బ్రిటిషు భారతదేశంలో వెట్టి చాకిరీ వ్యవస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతీయ వెట్టి చాకిరీ వ్యవస్థ బ్రిటిషు వారు 19 వ శతాబ్దంలో భారతదేశంలో ప్రవేశపెట్టిన నిర్బంధ కార్మిక వ్యవస్థ. ఒక పరిమిత కాలానికి చేసుకునే ఒప్పందం ప్రకారం కార్మికులు పనిచేస్తారు కాబట్టి దీన్ని ఒప్పంద కార్మిక వ్యవస్థ అనే వారు. ఒక పరిమిత కాలం పాటు సాగే బానిసత్వం లాంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో పదహారు లక్షలకు పైబడిన సంఖ్యలో భారతీయులను [1] శ్రామికులుగా వివిధ ఐరోపా వలస రాజ్యాలకు రవాణా చేశారు. బ్రిటిషు సామ్రాజ్యంలో 1833 లోను, [2] ఫ్రెంచ్ వలస దేశాల్లో 1848 లోను, డచ్ సామ్రాజ్యంలో 1863 లోనూ బానిసత్వాన్ని నిర్మూలించిన తర్వాత ఈ వ్యవస్థ విస్తరించింది. ఈ వెట్టి చాకిరీ వ్యవస్థ 1920ల వరకు కొనసాగింది. ఈనాడు కరిబియన్ దేశాలు, [3] నాటల్ (దక్షిణాఫ్రికా), తూర్పు ఆఫ్రికా, మారిషస్, శ్రీలంక, [4] మలేషియా, [5] మయన్మార్, ఫిజీ వంటి దేశాల్లో ప్రవాస భారతీయ సమాజం ఉందంటే దానికి మూలం ఈ కార్మిక వ్యవస్థే. ఇండో-కరిబియన్, ఇండో-ఆఫ్రికన్, ఇండో-ఫిజియన్, ఇండో-మలేషియన్, ఇండో-సింగపూర్ జనాభా పెరుగుదలకూ ఈ వ్యవస్థే దోహదం చేసింది.

ఈ వ్యవస్థలో ఒప్పందం కుదుర్చుకున్న కార్మికులను హీనంగా కూలీ అని పిలిచేవారు. వివిధ వలస దేశాల్లో వారి పని పరిస్థితులు అధ్వాన్నంగా ఉండేవి. వేతనాలు చాలా తక్కువగా ఉండేవి. ఒప్పందంలో నియమాలు ఉన్నప్పటికీ వాటిని పాటించేవారు కాదు. ఒప్పంద కాలపరిమితి తీరిపోయాక కూడా ఏదో విధంగా వాళ్లను వెనక్కి పోనీయకుండా నిర్బంధంగా అక్కడే ఉంచేలా యజమానులు కుటిల ప్రయత్నాలు చేసేవాళ్ళు.

భారతదేశంలో కార్మికుల నియామకాల్లో కూడా అనేక అక్రమాలు జరిగేవి. తమ పని ఏమిటో పని చెయ్యబోయేది ఎక్కడో వాళ్ళకు చెప్పేవారు కాదు. ఓడ ఎక్కేముందు రేవు లోను, ఓడలోనూ వాళ్ల నివాస పరిస్థితులు అమానవీయంగా ఉండేవి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు బ్రిటిషు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ అక్రమాలు కొనసాగాయి.

చివరికి దేశవ్యాప్తంగాను, బ్రిటన్ లోను, ఇతర దేశాల్లోనూ ప్రజల నుండి వచ్చిన ఒత్తిడి కారణంగా 1917 లో ఈ వెట్టి చాకిరీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసారు.

మొదటి వెట్టి ఒప్పందం[మార్చు]

భారతదేశం నుండి కొత్తగా ట్రినిడాడ్‌ వచ్చిన ఒప్పంద కార్మికులు
1834లో ఓడ నుండి మారిషస్ ద్వీపాన్ని చూస్తున్న మొదటి భారతీయ కార్మికులు - చిత్రం
కిద్దర్‌పూర్ లో వెట్టి స్మారకం
కిడ్డెరెపూర్ లో వెట్టి స్మారకం వద్ద ఫలకాలు,

1826 జనవరి 18 న, ఫ్రెంచి హిందూ మహాసముద్ర ద్వీపమైన రీయూనియన్ లో భారతీయ కార్మికులను తీసుకు రావడానికి అక్కడి ప్రభుత్వం కొన్ని నిబంధనలను నిర్దేశించింది. ప్రతి వ్యక్తి మేజిస్ట్రేట్ ముందు హాజరుకావాలని, తాను స్వచ్ఛందంగా వెళ్తున్నట్లు ప్రకటించాలనీ అన్నారు. ఈ ఒప్పందాన్ని గిర్మిట్ [6] అని పిలుస్తారు. ఎగ్రిమెంట్ (ఒప్పందం) అనే ఇంగ్లీషు మాటకు భ్రష్ట రూపమే ఈ గిర్మిట్. పాండిచ్చేరి, కారైక్కల్ నుండి కార్మికులను తెచ్చినట్లయితే, వారికి నెలకు 8 రూపాయలు (ఆ కాలంలో $4 కు సమానం), రేషన్లూ ఇస్తూ ఐదు సంవత్సరాల ఒప్పందం ఉండాలని అది వివరించింది.

1829లో మారిషస్‌లోకి భారతీయ కార్మికులను దిగుమతి చేసుకునే మొదటి ప్రయత్నం విఫలమైంది. అయితే 1838 నాటికి 25,000 మంది భారతీయ కార్మికులను మారిషస్‌కు తీసుకువెళ్ళారు.

