అమరావతి సంస్థానం

వికీపీడియా నుండి
(అమరావతీ సంస్థానం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

అమరావతీ సంస్థానం భారతదేశంలోని ఒక ప్రముఖ సంస్థానం. సంస్థానం పాలకులుగా వాసిరెడ్డి వంశానికి చెందిన వారు కీర్తి గడించారు. కాకతీయ రాజుల సామంతులుగా వాసిరెడ్డి నాయకులు తీరాంధ్ర దేశమును పాలించి ప్రఖ్యాతి గాంచిరి. పిఠాపురంలో ఉన్న 1413 A.D. సంవత్సరం నాటి శాసనం ఆధారంగా వాసిరెడ్డి నాయకులు, కాకతీయ సామ్రాజ్య వారసులైన ముసునూరి నాయకుల కాలంలో పిఠాపురం రాజ్యన్ని సామంతులుగా రాజ్య పాలన చేస్తుండేవారు. ఈ వంశమునకు చెందిన వారందరికీ గల చాళుక్య నారాయణ అను బిరుదును బట్టి వీరు చాళుక్య సంతతికి చెందినవారని చరిత్రకారుల అభిప్రాయము.

రాజా వేంకటాద్రి నాయుడు గారు చింతపల్లి నుండి అమరావతికి రాజధాని మార్చి అమరావతి సంస్థానాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప సంస్థానంగా మలచారు. ఈ సంస్థానంలో వజ్రాలు విరివిగా వ్యాపారం జరుగుచు ఉండేవి.

చరిత్ర

[మార్చు]

వాసిరెడ్డి నాయకుల మొదటి ప్రస్తావన పిఠాపురంలో దొరికిన సా.శ. 1413 నాటి ఒక శాసనములో గలదు. వాసిరెడ్డి పోతినీడు అను రాజు ఈ ప్రాంతమును ముసునూరి నాయకుల సామంతునిగా పాలించినట్టుగా ఉంది. పోతినీడు గోదావరీ తీర ప్రాంతములో పలు దేవాలయాలు కట్టించాడు. 4,60,000 తాడి చెట్లు నాటించి తన శాసనములలో తాడిచెట్ల ప్రయోజనాలను పేర్కొన్నాడు.

మల్లికార్జున నాయుడు

[మార్చు]

వంద సంవత్సరాల తర్వాత, సా.శ. 1500 నుండి 1527 వరకు వాసిరెడ్డి మల్లికార్జున నాయుడు పాలించాడు.

గోల్కొండ సుల్తాను కులీ కుతుబ్ షాకు పన్నులు చెల్లింప నిరాకరించి సుల్తానుతో యుద్ధానికి తలపడ్డాడు. గోల్కొండ సేనాధిపతి హైదర్ జంగ్‌తో జరిగిన పోరులో మల్లికార్జునుడు, హైదరు జంగు ఇద్దరూ మరణించారు. ఈ యుద్ధములో శ్రీశైల ప్రాంతమును పాలిస్తున్నవిజయనగర సామంతుడు రావెళ్ళ మల్లా నాయుడు కూడా పాల్గొన్నాడు. మల్లికార్జునుని రాణి సతీసహగమనము చేస్తుంది. రెండు సంవత్సరముల వయసున్న కొడుకు సదాశివ రాయుని కొడాలి రామభూపతి అను బంధువు గుంటూరు మండలం నూతక్కి గ్రామంలో పెంచుతాడు.

