ద్వారకా నగరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వర్ణ ద్వారకలో శ్రీకృష్ణుడు
దస్త్రం:EpicIndiaCities.jpg
ఇతిహాస కాలం నాటి భారతదేశ ప్రడేశాలు

వేద వ్యాసుడు సంస్కృత భాషలో వ్రాసిన మహాభారతం అను కావ్యంలో ద్వారకా నగరం ద్వారావతిగా పిలువబడింది. ఈ నగరానికి అనేక ద్వారాలు ఉండడమే ఇందుకు కారణం. సంస్కృత భాషలో ద్వారం అంటే తెలుగులో వాకిలి లేక ద్వారం అని అర్ధం. కనుక రెండు కారణ నామాలు ఈ నగరానికి చక్కగా వర్తిస్తాయి. అనార్తా సామ్రాజ్యాధీశులైన యాదవులకు ద్వారక రాజధాని. గుజరాత్ రాష్ట్ర పశ్చిమ తీరాన ఉన్న ఈ నగరం సముద్రజలాల వలన ముంచివేయబడింది. సంస్కృత మహాభారత కావ్యం ప్రకారం ఈ నగరం కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల అనంతరం సముద్రగర్భంలో కలిసి పోయింది. మగధరాజైన జరాసంధుడి దండయాత్రల నుండి ప్రజలను సురక్షితంగా కాపాడడానికి శూర సామ్రాజ్యానికి చెందిన యదు ప్రముఖులు సముద్ర గర్భంలో ఉన్న ద్వీపాల సమూహాలను ఎంచుకుని, ఈ నగర నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి, పూర్తి చేసి, ప్రజలను శూరసేన సామ్రాజ్యపు రాజధాని మధుర నుండి ద్వారకకు తరలించారు. ఈ ప్రదేశం అనర్త సామ్రాజ్యంలో ఒకభాగం. ద్వారకా నగరాన్ని సామ్రాజ్యము అనే కంటే సంయుక్త రాజ్యసమాహారం అనటం సమంజసం. అంధకులు, వృష్టులు, భోజులు ఈ రాజ్యసమాహారం లోని అంతర్భాగాలు. ద్వారకను పాలించిన యాదవులు దశరాస్, మధవులు అని కూడా పిలువబడ్డారు. ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖులలో ముఖ్యులు వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు.

ద్వారక, కుశస్థలి

[మార్చు]

కుశస్థలి అనబడే ద్వారకా నగరం వాసుదేవ కృష్ణుడి చేత జరాసంధుడి యుద్ధాల నుండి ప్రజలను కాపాడే నిమిత్తం నిర్మించబడింది. యాదవులు మధుర నుండి ద్వారకకు సురక్షితంగా తరలించబడ్డారు. పశ్చిమ తీరానికి తరలి వచ్చిన ఈ యాదవ నిర్మిత ఆనందమయ నగరం కుశస్థలి అని పిలువబడింది. ఈ నగర సమీపంలో రైవతక పర్వతాలు ఉన్నాయి. యాదవులు ఇక్కడకు తరలి వచ్చిన తరువాత ఈ నగర కోటను తిరిగి పటిష్ఠంగా నిర్మించి, శత్రు దుర్భేద్యం చేసారు.

  • శూరసేన సామ్రాజ్యం నుండి యాదవులు వలస వచ్చినట్లు ఇక్కడ సూచించబడినది (13,147)
  • వాసుదేవకృష్ణుడు ఇక్కడ నివసించడం ఆరంభించిన విషయం సూచించబడినది (12,339)
  • కుశస్థలిలో దేవతలు సమావేశం జరిపారు. కుబేరుడు విచారవదనాలతో ఉన్న యక్షులను 300 మంది మహాపద్ములను వెంటబెట్టుని వివిధ ఆయుధములను పట్టుకుని వచ్చిన విషయం సూచింపబడినది (3,160)

అర్జునుడి విజయం

[మార్చు]

అర్జునుడు తన 12 మాసాల తీర్థయాత్రా సమయంలో ద్వారకానగరానికి విజయం చేసి, తన ప్రియ నేస్తము, దగ్గరి బంధువు అయిన శ్రీకృష్ణుడిని కలుసుకున్నాడు. అర్జునుడు ఇంద్రప్రస్థం నుండి బయలుదేరి హిమాలయాలకు తీర్ధయాత్ర చేస్తూ తూర్పు సముద్రతీరానికి చేరి, అక్కడ నుండి దక్షిణ సముద్రతీరాల మీదుగా పశ్చిమ సముద్ర తీరం వైపు పయనించి, ద్వారకకు చేరి కృష్ణుడిని కలుసుకుని, రైవతక పర్వతానికి తీసుకొని పోబడి, అక్కడి నుండి సమీపంలోని ద్వారక చేరుకున్నాడు.

