రాగతి పండరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుమారి రాగతి పండరిబాయి
రాగతి పండరి
జననంరాగతి పండరిబాయి
జులై 22, 1965
విశాఖపట్టణం,
విశాఖపట్టణం జిల్లా
మరణం2015 ఫిబ్రవరి 19(2015-02-19) (వయసు 49)
విశాఖపట్టణం,
విశాఖపట్టణం జిల్లా
మరణ కారణంఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి
నివాస ప్రాంతంవిశాఖపట్టణం
ఇతర పేర్లురాగతి పండరి
వృత్తివ్యంగ్య చిత్రకారిణి
తండ్రిరాగతి గోవిందరావు
తల్లిరాగతి శాంతకుమారి
సంతకం

రాగతి పండరి (జూలై 22, 1965 - 19 ఫిబ్రవరి, 2015) తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్టులలో (వాగ్దేవి, కె.సి లలిత అడపాదడపా వ్యంగ్య చిత్రాలను ప్రచురించినప్పటికీ), రాశిలోనూ, వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించుకున్న ఏకైక మహిళా కార్టూనిస్టు.[1] అదొక్కటే ప్రత్యేకత కాదు, అనతి కాలంలోనే తెలుగు వ్యంగ్య చిత్ర కళా రంగంలో[2] చాలా మంచి పేరు తెచ్చుకుని, ఆ రంగంలో అగ్రగణ్యులైన బాపు, జయదేవ్, బాబు ల సరసన నిలబడగలిగిన స్థాయి చేరుకున్నది. ఈ మంచి పేరుకు వెనుక అకుంఠిత దీక్ష, వ్యంగ్య చిత్ర కళ మీద ఎనలేని ప్రేమ, నిరంతర పరిశ్రమ ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, ఈమెకు చిన్నతంలో వచ్చిన పోలియో మూలంగా శారీరకంగా చలాకీగా తిరగలేక పోయినా, అంతకు మించిన మానసిక చలాకీతనంతో, చకచకా కార్టూన్లు గీసి అందరి మన్ననలు అందుకుంటున్నది. ఆమె మాటలలోనె చెప్పాలంటే, "జీవితంలో వేదనని కాసేపు పక్కకు నెట్టి, నిండుగా నవ్వగలిగే శక్తినిచ్చే కార్టూన్లు, మనిషికి గ్లూకోజు డోసులాంటివి". ఏవిధమైన భయంలేకుండా, తాను కార్టూన్లు గీయాలన్న కోరిక, స్ఫూర్తి, కార్టూనిస్ట్ జయదేవ్ కలగ చేశారని చెపుతుంది. అలాగే, జయదేవ్ కూడా రాగతి పండరి తన నిజమైన శిష్యురాలని చెప్పుకుంటాడు.

వ్యక్తిగతం[మార్చు]

రాగతి పండరి 1965 సంవత్సరం జూలై 22విశాఖపట్టణంలో జన్మించింది. ఈమె తండ్రి రాగతి గోవిందరావు. తల్లి రాగతి శాంతకుమారి. ఈమె చదువు ఇంటివద్దనే కొనసాగింది. అతి చిన్నవయసులోనే పోలియో వల్ల వచ్చిన శారీరక లోపం ఉన్నా పట్టుదల, ధైర్యం కలిగి జీవితాన్ని ఆత్మ విశ్వాసంతో,కఠోర పరిశ్రమతో ఎదుర్కొని, కార్టూన్ రంగంలో అగ్రగణ్యుల సరసన చేరింది.[3]

వ్యంగ్య చిత్ర ప్రస్థానం[మార్చు]

రాగతి పండరి తన 8వ ఏటన 1973వ సంవత్సరంలో ప్రచురించిన మొట్టమొదటి వ్యంగ్య చిత్రం

తిరిగొచ్చే కార్టూన్లు ఈమెను నిరాశపరచలేదు, పట్టుదలను పెంపొందించి మరింత కృషి సలపటానికి ఆలవాలమయ్యాయి. ఈమె తన వ్యంగ్యచిత్ర ప్రస్థానాన్ని 1973లో తన 8వ ఏటనే మొదలు పెట్టింది. బాల్యం వీడని రోజులలలోనే ఈమె వ్యంగ్య చిత్రాలు ప్రచురణ ప్రారంభమయ్యింది. 1980-1990 దశకాలు ఈమెవే అని చెప్పవచ్చు. కొన్ని వేల వ్యంగ్య చిత్రాలను శరపరంపరగా చిత్రించి పాఠకుల మీదకు వదిలింది. అన్ని ప్రముఖ వార, మాస పత్రికలలో ఈమె కార్టూన్లు ప్రచురించబడ్డాయి,[4] పండుగలు వచ్చాయంటే, పత్రికల సంపాదకులు ఈమె కార్టూన్ల కోసరం ఎంతగానో కోరుకుని, అడిగి మరీ తెప్పించుకుని తమతమ పత్రికలలో ప్రచురిస్తారు.

