బెలూం గుహలు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
బెలూం గుహలు నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు.[1] అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ, విదేశీ, స్థానిక పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూం గుహల సొంతం. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలూం గుహల ప్రత్యేకత .
చరిత్ర
[మార్చు]బెలూం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం.సా.శ..పూ. 4,500 సంవత్సరాల ప్రాంతంలో అక్కడ మానవుడు నివసించినట్లు గుహల్లో లభించిన మట్టిపాత్రల ద్వారా తెలుస్తోంది. 1884 లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు బెలూం గుహల ఉనికి గురించి ప్రస్తావించాడు.[1] తరువాత దాదాపు ఒక శతాబ్దం వరకు వాటి గురించి ఎవరి ద్వారా ప్రస్తావన జరగలేదు. 1982లో డేనియల్ జెబోర్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం వీటిని సందర్శించి, పరిశీలించింది. బెలూం గుహల ఉనికి గురించి ఈ బృందం ద్వారానే బయటి ప్రపంచానికి ప్రముఖంగా తెలిసిందని చెప్పవచ్చు. ఈ బృందానికి రామస్వామిరెడ్డి, చలపతిరెడ్డి, మద్దులేటి అనే ముగ్గురు స్థానికులు సహకరించారు. ఈ గుహలు భూగర్బంలో 10 కిలోమీటర్లు వరకు విస్తరించి ఉన్నాయని కనిపెట్టారు. 2002 ఫిబ్రవరిలో బెలూం గుహలను సందర్శించడానికి ప్రజలను అనుమతించారు.[2].అప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను, చుట్టుప్రక్కల ప్రాంతాలను అభివృద్ధి పరుస్తోంది. 1985లో బెలూం గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరచుకుంది. 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధీనంలోకి వచ్చిన ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల్ దూరం వరకు సిమెంట్, స్లాబ్ రాళ్ళతో నడవటానికి అనుకూలంగా దారి నిర్మించారు.
బెలూం గుహల అందాలు
[మార్చు]-
బుద్ధుని విగ్రహం
సహజత్వానికి లోపం రాకుండా బెలూం గుహల అందాలు ద్విగుణీకృతమయ్యే విధంగా విద్యుత్ దీపాలను అమర్చారు. దిగుడు బావి మాదిరిగా ఉన్న ప్రవేశద్వారాన్ని పూర్తి రూపురేఖలు మార్చేసి, భూమికి 20 మీటర్ల అడుగున ఉన్న గుహల్లోకి వెళ్లేందుకు మెట్లు నిర్మించారు. గుహల లోపల పర్యాటకులు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు లోపలికి గాలిని పంపే ఆక్సిజన్ బ్లోయర్లు ఏర్పాటుచేశారు . గుహల్లోపల ఫౌంటెన్, కృత్రిమ కొలను ఏర్పాటు చేయటంతో, గుహలు మరింత అందాన్ని సంతరించుకున్నాయి. బెలూం గ్రామ సమీపంలో గల చదునైన వ్యవసాయ భూమి అడుగున ఈ గుహలు ఉన్నాయి. ఈ గుహలకు దిగుడు బావి వంటి మూడు దారులు ఉన్నాయి. మధ్యలో ఉన్న దారి గుహల్లోకి ప్రవేశ ద్వారంగా ఉపయోగపడుతోంది. ఈ గుహల్లోకి వెళ్లేదారి బిలంలా ఉంటుంది. దాంతో వీటిని బిలం గుహలుగా పిలిచేవారని, అదే పేరు కాలక్రమంలో బెల్లం గుహలుగా మారిందని భావిస్తున్నారు. బెలూం గుహలు విశాఖపట్నం జిల్లాలోని బొర్రా గుహల కంటే పొడవైనవి. వీటిలో పొడవాటి మార్గాలు, విశాలమైన ఛాంబర్లు, మంచినీటి గ్యాలరీలు మొదలైనవి ఉన్నాయి. బెలూం గుహల్లోనిme.సా.శ..పూ. 4500 నాటి పాత్రల అవశేషాలు చూస్తే, వాటి పురాతనతత్వం అర్థమవుతుంది. గుహల పైకప్పు నుంచి కిందికి వేలాడుతున్న స్పటికాల వంటి శిలాకృతులను 'స్టాలక్ టైట్' లని, కింది నుంచి మొలుచుకొని వచ్చినట్లు కనపడే ఆకృతులను 'స్టాలగ్ మైట్' లని అంటారు. వీటి రకరకాల ఆకారాలను బట్టి, స్థానికులు వీటికి కోటిలింగాలు, మండపం, సింహద్వారం, పాతాళగంగ వంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం పర్యాటకులను భక్తిభావంతో ముంచుతుంది.
ప్రయాణం
[మార్చు]బెలూం గుహలు కర్నూలు కు 109 కిలోమీటర్లు, హైదరాబాద్ కు 336 కిలోమీటర్లు, బెంగుళూరు కి కూడా 292 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నంద్యాలకు 67 కిలోమీటర్లు, తాడిపత్రికి 32 కిలోమీటర్లు, జమ్మలమడుగుకు 47 కు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బెలూం గుహలు చేరుకోవాలి అంటే కర్నూలు, నంద్యాల మీదుగా లేదా అనంతపురం జిల్లా తాడిపత్రి మీదుగా లేదా వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగు మీదుగా రోడ్డుమార్గం ద్వారా వెళ్లవచ్చు. రైలు ప్రయాణం ద్వారా అయితే తాడిపత్రి రైల్వే స్టేసన్ లో దిగి , అక్కడినుంచి రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. బెలూం గుహలు సందర్శించాక సమీపంలోని యాగంటి, బుగ్గ క్షేత్రాలను కూడా సందర్శించవచ్చు.
సమీప ప్రాంతాలు
[మార్చు]బెలుం గుహల సమీపంలో కొలిమిగుండ్ల లక్ష్మీనరసింహ స్వామి గుడి అనే సందర్శక ప్రదేశం ఉంది. ఈ దేవాలయం పాలరాతి తో కట్టబడి, చుట్టూ మెట్లతో నిర్మించబడింది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "చూడాల్సిన బెలూం గుహలు | Prajasakti::Telugu Daily". web.archive.org. 2019-11-02. Archived from the original on 2019-11-02. Retrieved 2019-11-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Belum or Belgam Caves". web.archive.org. 2019-10-25. Archived from the original on 2019-10-25. Retrieved 2019-11-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)