భారతీయ వెట్టి చాకిరీ వ్యవస్థను తొలుత వలసరాజ్యాల భూభాగాలలో చెరుకు తోటల పెంపకందారుల విజ్ఞప్తి మేరకు ఏర్పరచారు. ఈ వ్యవస్థ బానిసత్వం మాదిరిగానే నమ్మకమైన చౌక కార్మికులను అందిస్తుందని ఆశించారు. [7] ఈ కొత్త వ్యవస్థ ద్వారా అందే "స్వేచ్ఛా" కార్మికులు, గతంలో ఉన్న బానిస కార్మికుల కంటే మెరుగ్గా ఉంటారని అంచనా వేసారు. [8]

బ్రిటిషు భారత ప్రభుత్వ నిబంధనలు[మార్చు]

1837 లో ఈస్ట్ ఇండియా కంపెనీ, కలకత్తా నుండి భారతీయ కార్మికులను పంపించడానికి నిర్దుష్టమైన షరతులను విధించింది. వలస వెళ్లబోయే వ్యక్తి, అతని ఏజెంటూ వ్రాతపూర్వక కాంట్రాక్టుతో సహా బ్రిటిషు ప్రభుత్వం నియమించిన అధికారి ముందు హాజరు కావాలి. [9] ఒప్పంద కాలం ఐదు సంవత్సరాలు, తదుపరి ఐదు సంవత్సరాలు పొడిగించేందుకు వీలుగా ఉంటుంది. వలస వెళ్ళే వ్యక్తి తన ఒప్పందం ముగిసిన తర్వాత, ఏ రేవు నుండి బయలుదేరి వెళ్ళాడో ఆ రేవుకే తిరిగి రావాలి. ప్రతి వలస నౌక లోనూ స్థలం, ఆహారం మొదలైనవి నిర్దుష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఒక వైద్య అధికారిని నౌకలో తీసుకెళ్లాలి. 1837లో ఈ నియమాలను మద్రాసుకు కూడా విస్తరించారు.

భారతీయ కార్మికుల ఎగుమతిపై నిషేధం[మార్చు]

కార్మికుల వలసల కొత్త విధానం తెలిసిన వెంటనే దానికి, బ్రిటన్ లోను, భారతదేశం లోనూ బానిసత్వాన్ని వ్యతిరేకించిన స్థాయిలో వ్యతిరేకత మొదలైంది. 1838 ఆగస్టు 1 న, భారతీయ కార్మికుల ఎగుమతి వ్యవహారంపై విచారణకు ఒక కమిటీని నియమించారు. ఇది కొత్త వ్యవస్థను దుర్వినియోగపరచిన నివేదికలను విన్నది. 1839 మే 29 న, విదేశీ కార్మిక వ్యవస్థను నిషేధించారు. అలాంటి వలసలను చేపట్టే ఏ వ్యక్తి అయినా 200 రూపాయల జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్షకు గురవుతాడు. నిషేధం తర్వాత కూడా, కొంతమంది భారతీయ కార్మికులను పాండిచ్చేరి (అప్పట్లో ఫ్రెంచ్ వారి అధీనంలో) మీదుగా మారిషస్‌కు పంపడం కొనసాగింది. 

భారతీయ కార్మిక రవాణా పునఃప్రారంభం[మార్చు]

మారిషస్, కరిబియన్‌లోని యూరోపియన్ ప్లాంటర్లు నిషేధాన్ని రద్దు చేయడానికి తీవ్రంగా శ్రమించగా, బానిసత్వ వ్యతిరేక కమిటీ నిషేధాన్ని సమర్థించడానికి అంతే కష్టపడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం చివరకు యూరోపియన్ ప్లాంటర్లు, వారి మద్దతుదారుల నుండి వచ్చిన తీవ్రమైన ఒత్తిడికి లొంగిపోయింది: 1842 డిసెంబరు 2 న, బ్రిటిషు ప్రభుత్వం కలకత్తా, బొంబాయి, మద్రాసు నుండి మారిషస్‌కు కార్మికులు వలస వెళ్లేందుకు అనుమతించింది. ప్రతి రేవు లోనూ వలస ఏజెంట్లను నియమించారు. వ్యవస్థను దుర్వినియోగం చేస్తే అందుకు జరిమానాలు ఉన్నాయి. ఐదేళ్ల తర్వాత, కార్మికుడు ఎప్పుడు అడిగితే అప్పుడు తిరుగు ప్రయాణ ఖర్చులు ఇవ్వాల్సి ఉంటుంది. నిషేధం ఎత్తివేసిన తర్వాత, మొదటి ఓడ 1843 జనవరి 23న కలకత్తా నుండి మారిషస్‌కు బయలుదేరింది. మారిషస్‌లోని వలస దారుల సంరక్షకుడు, ప్రతి కొద్ది రోజులకూ ఒక కార్మికుల ఓడ వస్తోందనీ, పెద్ద సంఖ్యలో వస్తున్న వలసదారులను నమోదు చెయ్యడంలో వెనుకబడి పోతున్నాననీ, తనకు సహాయం కావాలనీ అడిగాడు. 1843 లో 30,218 మంది పురుషులు, 4,307 మంది మహిళలు భారతదేశం నుండి మారిషస్‌లోకి ప్రవేశించారు. మద్రాసు నుండి మొదటి ఓడ 1843 ఏప్రిల్ 21న మారిషస్ చేరుకుంది.

వ్యవస్థ దుర్వినియోగాలను అరికట్టడానికి ప్రయత్నాలు[మార్చు]

వ్యవస్థ దుర్వినియోగాలను అరికట్టడంలో అప్పట్లో ఉన్న నిబంధనలు విఫలమయ్యాయి. తప్పుడు పద్ధతుల్లో రిక్రూట్‌మెంటు కూడా కొనసాగింది. తత్ఫలితంగా, 1843లో బెంగాల్ ప్రభుత్వం కలకత్తా నుండి వలసలను నియంత్రించవలసి వచ్చింది. ఏజెంటు, సంరక్షకుడూ సర్టిఫికేట్‌పై సంతకం చేసిన తర్వాత మాత్రమే నిష్క్రమణను అనుమతించింది. మారిషస్‌కు వలసలు కొనసాగాయి. 1844లో 9,709 మంది మగ కూలీలను, 1,840 మంది భార్యలు, కుమార్తెలను రవాణా చేసారు.