రైవత పర్వతం

[మార్చు]

రైవతకము ద్వారక సమీపంలో ఉన్న వేసవి విడిది. కృష్ణుడు, అర్జునుడు ప్రభాసతీర్థములో కొంత సమయం విహరించి, తరువాత కొంతకాలం నివసించడానికి రైవతక పర్వతం చేరుకున్నారు. వారు రైవతకం చేరే ముందు శ్రీకృష్ణుడి ఆదేశానుసారం రైవతకం ఉత్సవార్థం అలంకరించబడింది. శ్రీకృష్ణుడి ఆదేశానుసారం అక్కడ కావలసినంత ఆహారం పుష్కలంగా సమీకరించబడింది. వారిని సంతోషపరచడానికి కావలసిన నృత్యగానాదులకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి. అర్జునుడు కృష్ణుడితో చేరి నృత్యగీతాలను చూసి ఆనందించి తరువాత కళాకారులను వెనుకకు పంపి అర్జునుడు చక్కగా అలంకరించబడిన అద్భుతమైన మంచము మీద విశ్రమించాడు. మరునాడు ఉదయం వంధిమాగదుల స్తుతులతో బ్రాహ్మణుల దీవెనలతో వీణానాదాల మధ్య అర్జునుడు నిదుర నుండి మేల్కొలుపబడ్డాడు. (1,220).

ద్వారకావాసుల స్వాగతం

[మార్చు]
స్వర్ణద్వారకను చూసి నమస్కరిస్తున్న కుచేలుడు

అర్జునుడు స్వర్ణ రథంలో యాదవుల రాజధాని అయిన ద్వారకకు చేరుకున్నాడు. అర్జునుడి రాకను పునస్కరించుకుని అతడి గౌరవార్థం ద్వారకను అందంగా అలంకరించారు. పూదోటలను, గృహాలను, వీధులను చక్కగా అలంకరించారు. ద్వారకావాసులు అర్జునుడిని చూడాలన్న ఆతురత వలన పురవీధులలో ఇరువైపులా వేల మంది చేరారు. మిద్దెలు, మేడలు, వసారాలు ప్రజలతో నిండిపోయాయి. వేల కొలది స్త్రీలు కూడా వారితో చేరారు. భోజులు, అంధకులు, వృష్టులు అర్జునుడికి ఆదరంతో, గౌరవంతో స్వాగతం పలికారు. అర్జునుడు ద్వారక లోని పెద్దలకు నమస్కరించి పూజించి వారి ఆశీర్వాదం పొందాడు. యాదవ యువకులు అర్జునుడిని ప్రేమాభిమానాలతో స్వాగతించారు. అర్జునుడు వారిని ఆదరంతో కౌగలించుకుని, వారి క్షేమసమాచారాలను కనుక్కొన్నాడు. తరువాత అర్జునుడు ఆనందమయమైన కృష్ణమందిరం చేరుకున్నాడు. రత్నమణిమయ భూషితమైన శ్రీకృష్ణ మందిరాన్ని చూసిన అర్జునుడు ఆనందించి, అక్కడ శ్రీకృష్ణుడితో కొంత కాలం నివసించాడు.

రైవత పర్వత ఆరాధన

[మార్చు]

పర్వతారాధన అనేది యాదవులలో సాధారణ మతపరమైన సంఘటన. వారు శూరసేన సామ్రాజ్యంలో ఉన్న సమయాన గోవర్ధనగిరిని పూజించిన విషయం భాగవతంలో వివరించబడింది. కొద్దిరోజుల అనంతరం భోజక, అంధక, వృష్టి వంశస్థులు మహోత్సవ సందర్భంగా రైవత పర్వతానికి ఒకటిగా చేరారు. రైవతక పర్వతం బహుసుందరంగా అలంకరించబడింది. తాత్కాలిక విడుదులు ముదురువర్ణాలు దిద్దబడి మణిమయములతో కృత్రిమ వృక్షాలతో అలంకరించబడింది. వాద్యకారులు వాద్యములను మీట సాగారు, గాయకులు గీతాలాపన చేయసాగారు, నృత్యకారులు నృత్యములు చేయసాగారు. వృష్టివంశ యువకులు చక్కగా అలంకరించుకున్నారు. అన్ని ఆభరణాలను అలంకరించుకుని సుందరంగా కనిపించారు. వారి బంగారు రథములను అధిరోహించి రావడం చూడడానికి ఆకర్షణీయంగా ఉంది. వేలాది పౌరులు తమ రథముల మీద కాలినడకన సకుటుంబ బంధుమిత్ర సహితంగా వచ్చారు. (1,222). అర్జునుడు తిరిగి ద్వారక చేరుకున్నాడు. సుభద్ర అర్జునుడిని వివాహమాడింది. అర్జునుడు అక్కడ కొంతకాలం ఉండి, బయలుదేరి పుష్కర్ క్షేత్రంలో కొంతకాలం ఉండి హస్తినకు చేరాడు.

రైవతపర్వతము మీద జరిగిన మరొక ఉత్సవం (14,59).

మణిమయఖచితమైన కోశములతో కప్పబడిన అనేక వస్తువులతో రైవతపర్వతం అలంకరించబడింది. అలంకరించబడిన బంగారు దీపస్తంభాలతో రైవతపర్వతం పగలు రేయి వ్యత్యాసం లేకుండా వెలిగి పోయింది. గుహలు, జలయంత్రాల (ఫౌంటెన్) శోభతో రైవతకం వెలిగి పోయింది. అన్ని వైపులా ఎగురవేయబడిన ధ్వజములకు కట్టబడిన చిరుగంటలు గాలికి నిరంతరం మ్రోగుతూ సంగీతంలా మధురంగా వీనుల విందు చేసాయి. పర్వతం మొత్తం స్త్రీ పురుషుల మాటలతో ప్రతిధ్వనించింది. అనేక దుకాణాలు చక్కగా అలంకరించబడి సుందరమైన వస్తుసముదాయములతో, వివిధ రకములైన ఆహార పదార్థములతో నిండి ఉన్నాయి. దుస్తులు, పూలమాలలు కొండలుగా పోయబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా వీణా, వేణు, మృదంగ నాదాలు మారు మ్రోగసాగాయి. ద్రాక్షరసంలో మిశ్రితమైన అనేక విధములైన అహారపదార్ధములు అక్కడక్కడా నిలువచేయబడి ఉన్నాయి. గ్రుడ్డి వారికి, అసహాయులకు, అశక్తులకు నిరంతరంగా బహుకరించబడ్డాయి. పర్వత శిఖరం మీద అనేక పవిత్రమైన నిర్మాణాలు నిర్మించబడ్డాయి.

