మృచ్ఛకటికమ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:సంస్కృత నాటకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 51: పంక్తి 51:


ఎంబీయెస్ ప్రసాద్ వ్యాసం : [http://telugu.greatandhra.com/articles/mbs/mbs-mruchakatikam-1-67493.html మృచ్ఛకటికమ్‌]
ఎంబీయెస్ ప్రసాద్ వ్యాసం : [http://telugu.greatandhra.com/articles/mbs/mbs-mruchakatikam-1-67493.html మృచ్ఛకటికమ్‌]

[[వర్గం:సంస్కృత నాటకాలు]]

12:57, 2 డిసెంబరు 2015 నాటి కూర్పు

The Little Clay Cart
An oleographic print depicting the female protagonist Vasantasenā, a rich courtesan.
రచయితŚūdraka
తారాగణం
  • Chārudatta
  • Vasantasenā
  • Maitreya
  • Samsthānaka
  • Āryaka
  • Sarvilaka
  • Madanikā
ఒరిజినల్ భాషSanskrit
కళా ప్రక్రియSanskrit drama
SettingAncient city of Ujjayini
Fifth century BC

'మృచ్ఛకటికమ్‌ అనేది శూద్రకుడు రాసిన సంస్కృత నాటకం. అనేక భాషల్లోకి అనువాదమయిన ఈ నాటకాన్ని ఇప్పటికీ రంగస్థలంపై ప్రదర్శిస్తూంటారు.

నేపధ్యం

సాధారణంగా సంస్కృత నాటకం అనగానే ఉదాత్త నాయకీనాయకులు, వారి మధ్య ప్రణయం, విరహం లాటివి వుంటాయి. కానీ దీనిలో దొంగలు, జూదరులు, విటులు, పోకిరీగా తిరుగుతూ జనాలపై జులుం సాగించే రాజుగారి బావమరిది, అతన్ని ఎదిరించే విప్లవకారుడు, అతనంటే అభిమానం చూపించే సైనికులు వీళ్లందరూ వుంటారు. ఈ నాటకం లోని చాలా దృశ్యాలు వీధుల్లో నడుస్తాయి. సాయంత్రపు చీకట్లో వీధిలో వెళుతున్న వేశ్యను రాజుగారి బావమరిది వెంటాడిి, చెరపట్టడానికి చేసే ప్రయత్నంతో నాటకం ప్రారంభమవుతుంది.

కథ

చారుదత్తుడనే బ్రాహ్మడు ఉజ్జయినీ నగరంలో వున్నాడు. అతని తాతముత్తాతలు వ్యాపారం చేసి చాలా గడించారు. ఇతను దానధర్మాలు చేసి డబ్బంతా పోగొట్టుకుని ప్రస్తుతం దరిద్రంలో వున్నాడు. మనిషి అందగాడు, గుణవంతుడు. భార్య, చిన్నపిల్లాడు వున్నారు. అతన్ని ఆశ్రయించుకుని మైత్రేయుడు, వర్ధమానకుడు అనే అనుచరులు, రదనిక అనే పనిగత్తె వున్నారు. ఆ వూళ్లో వసంతసేన అనే వేశ్యాకులంలో పుట్టి, యింకా ఆ వృత్తిని చేపట్టని సుందరి వుంది. ఆమె ఒక ఉత్సవంలో యితన్ని చూసి యిష్టపడింది. శకారుడనే రాజుగారి బావమరిది ఆమెను చూసి యిష్టపడ్డాడు. ఓ రోజు సాయంత్రం తన అనుచరుడితో కలిసి ఆమె వీధిలో నడిచి వెళుతూంటే వెంటపడ్డాడు. వసంతసేన అతని నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆ వీధిలోనే వున్న చారుదత్తుడి యింట్లోకి దూరి రక్షణ పొందింది. చారుదత్తుడు కూడా ఆమెను చూసి యిష్టపడ్డాడు. మళ్లీమళ్లీ ఆ యింటికి వచ్చేందుకు వీలుగా తన నగలు తీసి మూటగట్టి 'శకారుడంటే భయంగా వుంది, మీ దగ్గర దాచండి' అని చెప్పింది. చారుదత్తుడి యిల్లు శిథిలావస్థలో వుంది. ఈ నగలపాత్ర పోయిందంటే దరిద్రానికి తోడు అప్రదిష్ట కూడా. అందుకని పగలు వర్ధమానకుడు, రాత్రి మైత్రేయుడు దీన్ని కాపలా కాయాలని చెప్పాడు.