అధిక మరణాల కారణంగా వెట్టి ఒప్పందాన్ని పూర్తి చేసిన భారతీయులను స్వదేశానికి రప్పించడం సమస్యగా మిగిలిపోయింది. తిరుగు ప్రయాణాలకు సంబంధించిన నిబంధనలను సంతృప్తికరంగా పాటించలేదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

మారిషస్‌లోని యూరోపియన్ ప్లాంటర్‌ల డిమాండ్‌లను తీర్చడానికి కలకత్తా నుండి తగినంత మంది రిక్రూట్‌లు లేనందున, మద్రాసు నుండి వలసలను తిరిగి తెరవడానికి 1847లో అనుమతి మంజూరు చేసారు. 1850లో మద్రాసు నుండి మారిషస్‌కు మొదటి ఓడ బయలుదేరింది.

భారతీయ వలసదారుల కోసం నిర్మించిన కాలనీల్లో కంపెనీ అధికారులను నియమించారు. ఉదాహరణకు, డేనిష్ తోటల యజమానులు భారతీయులను నియమించుకోవడం మొదలుపెట్టినపుడు, డేనిష్ వెస్టిండీస్‌లో నియమించిన బ్రిటిషు ప్రతినిధిని "వలసదారుల సంరక్షకుడు" అని పిలిచేవారు. [10] ఈ అధికారి, కార్మికుల సంక్షేమాన్ని పర్యవేక్షించేవాడు. ఒప్పందంలోని నిబంధనలను అమలు జరిగేలా చూసేవాడు.

కరిబియన్‌కు భారతీయ కార్మిక రవాణా[మార్చు]

బానిసత్వం ముగిసిన తరువాత, ఐరోపా నేతృత్వంలోని వెస్ట్ ఇండియన్ షుగర్ వలస దేశాలు, విముక్తి పొందిన బానిసలను ఐర్లాండ్, జర్మనీ, మాల్టా ల నుండి వచ్చిన కుటుంబాలను, మదీరా నుండి వచ్చిన పోర్చుగీస్‌లను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాలన్నీ ఆయా వలస దేశాల్లో కార్మికుల అవసరాలను తీర్చడంలో విఫలమయ్యాయి. కొత్తగా వచ్చిన వారిలో మరణాలు అధికంగా ఉండడం, వారి ఒప్పందం ముగిసాక వారు పనిని కొనసాగించడానికి వారు ఇష్టపడకపోవడం దీనికి కారణాలు. 1844 నవంబరు 16 న, బ్రిటిషు భారత ప్రభుత్వం జమైకా, ట్రినిడాడ్, డెమెరారా (గయానా) ల లోకి వలసలను చేపట్టేందుకు చట్టం చేసింది. మొదటి ఓడ, విట్బీ, కలకత్తా రేవు నుండి బ్రిటిషు గయానాకు 1838 జనవరి 13న బయల్దేరి, మే 5 న బెర్బిస్‌కు చేరుకుంది. చక్కెర పరిశ్రమలో సమస్యల కారణంగా కరిబియన్‌కు కార్మికుల రవాణా 1848లో ఆగిపోయింది. తిరిగి 1851లో డెమెరారా, ట్రినిడాడ్‌లకు, 1860లో జమైకాకూ రవాణా మళ్ళీ మొదలైంది.

కొత్తగా విముక్తి పొందిన బానిసలు తక్కువ వేతనాలకు పని చేయడానికి నిరాకరించినందున ఒప్పంద కార్మికులను దిగుమతి చేసుకోవడం తోటల యజమానులకు తప్పనిసరైంది. ఆయా వలస దేశాల్లో ఉన్న విముక్త బానిసల సంఖ్యను చూస్తే తెలుస్తుంది. జమైకాలో 3,22,000 మంది ఉండగా, బ్రిటిషు గయానా, బార్బడోస్‌లలో వరుసగా 90,000, 82,000 మంది విముక్తి పొందిన బానిసలు ఉన్నారు. [11] విదేశీ కార్మికులను బ్రిటిషు దిగుమతి చేసుకోవడానికి రాజకీయ ప్రోత్సాహం కూడా ఉంది. భారతీయ శ్రామికుల వలసల కారణంగా విముక్తి పొందిన బానిసల పరపతి, బేరసారాల శక్తీ తగ్గిపోయింది. బ్రిటిషు వలస దేశాల్లో ఉన్న ప్లాంటోక్రసీ అనే ఈ వ్యవస్థలో వారి స్థానం బలహీనపడింది. [12]

ఒప్పందాన్ని పొడిగించేలా కార్మికులను బలవంతపెట్టడం[మార్చు]

ఉచిత తిరుగు ప్రయాణం కోసం దావాను వదులుకోవడం[మార్చు]