అర్జునుడు సుభద్రను ఎత్తుకు పోవడం

[మార్చు]

రైవతక పర్వత ఉత్సములో అర్జునుడి మనసు శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్ర మీద లగ్నమైంది. కృష్ణుడు అర్జునుడికి సుభద్రను తీసుకువెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. అర్జునుడు సుభద్రను తీసుకు పోతుండగా యాదవ వీరులు ఆగ్రహించారు. అర్జునుడి చర్యకు ప్రతీకారంగా ద్వారక అప్రమత్తం చెయ్యబడింది. సుభద్రను అర్జునుడు తీసుకు వెళ్ళగానే సుభద్ర అంగరక్షకులు ఏడుస్తూ పరిగెత్తుకుని పోయి యాదవ ప్రముఖునికి తెలియజేసారు. యాదవ ప్రముఖుడు స్వర్ణ ఢమారం మ్రోగించి సైన్యాలను పిలిచాడు. సైన్యం నాలుగు వైపుల నుండి వచ్చి చేరారు. యాదవప్రముఖులు తింటున్న వారు తింటున్నట్లు, పానీయములు త్రాగుతున్నవారు త్రాగుతున్నట్లు అలా వారు చేస్తున్న పనులను ఆపివేసి అక్కడకు చేరారు. వృష్టి, భోజ, యాదవ వీరులందరూ సమావేశమై వారి స్థానాలలో కూర్చున్నారు. యాదవ ప్రముఖుడు ఎర్రబడిన నేత్రములతో సుభద్రను తీసుకుపోతున్న అర్జునుడిని అడ్డుకొనమని చెప్పాడు. యాదవ వీరులు రోషాకులిత నేత్రాలతో పైకి లేచి అర్జునుడి దుష్కృత్యాన్ని నిందిస్తూ కొందరు వారి స్వర్ణ ఖచిత రథములను సిద్ధం చేసుకున్నారు, కొందరు సారథులను పిలిచారు, కొందరు ఆయుధములను తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తున్నారు, కొందరు తమ బంగారు అంబులను, బలమైన కవచాలను తీసుకురమ్మని చెప్తున్నారు, కొందరు అసహనంగా గుర్రాలను లేపి, స్వర్ణాభరణ భూషితములైన ఆ అశ్వాలను రథములకు కట్టి వేస్తున్నారు, కొందరు వరి వారి రథకులను పిలుస్తున్నారు. (1,222) తరువాత అర్జునుడు ద్వారకకు తీసుకురాబడి సుభద్రతో వివాహం జరిపించారు. వారిరువురు బయలుదేరి పుష్కర్లో కొన్ని రోజులు ఉండి చివరకు హస్తినకు చేరుకున్నారు.

ద్వారక, రైవతకము మీద శిశుపాలుడి దండయాత్ర

[మార్చు]

శ్రుతశ్రవుడి పుత్రుడు వసుదేవుడి మేనల్లుడు శిశుపాలుడు. శిశుపాలుడు పాండవుల వలె శ్రీకృష్ణుడికి మేనత్త కుమారుడైనా, పాండవులకు శ్రీకృష్ణుడి మీద భక్తిపూర్వక ప్రేమాభిమానాలు ఉన్నాయి. కాని శిశుపాలుడికి కృష్ణుడి మీద శత్రుత్వం ఉండేది. శ్రీకృష్ణుడు తన సైన్యాలతో ప్రాగ్జ్యోతిషపురంలో ఉన్న సమయంలో శిశుపాలుడు ద్వారకను తగులబెట్టాడు. ఆ సమయంలో భోజకరాజు రైవతపర్వతం మీద ఉత్సాహంగా కాలం గడుపుతున్నాడు. శిశుపాలుడు ఆ రాజు మీద దండయాత్ర చేసి, అతడి అంగరక్షకులను చంపి, మిగిలిన వారిని గొలుసులతో బంధించి తన నగరానికి తీసుకు పోయాడు.

ద్వారక మీద సాళ్వుడి దండయాత్ర

[మార్చు]

