గుడిమెట్ల చెన్నయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుడిమెట్ల చెన్నయ్య
గుడిమెట్ల చెన్నయ్య
జననంజూలై 1, 1950
ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం
జాతీయతభారతీయుడు
వృత్తిజనని సంస్థ వ్యవస్థాపకుడు, రచయిత, బ్యాంకు ఉద్యోగి
జీవిత భాగస్వామిఈశ్వరమ్మ
పిల్లలు3 కుమారులు (పూర్ణచందర్,ప్రతాపచందర్,నవీన్ చందర్)
తల్లిదండ్రులు
  • గుడిమెట్ల చంద్రయ్య (తండ్రి)
  • కొండమ్మ (తల్లి)

గుడిమెట్ల చెన్నయ్య (జ. జూలై 1, 1950 ) తెలుగు భాషాభిమాని, రచయిత.

ప్రారంభ జీవితం, విద్యాభ్యాసం[మార్చు]

గుడిమెట్ల చెన్నయ్య, చంద్రయ్య, కొండమ్మ దంపతులకు జూలై 1, 1950వ తేదీన నెల్లూరు జిల్లా (ప్రస్తుతం ప్రకాశం జిల్లా), కనిగిరి సమీపంలోని తమటంవారిపల్లి అనే కుగ్రామంలో జన్మించాడు.[1] ఇతని తండ్రి స్వగ్రామంలో చేనేత వృత్తిని వదిలి బ్రతుకు తెరువుకోసం రంగూన్ వెళ్ళాడు. అక్కడి నుండి మద్రాసు చేరుకుని పెరంబూరు బిన్ని మిల్లులో కార్మికుడిగా స్థిరపడ్డాడు. చెన్నయ్య పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లో అయినా ఇతని జీవితం మొత్తం చెన్నైలోనే కొనసాగుతోంది. ఇతడు 5వ తరగతి వరకు ఏ.బి.యం.మిడిల్ స్కూలులో ఆ తరువాత ఎస్.ఎస్.ఎల్.సి వరకు ది మద్రాస్ ప్రోగ్రెసివ్ యూనియన్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. అటు పిమ్మట పి.యు.సి, బి.కాం సర్ త్యాగరాయ కళాశాల, మద్రాసులో చదివాడు.

ఉద్యోగం[మార్చు]

ఇతడు 1973లో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో ఉత్తీర్ణుడై ప్రభుత్వ డెయిరీ డెవలప్‌మెంట్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి 1977 వరకు పనిచేశాడు. తరువాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించి దానిలో సుమారు 33 సంవత్సరాలు పనిచేసి 2010లో పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం చెన్నైలో విశ్రాంతి జీవితం గడుపుతున్నాడు.

సంఘసేవ[మార్చు]

ఇతడు సామాజిక, సాంస్కృతిక, కళా, సాహిత్యరంగాలలో చురుకుగా పాల్గొని తనవంతు సేవలను అందిస్తున్నాడు. భాషా సాంస్కృతిక రంగాలలో తమిళనాడులోని తెలుగు ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నాడు.

ఆయా రంగాలలో ఇతడు నిర్వహించిన/నిర్వహిస్తున్న పదవులు కొన్ని:

  • శ్రీ వెంకటేశ్వర కళాలయం - అధ్యక్షుడు.
  • 'జనని' (సాంఘిక, సాంస్కృతిక సమితి) - వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి
  • ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ వెల్‌ఫేర్ (ఇండియా) - కోశాధికారి
  • టి.కె.పి.క్రికెట్ క్లబ్ - సలహాదారు
  • ముత్తమిళ్ ఆయ్‌వు మండ్రం - శాశ్వత సభ్యుడు
  • అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరం - సంయుక్త కార్యదర్శి
  • ఐ.ఓ.బి. తెలుగు సాంస్కృతిక సమితి - వ్యవస్థాపకుడు
  • ది పెరంబూర్ తెలుగు సాహితీ సమితి - సమన్వయకర్త
  • యూత్ ఎడ్యుకేషన్ అండ్ వెల్‌ఫేర్ అసోసియేషన్, చెన్నై - సలహాదారు
  • ఫెడరేషన్ ఆఫ్ మద్రాస్ తెలుగు పీపుల్స్ అసోసియేషన్ - ఉపాధ్యక్షుడు (మాజీ)
  • వాసుకి నగర్ వెల్‌ఫేర్ అసోసియేషన్ - సంయుక్త కార్యదర్శి (మాజీ)
  • ఆలిండియా ఓవర్‌సీస్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ - ఊతుకోట/అంబత్తూరు/వ్యాసర్పాడి శాఖలు - కార్యదర్శి (మాజీ)
  • ఐ.ఓ.బి.స్టాఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటి - కార్యవర్గ సభ్యుడు (మాజీ)

