చో రామస్వామి
చో రామస్వామి | |
---|---|
జననం | 1934 అక్టోబరు 5 |
మరణం | 2016 డిసెంబరు 7 చెన్నై | (వయసు 82)
మరణ కారణం | శ్వాసకోశ సంబంధిత వ్యాధి |
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత, నటుడు, దర్శకుడు, పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు |
చో రామస్వామి (1934 అక్టోబరు 5 - 2016 డిసెంబరు 7) తమిళనాడుకు చెందిన పాత్రికేయుడు, సినిమా నటుడు, రాజకీయ విశ్లేషకుడు. తుగ్లక్ పత్రిక సంపాదకునిగా సుప్రసిద్ధుడు. రాజ్యసభ సభ్యుడు. సినిమా నటుడు, రంగస్థల నటుడు, రచయిత, రాజకీయ విశ్లేషకుడు, పత్రికా సంపాదకుడు, న్యాయవాది - ఇలా అనేక రంగాలలో రాణించాడు.[1]
విశేషాలు
[మార్చు]చో అసలు పేరు శ్రీనివాస అయ్యర్ రామస్వామి. ఇతడు "దెన్‌మొళియల్" అనే నాటకాన్ని వ్రాసి దానిలో చో అనే పాత్రను ధరించి రక్తికట్టించి ప్రేక్షకుల మెప్పుపొందడంతో ఇతని పేరులోని శ్రీనివాస అయ్యర్ స్థానంలో చో చేరి ఇతడు చో రామస్వామిగా స్థిరపడ్డాడు. [2] ఇతడు మైసూరులో 1934 అక్టోబర్ 5న జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో లా చదివి కొంతకాలం న్యాయవాద వృత్తిని చేపట్టాడు.
సినిమారంగం
[మార్చు]చో రామస్వామి 1963-2005 మధ్యకాలంలో సుమారు 200 తమిళ సినిమాలలో నటించాడు. ఎక్కువగా హాస్యపాత్రలలోను, తండ్రిపాత్రల లోనూ నటించాడు. 14 చిత్రాల్లో హీరోగాను, మరికొన్ని చిత్రాల్లో ప్రతినాయకుడిగాను నటించాడు. నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు. 14 చిత్రాలకు మాటలు వ్రాశాడు. జయలలితతో పాటు ఎంజీఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులతో కలసి పలు సినిమాల్లో నటించాడు. ప్రముఖ నటి రమ్యకృష్ణ వ్యంగ్య రచయిత చో రామస్వామి మేనకోడలు.
నాటకరంగం
[మార్చు]చదువుకునే రోజులలోనే ఇతనికి రంగస్థలంపై మోజు ఏర్పడి అది వ్యామోహంగా ముదిరింది. నాటకాలు వ్రాయడం, నటించడం దర్శకత్వం వహించడంలో ఇతడు తలమునకలైనాడు. ఇతడు 23 నాటకాలను వ్రాశాడు. ఇతడు వ్రాసిన నాటకాలలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ అత్యంత జనాదరణ పొందింది. తుగ్లక్ గోరీ నుండి లేచివచ్చి దేశానికి ప్రధాని కావడం ఈ నాటకం ఇతివృత్తం. ఫిరాయింపు రాజకీయాలపైన ఈ నాటకం వ్యంగ్యంగా, ఘాటుగా విమర్శించింది. దీనిని సినిమాగా తీయడానికి ప్రయత్నించినప్పుడు డి.ఎం.కె.ప్రభుత్వం గట్టిగా అడ్డుకొంది. అయితే ఇతడు వెనకడుగు వేయలేదు. 1971లో ఆ సినిమాను నిర్మించాడు.
రచనలు
[మార్చు]ఇతడు నాటకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు రచించాడు. ఆధ్యాత్మిక రచనలలో హిందూ మహాసముద్రం (6 భాగాలు), మహాభారతం, వాల్మీకి రామాయణం, నానేరాజా మొదలైనవి ముఖ్యమైనవి. నాటకాలలో వెయిట్ అండ్ సీ, వై నాట్?, వాట్ ఫార్?, ముహమ్మద్ బిన్ తుగ్లక్, నేరమై ఉరంగం నేరం, మద్రాస్ బై నైట్ ముఖ్యమైనవి. ఇతడు తన జీవితచరిత్రను అదృష్టం అందించిన అనుభవాలు (Expressions given by Fortune) అనే పేరుతో రచించాడు.