యూరోపియన్ ప్లాంటర్లు సుదీర్ఘ కాలంపాటు ఒప్పందాలు చేసుకోవాలని కార్మికులపై ఒత్తిడి తెచ్చారు. 1847లో, మారిషస్ ప్రభుత్వం, ఒప్పందం ముగిసాక వెనక్కి వెళ్ళకుండా మారిషస్‌ లోనే ఉండాలని నిర్ణయించుకున్న ప్రతి కార్మికుడికీ £2 గ్రాట్యుటీని అందజేసింది. మారిషస్ ప్రభుత్వం తిరుగు ప్రయాణ భత్యాన్ని నిలిపివేయాలని భావించింది. చివరకు 1852 ఆగస్టు 3 న, బ్రిటిషు ఇండియా ప్రభుత్వం ఒప్పంద షరతులను మార్చడానికి అంగీకరించింది, దీని ద్వారా ఒప్పందం ముగిసిన ఆరు నెలలలోపు వెనక్కి వెళ్ళేందుకు అవసరమైన రవాణా ఖర్చులను అడగకపోతే, కార్మికులు ఆ హక్కును కోల్పోతారు. అయితే రోగులకు, పేద వారికీ కొన్ని రక్షణలు కల్పించారు. 1852లో చేసిన మరో మార్పు ప్రకారం కార్మికులు ఐదేళ్ల తర్వాత తిరిగి వెళ్లవచ్చు (తిరుగు ప్రయాణానికి $35 తామే పెట్టుకోవాలి). అయితే 10 సంవత్సరాల తర్వాత ఉచిత తిరుగు ప్రయాణానికి అర్హత పొందుతారు. చాలా కొద్దిమంది మాత్రమే 10 సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకోవాలని భావించడంతో కార్మికులు ఈ నియామకాలకు ముందుకు రాలేదు. పైగా $35 మొత్తం చాలా ఎక్కువ. దాంతో 1858 తర్వాత ఆ మార్పును రద్దుచేసారు.

మహిళల నిష్పత్తిని పెంచడం[మార్చు]

ఒప్పందం కుదుర్చుకున్న కార్మికులు తమ కుటుంబాన్ని కూడా తమతో తెచ్చుకునే వీలు కల్పిస్తే, వారు వలస దేశంలో ఎక్కువ కలం నివసించే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావించారు. మారిషస్‌కు ప్రారంభ వలసలలో స్త్రీల నిష్పత్తి చాలా తక్కువగా ఉండేది. ఈ అసమతుల్యతను సరిచేయడానికి మొదటి ప్రయత్నంగా, 1856 మార్చి 18 న, వలస దేశాల కార్యదర్శి డెమెరారా గవర్నర్‌కు పంపిన సందేశంలో, 1856–7 సీజనులో మొత్తం కార్మికుల్లో 25 శాతం మహిళలు ఉండాలనీ, ఆ తరువాతి సంవత్సరాల్లో పురుషుల సంఖ్య స్త్రీల సంఖ్యకు మూడు రెట్ల కంటే మించకూడదనీ పేర్కొన్నాడు. విదేశాలకు వెళ్ళడానికి దక్షిణ భారతీయ స్త్రీల కంటే, ఉత్తర భారత స్త్రీలను ప్రేరేపించడం కష్టమైంది. కానీ వలసరాజ్యాల కార్యాలయం తన కృషిని కొనసాగించి 1868 జూలై 30 న ప్రతి 100 మంది పురుషులకు 40 మంది స్త్రీలు ఉండాలనే నిష్పత్తికి కట్టుబడి ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది మిగిలిన ఒప్పంద కాలమంతటా అమలులో ఉంది.

భూమి మంజూరు[మార్చు]

ట్రినిడాడ్ భిన్నమైన ధోరణిని అనుసరించింది. అక్కడి ప్రభుత్వం కార్మికులకు వారి ఒప్పంద గడువు ముగిసినప్పుడు అక్కడే స్థిరపడేందుకు నిజమైన ప్రోత్సాహకాలను అందించి, దేశంలో వాటా ఇచ్చింది. 1851 నుండి తిరుగు ప్రయాణ భత్యాలను వదులుకున్న వారందరికీ £10 చెల్లించేవారు. దాని స్థానంలో భూమిని మంజూరు చేసారు. 1873లో దాని మరింత పెంచి 5 ఎకరాల భూమితో పాటు, £5 నగదు కూడా ఇచ్చారు. ఇంకా, ట్రినిడాడ్ 1870లో ఆమోదించిన చట్టం ప్రకారం, మరణాల రేటు 7 శాతానికి మించి ఉన్న తోటలకు కొత్త వలసదారులను కేటాయించలేదు.

ఇతర యూరోపియన్ వలసల కోసం రిక్రూట్‌మెంట్[మార్చు]

భయంకరమైన మానవ వ్యయంతో బ్రిటిషు వారు ప్రవేశపెట్టిన భారతీయ ఒప్పంద వ్యవస్థ సాధించిన విజయం ఇతరుల దృష్టిని దాటి పోలేదు. ఇతర యూరోపియన్ తోటల యజమానులు మానవశక్తిని నియమించుకోవడానికి భారతదేశంలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. ఉదాహరణకు, చక్కెర ఉత్పత్తి చేసే ఫ్రెంచి వారి వలస దేశాల వారు బ్రిటిషు అధికారులకు తెలియకుండా భారతదేశంలోని ఫ్రెంచ్ ఓడరేవుల ద్వారా కార్మికులను తెచ్చుకున్నాయి. 1856 నాటికి, రీయూనియన్‌లో కార్మికుల సంఖ్య 37,694కి చేరుకుందని అంచనా. 1860 జూలై 25 వరకు రీయూనియన్ కోసం ఏటా 6,000 మంది చొప్పున కార్మికులను నియమించుకోవడానికి బ్రిటిషు అధికారులు ఫ్రాన్స్‌ను అనుమతించారు. మార్టినిక్, గ్వాడెలోప్, ఫ్రెంచ్ గయానా (కేయెన్) వంటి ఫ్రెంచి వలసలలోకి కూడా 'స్వేచ్ఛా' కార్మికులను దిగుమతి చేసుకోవచ్చనే అనుమతితో దీన్ని 1861 జూలై 1 న పొడిగించారు. వెట్టి ఒప్పందం ఐదు సంవత్సరాల కాలానికి (అప్పట్లో బ్రిటిషు వలస దేశాల కంటే ఎక్కువ) ఉండేది. ఒప్పందపు ముగింపులో తిరుగు ప్రయాణపు ఖర్చులు ఇచ్చేవారు. (బ్రిటిషు వలస దేశాల్లో వలె పది ఏళ్ళ తర్వాత కాదు). వ్యవస్థలో ఏదైనా దుర్వినియోగం జరిగినట్లయితే, సదరు ఫ్రెంచ్ వలస దేశానికి వలసలను నిలిపివేయడానికి గవర్నర్-జనరల్‌కు అధికారం ఉండేది.