రచనలు[మార్చు]

ఇతడు ప్రియదత్త, ఆటవిడుపు, జగతి, రమ్యభారతి, సురభి, నెలవంక నెమలీక, ప్రముఖాంధ్ర, సాహిత్య ప్రస్థానం వంటి పలు పత్రికలలో వ్యాసాలు, సమీక్షలు, కవితలు ప్రచురించాడు. ఆకాశవాణి చెన్నై కేంద్రంలో అనేక సాహిత్య ప్రసంగాలు చేశాడు.

నాటకరంగం[మార్చు]

దూరదర్శన్‌లో ఇతని నాటిక ప్రదర్శించారు. రచయితగానే కాక ఇతడు నటుడిగా అనేక రేడియో, స్టేజి నాటకాలలో పాల్గొన్నాడు. ఒకే చెట్టు పూలు, రామరాజ్యం, నీ మనసు మారాలి, అడ్వకేట్ ఆనంద్, న్యాయమా బంధమా, విలేజ్ ఆఫీసర్, వీడని బంధాలు, మట్టిబొమ్మలు వంటి అనేక నాటకాలు, నాటికలలో నటించి బి.పద్మనాభం, రంగనాథ్, కె. రామలక్ష్మి వంటి ప్రముఖుల ప్రశంసలను పొందాడు[2].

పురస్కారాలు[మార్చు]

తమిళనాట ఇతడు తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించి ఇతడిని దేశంలోని పలు సంస్థలు సత్కరించాయి.

వాటిలో కొన్ని:

  • తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం, చెన్నై - 25వ వార్షికోత్సవాల సందర్భంగా సన్మానం.
  • రాయలసీమ ఆర్ట్ క్రియేటివ్ కల్చరల్ అసోసియేషన్, కడప - పద్మశ్రీ ఘంటసాల సేవా పురస్కారం.
  • గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం, నెల్లూరు.
  • జగన్నాథ సాహితీ సమాఖ్య, నల్లజర్ల - సన్మానం
  • శ్రీరాయలకళాసమితి, చెన్నై - సన్మానం
  • గుఱ్ఱం జాషువా స్మారక కళాపరిషత్, దుగ్గిరాల - సన్మానం
  • రాయలసీమ ఆర్ట్ క్రియేటివ్ కల్చరల్ అసోసియేషన్, కడప - ఉగాది పురస్కారం
  • ప్రకాశం జిల్లా రచయితల సంఘం, ఒంగోలు వారి 7వ రాష్ట్రస్థాయి మహాసభలలో రాష్ట్రేతర ప్రాంతంలో తెలుగు భాషాసేవకై పురస్కారం.
  • బెంగుళూరు తెలుగు తేజం 4వ వార్షికోత్సవం సందర్భంగా ఆత్మీయ సత్కారం.
  • విశ్వజన కళామండలి, హైదరాబాదు వారిచే ట్రూ ఇండియన్ పెరియార్ అవార్డ్.

బిరుదులు[మార్చు]

  • సాహిత్య సేవాభూషణ
  • ఘంటసాల ఎదురొళి

మూలాలు[మార్చు]

  1. "మావూరు మనవూరు సాక్షి దినపత్రిక 15-10-2017 చెన్నై సిటీ 6వ పేజీ". Archived from the original on 2017-10-21. Retrieved 2017-10-21.
  2. మదరాసు జ్ఞాపకాలు - గుడిమెట్ల చెన్నయ్య