ద్వారక మీద సాళ్వుడి దండయాత్ర పెద్ద వివాదాంశం అయింది. సాళ్వుడి దాడి సంశయం లేకుండా వాయుమార్గంలో జరిగిన దాడి. చరిత్రకారులు ఈ దాడిని నౌకాదళం శైలిలో జరిగిన వాయుమార్గ దాడిగా భావిస్తున్నారు. ఉదాహరణగా సాళ్వుడి ఎగిరే రథం అనే వాయువాహనం సౌవా వాస్తవానికి ఒక యుద్ధనౌక. వివరణలు: ద్వారకానగరం సముద్ర పరివేష్టితమైన ఒక ద్వీపమని భావించబడుతుంది. ఇంద్రప్రస్థంలో ధర్మరాజు చేసిన పవిత్ర రాజసూయ యాగం సందర్భంలో శిశుపాలుడు శ్రీకృష్ణుడి చేతిలో వధించబడిన కారణంగా శిశుపాలుని సోదరుడిగా భావిస్తున్న సాళ్వుడు ఆగ్రహంతో కాలిపోతూ ద్వారక మీద దండెత్తాడు. సాళ్వుడు విలువైన లోహంతో నిర్మించిన సౌవా (ఈ రథాన్ని సౌభ అని కూడా అంటారు. సౌభ పేరుతో ఒక నగరం కూడా ఉంది) రథంలో ద్వారకను చేరి వృష్టి వీరులను వధించి ద్వారకా నగరంలోని పూలతోటలను ధ్వంసం చేసాడు. అతడు అనర్తదేశీయులను (అనర్త ఒక గొప్పదేశం అని దానికి రాజధాని అని తెలుస్తుంది ) కృష్ణుడి గురించి అడిగాడు. సాళ్వుడు తన విలువైన లోహ రథంతో ఆకాశంలోకి ఎగిరాడు అని వర్ణించబడింది. ఆ వాహనం పేరు మతికగా పేర్కొనబడింది ఆ వాహనం మనసుతో తలచిన రీతిగా నడుస్తుందని వర్ణించబడింది. (3,14)

ద్వారక రక్షణ

[మార్చు]

సాళ్వుడు తన సైన్యాలను సిద్ధపరచి, ద్వారకానగర పైభాగాన నిలిచి ద్వారక సైన్యాలతో పోరాడసాగాడు. ఆ యుద్ధంలో వారు ద్వారక మీద నలువైపుల నుండి బాణవర్షం కురిపించారు. ఆ సమయంలో చక్కని రక్షణవలయంలో ఉంది. చక్కని ఆర్చీలు, బురుజులు, యుద్ధోత్సాహులైన వృష్టి వీరులు, భేరీలు, మృదంగాలు, శంఖాలు, యుద్ధానికి సిద్ధంగా రెండువైపులా చెక్కతో చేసిన గోడలను నిలిపిన వీధులు, అక్కడక్కడా ఏర్పాటు చేసిన ద్వారాలు, పుష్కలంగా సమకూర్చబడిన ఆహారపదార్థాలు, ఆయుధములను విసరడానికి ఉపయోగించబడే యంత్రాలు, పాత్రలు, తోలుతిత్తులు, కత్తులు, కటారులు, బల్లెములు, వేడి ద్రవాలు, మందు గుళ్ళు, పదునైన గొడ్డళ్ళు. పటిష్ఠమైన చక్కటి రథాలు సిద్ధంగా ఉన్నాయి. యాదవ వీరులు (గడ, సమ్వ, ఉద్ధవ) వారికి వారు అధికార స్థానాలలో నిలిచారు. సైన్యసమేతంగా యాదవ వీరులు యుద్ధసన్నద్ధులై నగరరక్షణ కొరకు నిలిచారు.

నగరవాసులను అప్రమత్తులను చేయుట

[మార్చు]

నిర్లక్ష్యాన్ని అడ్డగించడానికి ఉగ్రసేనుడు, ఉద్దవుడు నగరవాసులను మత్తుపానీయాలను సేవించరాదని నియమం విధించాడు. వృష్టి, అంధక వీరులకు తాము మత్తులో ఉంటే వధించబడతామని తెలుసు. రాజసేవకులు గాయకులను, నృత్యకారులను, మిగిలిన కళాకారులను నగరం నుండి పంపివేసారు. నదుల మీద ఉన్న వంతెనలను పడగొట్టారు. పడవలను నడపడం ఆపివేసారు. వాటిని కట్టి వేసారు. గుంటలను త్రవ్వి అక్కడక్కడా రంధ్రములను ఏర్పాటు చేసి సైనికులు అక్కడ రహస్యముగా నిలిచి నగర రక్షణ కర్తవ్యములో మునిగి పోయారు. సహజంగా పటిష్ఠమై చక్కని రక్షణ వలయములో ఉండే ద్వారకానగరం, ఇప్పుడు ఆయుధములతో సమృద్ధమై ఉంది. చక్కని వ్యూహముతో నగరం శత్రువును ఎదుర్కొనడానికి సిద్ధం అయింది.

పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

[మార్చు]

సాళ్వుడు ద్వారకలో ప్రవేశించగానే ద్వారకలో ప్రవేశించే వారుగాని ద్వారక నుండి వెలుపలికి వెళ్ళేవారుగాని లేక పోవడం గ్రహించాడు. వీధులన్నీ ఏనుగులతో, అశ్వములతో నిండి ఉన్నాయి. యుద్ధవీరులకు కావలసిన సదుపాయములు జీతభత్యములు ఇవ్వబడ్డాయి. వారికి అహారపదార్థాలు, ఆయుధములు, దుస్తులు ఇవ్వబడ్డాయి. సైన్యంలో స్వర్ణమును జీతంగా ఇవ్వబడని వారు లేరు, సైన్యంలో అలసిన వారు కాని, పిరికివారు కాని ఎవరూ లేరు. ఆహుకుని చక్కని నిర్వహణలో సైన్యము యుద్ధసన్నద్ధం అయి ఉంది.

