రాజతరంగిణి అనువాదాలు - అనుసృజనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కల్హణుడు 12వ శతాబ్దిలో రచించిన రాజతరంగిణి కావ్యానికి తెలుగు సాహిత్యంలో అనువాదాలు, అంతకన్నా మిన్నగా అనుసృజనలు ఏర్పడ్డాయి. కాశ్మీర రాజతరంగిణిలోని కశ్మీర రాజుల ఇతివృత్తాలు, స్వభావ చిత్రణలు, చారిత్రికత తెలుగులో సాహిత్యకారులను ఆకర్షించింది. తెలుగులో సుప్రతిష్ఠులైన విశ్వనాథ సత్యనారాయణ, పిలకా గణపతిశాస్త్రి, విద్వాన్ విశ్వం తదితరులు రాజతరంగిణి అనువాదాలు, అనుసృజనలు చేశారు. సా.శ.1148-50ల్లో సంస్కృతంలో రాజతరంగిణి రచన జరిగిందని పరిశోధకుల నిర్ధారణ.[1]

అనువాదాలు[మార్చు]

మూలానికి విధేయంగా ఉంటూ తెలుగులోకి అనువర్తించడాన్ని తెనిగింపు లేదా అనువాదం అంటారు. ఈ ప్రకారమే పలువురు బహుభాషావేత్తలు, పండితులు రాజతరంగిణిని అనువదించారు.

  • కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు రాజతరంగిణిని తెలుగులోకి అదే పేరుతో అనువాదం చేశారు.[2]
  • స్వయంపాకుల వేంకటరమణ శర్మ తెలుగులోకి శ్రీ రాజతరంగిణి అనే పేరుతో చంపూ ప్రబంధంగా అనువదించారు. ఇది రెండు భాగాలుగా ముద్రితమయింది. మొదటి ఏడు తరంగాలు ఒక భాగం, ఎనిమిదవ తరంగం ఒక్కటి ఒకభాగం.
  • విద్వాన్ విశ్వం తెలుగులోకి రాజతరంగిణిని అనువదించారు.
రెండుచింతల లక్ష్మీనరసింహ శాస్త్రి తెలుగులో 
రాజతరంగిణి పేరుతో పద్య కావ్యంగా 
అనువదించారు. ఒకటి నుంచీ ఏడవ తరంగం 
వరకు పూర్తిగానూ,అష్టమతరంగం 
కొంతభాగం వరకు అనువాదం చేశారు.

అనుసృజనలు[మార్చు]

  • విశ్వనాథ సత్యనారాయణ ఆరు నవలల్ని కశ్మీర రాజతరంగిణి ఆధారంగా రచించారు. కాశ్మీర రాజవంశ నవలలు అనే సీరీస్‌ని ఈ రాజతరంగిణిలోని పలు తరంగాల్లో కథల ఆధారంగా వ్రాశారు. ఆ నవలలు ఇవి:
  1. యశోవతి - మహాభారత యుద్ధకాలం నాటి కాశ్మీర రాజయిన గోనందుడు తర్వాతి మూడు తరాల రాజుల ఇతివృత్తంతో నవల వ్రాశారు.
  2. పాతిపెట్టిన నాణెములు - కలియుగారంభం నాటి కాశ్మీర రాజుల కథను తీసుకుని పాతిపెట్టిన నాణెములు రచించారు.
  3. మిహిరకులుడు - మిహిరకులుడనే క్రూరుడైన కాశ్మీర రాజు గురించిన ఇతివృత్తంతో వ్రాశారు.
  4. సంజీవకరణి
  5. కవలలు - కాశ్మీర రాజ్యాన్ని ప్రతాపాదిత్య మహారాజు పరిపాలిస్తున్న కాలంలో జరిగిన ఓ విడ్డూరమైన కథను ఆధారం చేసుకుని ఈ నవల వ్రాశారు.
  6. భ్రమరవాసిని
  • కాశ్మీర పట్టమహిషి నవలను పిలకా గణపతిశాస్త్రి కల్హణుని రాజతరంగిణిలోని ప్రతాపాదిత్య మహారాజు కాలంలో జరిగిన కథను ఆధారం చేసుకుని రచించారు.[3]
  • చైత్ర పౌర్ణమి పేరిట ప్రచురితమైన పిలకా గణపతిశాస్త్రి కథాసంకలనం కూడా రాజతరంగిణి కథలనే ఆధారం చేసుకుని వుంది[3].
  • కస్తూరి మురళీకృష్ణ మొత్తం రాజతరంగిణిని ప్రతిబింబించేలా 16 కథలను వ్రాశారు. కాశ్మీర రాజతరంగిణి కథలు పేరిట ఈ కథల సంకలనం వెలువడి ప్రఖ్యాతి పొందింది.
  • పానుగంటి లక్ష్మీ నరసింహారావు చూడామణి నాటక ఇతివృత్తాన్ని కల్హణుడు రచించిన కాశ్మీర రాజతరంగిణి నుంచి వినయాదిత్యుడనే రాజు, దామోదరశర్మ అనే మంత్రిల యథార్థగాథను స్వీకరించి పెంచి రచించారు.[4]

మూలాలు[మార్చు]

  1. ధర్, సోమనాథ్ (1983). కల్హణుడు (1 ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాఢమీ.
  2. సత్యనారాయణశాస్త్రి, మధునాపంతుల (1950). ఆంధ్ర రచయితలు (1 ed.). pp. 265–271.
  3. 3.0 3.1 మురళి. "కాశ్మీర పట్టమహిషి(వ్యాసం)". nemalikannu.blogspot.in. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 9 December 2014.
  4. పానుగంటి, లక్ష్మీనరసింహారావు. చూడామణి. Retrieved 9 December 2014.