కైప మహానందయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కైప మహానందయ్య
జననం
కైప మహానందయ్య

(1900-01-05) 1900 జనవరి 5 (వయసు 124)
మరణం1984 ఫిబ్రవరి 24(1984-02-24) (వయసు 84)
విద్యాసంస్థపచ్చయప్ప కళాశాల, మద్రాసు
వృత్తిపోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత, సాహితీవేత్త
గుర్తించదగిన సేవలు
మానవ జన్మము
తల్లిదండ్రులుమహానంది శాస్త్రి, సుబ్బమ్మ
బంధువులుకైప సుబ్రహ్మణ్యశర్మ

కైప మహానందయ్య అనంతపురం జిల్లాకు చెందిన సాహితీకారుడు.

జీవిత విశేషాలు[మార్చు]

అనంతపురంజిల్లాలోని విద్వత్‌కుటుంబాలలో ప్రశస్తమైన కైప కుటుంబంలో ఇతడు మహానంది శాస్త్రి, సుబ్బమ్మ దంపతులకు 1900, జనవరి 5వ తేదీన జన్మించాడు.[1] స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు, పాత్రికేయుడు అయిన కైప సుబ్రహ్మణ్యశర్మకు ఇతడు తమ్ముడు. ప్రొద్దుటూరులో శేషశాస్త్రుల వద్ద వేదాధ్యయనం చేశాడు. కర్నూలులోని కోల్స్ మిషన్ స్కూలులో చేరి మెట్రిక్యులేషన్ చదివాడు. మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో 1920-23 మధ్యకాలంలో చదివాడు. ఆ సమయంలో ఆంధ్రభాషాభివర్ధనీ సంఘనికి కార్యదర్శిగా పనిచేశాడు. విద్యార్థి దశలోనే ఇతడు ఆంధ్ర విద్యార్థి అనే మాసపత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు.[2] 1924-25 సంవత్సరాలలో అనంతపురంలోని దత్తమండల కళాశాలలో బి.ఎ.చదివాడు. ఇతడు తన సోదరుడు కైప సుబ్రహ్మణ్యశర్మతో కలిసి నీలం సంజీవరెడ్డికి కొంతకాలం ప్రైవేటు పాఠాలు చెప్పేవాడు. 1920లో పామిడిలో జరిగిన మద్యపాన నిషేధకార్యక్రమంలో పప్పూరు రామాచార్యులు, తరిమెల సుబ్బారెడ్డి, కైప సుబ్రహ్మణ్యశర్మ మొదలైన వారితో కలిసి పాల్గొని 'పికెటింగ్' నేరానికి ఐ.పి.సి.సెక్షన్ 341 క్రింద అరెస్ట్ అయ్యాడు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత జీవనోపాధి కోసం పోలీసు శాఖలో చేరి పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా 1925-47 వరకు, పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా 1947-56 వరకు పనిచేసి 1956, జూలై 7వ తేదీన పదవీ విరమణ చేశాడు. ఇతడు 1984, ఫిబ్రవరి 27వ తేదీ సోమవారం ఏకాదశి ఘడియలలో మరణించాడు.

రచనలు[మార్చు]

ఇతడు పచ్చయప్ప కళాశాలలో చదివే సమయంలో వ్యాసరచన పోటీలో పాల్గొని చిత్తైకాగ్రత అనే వ్యాసం వ్రాసి స్వర్ణపతకాన్ని గెలుచుకొన్నాడు. అనంతపురం దత్తమండల కళాశాలలో వ్యాసరచన పోటీలో పాల్గొని 'విజయమునకు మార్గము' అనే రచనకు ప్రథమ బహుమతి 10 రూపాయలు పొందాడు. శీరిపి ఆంజనేయులు, పప్పూరు రామాచార్యులు, మరూరు లక్ష్మీనరసప్ప, పేరనార్యుడు, రాళ్ళపల్లి గోపాలకృష్ణమాచార్యులు మొదలైన పేరొందిన రచయితల సాన్నిహిత్యంలో వారి స్ఫూర్తితో రచనావ్యాసంగానికి పూనుకున్నాడు. ఇతని శైలి చాలా నిరాడంబరంగా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఉంటుంది. విద్యార్థ దశలో వ్రాసిన వ్యాసాలు అనంతపురం నుండి వెలువడే శ్రీవత్స అనే వారపత్రికలో ప్రచురింబడ్డాయి. కరుకైన పోలీసుశాఖలో పనిచేస్తూ కూడా ఆంధ్ర భాషాభిమానిగా పోలీసుశాఖాధికారులకు ఉపయుక్తమయ్యే వ్యాసాలను ప్రజామతలో ధారావాహికగా ప్రకటించాడు.

కైప మహానందయ్య రాసిన మానవ జన్మము

ఇతడు రచించిన గ్రంథాలు ఈ విధంగా ఉన్నాయి.

  1. మానవ జన్మము
  2. మన జీవితము
  3. వ్యాస మంజరి[3]
  4. నీతి సుధ
  5. అమృతవాణి
  6. గీతోపదేశము మొదలైనవి.

మూలాలు[మార్చు]

  1. రావినూతల శ్రీరాములు. మానవ జన్మము (1 ed.). గుంతకల్లు: మహానంది పబ్లికేషన్స్. p. v-vi.
  2. జానమద్ది, హనుమచ్ఛాస్త్రి. మానవ జన్మము (1 ed.). గుంతకల్లు: మహానంది పబ్లికేషన్స్. p. Back cover.
  3. నేషనల్ లైబ్రరీలో పుస్తకవివరాలు[permanent dead link]