రాజకీయాలు
[మార్చు]చో రామస్వామి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనకున్నా ఇతడు రాజకీయ సూత్రధారిగా పనిచేసిన సందర్భాలున్నాయి. కామరాజ నాడార్ నాయకత్వంలోని పాతకాంగ్రెస్‌ను ఇందిరా కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి ఇతడు ఇందిరాగాంధీ, కామరాజ్ నాడార్‌లతో మాట్లాడి మధ్యవర్తిత్వం నెరిపాడు. ఎం.జి.రామచంద్రన్ మరణించిన తర్వాత అతని శవయాత్రలో అవమానానికి గురైన జయలలితను తిరిగి ఎ.ఐ.డి.ఎం.కె. అధినాయకురాలిగా ప్రతిష్ఠించడంలో ఇతని పాత్ర గణనీయమైనది. జయలలితకు ఇతడు రాజగురువు లాంటివాడు. ఇతనికి కృపలానీ, ఇందిరాగాంధీ, మొరార్జీదేశాయ్, కరుణానిధి, చరణ్ సింగ్, కామరాజర్, ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్, వాజ్‌పేయి, అద్వానీ, మోదీ వంటి రాజకీయ నేతలతో సత్సంబంధాలున్నాయి. అయితే ఈ సత్సంబంధాలు వారిపై విమర్శలు చేయవలసిన సందర్భంలో అడ్డురాలేదు. ఇతడు మొరార్జీదేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యసభకు రాష్ట్రపతిచేత నియమించబడి 1999-2005 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.
తుగ్లక్ పత్రిక
[మార్చు]1970లో తమిళభాషలో తుగ్లక్ పేరుతో ఈ రాజకీయ వారపత్రికను ప్రారంభించాడు. ఈ పత్రిక సంపాదకుడు, వ్యవస్థాపకుడు ఇతడే. ఈ పత్రిక తమిళనాడులో ప్రతిపక్ష పాత్రను పోషించిందని చెప్పవచ్చు. ఈ పత్రిక ద్వారా ఎవరైనా తప్పుచేస్తే చో నిర్భయంగా విమర్శించేవాడు. ఇందిరా గాంధీ, జయలలిత, ఎం.జీ.ఆర్, కరుణానిధి, జె.బి.కృపలాని, చంద్రశేఖర్, జి.కె.ముపనార్, రామకృష్ణ హెగ్డే, ఎన్.టి.రామారావు, అటల్ బిహారీ వాజ్‌పాయి, సోనియాగాంధీ, ఎల్.కె.అద్వానీ, మన్‌మోహన్ సింగ్, పి. చిదంబరం లాంటి వారిపై ఈ పత్రిక నిశితంగా విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం ఈ పత్రిక 60వేల సర్క్యులేషన్‌ను కలిగి ఉంది.
మరణం
[మార్చు]తమిళ ప్రజలు విపరీతంగా అభిమానించే రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ నటుడు, పత్రికా సంపాదకుడు అయిన 82 ఏళ్ల కురు వృద్ధుడు చో రామస్వామి 2016, డిసెంబరు 7వ తేదీ బుధవారం ఉదయం 4.40 గంటల ప్రాంతంలో చెన్నై అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు. ఈయన గత కొద్ది కాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఇతని పార్థివ దేహానికి బుధవారం సాయంత్రం 4.30 ప్రాంతంలో స్థానిక బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. [3] ఇతనికి భార్య సౌందర రామస్వామి, కుమారుడు శ్రీరామ్(రాజీవాక్షణ్), కుమార్తె సింధు ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, విలేకరి. "చో రామస్వామి ఇక లేరు". eenadu.net. చెన్నై: ఈనాడు. Archived from the original on 8 December 2016. Retrieved 8 December 2016.
- ↑ కె, రామచంద్రమూర్తి (8 December 2016). "వ్యంగ్య ప్రహారం 'చో'". సాక్షి. Archived from the original on 8 డిసెంబరు 2016. Retrieved 8 December 2016.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "చో రామస్వామి కన్నుమూత". సాక్షి. సాక్షి. 2016-12-07. Retrieved 8 December 2016.
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- సంపాదకులు
- విమర్శకులు
- 1934 జననాలు
- 2016 మరణాలు
- తమిళనాడు పాత్రికేయులు
- తమిళనాడు నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు
- తమిళనాడు రచయితలు
- తమిళనాడు సినిమా నటులు
- తమిళనాడు రంగస్థల నటులు
- తమిళనాడు సినిమా దర్శకులు
- తమిళనాడు నాటక రచయితలు
- తమిళ సినిమా నటులు
- తమిళ సినిమా దర్శకులు
- రాజకీయ విశ్లేషకులు