Jump to content

ప్రేమించి చూడు (1965 సినిమా)

వికీపీడియా నుండి
ప్రేమించిచూడు
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.పుల్లయ్య
నిర్మాణం వి.వెంకటేశ్వర్లు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జగ్గయ్య,
రాజశ్రీ,
కాంచన,
రేలంగి వెంకట్రామయ్య,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
శాంతకుమారి,
చలం
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల
నిర్మాణ సంస్థ పద్మశ్రీ పిక్చర్స్
భాష తెలుగు

ఇది ఒక పూర్తి హాస్య రస చిత్రం. ప్రముఖ దర్శకుడు శ్రీధర్ తమిళంలో నిర్మించిన "కాదలిక్క నేరమిల్లై (காதலிக்க நேரமில்லை)" చిత్రం దీనికి మాతృక. సరదాగా, హాయిగా సాగిపోయే సినిమా. ఆ తర్వాత దీనిని హిందీలోకి "ప్యార్ కియే జా" పేరుతో పునర్నించారు. ఇందులో కిషోర్ కుమార్, మెహమూద్ మొదలైనవారు నటించారు.

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: పి.పుల్లయ్య
  • కథ: శ్రీధర్
  • మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ
  • పాటలు: ఆత్రేయ, దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి, ముళ్ళపూడి వెంకటరమణ
  • సంగీతం: మాస్టర్ వేణు
  • నేపథ్య గాయకులు: పి.బి.శ్రీనివాస్, సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎల్.ఆర్.ఈశ్వరి, బసవేశ్వర్, ఎం.ఎస్.రాజు

నటీనటులు

[మార్చు]
  • అక్కినేని నాగేశ్వరరావు
  • రాజశ్రీ
  • కాంచన
  • జగ్గయ్య
  • రేలంగి[1]
  • గుమ్మడి
  • శాంతకుమారి
  • చలం
  • గిరిజ
  • అల్లు రామలింగయ్య
  • రావి కొండలరావు

చిత్రకథ

[మార్చు]

బుచ్చబ్బాయి (రేలంగి) ధనవంతుడు. ఎస్టేట్ ఓనర్ అతనికి ఇద్దరు కుమార్తెలు (కాంచన, రాజశ్రీ), కమారుడు (చలం). అతనికి కూతుర్లంటే ప్రాణం. ఇద్దరూ కాలేజిలో చదువుతూ ఉంటారు. పెద్దకుమార్తె ఆ కాలేజిలో చుదువుతున్న వాసు (జగ్గయ్య) ని ప్రేమిస్తుంది. శలవులకు అప్పచెల్లెళ్లు ఇంటికి బయలుదేరడంతో సినిమా ప్రారంభమవుతుంది. బుచ్చబ్బాయి దగ్గర అసిస్టెంట్ మానేజర్ రంగారావు. ఒక సాధారణ బడిపంతులు (రావి కొండలరావు) కుమారుడు. రంగ స్నేహితుడు బుచ్చబ్బాయి పెద్ద కూతురును ప్రేమించిన వాసు. రంగాకి అతను ఫైనాన్సియర్. అతని తండ్రి ఓ కోటీశ్వరుడు (గమ్మడి). తల్లి (శాంతకుమారి). రంగ ఒక డకోటా వంటి కారు కొని తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు, షికారుగా ఊరిచివరకు వచ్చిన బుచ్చబ్బాయి కుమార్తెలను రంగా ఆట పట్టిస్తాడు. కూతుర్ల మాట మీద రంగాను పనిలోంచి తీసేస్తాడు బుచ్చబ్బాయి. బుచ్చబ్బాయి పని కావాలోయ్ అని ఆందోళన మొదలు పెడతాడు రంగా. రంగా వీరంగాన్ని అడ్డుకునే ప్రయత్నంలో బాల్కనీ నుంచి బాల్చీలతో నీళ్లు పోసే ప్రక్రియ చేపడతారు బుచ్చబ్బాయి, కుమార్తెలు. ఆ ప్రయత్నంలో రెండో కూతురు చేతినుండి బాల్చీ జారి రంగా మీద పడుతుంది.అతడిని పరామర్శిండానికి వచ్చి అతని ప్రేమలో పడుతుంది. తనకంటే డబ్బున్న వాడికి తప్ప కూతుర్లనిచ్చి పెళ్ళి చేయనంటాడు బుచ్చబ్బాయి. దానితో వాసుని పెద్దకారులో రమ్మనమని, వాసు చేత డబ్బున్న తండ్రి వేషం వేయిస్తాడు. వీళ్ల నటనకి బచ్చబ్బాయి పడిపోతాడు. తన కుమార్తెలలో ఒక కుమార్తెను రంగాకిచ్చి పెళ్ళి చేయాలనకుంటాడు. వాసుని ప్రేమించిన పెద్దకుమార్తె ఒప్పుకోదు. రెండో కుమార్తె తన అంగీకారం తెలుపుతుంది. కాస్త బెట్టు చూపి,ఒప్పుకుంటారు రంగా, మారు వేషంలో ఉన్న వాసు. ఊరి చివరకు తీసుకువెళ్లి కూతుర్లకు తమ కథ అంతా చెబుతారు వాసు, రంగా. రంగా బీద వాడైనా పెళ్ళి చేసుకోడానికి అభ్యంతరం లేదని చెబుతుంది బుచ్చబ్బాయి చిన్నమ్మాయి. ఇంతలో ఆ ప్రాంతంలో ఉన్న తోటని కొనడానికి వచ్చిన వాసు తండ్రి బుచ్చబ్బాయిని తన బాల్యమిత్రుడిగా గుర్తుపడతాడు. తన కుమారుడికి పెద్దకూతురిని ఇచ్చి పెళ్ళిచేయమని బుచ్చబ్బాయిని అడుగుతాడు వాసుతండ్రి. బుచ్చబ్బాయి పెద్దకూతురు ఒప్పుకోదు. వాసు పక్కకి తీసకువెళ్లి ఆ పెళ్ళి కుమారడు తనే నని చెబుతాడు. వివాహం నిశ్చయమవుతంది. రెండు వివాహాలు కలిపి చేయడానికి నిర్ణయమవుతుంది. తమఊరికి వచ్చి కారు ఇబ్బంది పెట్టడంతో రోడ్డు మీద ఉన్న వాసు తల్లి దండ్రులను తన ఇంటికి తీసుకు వెళతాడు. అక్కడ గోడ మీద రంగా ఫొటో చూసి బుచ్చబ్బాయికి హెచ్చరికగా ఫోన్ చేస్తాడు వాసు తండ్రి.బుచ్చబ్బాయి పోలీస్ కంప్లైట్ ఇస్తాడు. పోలీసులు వాసు రంగాలను అరెస్ట్ చేస్తారు. రంగా లాంటి మనిషి మరొకడని బుకాయిస్తారు వాసు, రంగా. బుచ్చబ్బాయి కేసు వాపసు తీసుకుంటాడుయ వివాహ ముహూర్తం సమీపించింది కాని వాసు జాడలేదని అతని తల్లి దండ్రులు గాభరాపడతారు. మారువేషంలో ఉన్న వాసు అందర్నీ ఏమార్చి తాళి కట్టి తమ నాటకాన్ని బయట పెడతాడు. కథ సుఖాంతం.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