డేనిష్ తోటల యజమానులు భారతీయ కార్మికులను సెయింట్ క్రోయిక్స్‌కు దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. [13] అయితే ఈ ఒప్పంద విధానం కొనసాగలేదు.

బ్రిటిషు సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాలకు రవాణా[మార్చు]

బ్రిటిషు ప్రభుత్వానికి ఆమోదయోగ్యమైన కార్మిక చట్టాలను ప్రవేశపెట్టిన తరువాత, చిన్న బ్రిటిషు కరిబియన్ దీవులకు కూడా కార్మికుల రవాణా మొదలైంది. 1856లో గ్రెనడా, 1858లో సెయింట్ లూసియా, 1860లో సెయింట్ కిట్స్ సెయింట్ విన్సెంట్ కు కార్మికుల రవాణా మొదలైంది. 1860 ఆగస్టు 7 న దక్షిణాఫ్రికా లోని నాటల్‌కు వలసలను ఆమోదించారు. మద్రాసు నుండి మొదటి ఓడ 1860 నవంబరు 16 న డర్బన్‌ చేరుకుంది. దక్షిణాఫ్రికాలో భారతీయ సమాజం ఉనికి అలా మొదలైంది. మూడేళ్ల కాంట్రాక్టుపై రిక్రూట్‌మెంట్లు జరిగాయి. బ్రిటిషు ప్రభుత్వం 1862 లో డేనిష్ వలస దేశాలకు రవాణాను అనుమతించింది. సెయింట్ క్రోయిక్స్‌కు పంపిన ఒక ఓడలో చాలా మరణాలు సంభవించాయి. ఒప్పంద కార్మికుల చికిత్సపై బ్రిటిషు కాన్సుల్ నుండి ఈ సంఘటనపై వచ్చిన నివేదికల పర్యవసానంగా తదుపరి వలసలను ఆపేసారు. ప్రాణాలతో బయటపడిన వారు 1868లో భారతదేశానికి తిరిగి వచ్చారు, దాదాపు ఎనభై మంది భారతీయులు మాత్రమే మిగిలారు. 1864లో ఆస్ట్రేలియా లోని క్వీన్స్‌లాండ్‌కు వలస వెళ్లేందుకు అనుమతి లభించింది. అయితే ఈ ప్రాంతానికి భారతీయులు ఎవర్నీ రవాణా చేయలేదు.

ఒప్పంద కార్మిక వ్యవస్థ క్రమబద్ధీకరణ[మార్చు]

వివిధ వలస రాజ్యాలకు ఒప్పందపు కార్మికులను పంపించే వ్యవస్థల మధ్య చాలా వ్యత్యాసాలు ఉండేవి. 1864 నాటి బ్రిటిషు ప్రభుత్వం, వ్యవస్థ దుర్వినియోగాన్ని తగ్గించే ప్రయత్నంలో భారతీయ కార్మికుల నియామకానికి సాధారణ నిబంధనలను రూపొందించింది. వీటిలో - ఓడ ఎక్కే రెవులో కాకుండా, రిక్రూట్‌మెంట్ జిల్లాలోనే మేజిస్ట్రేట్ ముందు హాజరవడం, రిక్రూటర్‌లకు లైసెన్స్ ఇవ్వడం, రిక్రూట్‌మెంట్ నియమాలను పాటించని రిక్రూటర్‌లకు జరిమానాలు విధించడం, వలసదారుల రక్షకుల కోసం చట్టబద్ధంగా నియమాలు నిర్వచించడం, డిపోల కోసం నియమాలు ఏర్పరచడం, ఏజెంట్లకు కమీషను ద్వారా కాకుండా జీతంగా చెల్లించడం వంటివి వీటిలో కొన్ని. నౌకల్లో వలస వచ్చిన వారి చికిత్స, ప్రతి 100 మంది పురుషులకు 25 మంది స్త్రీలు ఉండాలని నిర్ణయించారు. అయినప్పటికీ, చక్కెర వలస దేశాల వారు, వలసదారులకు ప్రతికూలమైన కార్మిక చట్టాలను రూపొందించగలిగాయి. ఉదాహరణకు, డెమెరారాలో 1864లో ఒక ఆర్డినెన్స్ ప్రకారం, ఒక కార్మికుడు పనికి గైర్హాజరు కావడం, తప్పుగా ప్రవర్తించడం లేదా ప్రతి వారం ఐదు పనులు పూర్తి చేయకపోవడం మొదలైనవాటిని నేరంగా పరిగణించేవారు. 1867లో మారిషస్‌లో కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాల ప్రకారం, గడువు ముగిసిన కార్మికులు ఎస్టేట్ నుండి విముక్తి పొందడం అసాధ్యంగా మారింది. వారు పాస్‌లను తీసుకెళ్లవలసి ఉంటుంది. అందులోవారి వృత్తి, నివాస జిల్లా ఉంటుంది. ఆ జిల్లా వెలుపల ఎవరైనా కనబడితే అరెస్టు చేసి ఇమ్మిగ్రేషన్ డిపోకు పంపిస్తారు. అతనికి ఉపాధి లేదని తేలితే, అతన్ని ద్రిమ్మరిగా పరిగణించేవారు.

