Jump to content

వేములవాడ భీమకవి

వికీపీడియా నుండి

వేములవాడ భీమకవి, తొలితరం తెలుగు కవి. ఇతని కాలం గురించి, స్థలం గురించి స్పష్టంగా తెలియడం లేదు. ఇతని రచనలు ఏవీ లభించడం లేదు.[1] అయినా ఇతర కవులు అతనిని పేర్కొనడం వలనా, అతనివని చెప్పబడే కొన్ని చాటువుల వలనా భీమకవి పేరు తెలుగు సాహిత్యంలో సుపరిచితమైనదిగా ఉంది. ఇతడు వాక్పటుత్వం కలిగినవాడని, శాపానుగ్రహ సమర్ధుడని కూడా ప్రజాబాహుళ్యంలో కథలున్నాయి.

ప్రస్తావన, కాలం

[మార్చు]

భీమకవి నన్నయ కాలానికి చెందినవాడని, కాదు తరువాతి కాలంవాడని అభిప్రాయాలున్నాయి.

శ్రీనాధుడు, పింగళి సూరన, అప్పకవి తమ కవితలలో భీమకవిని ప్రస్తావించారు. కాశీఖండం ఆరంభంలో శ్రీనాధుడు తన కవితా శైలి విశేషాలను చెప్పుకొంటూ

వచియింతు వేములవాడ భీమన భంగి
నుద్ధండ లీల నొక్కొక్క మాటు
భాషింతు నన్నయ మార్గంబున
నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్కమాటు....

అంటూ ముందుగా వేములవాడ భీమ కవిని, తరువాత నన్నయను, ఆపై తిక్కనను, ఎఱ్ఱనను పేర్కొన్నాడు. అందువలన భీమకవి నన్నయ సమకాలికుడనే అభిప్రాయం ఉంది.

అప్పకవి తన అప్పకవీయంలో ఒక కథ చెప్పాడు -

భారతముఁ దెనిఁగించుచుఁ దా రచించి
నట్టి రాఘవ పాండవీయంబు నడఁచె
ఛందమునడంప నీ ఫక్కి సంగ్రహించె
ననుచు భీమన మ్రుచ్చిలి నడఁచె దాని

ఆదిని భీమకవీంద్రుడు
గోదావరిలోనఁ గలిపెఁ గుత్సితమున, నా
మీఁదట రాజనరేంద్ర
క్ష్మాదయితుని పట్టి దాని మహి వెలయించెన్

భీమకవి తాను రచించిన "రాఘవ పాండవీయము"ను నన్నయకు చూపాడు. దాని ముందు తన భారతం నిలువదని అసూయతో నన్నయ ఆ భీమకవి గ్రంథాన్ని నాశనం చేశాడట. అందుకు కోపించి నన్నయ రచించిన "ఆంధ్ర శబ్ద చింతామణి"ని భీమకవి గోదావరిలో కలిపేశాడట. - ఈ కథ కల్పితమనీ, నన్నయకూ భీమకవికీ కూడా అన్యాయం చేస్తున్నదనీ సాహితీకారులు అభిప్రాయపడ్డారు. (ఆంధ్ర శబ్ద చింతామణిని నన్నయకు అంటగట్టి ఆయనకు లేని కీర్తిని సంపాదించి పెట్టదలచిన అప్పకవి ఈ పాపపు వృత్తాంతమును కూడ అతనికి అంటగట్టి లేని దుష్కీర్తిని సంపాదించి పెట్టెను. [2])


125 సంవత్సరాల తరువాత పింగళి సూరన, రాఘవ పాండవీయం అనే ద్వ్యర్ధి కావ్యాన్ని వ్రాశాడు. అతను కూడా కూడా ఈ లోక వదంతిని గౌరవిస్తూ భీమకవి వ్రాసిన రాఘవ పాండవీయం ఎలాగుండేదో తెలియదని, బహుశా అది ద్వ్యర్ధ్యాకృతినుండెనని తానూహిస్తున్నానని చెప్పుకొన్నాడు.

భీమన తొల్లి జెప్పెనను పెద్దల మాటయె గాని యందు నొం
డేమియు నేయెడన్నిల్చుటెవ్వరుఁ గాన రటుండ నిమ్ము నా
నా మహిత ప్రబంధ రచనా ఘన విశృతి నీకుఁ గల్గుటన్
నా మదిఁ దద్ద్వయార్ధకృతి నైపుణియుం గలదంచునెంచెదన్

పై ప్రస్తావనల ద్వారా భీమకవి నన్నయ సమకాలికుడు కావచ్చునని అనిపిస్తున్నది. భీమకవి వనబడే రెండు చాటు పద్యాలను కూడా అతని కాల నిర్ణయానికి వినియోగిస్తున్నారు.

ఘనుఁడన్ వేములవాడ వంశజుఁడ ద్రాక్షారామ భీమేశ నం
దనుఁడన్ దివ్య విషామృత ప్రకట నానా కావ్య ధుర్యుండ భీ
మన నా పేరు వినంగఁ జెప్పితి, దెలుంగాధీశ! కస్తూరికా
ఘన సారాది సుగంధ వస్తువులు వేగందెచ్చి లాలింపరా!