సాళ్వుడి సైన్యము విడిది చేయుట

[మార్చు]

సౌభ రాజు సాళ్వుడు తన కాల్బలములను, అశ్వదళాలను, గజదళములను స్వయంగా నాయకత్వం వహిస్తూ తన చతురంగ బలములతో భూమార్గంలో పయనించి పుష్కలమైన నీరు ఉన్న మార్గాలలో పయనిస్తూ శ్మశానాలను, ఆలయములను, పవిత్రమైన వృక్షరాజాలను, చీమల పుట్టలు కలిగిన భూములను దాటుకుంటూ ద్వారకవైపు దండయాత్రకు వచ్చి విడిది చేసాడు. సాళ్వుడు అన్ని విధములైన ఆయుధములను, విస్తారమైన రథాలతో, కాల్బలములకు చక్కగాజీతభత్యములు సమకూర్చి చక్కగా ఆహారాలను అందించి, చక్కగా పోషించబడిన యుద్ధోత్సాహంతో అలంకరించిన రథములలోసిద్ధంగా ఉన్నారు.

ద్వారక వెలుపలి యుద్ధం

[మార్చు]

చారుధేష్ణుడు, సాంభ ప్రద్యుమ్నుడు మొదలైన రాజకుమారులు యుద్ధోత్సాహంతో సాళ్వుడిని ఎదుర్కొన్నారు. ధ్వజములతో ఎగురుతున్న రథములతో ఆయుధములను నింపుకుని సాళ్వుడిని ఎదుర్కొనడానికి నిశ్చయించుకుని రాజకుమారులు బయలు దేరి సాళ్వుడి సైన్యశిబిరాలను చేరుకున్నారు. సాంభుడు సాళ్వుడి సైన్యాధ్యక్షుడైన క్షేమనర్తిని తరిమికొట్టి వేఘవంతుడిని వధించాడు. చారుధేష్ణుడు వివిధాన్యుడిని వధించాడు. సాళ్వుడు ప్రద్యుమ్నుడిని ముందు ఓడించాడు. సారథి ప్రద్యుమ్నుడిని అక్కడ నుండి తీసుకు పోయి ప్రద్యుమ్నుడు కోలుకున్న తరువాత తిరిగి సాళ్వుడిని ఎదుర్కొనడానికి తీసుకువచ్చాడు. ప్రద్యుమ్నుడు సాళ్వుడిని ఓడించి తరిమి కొట్టాడు. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థము నుండి ద్వారకలో ప్రవేశించగానే ఎక్కడా వేదధ్వనులు, యజ్ఞయాగములు లేకపోవడం చూసి ధ్వంసం చేయబడిన పూలతోటలు చూసాడు. ద్వారకానగరం శోభావిహీనంగా కనిపించింది. నగరమంతా విరిగిన ఆయుధములు అక్కడ యుద్ధం జరిగిన విషయం సూచిస్తుంది. (3-16,17, 181, 191, 20 ).

సాళ్వుడితో శ్రీకృష్ణుడి యుద్ధం

[మార్చు]

శ్రీకృష్ణుడు రథ, గజ, తురంగ, కాల్బల సహితమైన సైన్యములను తీసుకు వెళ్ళి అనేక దేశములను దాటి, వృక్షసముదాయముల సహితమైన పర్వతములను దాటి, నీటి మడుగులను, సెలయేళ్ళను దాటి చివరకు మృతికావర్తమును (మృత్తిక) చేరాడు. శ్రీకృష్ణుడికి సాళ్వుడు తన విలువైన లోహములతో చేయబడిన రథముతో సముద్రపు ఒడ్డున నిలిచి ఉన్నాడని తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుడు సైన్యములతో అక్కడకు చేరుకున్నాడు. సాళ్వుడు అపారంగా బాణవర్షాన్ని కురిపించాడు. శ్రీకృష్ణుడు వాటిని లెక్కచేయకుండా సాళ్వుడిని ఎదుర్కొన్నాడు. కృష్ణుడు వేసే బాణాలు సాళ్వుడిని చేర లేదు. రెండు యోజనముల దూరంలో సాళ్వుడి జాడ కూడా కనిపించక పోవడంతో శ్రీకృష్ణుడి సైన్యాలు కేవలం ప్రేక్షకపాత్ర వహించాయి. కృష్ణుడు వేసిన బాణాలు సాళ్వుడి రథాన్ని రక్షిస్తున్న దానవుల శరీరాలను చీల్చిన కారణంగా వారు శరాఘాతాలకు గాయపడి సముద్రంలో మునిగిపోయారు. దానవులు వారి ఆయుధాలను కోల్పోయి కవచములు చీలి పెద్దగా రోదిస్తూ సముద్రంలో పడగానే సముద్రంలోని మృగాలు వారిని మింగసాగాయి. అది చూసిన సాళ్వుడు మాయా యుద్ధం మొదలు పెట్టాడు. సాళ్వుడు కృష్ణుడి మీద అనేక క్రూర ఆయుధములను వేశాడు. శ్రీకృష్ణుడు వాటిని లక్ష్యపెట్టక యుద్ధాన్ని కొనసాగించాడు. యుద్ధం ఘోరరూపు తాల్చింది. చివరకు సాళ్వుడు కొండశిఖరాన నిలిచి శ్రీకృష్ణుడితో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. అప్పుడు అక్కడ హఠాత్తుగా చీకట్లు, వెలుగులు నిరంతరం మారి మారి కమ్ముకున్నాయి. పగలు కొంతసేపు ప్రకాశవంతంగాను, కొంతసేపు మబ్బు కమ్ముకున్నట్లుగాను, కొంత సమయం వేడిగాను, కొంతసమయం అత్యంత చలిగాను మారి మారి ఉండసాగింది. తరువాత నిప్పులు వర్షంగా రాలసాగాయి, తరువాత బూడిద వర్షంగా రాలసాగింది, తరువాత అయుధ వర్షము సాగింది. ఆకాశము కప్పు చీల్చుకుని నూరు సూర్యులు వచ్చినట్లు నూరు చంద్రులు వచ్చినట్లు పదివేల తారకలు వెలిగినట్లు ప్రకాశించ సాగింది. పగలేదో రాత్రి ఏదో గుర్తించ శక్యము కాలేదు. ఆ ప్రదేశం అంతా వింత పరిస్థితిలో మునిగి పోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రజ్ఞాస్త్రం సంధించి ప్రయోగించాడు.

