్డి 1962లో తొలిసారి కమ్యూనిస్టుల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యాడు. పార్లమెంటులో ఇతను పనితనానికి మెచ్చి, జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రేసు పార్టీలోకి ఆహ్వానించాడు. ఇందిరా గాంధీ ఈయన్ను తొలుత కంపెనీ వ్యవహారాలు, పరిశ్రమాభివృద్ధి శాఖామంత్రిగా నియమించింది. ఆ తరువాత కార్మికశాఖ మంత్రిగా పనిచేశాడు. ఇతను రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎన్నికయ్యాడు. అందులో 11 సంవత్సరాల పాటు కేంద్రప్రభుత్వ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నాడు.

ప్రభుత్వరంగపు గట్టి మద్దతుదారుడైన రఘునాథరెడ్డి, మొనోపలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చట్టం 1969 యొక్క రూపకర్తలలో ఒకడు. ఇందిరా గాంధీ ఇతనిని ప్రభుత్వ రంగ పరిశ్రమలలో వివాద పరిష్కారాలకు తరచు పంపిస్తూ ఉండేది. సింగరేణి కాలరీస్ అవార్డును రూపొందించడంలో రఘునాథరెడ్డి ప్రధాన పాత్ర వహించాడు. 1974 నుండి 76 వరకు కార్మిక శాఖామంత్రిగా ఉంటూ, వెట్టిచాకిరి నిర్మూలన చట్టం (1976) ను రూపొందించాడు.[7]

కృష్ణకాంత్, మోహన్ ధరియా, అమృత్ నహతాలతో పాటు క్రాంగ్రేస్ ఫోరం ఫర్ సోషలిస్ట్ ఆక్షన్ లో క్రియాశీలక సభ్యుడిగా, ప్రజాస్వామ్యం లేనిదే సామ్యవాదం సిద్ధించదని భావించాడు.

ఇతని కుమారుడు కొల్లి శ్రీనాథ్ రెడ్డి ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు, వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షస్థానాన్ని వహించిన తొలి భారతీయుడు, పద్మభూషణ పురస్కార గ్రహీత.

మూలాలు

[మార్చు]
  1. http://rajyasabha.nic.in/rsnew/pre_member/1952_2003/r.pdf
  2. India book of the year. Encyclopædia Britannica (India). 2003. p. 17. ISBN 978-81-8131-000-2.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-03. Retrieved 2014-10-19.
  4. Bulletin of the Ramakrishna Mission Institute of Culture, Volume 49. Ramakrishna Mission. 1998. p. 247.
  5. Trivedi, H. N. (1977). Thirty years of the Indian National Trade Union Congress, 1947 to 1977. Indian National Trade Union Congress. p. 35. OCLC 5971288.
  6. Venkaiah Naidu offers homage to Raghunath Reddy
  7. Human Bondage: Tracing its Roots in India By Lakshmidhar Mishra