చారుదత్తుడి వద్ద ఒళ్లు పట్టేవాడిగా గతంలో పనిచేసిన సంవాహకుడు అనేవాడు యిప్పుడు జూదగాడై, జూదంలో ఓడిపోయాడు. జూదమండపం అద్దె కూడా చెల్లించకుండా పారిపోబోతే వాళ్లు తరుముకుని వచ్చారు. అతను పారిపోతూ, దారిలో వున్న వసంతసేన యింట్లో చొరబడ్డాడు. వాడు చారుదత్తుడి తాలూకు మనిషనే అభిమానంతో వసంతసేన అతని తరఫున డబ్బు చెల్లించి ఋణవిముక్తుణ్ని చేసింది. అతను సిగ్గుపడ్డాడు. ఇకపై యీ అలవాటు మానేసి బౌద్ధసన్యాసిగా మారిపోతానని చెప్పి వెళ్లిపోయాడు. శర్విలకుడనే బ్రాహ్మణుడు ఒక దొంగ. వసంతసేన వద్ద పనిచేసే మదనికను ప్రేమించాడు. ఆమె బానిసత్వాన్ని విడిపించడానికి డబ్బు సంపాదించాలని, దొంగతనానికి బయలుదేరాడు. రాత్రి చారుదత్తుడి యింట్లో కన్నం వేసి దూరాడు. అక్కడ మైత్రేయుడు నగలపాత్ర పట్టుకుని నిద్రపోతూ భయంతో పలవరిస్తున్నాడు. దొంగ తన దగ్గరకు రాగానే అతనే తన స్నేహితుడు వర్ధమానుడనుకుని 'ఇదిగో తీసుకో' అని దాన్ని యిచ్చేశాడు. అనాయాసంగా చేతి కందిన పాత్రను పట్టుకుని వచ్చి మదనిక దగ్గరకు వచ్చాడు. వసంతసేనకు విషయమంతా తెలిసి, నాకే పరిహారమూ అక్కరలేదు, వెళ్లి పెళ్లి చేసుకోమంది. మదనికను బండి ఎక్కిస్తూండగానే ఆర్యకుడనే విప్లవకారుణ్ని బంధించారన్న ప్రకటన వినబడుతుంది. 'అతను నా స్నేహితుడు, వెళ్లి విడిపిస్తాను, నువ్వీమెను మా నాన్నగారింట్లో విడిచి వెళ్లు' అని బండివాడికి చెప్పి అతను వెళ్లిపోయాడు.

నగలు పోయిన సంగతి గ్రహించిన చారుదత్తుడు బాధపడుతూంటే అతని భార్య తన పుట్టింటివాళ్లు యిచ్చిన నగను చేతిలో పెట్టి వసంతసేనకు పంపించేయమంది. వసంతసేనను చారుదత్తుడి యింటికి వచ్చి దొంగతనం గురించి చెప్పి తన నగలను చూపించింది. వాళ్లిద్దరి మధ్య అనురాగం వెల్లివిరిసింది. మర్నాడు ఉదయం చారుదత్తుడు ఒక తోటకు వెళుతూ మైత్రేయుడితో వసంతసేనను గూటిబండిలో అక్కడకు తీసుకుని రమ్మనమని చెప్పి వెళ్లిపోయాడు. చారుదత్తుడి కొడుకు పొరుగింటి కుర్రాడు బంగారు బండితో ఆడుకోవడం చూసి తనకు కూడా అలాటిది కావాలని ఏడిస్తే పనిమనిషి మట్టి బండి చేసి దానితో వసంతసేన వద్దకు తీసుకెళ్లింది. పిల్లాణ్ని చూసి వసంతసేన నువ్వు కూడా బంగారుబండి చేయించుకో అంటూ తన ఒంటి మీద నగలు మట్టిబండిలో పోసింది. శకారుడి కోసం అదే తోటకు వెళుతున్న ఒక గూటిబండి ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా చారుదత్తుడి యింటి దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అది చారుదత్తుడు తనకోసం పంపించిన బండే అనుకుని వసంతసేన ఆ బండిలో కూర్చుంది.