సాళ్వుడు చేసిన మాయ

[మార్చు]

శ్రీకృష్ణుడి సేవకుని రూపంలో ఒక సేవకుడు కృష్ణుడిని సమీపించి తాను ద్వారక నుండి వచ్చానని ఆహుకుడు సందేశం పంపాడని చెప్పాడు. దిగులుగా దుఃఖిస్తూ " దేవా ! అహుకుడు ఇలా చెప్పాడు " కృష్ణా ! నీవు లేని సమయం చూసి సాళ్వుడు కొంత సైన్యంతో ద్వారకకు వచ్చి మీ తండ్రి గారైన వసుదేవుడిని సంహరించాడు. ఇక యుద్ధంతో పని లేదు కనుక నువ్వు యుద్ధం ఆపి ద్వారకను రక్షించే బాధ్యతను స్వీకరించు " అని చెప్పాడు. ఈ అబద్ధపు సమాచారమునకు కొంతసేపు విస్మయం చెందినా, కొంతసేపటికి కోలుకొని, అది రాక్షస మాయ అని గ్రహించి, యుద్ధాన్ని కొనసాగించాడు.

శ్రీకృష్ణుడు సాళ్వుడిని సంహరించుట

[మార్చు]

ఈ అఖరి యుద్ధం సముద్రమధ్యమందు ఉన్న ద్వీపాలలో జరిగినట్లు ఉంది. సౌభానగరం ద్వీపంలో ఉన్నట్లు ఉంది. సాళ్వుడి సైన్యాలు శ్రీకృష్ణుడి మీద బండరాళ్ళను దొర్లించినట్లు వర్ణించబడింది. శ్రీకృష్ణుడు వాటిని శక్తివంతమైన అస్త్రశస్త్రములతో ఎదుర్కొన్నాడు. సాళ్వుడి రథము చూపుల నుండి తొలగి పోయింది. శ్రీకృష్ణుడు సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు. చివరగా సాళ్వుడు గదాయుధాన్ని ప్రయోగించాడు. సుదర్శన చక్రం సాళ్వుడిని చీల్చింది. తుట్టతుదకు మహావీరుడైన సాళ్వుడు వధించబడ్డాడు. దానవస్త్రీలు భయముతో హా హా కారాలు చేస్తూ నలుదిశలా పారిపోయారు. శ్రీకృష్ణుడు తన రథమును సౌభానగరం ముందు ఉంచి పాంచజన్యమును పూరించి విజయధ్వానం చేసాడు. మిగిలిన సైన్యాలను సమూలంగా నాశనం చేసి సౌభానగరంలో ప్రవేశించి మేరుపర్వతం వంటి ఆ నగరాన్ని ధ్వంసం చేసి తగులబెట్టాడు. దానవులు భయంతో నగరం విడిచి పారిపోయారు. సాళ్వుని వధించి సౌభానగరాన్ని ధ్వంసం చేసి శ్రీకృష్ణుడు సైన్యాలతో విజయోత్సాహంతో అనర్తకు చేరాడు. (3,22)

చాలా మంది చరిత్రకారులు శ్రీకృష్ణుడితో సముద్రం మీద లేక ఆకాశంలో నుండి యుద్ధం చేసిన వీరుడు మృత్తికావర్తం (మట్టి లేక ఇసుకతో పర్యవేష్టితమైన నగరం) నగరానికి చెందిన సాళ్వుడు కాదు అని అభిప్రాయపడుతున్నారు. మటిక, మర్తిక, మృత్రికావతి మొదలైన పేర్లతో పిలువబడిన సాళ్వుడి రాజధాని అయిన మృత్తికావర్త నగరం రాజస్థాన్‌లో ఉందని అది మద్రదేశానికి నైరృతి లోనూ విరాటుడు పాలించే మత్సదేశానికి పశ్చిమంగానూ ఉందని భావించబడుతుంది. శిశుపాలుడి మరణానికి ప్రతీకారం సాధించడానికి సాళ్వుడు ద్వారక మీద దండెత్తి ప్రద్యుమ్నాదులను ఎదుర్కొన్నాడు. సముద్రం మీద యుద్ధం చేసిన శత్రువు సాళ్వుడిచేత ప్రేరేపించబడిన మరియొకడై ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. శ్రీకృష్ణుడు మృత్తికావర్త నగరానికి చేరుకున్నప్పుడు అక్కడ తెలుసుకున్న సమాచారాన్ని అనుసరించి తిరిగి సముద్రాన్ని చేరుకుని అక్కడ యుద్ధము చేసి శత్రుసంహారం చేసాడని ఆ శత్రువు సముద్రము మీద నివసించే దానవుడని, అసురులు వేరొక సంస్కృతికి చెందినవారై ఉంటారని భావించబడుతుంది. వారు ద్వారకను అరేబియా ఖండం సమీపంలోని ద్వీపం నుండి వచ్చి ఉంటారని సాళ్వుడు అన్న పేరు కువైతుకు సంబంధించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ద్వారక మీద పాండ్యుల పగ