సదాశివ రాయలు

[మార్చు]

సదాశివ రాయల పాలనలో కృష్ణా నది తీరములోని చింతపల్లి రాజధానిగా ఉంది. గోల్కొండ సుల్తానుల ఆధిపత్యమును అంగీకరించిన రాయలుకు ఇబ్రహీం కుతుబ్ షా నందిగామ పరగణా ఇస్తాడు. క్రీ. శ. 1550 నుండి 1581 వరకు ఎట్టి ఒడిదుడుకులు లేకుండా పాలించాడు. సదాశివుని తదుపరి ఆతని మునిమనుమలు గంగినీడు, గురివినీడు, చినవేంకటాద్రి, మాదినీడు క్రీ. శ. 1600 నుండి 1670 వరకు పాలించారు

చినపద్మనాభ రామన్న

[మార్చు]

పేరు ప్రఖ్యాతులు పొందిన వాసిరెడ్డి వంశస్థులలో చినపద్మనాభ రామన్నఒకడు. క్రీ. శ. 1685లో తానీషా నుండి 500 గ్రామాలు పొందుతాడు. రామన్న అబుల్ హసన్ తానీషాను సందర్శించిన ఒక సందర్భములో సుల్తాను మదించిన అశ్వాన్ని లొంగదీయలేక తంటాలు పడుతుండగా రామన్న చూసి, గుర్రాన్ని మచ్చిక చేసుకొని స్వారీ చేసి వస్తాడు. సంతసించిన సుల్తాను రామన్నను నందిగామ, ఖమ్మంమెట్టు, వినుకొండ, కొండవీడు మొదలైన 500 గ్రామాలకు సర్దేశముఖ్‌గా నియమించాడు. చింతపల్లి కోటను గట్టిపరచి శత్రుదుర్భేద్యము చేస్తాడు. క్రీ. శ. 1710 వరకు పాలన సాగిస్తాడు. తదుపరి రామన్న వారసులు బుచ్చిరాఘవ, పెదనరసన్న, చిననరసన్న, చినరామలింగ, చంద్రమౌళి, రాజమౌళి, లక్ష్మీపతి క్రీ. శ. 1760 వరకు పాలిస్తారు.

క్రీ. శ. 1763లో జగ్గయ్య చింతపల్లిని పాలిస్తున్న సమయములో ఫ్రెంచి వారికి బ్రిటిషు వారికి ఆంధ్రదేశముపై ఆధిపత్యము కొరకు సంఘర్షణ మొదలవుతుంది. బ్రిటిషువారికి అనుకూలముగా ఉన్నాడనే అనుమానముతో గోలకొండ నవాబు సోదరుడు బసాలత్ జంగ్ పంపిన ఫ్రెంచి సైన్యంతో తలపడిన జగ్గయ్య యుద్ధములో మరణిస్తాడు. జగ్గయ్య భార్య అచ్చమ్మ సతీసహగమనము చేస్తుంది.

వేంకటాద్రి నాయుడు

[మార్చు]
రాజ వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు. మంగళ గిరి ఆలయంలో ప్రధాన ద్వారంలో వున్న చిత్ర పటము. స్వంతి కృతి

ముఖ్య వ్యాసము: వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు

వేంకటాద్రి రాజధానిని కృష్ణానది ఒడ్డుననున్న గుంటూరు మండలంలోని అమరావతి/ధరణికోటకు మార్చాడు. వేంకటాద్రి పండితపోషకుడు, మంచి పరిపాలనాదక్షుడు. కృష్ణా డెల్టా ప్రాంతమందు వందకుపైగా దేవాలయములు కట్టించాడు. వీటిలో అమరావతి, చేబ్రోలు, పొన్నూరు, మంగళగిరి ముఖ్యమైనవి.

వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచు సామాన్యప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడుగా మారింది. పిమ్మట పశ్చాత్తాపము చెంది శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. తండ్రి జగ్గయ్య పేరు మీదనే బేతవోలు గ్రామం పేరును జగ్గయ్యపేటగా మార్చాడు. వేంకటాద్రి నాయుడు 1817, ఆగస్టు 17న మరణించాడు[1]

మూలాలు

[మార్చు]
  1. కొడాలి లక్ష్మీనారాయణ (1963). శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు. పొన్నూరు: శ్రీ భావనారాయణస్వామివారి దేవస్థానము.

వెలుపలి లంకెలు

[మార్చు]