సూరినామ్‌కు రవాణా[మార్చు]

ఇంపీరియల్‌ ఒప్పందం ప్రకారం సురినామ్‌కు భారతీయ కార్మికుల రవాణా ప్రారంభమైంది. భారతీయ కార్మికులను నియమించుకోవడానికి తాము పొందిన హక్కులకు బదులుగా డచ్ వారు, పశ్చిమ ఆఫ్రికాలోని కొన్ని పాత కోటలను (బానిస వ్యాపారపు అవశేషాలు) బ్రిటిషు వారికి బదిలీ చేశారు. సుమత్రాపై హక్కుల బ్రిటిషు వారి వాదనలకు ముగింపు పలికేందుకు కూడా బేరసారాలు సాగించారు. ఐదు సంవత్సరాల ఒప్పందంపై కార్మికుల చేత సంతకం చేయించుకున్నారు. ఈ కాలం ముగిసాక తిరుగు ప్రయాణ ఖర్చులు ఇచ్చేవారు. కానీ వారు డచ్ చట్టానికి లోబడి ఉండాలి. భారతీయ ఒప్పంద కార్మికులతో కూడిన మొదటి ఓడ 1873 జూన్‌లో సూరినామ్‌ చేరుకుంది. ఆ తర్వాత అదే సంవత్సరంలో మరో ఆరు ఓడలు వచ్చాయి.

1842 - 1870 మధ్య బ్రిటిషు వలస దేశాలకు భారతీయ కార్మికుల రవాణా[మార్చు]

1842, 1870 మధ్య మొత్తం 5,25,482 మంది భారతీయులను బ్రిటిషు, ఫ్రెంచ్ వలస దేశాలకు తరలించారు. వీరిలో 3,51,401 మంది మారిషస్‌కు, 76,691 మంది డెమెరారాకు, 42,519 మంది ట్రినిడాడ్‌కు, 15,169 మంది జమైకాకు, 6,448 మంది నాటల్‌కు, 15,005 మంది రీయూనియన్‌కు, 16,341 మంది ఇతర ఫ్రెంచ్ వలస దేశాలకూ వెళ్లారు. ఇంతకుముందు మారిషస్‌కు వెళ్లిన 30,000 మంది, సిలోన్ లేదా మలయాకు వెళ్లిన కార్మికులు, ఫ్రెంచ్ వలస దేశాల కోసం చేసిన అక్రమ రిక్రూట్‌మెంట్‌లూ ఈ సంఖ్యలో లేవు. ఆ విధంగా 1870 నాటికి, భారతీయ కార్మికులను వలస దేశాలకు రవాణా చేసే ఒప్పంద విధానం, యూరోపియన్ వలసవాద తోటలకు కార్మికులను అందించే వ్యవస్థగా ఉంది. 1879లో, ఫిజీ కూడా భారతీయ కార్మికులను దిగుమతి చేసుకున్నపుడు, కొన్ని చిన్న మార్పులతో ఇదే వ్యవస్థను అనుసరించింది.

వ్యవస్థ నిజస్వరూపం[మార్చు]

ఈ వ్యవస్థకు పేరు ఒప్పంద కార్మిక వ్యవస్థ నే పేరు ఉన్నప్పటికీ అంతర్గతంగా ఇది బానిసత్వవ్యవస్థ లాగానే ఉండేది. ఒక నిర్ణిత కాలానికి బానిస లాగా పనిచేసేందుకు చేసుకున్న ఒప్పందం ఇది. ఒప్పందం కుదుర్చుకున్న కార్మికులను హీనంగా చూస్తూ కూలీ అని పిలిచేవారు. వలస దేశాల్లో వారి వేతనాలు చాలా తక్కువగాను, పని పరిస్థితులు ఘోరంగానూ ఉండేవి. ఒప్పందం నిర్దేశించిన నియమాలను సరిగ్గా పాటించేవారు కాదు. [14] ఒప్పంద కాలపరిమితి తీరిపోయాక కొన్ని దేశాల్లో తగు ప్రోత్సాహకాలు ఇచ్చి వారిని అక్కడే ఉంచే ఏర్పాటు చేసినప్పటికీ, కొన్ని చోట్ల వాళ్లను వెనక్కి పోనీయకుండా నిర్బంధంగా అక్కడే ఉంచేలా యజమానులు కుటిల ప్రయత్నాలు చేసేవాళ్ళు.

నివాస పరిస్థితులు దయనీయంగా, హీనంగా ఉండేవి. అనారోగ్య పరిస్థితులలో జీవిస్తూ రోగాలతో సతమతమయ్యేవాళ్లు. పని పరిస్థితులు క్రూరంగా, చాలా కఠినంగా ఉండేవి. పని వేళలు ఎక్కువగా ఉండేవి. [15] స్త్రీలపై యజమానులు, సూపర్వైజర్లూ లైంగిక అత్యాచారాలు చెయ్యడం సాధారణంగా ఉండేది. 1930 ల్లో మారిషస్‌లో పనిచేసి వెనక్కి తిరిగి వచ్చిన బీబీ జుహూరున్ అనే మహిళ, మారిషస్‌లో తన యజమాని తనను ఉంపుడుగత్తెలా ఉండమన్నాడని చెప్పింది. అందుకు ఒప్పుకోనందనున తనకు మూణ్ణెల్లు ఖైదు విధించారనీ, అదయ్యాక తిరిగి అదే యజమాని వద్దకు పంపారని, అక్కడ తనను కొట్టారనీ చెప్పింది. అప్పట్లో బ్రిటిషు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ముందు ఆమె ఈ సంగతి చెప్పింది. "మారిషస్ ఒక బానిసల దేశమనీ, భారతదేశంలో అడుక్కునైనా తింటాను గానీ ఆ దేశానికి వెళ్లన"నీ ఆమె చెప్పింది. [16]

భారతదేశంలో కార్మికులను నియమించుకునేటపుడు కూడా బ్రిటిషు ప్రభుత్వాధికారులు, వలస రాజ్యాల ప్రతినిధులూ అనేక అక్రమాలు చేసేవాళ్ళు. తీరం నుండి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను నియమించుకునేటపుడు, కార్మికులకు వాళ్ళు పని చేయబోయేది ఎక్కడో, అది ఏం పనో చెప్పేవారు కాదు. అసలు తమను ఓడ ఎక్కించి వేరే దేశానికి తీసుకువెళ్తున్నారన్న సంగతి ఓడ ఎక్కే సమయం దాకా వాళ్ళకు తెలిసేది కూడా కాదు. [17] ఓడ ప్రయాణంలో కూడా పరిస్థితులు దయనీయంగా ఉండేవి.