[మార్చు]

పాండ్యుల రాజు సారంగధ్వజుడు. వాసుదేవ కృష్ణుడు వారి దేశం మీద దండెత్తినప్పుడు అతడి బంధువులందరూ పారిపోయారు. ఆయన తండ్రి ఒక యుద్ధములో కృష్ణుడి చేత చంపబడ్డాడు. భీష్ముడు, ద్రోణుడు, భార్గవరాముడు, కృపాచార్యుడు మొదలైన వారి వద్ద నుండి పొందిన ఆయుధాల కారణంగా అతడు అయుధసంపత్తిలో రుక్మి, కర్ణుడు, అర్జునుడు, కృష్ణుడు మొదలైన వారికి సమానుడయ్యాడు. ఆ కారణంగా అతడు ద్వారకను జయించి మిగిలిన ప్రపంచాన్ని జయించాలని అనుకున్నాడు. ఆయన హితైషులు అతడి హితము కోరి అతడిని అలాంటి ఆలోచనలు వినాశకరమైనవని చెప్పి అతడి మనసు మార్చారు. ఆయన మనసు మార్చుకుని తనరాజ్యాన్ని పాలించాడు. (7,23) తరువాతి కాలంలో ఆయన కురుక్షేత్రయుద్ధంలో పాండవ సేనలకు సహకరించి యుద్ధం చేసాడు.

ద్వారక సముద్రంలో మునుగుట

[మార్చు]

ద్వారకానగరం మునిగి పోవడం గురించిన వర్ణన మహాభారతంలోని 16వ పర్వమైన మౌసల పర్వములో వర్ణించబడింది. (మౌసల పర్వము)

రోజురోజుకు బలవత్తరమైన గాలులు వీచసాగాయి. కుండలు మృణ్మయ పాత్రలు అకారణంగా పగలసాగాయి. చంద్రుని చుట్టూ ఒక వలయం వంటి ప్రకాశం ఏర్పడింది. చతుర్ధశిలో గ్రహణం ఏర్పడింది. మహాభారత యుద్ధ సమయంలో కూడా గ్రహణం ఏర్పడినట్లు ఊహించబడుతుంది. కురుక్షేత్ర యుద్ధం జరిగి 36వ సంవత్సరం ఆరంభమయింది. ఈ సూచనలను గ్రహించిన శ్రీకృష్ణుడు యాదవులను సమావేశపరచి అందరిని పవిత్ర సముద్రస్నానం చేయడానికి వెళ్ళమని ఆదేశించాడు. యాదవులందరూ సకుంటుంబంగా ప్రభాసతీర్ధానికి వెళ్ళి అక్కడ తాత్కాలిక నివాసాలను ఏర్పరచుకున్నారు. విస్తారమైన ఆహారపదార్థాలు మత్తు పానీయాలను తీసుకు వెళ్ళారు. బ్రాహ్మణ సంతర్పణకొరకు తయారు చేసిన అహారాన్ని కోతులకు పెట్టారు. యాదవ వీరులు మత్తుపానీయాలను త్రాగి మత్తెక్కి ఉన్నారు. అప్పుడు సాత్యకి, కృతవర్మ మధ్య కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన పొరపాట్ల గురించిన ఒక వివాదం తలెత్తి అది తీవ్రమై పగ చెలరేగింది. ఆ వివాదంలో ఒకరిని ఒకరు చంపుకుని చివరకు యాదవులు నిశ్శేషమైనారు. కృష్ణుడి ఆదేశానుసారం ద్వారకకు వచ్చిన అర్జునుడు అక్కడి ప్రముఖులకు "ద్వారక ఇక ఏడు రోజులలో మునిగి పోతుంది" అని చెప్పాడు. తరువాత శ్రీకృష్ణుడి మనుమడైన వజృడు ఇంద్రప్రస్థానికి రాజయ్యాడు. అర్జునుడు ద్వారకకు వెళ్ళి యాదవులకు శ్రీకృష్ణ బలరాములతో సహా అంత్యక్రియలు నిర్వహింపజేసి, ద్వారకావాసులను నగరాన్ని ఖాళీ చేయించి వారి సంపదలను వాహనములకు ఎక్కించి ద్వారకను దాటి వెనుదిరిగి చూసే సమయానికి మెల్ల మెల్లగా ద్వారక నీట మునగడం స్వయంగా ద్వారకావాసులతో సహా దర్శించాడు. ద్వారకా వాసులు హాహాకారాలు చేసి తరువాత హస్తినకు బయలుదేరారు. (16.7)

పాండవులు మహాప్రస్థాన సమయంలో మునిగి పోయిన ద్వారక ఉన్న ప్రదేశాన్ని దర్శించారు.