శైలి[మార్చు]

సాధారణంగా కార్టూనిస్టులు ఇండియన్ ఇంకులో క్రొక్వైల్ కలాన్ని ముంచి కార్టూన్లు వేస్తారు. కానీ రాగతి పండరి ఆలోచన వచ్చిందే తడవుగా కాగితంపై పెన్సిల్‌తో గీతలు కూడా గీసుకోకుండా నేరుగా స్కెచ్ పెన్నుతోనే కార్టూన్ వేసేస్తారు. ఆ క్రమంలో ఐదు పది నిమిషాల స్వల్పవ్యవధిలోనే కార్టూన్ గీసే విభిన్నమైన శైలి ఆమెది.[5] జయదేవ్ గురువుగా భావించి ఆయన శైలిలో కొద్దిరోజుల పాటు కార్టూన్లు వేసినా, వేగంగా తనదంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుని ఆమె గీత చూడగానే గుర్తుపట్టేలా శైలిని ఏర్పరుచుకున్నారు.

వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు[మార్చు]

  • సామన్యంగా, కార్టూన్లలో ఆడవారిని ఒక మూసలో ఇరికించి, ఒక గయ్యాళి భార్యగానో, అత్తగారిగానో, అప్పడాల కర్ర ఝుళిపిస్తున్నట్టుగా వేయటం పరిపాటి. రాగతి పండరి, అటువంటి మూసను అధిగమించి, ఆడవారిని తన వ్యంగ్య చిత్రాలలో అనేక ఇతర పాత్రలను, సృష్టించి, చూపించారు.
  • కుదురైన చక్కటి చిత్రీకరణ, గుండ్రటి చేతివ్రాత, తేట తెలుగులో సంభాషణలు వీరి వ్యంగ్య చిత్రాల ప్రత్యేకత.
  • వీరు సృష్టించిన నవగ్రహం అనుగ్రహం మహిళా ద్వయం మంచి పేరు తెచ్చుకున్నది. ఇందులో సన్నగా, పొడుగ్గ ఉన్న ఆమె, పొట్టిగా, లావుగా ఉన్న మరొకామె మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్య సంభాషణలతో చక్కటి హాస్యం మేళవించి, వీరు వేసిన వ్యంగ్య చిత్రాలు పాఠకులను అలరించాయి.
  • ఇంకా ఇద్దరు అమ్మాయిలు, మగాడు, కాలేజి గర్ల్‌ వంటి శీర్షికల పేరు మీద వీరు వేసిన వ్యంగ్య చిత్రాలు కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాయి
  • తెలుగు వ్యంగ్య చిత్రరంగంలో అనేక వ్యంగ్యచిత్ర ధారావాహికలు వార పత్రికలలో నిర్వహించిన ఘనత వీరిదే.
  • సమకాలీన వ్యంగ్య చిత్రాకారులలో, వార్తా పత్రికలలో పనిచేస్తూ ఉన్న కార్టూనిస్ట్‌లను మినహాయిస్తే, రాజకీయ వ్యంగ్య చిత్రాలు వేసే ఏకైక ఫ్రీలాన్స్మూస:స్వయం ఉపాధి కళాకారిణిమహిళా కార్టూనిస్ట్. 'రాజకీయ చెదరంగం' అన్న పేరుతో వేసిన కార్టూన్లు ఎంతో పేరు తెచ్చుకున్నాయి. ఈ శీర్షికన ఒక దశాబ్దం పైగా రాజకీయ వ్యంగ్య చిత్రాలను ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురించబడటం తనకెంతో ఆనందం కలిగించిందని ఈమె చెప్తారు.
  • వీరు వేసే రాజకీయ వ్యంగ్య చిత్రాలలో, నీజమైన రాజకీయ నాయకుల వ్యంగ్య చిత్రాలు ఉండవు. ఊహాజనిత రాజకీయ నాయకులను మాత్రమే చిత్రిస్తారు.
  • మానవ ప్రవృత్తిలో ఉన్న ద్వంద్వ అలోచానావిధానం, సాఘిక దురాచారాలు, వీరి కార్టూన్లలో నిసితంగా విమర్శించి, హాస్యం ప్రధానంగా, ఆకర్షణీయంగా ఉండి, పాఠకులను నవ్వులలో ముంచెత్తటమే కాకుండా, ఆలోచించటానికి కూడా ఉద్యుక్తులను చేస్తాయి.

