అత్తిపత్తి
| అత్తిపత్తి | |
|---|---|
| ముట్టుకుంటే ముడుచుకొనే (మైమోసా పుడికా) ఆకులు మరియు పుష్పం |
|
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | మాగ్నోలియోఫైటా |
| Class: | Magnoliopsida |
| Order: | Fabales |
| Family: | ఫాబేసి |
| Subfamily: | మైమోసాయిడే |
| Genus: | మైమోసా |
| Species: | మై. ప్యూడికా |
| Binomial name | |
| మైమోసా ప్యూడికా లిన్నయస్ |
|
అత్తిపత్తి లేదా సిగ్గాకు (ఆంగ్లం Touch-me-not) ముట్టుకుంటే ముడుచుకునే లక్షణం గల ప్రాకే మొక్క. ఇది ఫాబేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం మైమోసా ప్యూడికా (లాటిన్లో ప్యూడికా అంటే సిగ్గు అని అర్ధం). ఈ మొక్కను కేవలం దాని విలక్షణతకై పెంచుకుంటుంటారు. అత్తిపత్తి ఆకులు ముట్టుకున్న వెంటనే లోపలివైపుకు ముడుచుకొని వాలిపోతాయి. మళ్లీ కొన్ని నిమిషాల్లో తిరిగి యధాస్థితికి చేరతాయి. దక్షిణ అమెరికా మరియు మధ్య అమెరికా ప్రాంతాలకు స్థానికమైన ఈ మొక్క, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ ప్రాంతాలన్నింటిలో కలుపుమొక్కగా పెరుగుతుంది.
లక్షణాలు [మార్చు]
- కంటకాలు వంటి నిర్మాణాలతో సాగిలబడి పెరిగే చిన్నపొద.
- ద్విపిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
- సమపుష్టి శీర్షవద్విన్యాసంలో అమరి ఉన్న కెంపురంగు పుష్పాలు.
- నొక్కులు కలిగి తప్పడగా ఉన్న కాయలు.
అత్తిపత్తి ఆకులు ముట్టుకుంటే ఎందుకు ముడుచుకుంటాయి? [మార్చు]
అత్తిపత్తి ఆకులు మన చేతితో తాకినా, ఏదైనా కీటకం వాలిగా, నీటిచుక్కలు పడినా, పెద్దగా గాలి వీచినా వెంటనే ముడుచుకొనిపోతాయి. అయితే యధాస్థితికి రావడానికి అరగంట నుండి గంట వరకు పడుతుంది. దీనికి కారణం ఆకులు కొమ్మను కలిసే ప్రదేశంలో మందంగా బుడిపెలా ఉండే పత్రపీఠం. మనం ఆకుల్ని తాకినప్పుడు దీనిలోని మృదుకణజాలం నుండి నీరు కాండంలోనికి వెళ్ళి ఫలితంగా పటుత్వం తగ్గిపోయి ఆకులు వాలిపోతాయి. కొంత సమయానికి కాండం నుండి నీరు బుడిపెలోనికి చేరి ఆకులు తిరిగి యధాస్థితికి వస్తాయి.