సమీపకాల పురావస్తుపరిశీలన

[మార్చు]

ద్వారకానగర పరిశోధనలు నిర్మాణ పరమైన విషయాలను వెలికితీయడమే కాక, సంస్కృతి గురించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రాముఖ్యత ఇచ్చింది. అక్కడ లభించిన మృణ్మయ పాత్రల వయసును అనుసరించి మిగిలిన విషయాల కాలనిర్ణయం చేయడానికి ఉపకరిస్తుంది. బెట్ ద్వారకలోని మృణ్మయ పాత్రలు క్రీ పూ 3,500 సంవత్సరాలనాటివని నిర్ణయించబడింది. భవిష్యత్తులో జరగబోయే పరిశోధనలు పురాతన భారతదేశం లోని ఇతర నగరాల గురించిన విషయాలను వెలుగులోకి తీసుకురావచ్చు. వరదలలో మునిగిపోయిన ఇంద్రప్రస్థము, పాటలీపుత్రము వంటి నగరాల గురించిన విశేషాలు కూడా వాటిలో కొన్ని. అర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఇది ప్రస్తుతం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ పేరుతో గోవాలో ఉంది) పేరుతో ఎస్ అర్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన అనేక పరిశోధనలు ఈ విషయాలను వెలుగులోకి తీసుకు వచ్చాయి.

కథల్లోను, కావ్యాల్లోను నిజమైన ప్రదేశాల పేర్లను పేర్కొనడం ఎక్కువమంది రచయితల్లో కనిపించే లక్షణం. రచయిత చనిపోయిన లక్షల సంవత్సరాల తర్వాత త్రవ్వకాల్లో బయల్పడిన ఆ రచయిత వ్రాతల ప్రకారం పరిశొధిస్తే ఆప్రదేశాలు అలాగే ఉంటాయని, తరువాత ఎవరైనా ఆ వ్రాతలు చదివినప్పుడు అందులోని కథ నిజంగా జరిగినట్లు అనిపిస్తుందని అభిరాయమున్నది. [ఆధారం చూపాలి] క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల వరకూ ఆర్యుల భాష అయిన సంస్కృత భాష భారతదేశంలో లేదని, మహాభారత కావ్యం వేద కాలం తర్వాత, అనగా సుమారు క్రీస్తు పూర్వం 800 - క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల మధ్య ఆర్యుల తెగకు చెందిన వేదవ్యాసుడు అను కవి రచించిన కావ్యము అని, మహా భారతములోని సన్నివేశాలు కల్పితాలు అని, హిందువులకు తమ మతముపై యున్న గట్టి విశ్వాసాలే కల్పిత కావ్యాన్ని చరిత్రగా చేశాయని పరిశోధకుల భావన. గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల ద్వారకా నగరం వద్ద అరేబియన్ సముద్ర తీర గర్భంలో బయల్పడిన ఓడ రేవు క్రీస్తుపూర్వం 3000 సంవత్సారాలనాటిదని, అది సింధూ (హరప్పా) నాగరికతకు చెందినది అని, ఆ కాలంలో భాషకు లిపి లేదని పరిశోధనలు తెలుపుతున్నాయి [1] శ్రీకృష్ణ భగవానుడి ద్వారకా నగరం తెలియనివారుండరు కదా ? మహాభారతము, భాగవతము, స్కంద, హరివంశ పురణాము, వాయు పురాణములలో ద్వారకా క్షేత్రానికి సంబంధించిన ఎన్నో పురాణ గాథలు వున్నాయి .శ్రీకృష్ణ భగవానుడు…తన అవతారం చాలించే ముందు ఎక్కువ సమాయాన్ని ద్వారక క్షేత్రంలో గడిపాడట.జరాసంధుడు కాలయవనునితో కలసి మధురపై దాడికి దిగడంతో…, యాదవుల రక్షణ కోసం…ఆయన గుజరాత్ లోని సౌరాష్ర్టంలోని తీర ప్రాంతానికి వెళ్తాడు. ఈ సముద్ర తీరంలో ఒక కోటను నిర్మించాడు. కృష్ణపరమాత్మ అవతారామ్ చాలించినప్పుడే ద్వారకా కూడాసముద్రం గర్భంలో మునిగిపోయిందట.ద్వాపర యుగ అవశేషాలు ఇంకా త్రవ్వకాలలో బయటపడుతూనే ఉన్నాయి. మునిగిపోయిన ద్వారకా నగరం గురించి ఇంకా అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.ద్వారక లోని ముఖ్య మందిరాలలో “రణచోఢ్ రాయ్” (ద్వారకాధీశ్ మందిరమని) ప్రముఖమైనదిగా చెప్పబడుచున్నది .ద్వారకాధీశ్ మందిరానికి దక్షిణాన “త్రివిక్రమ” మందిరం, ఉత్తరాన “ప్రద్యుమ్న” మందిరం ఉన్నాయి. బేట్ ద్వారక, సుదామాపురి…., దీనిని ఇప్పుడు పోరుబందర్ అని పేరుతో పిలుస్తున్నారు. మహాప్రభు వల్లభాచార్యులు, శ్రీరామానుజులు ద్వారకా.[2][3]

ఇతర విషయాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

పరిశీలనలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Ancient shorelines of Gujarat, India, during the Indus civilization (Late Mid-Holocene): A study based on archaeological evidences, A. S. Gaur* and K. H. Vora, Marine Archaeology Centre, National Institute of Oceanography, Dona Paula, Goa 403 004, India
  2. Archaeology of Dwaraka land, by Sundaresh and A.S Gaur, Marine Archeology Center, National Institute of Oceanography, Goa 403004.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-11. Retrieved 2016-05-09. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)