వెట్టి చాకిరీ ఒప్పందం[మార్చు]

1912 వెట్టి ఒప్పందం షరతులు ఇలా ఉన్నాయి:

  1. సేవా కాలం-వలస దేశానికి వచ్చిన తేదీ నుండి ఐదు సంవత్సరాలు.
  2. శ్రమ స్వభావం - నేల సాగు లేదా ఏదైనా తోటల ఉత్పత్తికి సంబంధించి పని.
  3. ఆదివారాలు, అధీకృత సెలవులు మినహా వారంలో ప్రతి రోజూ వలసదారుడు పనిచెయ్యాలి.
  4. అదనపు వేతనం లేకుండా రోజూ పని చేయాల్సిన గంటల సంఖ్య-సోమవారంతో ప్రారంభమయ్యే ప్రతి వారంలో మొదటి ఐదు రోజులలో తొమ్మిది గంటలు, శనివారం ఐదు గంటలు.
  5. నెలవారీ లేదా రోజువారీ వేతనాలు: పదిహేనేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి వయోజన పురుషుడికి కనీసం ఒక షిల్లింగ్ ఇస్తారు. స్త్రీకి తొమ్మిది పెన్స్ కంటే తక్కువ కాకుండా ఇస్తారు. 19 ఏళ్ళ లోపు పిల్లలు చేసిన పనికి అనులోమానుపాతంలో వేతనాలు అందుకుంటారు.
  6. టాస్క్ లేదా టికా-వర్క్‌లో నియమించినప్పుడు, పదిహేనేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి వయోజన పురుషునికి ఒక షిల్లింగ్‌కు తక్కువ కాకుండా చెల్లిస్తారు. మహిళకు తొమ్మిది పెన్స్‌లకు తక్కువ కాకుండా చెల్లిస్తారు.
  7. సాధారణ సామర్థ్యం ఉన్న వయోజన పురుషుడు చేయగలిగినంత పనిలో స్త్రీ నాలుగింట మూడు వంతులు చెయ్యాలి. రోజుకు ఒక పని కంటే ఎక్కువ యజమాని ఇవ్వకూడదు, వలసదారుడు చెయ్యాల్సిన అవసరం లేదు. అయితే పరస్పర ఒప్పందం ద్వారా అటువంటి అదనపు పనిని కేటాయించవచ్చు, చెయ్యవచ్చు, చెల్లించవచ్చు.
  8. ప్రతి వారం శనివారం నాడు వేతనాలు చెల్లిస్తారు.
  9. తిరుగు ప్రయాణానికి షరతులు- వలసదారులు వలస దేశంలో ఐదు సంవత్సరాల పారిశ్రామిక నివాసాన్ని పూర్తి చేసిన తర్వాత వారి స్వంత ఖర్చుతో భారతదేశానికి తిరిగి రావచ్చు.
  10. పది సంవత్సరాల నిరంతర నివాసం తర్వాత, వలస దేశానికి వచ్చేటప్పటికి పన్నెండేళ్ల వయస్సు పైబడిన వలసదారుడు, ఆ కాలంలో ఐదేళ్లపాటు పని చేస్తే, వారు తిరుగు ప్రయాణ భత్యానికి అర్హులు. వాళ్లు దాన్ని రెండు సంవత్సరాలలోపు తీసుకోవాలి. వలసదారుడు వలస దేశంలోకి ప్రవేశించినప్పుడు పన్నెండేళ్లలోపు వయస్సు కలిగి ఉన్నట్లయితే, అతను 24 ఏళ్లు వచ్చేలోపు దానిని క్లెయిమ్ చేయవచ్చు. వలస దేశంలో జన్మించిన వలసదారు యొక్క బిడ్డ పన్నెండేళ్ల వయస్సు వచ్చే వరకు తిరుగు ప్రయాణ భత్యానికి అర్హులు. అతని తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తప్పనిసరిగా ప్రయాణంలో ఉండాలి.
  11. ఇతర షరతులు- ప్రవాసులకు తోటలోకి వచ్చిన తర్వాత మొదటి ఆరు నెలల్లో వారి యజమానుల నుండి ఫిజీ ప్రభుత్వం నిర్దేశించిన స్కేల్ ప్రకారం నాలుగు పెన్స్‌ల విలువైన రోజువారీ రేషను లభిస్తుంది. పన్నెండు సంవత్సరాలు పైబడిన వారికి ఒక్కొక్కరికీ ఈ రేషను ఇస్తారు.
  12. ఐదు, పన్నెండు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ప్రతి బిడ్డకు దాదాపు సగం రేషన్‌లు ఉచితంగా అందుతాయి. ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి బిడ్డకు, మొదటి సంవత్సరంలో ప్రతిరోజూ తొమ్మిది చటాకుల పాలు ఉచితంగా ఇస్తారు.
  13. వలసదారులకు అనువైన నివాసస్థలాన్ని అద్దె లేకుండా కేటాయిస్తారు. యజమానులు దాన్ని మంచి స్థితిలో ఉంచాలి. వలసదారులు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారికి ఆసుపత్రి వసతి, వైద్య హాజరు, మందులు, వైద్య సౌకర్యాలు, ఆహారం ఉచితంగా ఇస్తారు.
  14. భార్య ఇంకా జీవించి ఉన్న వలసదారు పెళ్ళి చట్టబద్ధంగా రద్దైతే తప్ప వలస దేశంలో మరొకరిని పెళ్ళి చేసుకోవడానికి అనుమతించరు; కానీ అతనికి స్వదేశంలో ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు ఉంటే, అతను వారందరినీ తనతో పాటు వలస దేశానికి తీసుకెళ్లవచ్చు. వారిని చట్టబద్ధంగా నమోదు చేసి అతని భార్యలుగా గుర్తిస్తారు.

