పెదరాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదరాయుడు
దర్శకత్వంరవిరాజా పినిశెట్టి
రచనకె. ఎస్. రవికుమార్ (కథ)
జి. సత్యమూర్తి (మాటలు)
రవిరాజా పినిశెట్టి (చిత్రానువాదం)
నిర్మాతమోహన్ బాబు
తారాగణంమోహన్ బాబు ,
సౌందర్య ,
రజనీకాంత్
ఛాయాగ్రహణంకె. ఎస్. ప్రకాశరావు[1]
కూర్పుగౌతంరాజు
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1995 జూన్ 15 (1995-06-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

పెదరాయుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో 1995లో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా.[2] ఇందులో మోహన్ బాబు, సౌందర్య, భానుప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది నాట్టమై అనే విజయవంతమైన తమిళ సినిమాకు పునర్నిర్మాణం. ఇందులో రజనీకాంత్ పాపారాయుడిగా ఒక అతిథి పాత్రలో నటించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు ప్రజాదరణ పొందాయి.[3]

కథ[మార్చు]

పెదరాయుడు (మోహన్ బాబు) గ్రామ పెద్ద. క్రమశిక్షణ కలిగిన జీవితం గడుపుతుంటాడు. తన వంశపారంపర్యంగా వచ్చిన ఆసనం మీద కూర్చుని గ్రామంలో ఏదైనా సమస్యలు ఎదురైతే ధర్మాన్ని అనుసరించి తీర్పులు ఇవ్వడంలో నేర్పరి. అతని భార్య లక్ష్మి (భానుప్రియ) తన భర్తను ఎంతో గౌరవిస్తుంటుంది. అతని తమ్ముళ్ళు రాజా (మోహన్ బాబు), రవీంద్ర (రాజా రవీంద్ర) లకు కూడా తమ అన్నయ్య అంటే భక్తి ప్రపత్తులతో ఉంటారు. వారిని తన స్వంత బిడ్డల్లా చూసుకుంటుంటాడు పెదరాయుడు. రాజా ఓ పారిశ్రామికవేత్త (సత్యనారాయణ) కూతురైన భారతి (సౌందర్య) ను వివాహం చేసుకుంటాడు. భారతికి తన భర్త అన్నకు అణిగి మణిగి ఉండటం నచ్చదు. అలాగే పెదరాయుడంటే లెక్కచేయకుండా ఉంటదు. కొన్ని సంఘటనల కారణంగా అతని గొప్పతనాన్ని తెలుసుకుని గౌరవించడం మొదలు పెడుతుంది. రవీంద్ర తన మామయ్య భూపతి కూతురుని ప్రేమిస్తాడు.

గతంలో పెదరాయుడి తండ్రియైన పాపారాయుడు, భూపతి తన సేవకుడి కూతురును మానభంగం చేస్తే తన చెల్లెలు కొడుకు అని కూడా చూడకుండా ఆమెతో బలవంతంగా పెళ్ళి చేసిఉంటాడు. భూపతి తండ్రి తన కుమారుడికి జరిగిన అవమానం తట్టుకోలేక పాపారాయుడిని తుపాకీతో కాలుస్తాడు. పాపారాయుడు భూపతి కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేస్తున్నాననీ, ఆ కుటుంబంతో ఎవరు సంబంధం పెట్టుకున్నా వారికి కూడా అదే శిక్ష పడుతుందని తుది తీర్పు చెబుతాడు. తన తర్వాత గ్రామ పెద్దగా తన పెద్ద కొడుకు పెదరాయుడికి అప్పగించి మరణిస్తాడు. అప్పటి నుంచీ భూపతి పెదరాయుడి కుటుంబంపై కక్ష పెంచుకుంటాడు.