సి.వి.శ్రీధర్ నిర్మాతగా, దర్శకునిగా తమిళంలో తీసిన కాదలిక్క నేరమిల్లె మంచి విజయాన్ని సాధించింది. దర్శకుడు, నిర్మాత పి.పుల్లయ్య దాన్ని తెలుగులో పునర్నిర్మించేందుకు హక్కులు కొన్నారు. హాస్యభరితమైన ఈ స్క్రిప్టుకు రచయితగా రమణే న్యాయం చేస్తారని రమణని రచయితగా పెట్టుకున్నారు. ముళ్ళపూడి వెంకటరమణ వేగంగా డైలాగు వెర్షన్ సహా అందించేశారు. దాంతోపాటుగా "బుచ్చబ్బాయ్ పనికావాలోయ్" పాట రాసియిచ్చారు.[2]

నటీనటుల ఎంపిక

[మార్చు]

దర్శక రచయితలు పుల్లయ్య, రమణ కలిసి తమిళ సినిమాను మరోసారి చూశారు. ఆ వెంటనే జరిగిన చర్చల్లో ప్రధానమైన ప్రేమజంటలకు అక్కినేని నాగేశ్వరరావు-రాజశ్రీ, కొంగర జగ్గయ్య-కాంచనలు బావుంటారని తేలింది. ప్రధానపాత్ర అయిన బుచ్చబ్బాయ్ పాత్రధారిగా రేలంగినీ, రేలంగి కొడుకుగా చలం, అతని జోడీగా గిరిజలను ఎంచుకున్నారు.[2]

చిత్రీకరణ

[మార్చు]

స్పందన

[మార్చు]

సినిమాలోని పాటలన్నీ మంచి ప్రాచుర్యం సాధించాయి, దాంతో సినిమా బాగా విజయవంతమైంది.[2]

పాటలు

[మార్చు]
  1. అది ఒక ఇదిలే అతనికి తగులే సరికొత్త సరసాలు సరదాలు , రచన : ఆత్రేయ ,పి.సుశీల, పి.బి. శ్రీనివాస్
  2. అందాలే తొంగిచూసే హాయిహాయి , రచన : సి నారాయణ రెడ్డి ,పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి, బసవేశ్వర్
  3. కళ కళలాడే కన్నులు తహ తహలాడే ఊహలు - రచన: ఆరుద్ర; ఎల్. ఆర్. ఈశ్వరి, ఎం. ఎస్. రాజు
  4. దొరికేరూ దొరగారు ఇక నన్ను విడలేరు దోచుకున్న వలపులు - పి.సుశీల, ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  5. ప్రేమించి చూడు పిల్లా పెళ్ళాడుదాము మళ్ళా వయసున్న ఇలా - ఘంటసాల - రచన: ఆత్రేయ
  6. మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడదా - రచన: ఆరుద్ర[3] ; - పి.బి. శ్రీనివాస్
  7. మేడమీద మేడ కట్టి కోట్లు కూడబెట్టినట్టి ... బుచ్బబ్బాయి పని కావాలోయి - పి.బి. శ్రీనివాస్ బృందం - రచన:ముళ్ళపూడి వెంకటరమణ
  8. వెన్నెల రేయీ ఎంతో చలిచలి వెచ్చనిదానా రావే నా చెలి , రచన : దాశరథి ,పి.బి.శ్రీనివాస్, పి.సుశీల

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
  2. 2.0 2.1 2.2 బి.వి.ఎస్.రామారావు (అక్టోబరు 2014). కొసరుకొమ్మచ్చి (3 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.
  3. ప్రేమించి చూడు, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2002, పేజీలు: 17-18.