ఒప్పంద వెట్టి చాకిరీ వ్యవస్థపై తుది నిషేధం[మార్చు]

బ్రిటిషు నేతృత్వంలోని భారత ఒప్పంద వ్యవస్థను చివరికి 1917 లో నిషేధించారు. [18] ది ఎకనామిస్ట్ ప్రకారం, "మానవతావాద ఆందోళనల నుండి కాకుండా, భారతీయ జాతీయవాదుల నుండి వచ్చిన ఒత్తిడి, లాభదాయకత క్షీణించడం వలనా ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చివరకు ఒప్పందాన్ని ముగించింది." [18]

దేశం వారీగా భారతీయ ఒప్పంద కార్మికుల రవాణా[మార్చు]

భారతీయ వెట్టి కార్మికుల దిగుమతి
వలస రాజ్యం పేరు రవాణా చేసిన కార్మికుల సంఖ్య
బ్రిటిషు మారిషస్ 4,53,063
బ్రిటిషు గయానా 2,38,909
బ్రిటిషు ట్రినిడాడ్ టొబాగో 1,47,596 [19]
బ్రిటిషు జమైకా 36,412
బ్రిటిషు మలయా 4,00,000
బ్రిటిషు గ్రెనడా 3,200
బ్రిటిషు సెయింట్ లూసియా 4,350
నాటల్ 1,52,184
సెయింట్ కిట్స్ 337
సెయింట్ విన్సెంట్ 2,472
రీయూనియన్ 26,507
డచ్ సురినామ్ 34,304
బ్రిటిషు ఫిజీ 60,965
తూర్పు ఆఫ్రికా 32,000 [20]
సీషెల్స్ 6,315
బ్రిటిషు సింగపూర్ 3,000 [21]
మొత్తం 16,01,614

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Documentary heritage submitted by Fiji, Guyana, Suriname, Trinidad and Tobago and recommended for inclusion in the Memory of the World Register in 2011'
  2. Indian indentured labourers - National Archive
  3. THE EXPERIENCE OF INDIAN INDENTURE IN TRINIDAD: ARRIVAL AND SETTLEMENT - Sherry-Ann Singh, Department of History University of the West Indies St. Augustine, Trinidad and Tobago
  4. Asian Indentured Labor in the 19th and Early 20th Century Colonial Plantation World - Richard B. Allen
  5. The British and rubber in Malaya, c1890-1940, 2005, James Hagan, Andrew Wells - University of Wollongong
  6. Kumar, Pratap (2015). Indian Diaspora: Socio-Cultural and Religious Worlds. Leiden: BRILL. p. 38. ISBN 9789004287983.
  7. Sturman, Rachel (1 December 2014). "Indian Indentured Labour and the History of International Rights Regimes". The American Historical Review. 119 (5): 1439–1465. doi:10.1093/ahr/119.5.1439.
  8. Hassankhan, Maurits; Roopnarine, Lomarsh; Ramsoedh, Hans (2016). The Legacy of Indian Indenture: Historical and Contemporary Aspects of Migration and Diaspora. London: Routledge. p. 4. ISBN 9781138280526.
  9. Bahadur, Gaiutra (2014). Coolie Woman: The Odyssey of Indenture. The University of Chicago. ISBN 978-0-226-21138-1.
  10. Roopnarine, Lomarsh (2016). Indian Indenture in the Danish West Indies, 1863-1873. New York: Palgrave Macmillan. p. 12. ISBN 9783319307091.
  11. Misir, Prem (2017). The Subaltern Indian Woman: Domination and Social Degradation. Berlin: Springer. p. 20.
  12. Misir, p. 20.
  13. Roopnarine, p. 12.
  14. "ఇండేంచర్‌డ్ లేబర్ ఫ్రం సౌత్ ఏషియా (1834-1917)". స్ట్రైకింగ్ వుమెన్. Archived from the original on 2022-01-22. Retrieved 2022-01-22. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-10-25 suggested (help)
  15. లాల్, బ్రిజ్. వి. "ఇండియన్ ఇండెంచర్ - హిస్టరీ అండ్ హిస్టోరియోగ్రఫీ ఇన్ ఎ నట్‌షెల్" (PDF). ప్లూటో జర్నల్స్: 4. Archived from the original (PDF) on 2022-01-22 – via JSTOR.
  16. "ఎ వొమన్స్ ఎకౌంట్ ఫ్రం 1800 స్ రివీల్స్ ది ప్లైట్ ఆఫ్ ఇండియన్ ఇండెంచర్‌డ్ లేబర్ ఇన్ ది కర్బియన్". స్క్రోల్. Archived from the original on 2022-01-22. Retrieved 2022-01-22. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  17. "Forced Labour". The National Archives, Government of the United Kingdom. 2010.
  18. 18.0 18.1 "The legacy of Indian migration to European colonies". The Economist. 2 September 2017. Retrieved 2 September 2017.
  19. https://natt.gov.tt/sites/default/files/pdfs/Nelson-Island-and-Indian-Indentureship-in-Trinidad_02.pdf
  20. "Kenya's Asian heritage on display". BBC News. 2000-05-24. Retrieved 2017-09-02.
  21. Indian convicts’ contributions to early Singapore (1825–1873) - Vernon Cornelius-Takahama