భూపతి తనకు అనుకూలమైన ఒక పంతులమ్మని గ్రామానికి రప్పించి ఆమె తండ్రిని తన గుప్పిట్లో పెట్టుకుని, అతనికి ఏమీ కాకుండా ఉండాలంటే ఆమె రాజాను లొంగదీసుకోమని చెబుతాడు. తర్వాత భూపతి ఆమెను చంపి ఆ నేరాన్ని రాజా మేద వేస్తాడు. పెదరాయుడు తన కొడుకు, కోడలికి 10 సంవత్సరాలు గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. తన కూతురు రవీంద్రను ప్రేమిస్తున్నదన్న నిజం తెలుసుకున్న భూపతి అతన్ని చంపాలని చూస్తాడు. రాజా అతన్ని కాపాడతాడు. అప్పుడే గర్భవతిగా ఉన్న భారతి ఆ విషయం చెప్పడానికి పెదరాయుడి దగ్గరకు వెళుతుంది. రాజా భూపతి మీద పగ తీర్చుకోవాలని బయలు దేరతాడు. కానీ భూపతి తల్లే కుమారుణ్ణి చంపి పెదరాయుడి దగ్గరకు వెళ్ళి అసలు నిజాన్ని వెల్లడిస్తుంది. పంతులమ్మను చంపింది రాజా కాదనీ, భూపతే ఆ నేరం చేసి రాజాని అందులో ఇరికించాడని చెబుతుంది. తన తీర్పు తప్పు అయినందుకు చింతిస్తూ పెదరాయుడు మరణిస్తాడు. అప్పుడే భారతి ఒక మగశిశువుకు జన్మనిస్తుంది. రాజా తన అన్న స్థానంలో గ్రామ పెద్ద అవుతాడు.

తారాగణం[మార్చు]

నిర్మాణం[మార్చు]

1994 లో శరత్ కుమార్ కథానాయకుడిగా తమిళంలో వచ్చిన నట్టమై మంచి విజయాన్ని సాధించింది. రజనీకాంత్ ఈ సినిమాను చూసి మోహన్ బాబుకు ఫోన్ చేసి ఈ చిత్రాన్ని చూడమన్నాడు. ఈ కథను తెలుగులో తెరకెక్కిస్తే మంచి విజయాన్ని సాధిస్తుందని తన అభిప్రాయాన్ని చెప్పాడు. మోహన్ బాబు వెంటనే ఆ చిత్రానికి హక్కులు కొనుగోలు చేశాడు. అంతకు మునుపు మోహన్ బాబు, రవిరాజా పినిశెట్టి కాంబినేషన్ లో ఎం. ధర్మరాజు ఎం. ఎ అనే చిత్రం వచ్చిఉంది. ఆ అనుభవంతో ఈ కథను రవిరాజా పినిశెట్టి అయితే బాగా తెరకెక్కించగలడని మోహన్ బాబు ఆయనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు.

ఈ కథలో పెదరాయుడి తండ్రి పాపారాయుడి పాత్ర నిడివి తక్కువైనా కీలకమైనది. కథకు ఆయువుపట్టు లాంటిది. మోహన్ బాబు కాపీహక్కులు కొనుగోలు చేయగానే రజనీకాంత్ తాను ఆ పాత్ర చేస్తానని తెలిపాడు. నిడివి తక్కువైందని మోహన్ బాబు సందేహించినా రజనీ పట్టు పట్టాడు. ఈ పాత్రకు రజనీకాంత్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదు.

ఫలితం[మార్చు]

ఈ చిత్రం 25 వారాలు విజయవంతంగా ఆడింది. ఈ సినిమా 200 రోజుల కార్యక్రమానికి ఎన్. టి. ఆర్ అతిథిగా విచ్చేశాడు.

పాటలు[మార్చు]

సం.పాటగాయకులుపాట నిడివి
1."ఢమ ఢమ గుండె ఢమరుకం"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం చిత్ర 
2."కూ అన్నదోయి"కె. ఎస్. చిత్ర ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం 
3."కదిలే కాలమా"కె. జె. ఏసుదాసు చిత్ర 
4."అబ్బ దీని సోకు"ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర 
5."బావవి నువ్వు"ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర 

మూలాలు[మార్చు]

  1. "Peda Rayudu on Moviebuff.com". moviebuff.com. Retrieved 19 March 2018.
  2. "'పెదరాయుడు' గురించి ఈ విశేషాలు తెలుసా?". www.eenadu.net. Retrieved 2020-06-15.
  3. Filmfare Awards. Web.archive.org (9 November 1999). Retrieved on 3 February 2013.