మధ్యాహ్న భోజన పథకము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పశ్చిమ గోదావరి జిల్లా, గద్దేవారిగూడెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారవుతున్నది.

పాఠశాలలలో విద్యార్ధులకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కలిపించే ప్రభుత్వ విధానాన్ని మధ్యాహ్న భోజన పథకము (Mid Day Meal Program) అంటారు. పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశ్యంతో, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకం ఇది. ఇందులో అన్ని పని దినాలలో విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా భోజనం పెడతారు. బాలబాలికల్ని ఆకలి బాధ నుంచి దూరం చేయడం, పాఠశాలలో చేరేవారి సంఖ్యను, హాజరు అయ్యేవారి సంఖ్యను పెంచడం, పిల్లల్లో అన్ని కులాల వారి పట్ల సమ భావన పెంపొందించడం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం, మహిళలకు ఉపాధి కల్పించడం ద్వారా సాధికారతను పెంపొందించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు. గుజరాత్, మరియు తమిళనాడు రాష్ట్రాలలో ఇది ఎప్పటినుంచో అమలులో ఉంది. నవంబర్ 28, 2001 సంవత్సరంలో సుప్రీం కోర్టు ధర్మాసనం మార్గనిర్దేశం నేపథ్యంలో ఈ పథకం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. తమిళనాడులోని పాఠశాలల అభివృద్ది ఈ పథకం యొక్క విజయానికి చక్కని తార్కాణం.

చరిత్ర[మార్చు]

1923 లోనే మద్రాసు ప్రెసిడెన్సీ, మద్రాసు సిటీ కార్పొరేషన్ పాఠాశాలల్లో చదివే పిల్లలకి భోజనం పెట్టేది. 1960లో కామరాజ్ నాడార్ ప్రభుత్వం దీనిని విస్తృతంగా అమలు పరిచింది. 1982 లో ఎం జి రామచంద్రన్ ప్రభుత్వం ఈ పథకాన్ని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు విస్తరింపచేసింది. తరువాత తమిళనాడు ప్రభుత్వం, పదవ తరగతి చదివే పిల్లలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేసింది. తమిళనాడులో అమలవుతున్న ఈ పథకం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమైంది.


కామరాజ్ నాడార్ కు ఈ పథకం యొక్క ఆలోచన ఎలా వచ్చిందన్న విషయం పై ఆసక్తి కరమైన కథనం ఉంది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో గల ఒక చరన్మహదేవి అనే కుగ్రామంలో ఆలోచనకు బీజం పడింది. ఈయన చాలా సాధారణ జీవితం గడిపేవాడు. ఎక్కడికి ప్రయాణించాలన్నా పైన ఎర్ర లైటు కూడాలేని ఒక కారులో ప్రయాణం చేసేవాడు. కాన్వాయ్ లకు పెద్దగా అలవాటు పడలేదు. అలాంటి ఒక ప్రయాణంలో చరన్మహదేవి గ్రామం దగ్గర రైల్వే గేటు వద్ద ఆగి కారు దిగి ఎదురు చూస్తుండగా ఆయనకు ఆవులు, మరియు మేకలు కాసుకొనే కొద్ది మంది బాలలు కనిపించారు. ఒక అబాయిని పిలిచి బాబూ! నీవు బడికి వెళ్ళకుండా ఇక్కడ ఆవులతో ఏమి చేస్తున్నావు? అని అడిగాడు. అప్పుడా బాలుడు నేను బడికి వెళితే నాకు తిండి ఎవరు పెడతారు? నా ఆకలి తీరితేనే కదా నేను చదువుకొనేది? అని గడుసుగా సమాధానమిచ్చాడు. ఈ సంఘటనే ఆయన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడానికి ప్రేరేపించింది.


తరువాత ఇతర రాష్ట్రాలలో కూడా అమలులోకి వచ్చింది. గుజరాత్ లో 1980లో, కేరళ లో 1995 లో, ప్రారంభించబడింది. ఇంకా మధ్యప్రదేశ్, ఒరిస్సా ల్లో కూడా ప్రారంభించబడింది. నవంబర్ 28, 2001 న సుప్రీం కోర్టు, ప్రభుత్వంచే నడపబడే అన్ని ప్రాథమిక పాఠశాలల యందు ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలుపరచాలని తీర్పు చెప్పింది. మొదట్లో కొన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేఖించినా 2005 నాటికి ఇది అన్ని రాష్ట్రాలలో ఆరంభమైంది.


ప్రస్తుతం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పధకాన్ని అమలు చేస్తున్నారు. అయినా దేశం మొత్తంలో 55% పిల్లలకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. (పెద్ద రాష్ట్రాలైన బీహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో అమలు కానందువలన). రాజస్థాన్, మహారాష్ట్రలలో ఒక భోజనం తయారు ఖరీదు 50 పైసలు పడుతుంటే గోవాలో రూ.8.50 అవుతున్నది. సగటున ఒక భోజనం తయారు ఖరీదు రూ.1.17 అవుతున్నది. [1].


2004-2005 సంవత్సరం బడ్జెట్‌లో ఈ నిమిత్తం 1,675 కోట్ల రూపాయలు కేటాయించారు.

మూలాలు, వనరులు[మార్చు]

  1. http://nac.nic.in/communication/meal.pdf

బయటి లింకులు[మార్చు]