శర్విలకుడు ఆర్యకుణ్ని విడిపించాడు. అతని సంకెళ్లతో సహా పారిపోయి వస్తూ వుంటే రాజభటులు వెంటాడారు. అతను తప్పించుకోవడానికి యిటుగా వచ్చి వసంతసేన కోసం వచ్చిన గూటిబండిలో ఒదిగి కూర్చున్నాడు. అది తోటకు చేరాక చారుదత్తుడు ఆర్యకుణ్ని చూసి, బంధనాలు విడిపించి పంపించివేశాడు. వసంతసేన ఎక్కిన బండి శకారుడి వద్దకు చేరింది. తను బతిమాలుకున్నా ఆమె వినకపోవడంతో కోపం తెచ్చుకుని పీక పట్టుకుని నులిమివేశాడు. ఆమె కుప్పకూలింది. శకారుడు ఆమెను ఎండుటాకులతో కప్పివేశాడు. ఇదంతా చూసిన తన సేవకుణ్ని తన మేడలో బంధించాడు. వసంతసేన వలన ఉపకారం పొంది బౌద్ధసన్యాసిగా మారిన సంవాహకుడు ఆ తోటలో తన బట్టలు వుతుక్కుని తడిబట్టల్ని ఆ ఆకులపై ఆరబెట్టాడు. అంతలో ఆకులగుట్ట కదిలింది. ఆకులు కదలించి చూసి వసంతసేనను కాపాడి తన ఆరామానికి తీసుకెళ్లాడు.

శకారుడు న్యాయాధికారుల వద్దకు వెళ్లి చారుదత్తుడు నగలపై ఆశతో వసంతసేనను చంపివేశాడని అభియోగం చేశాడు. మట్టిబండిలో దొరికిన నగలు ఆ ఆరోపణకు బలం చేకూర్చాయి. చారుదత్తుణ్ని కొరత వేయమని తీర్పు యిచ్చారు. అతన్ని వధ్యభూమికి తీసుకెళుతూ చాటింపు వేస్తే అది విన్న శకారుడి సేవకుడు మేడ నుంచి దూకేసి శకారుడే హంతకుడని అందరికీ చెప్పాడు. శకారుడు వాడు దొంగ అనీ, పట్టుకున్నందుకు తనపై కోపంతో అలా చెప్తున్నాడనీ జనాల్ని నమ్మించి చారుదత్తుడికి సహాయం అందకుండా చేశాడు. అతని కొరత ప్రకటన విన్న వసంతసేన వధ్యభూమికి చేరింది. చారుదత్తుడిపై కత్తి ఎత్తిన తలారి తత్తరపడ్డాడు. వసంతసేన సజీవంగా వుందని చూసిన శకారుడు భయంతో పారిపోసాగాడు.

ఇంతలో శర్విలకుడు వచ్చి ఆర్యకుడు రాజుని చంపి కొత్త రాజయ్యాడని, తనను కాపాడినందుకు కృతజ్ఞతగా కుశావతీ రాజ్యాన్ని చారుదత్తుడికి ధారాదత్తం చేశాడనీ చెప్పాడు. పారిపోబోయిన శకారుడు పట్టుబడ్డాడు. అతన్ని చంపెయ్యబోతూ వుంటే చారుదత్తుడు ప్రాణభిక్ష పెట్టాడు. చారుదత్తుడు మళ్లీ ఐశ్వర్యవంతుడయ్యాడు. వసంతసేనను చేపట్టడానికి అతని భార్య అనుమతించింది. ఆర్యకుడు సుభిక్షంగా రాజ్యపరిపాలన చేస్తున్నాడు. ఇదీ కథ.

సినిమా

తెలుగులో వసంతసేన పేరుతో అక్కినేని నాగేశ్వరరావు, బి సరోజాదేవిలతో నిర్మాత-దర్శకుడు బియస్‌ రంగా సినిమా గా తీశారు. హిందీలో శశి కపూర్‌ ఉత్సవ్‌ పేరుతో గిరీశ్‌ కర్నాడ్‌ దర్శకత్వంలో తీశారు.

తెలుగు అనువాదం

నాటకానికి తెలుగులో అనువాదాలు చాలా వచ్చాయి. బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు అనువాదాన్ని అజో-విభొ-కందాళం ఫౌండేషన్‌ వారు 2005లో ప్రచురించారు.

మూలాలు

ఎంబీయెస్ ప్రసాద్ వ్యాసం : మృచ్ఛకటికమ్‌