సత్కార సమాహారం[మార్చు]

  • 1991 సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా కలెక్టరు చేతుల మీదగా ప్రశంసా బహుమతి.
  • 2001 సంవత్సరం ఉగాది పురస్కారం ఆంధ్ర ప్రదేశ్ అప్పటి గవర్నర్ సి.రంగరాజన్ చేతులమీదుగా అందుకోవటం

పుస్తకాలు[మార్చు]

  • విశాలాంధ్ర ప్రచురణ సంస్థ 1997లో వీరి రెండువందల కార్టూన్లను ఒక సంపుటిగా "నవ్వుల విందు" పేరుమీద ప్రచురించారు
  • చిత్రకళా పరిషత్ వారు 2008 సంవత్సరంలో ఈమె ఆత్మకథ నా గురించి నేను ప్రచురించారు. ఈ పుస్తకాన్ని, ప్రముఖ సాహితీవేత్త ద్వాదశి నాగేశ్వరశాస్త్రి (ద్వా.నా. శాస్త్రి) చేతులమీదుగా 2008లో విశాఖపట్నంలో విడుదలైంది.[6]

ప్రముఖుల అభిప్రాయాలు[మార్చు]

  • మీవి కేవలం కార్టూన్లే కాదు.. నేటికాలపు తెలుగు మధ్యతరగతి వారి చరిత్ర.

- బాపు, కార్టూనిస్టు, చిత్రకారుడు, సినీదర్శకుడు.[3]

  • రాగతి పండరి కార్టూన్ సామ్రాజ్యాన్ని మొత్తం తన కైవసం చేసుకున్న ఏకైక మహిళ కార్టూనిస్టుగా పేరు ప్రఖ్యాతులనార్జించింది. సామాజిక స్పృహతో, అను నిత్యం, కొత్త కొత్త అంశాలపై అమె విసిరిన విసురులు కోకొల్లలు. ముఖ్యంగా తెలుగు మహిళల జీవన సమస్యలను ఆకళింపు చేసుకుని వ్యంగ్యం జోడించి, తన సన్నటి, అతి స్వల్పమైన గీతలలో, పొందికైన వ్యాఖ్యలతో నవ్వుల పంటలు పండిస్తున్నది

-జయదేవ్, కార్టూనిస్టు.

  • కాలక్రమేణా, తనకంటూ స్వంత శైలి ఏర్పరుచుకుని, చాలామంది మగ తెలుగు కార్టూనిస్టులు, వృత్తిపరంగా అసూయ పడేలా దూసుకు వచ్చిన ఒకే ఒక మహిళా కార్టూనిస్టు. నిత్య జీవితంలో అనేక సంఘటనలను తనదైన శైలిలో, చక్కని హాస్యం మేళవించి వేనవేల కార్టూన్లలో ప్రదర్శించారామె!"

-రామకృష్ణ, కార్టూనిస్టు

  • పండగలు, పబ్బాలు, అల్లుళ్ళు, ఆడపడుచులు, దొంగలు, పోలీసులు, ఆఫీసులు, పార్కులూ.... ఆమె తాకని సబ్జెక్టులేదు, లాగని తీగ లేదు, నడవని డొంక లేదు. స్వైర విహారమే. కార్టూనులో ఏ మూల వెదికినా తేట తెలుగుదనమే, ఏ చోట స్పృశించినా తేనెల తెలుగు మాటలే.

-జయదేవ్, కార్టూనిస్టు.[5]

వ్యంగ్యచిత్ర మాలిక[మార్చు]

రాగతి పండరి సృష్టించిన పాత్రలలో కొన్ని[మార్చు]

మరణం[మార్చు]

2015 ఫిబ్రవరి 19విశాఖపట్టణంలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో కన్నుమూశారు.[7] ఆమె కోరిక ప్రకారం కుటుంబసభ్యులు ఆమె అవయవాలను సావిత్రిబాయి పూలే మెమోరియల్ ట్రస్ట్ ద్వారా దానం చేశారు.[8]

మూలాలు[మార్చు]

  1. "ప్రముఖ మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కన్నుమూత". one india. Archived from the original on 2023-02-03. Retrieved February 19, 2015.
  2. "తొలి తెలుగు మహిళా కార్టూనిస్ట్ – రాగతి పండరి". Archived from the original on 2023-02-03. Retrieved July 22, 2021.
  3. 3.0 3.1 "చెదిరిన గీత". జగతి పబ్లికేషన్స్. సాక్షి. 20 ఫిబ్రవరి 2015. Retrieved 21 February 2015.
  4. "వ్యంగ్య కార్టూనిస్టులలో కీర్తిప్రతిష్టలను పొందిన మహిళ". Archived from the original on 2015-07-30.
  5. 5.0 5.1 జయదేవ్ (20 ఫిబ్రవరి 2015). "నవ్వుల సంతకం". జగతి పబ్లికేషన్స్. సాక్షి. Retrieved 21 February 2015.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-10-06. Retrieved 2009-01-30.
  7. "ప్రముఖ మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కన్నుమూత".
  8. నాగేశ్వరరావు. "ప్రముఖ మహిళా కార్టూనిస్టు రాగతిపండరి కన్నుమూత". తెలుగు వన్ ఇండియా. Retrieved 19 February 2015.

2. నా గురించి నేను... రాగతి పండరి ఆత్మకథ-ప్రచురణ చిత్రకళా పరిషత్ 2008వ సంవత్సరంలో