వేములవాడ భీమకవి వేగమె చూచి కళింగ గంగు తా
సామము మాని కోపమున సందడి దీఱిన రమ్ము పొమ్మనెన్
మోమును జూడ దోసమిఁక ముప్పది రెండు దినంబులావలన్
జామున కర్ధమందతని సంపద శత్రులఁ జేరుఁగావుతన్

ఈ పద్యాలలో తెలుంగా ధీశులు, కళింగ గంగులు ఒకరే ఐనచో ఆ కళింగ గంగు 11వ శతాబ్ది అంత్యకాలం వాడు. 1077లో పట్టాభిషిక్తుడై 50 సంవత్సరాలు పాలించాడు. అతనిని దర్శించేనాటికి భీమకవి నవ యువకుడు గనుక నన్నయ నాటికి భీమకవి చాలా పిన్నవయస్కుడైయుండాలి. అప్పటికి అతడు రాఘవ పాండవీయమనే బృహత్కావ్యం వ్రాసే అవకాశం లేదు.[2]

స్థలం

[మార్చు]

"ఇతడు తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంకు సమీపములొనున్న వేములవాడకి చెందినవాడు" అని కొందరు భావించినా, అత్యధిక పండితులు,సాహిత్య చరిత్రకారులు ఇతనిని ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు చెందినవాడుగా నిర్ధారించారు.[3] ఇక్కడ ప్రసిద్ధమైన రాజరాజేశ్వరాలయం కాక అతి పురాతనమైన భీమేశ్వరాలయం కూడా ఉంది.[4]

రచనలు

[మార్చు]

తాను "నానా కావ్య ధురంధరుడను" అని భీమకవి చెప్పుకొన్నాడు. కాని భీమకవి రచనలు ఏవీ లభించడంలేదు. అతని రచనల ప్రస్తావన కూడా ఇతర కావ్యాలలో స్పష్టంగా లేదు. రాఘవ పాండవీయం, శతకంధర రామాయణం, నృసింహ పురాణం (కస్తూరి కవి తన "ఆనంద రంగ రాట్ఛందం"లో ఉదహరించిన దానిని బట్టి), బసవ పురాణం వంటి రచనలు చేశాడని చెబుతున్నారు. "కవి జనాశ్రయం" అనే లక్షణ గ్రంథాన్ని వ్రాశాడని కూడా ఒక నానుడి ఉంది.

కేవలం చాటుపద్యాల ద్వారానే సాహితీలోకంలో చిరస్థాయిగా నిలిచిన దిట్ట వేములవాడ భీమకవి. పైన కొన్ని చాటువులు ఉదహరింపబడ్డాయి. అతని పలుకు బలాన్ని చెప్పే ఒక చాటువు ఇది.

రామునమోఘ బాణమును, రాజ శిఖామణి కంటిమంటయున్
భీము గదా విజృంభణ ముపేంద్రుని చక్రము వజ్రి వజ్రమున్
తామర చూలి వ్రాతయును దారకవి ద్విఘఘోరశక్తియున్
వేములవాడ భీమకవి వీరుని తిట్టును రిత్తపోవునే!

ఇదే చాటువుకు పాఠాంతరం ఇలా ఉంది

బిసరుహ గర్భు వ్రాతయును విష్ణుని చక్రము వజ్రి వజ్రమున్
దెసలను రాము బాణము యుధిష్ఠిరు కోపము మౌని శాపమున్
మసకపు పాము కాటును గుమారుని శక్తియు గాలు దండమున్
బశుపతి కంటి మంటయును పండిత వాక్యము రిత్తపోవునే!

భీమకవి మరొక చాటువు ఇది. ఇందులో తిక్కన ప్రస్తావన ఉండడం గమనించాలి. చాలా చాటువులు ఇలానే ఒక కవికి ఆపాదింపబడుతాయి. అవి కల్పితమో కాదో తెలియడం కష్టం.

ఏమి తపంబు సేసి పరమేశ్వరు నేమిట పూజ సేసిరో
రాముని తల్లియున్ బరశురాముని తల్లియు భీముతల్లియున్
కాముని కన్న తల్లియును కంజదళాక్షుననుంగు దల్లియున్
శ్రీ మహిత ప్రతాపుడగు సిద్ధయ తిక్కన గన్న తల్లియున్

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • వేములవాడ భీమకవి (సినిమా): వేములవాడ భీమకవి పై ఒక సినిమాకూడ వచ్చింది. దాసరి యోగానంద్ దర్శకత్వంలో, నందమూరి తారక రామారావు, బాలకృష్ణలు నటులుగా తీయబడ్డ ఆ సినిమా 1975 జనవరి 8 వ తేదీనాడు విడుదలైనట్లు తెలుస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. ద్వా.నా.శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర
  2. 2.0 2.1 పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర
  3. Datta, Amaresh (1987). Encyclopaedia of Indian Literature: A-Devo (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 978-81-260-1803-1.
  4. Shri Bheemalingeswara Swamy Adhyayana Kendram. Vemulawada Bheemakavi.

ఇతర లింకులు

[మార్చు]

వనరులు

[మార్చు]
  • పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  • దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రం - ప్రచురణ: ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
  • ద్వానా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర - ప్రచురణ: ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
  • ప్రసిద్ధ తెలుగు పద్యాలు - సంకలనం: పి. రాజేశ్వరరావు - ప్రచురణ: ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు
  • జొన్నలగడ్డ వేంకట రాధాకృష్ణయ్య, వేములవాడ భీమకవి చరిత్ర, శ్రీ భీమలింగేశ్వర స్వామి అధ్యయన కేంద్రం, 1938.

బయటి లింకులు

[మార్చు]