అక్షాంశ రేఖాంశాలు: 28°36′45″N 77°16′38″E / 28.61250°N 77.27722°E / 28.61250; 77.27722

అక్షరధామ్

వికీపీడియా నుండి
(అక్షరధాం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అక్షరధామ్
అక్షరధామ్ is located in ఢిల్లీ
అక్షరధామ్
అక్షరధామ్
భౌగోళికాంశాలు:28°36′45″N 77°16′38″E / 28.61250°N 77.27722°E / 28.61250; 77.27722
పేరు
స్థానిక పేరు:Swaminarayan Akshardham
దేవనాగరి:अक्षरधाम
స్థానం
దేశం:భారత దేశము
ప్రదేశం:Noida Mor, New Delhi
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:Swaminarayan
నిర్మాణ శైలి:Vastu Shastra and Pancharatra Shastra
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
6 November 2005 (consecration)
నిర్మాత:BAPS, Pramukh Swami Maharaj
వెబ్‌సైటు:http://www.akshardham.com/

అక్షరధామ్[1] భారతదేశ రాజధాని నగరమైన కొత్తఢిల్లీలో, దాదాపు వంద ఎకరాల సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం. నవంబరు 7, 2005వ తేదీన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదగా ఆవిష్కృతమైంది. 8వ తేదీ నుండి ప్రజలకు దర్శనీయ ప్రదేశంగా తెరిచారు. ఈ భవనం నిజాముద్దీన్ వంతెనకు కొంత దూరంలో "నొయిడా క్రాసింగ్" వద్ద యమునా నది తీరాన మహొన్నంతంగా వెలసి, పర్యాటకుల్ని, ఆధ్యాత్మికవాదులను, ప్రాచీన సంస్కృతీ వారసత్వారాధకులను సమంగా అలరిస్తోంది. అక్షరధాంలో ఆలయంతో పాటుగా, ఒక స్మారక భవన సముదాయం, ఒక విద్యా ప్రభోధ కేంద్రం, జ్ఞాన ప్రకాశ నిలయం ఉన్నాయి. అక్షరధామ్ సంప్రదాయక కళ, భవన నిర్మాణ పరిజ్ఞానం, భారతీయ సంస్కృతీ నాగరికతలు, ప్రాచీన నైతిక విలువలు, విజ్ఞానాల్ని ఉత్తమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సృజనాత్మంకంగా మేళవించిన తీరుకు ప్రతీక.

అక్షరధామ్ సముదాయం అంటే పరమాత్ముని శాశ్వత, అవినాశ నిలయం. వేదాలలో, ఉపనిషత్తులలో నిర్వచించబడిన శాశ్వత విలువలు, శాశ్వత సుగుణాలకు నెలవు. ఆ స్మారక భవన సముదాయం యొక్క పూర్తిపేరు "స్వామి నారాయణ్ అక్షరధామ్".

అక్షరధామ్-నిర్మాణ కళాశైలి

నిర్మాణ కళాశైలి

[మార్చు]

రాజస్తాన్ ‍లోని పిండ్వారా, సికంద్రా పట్టణాల నుంచి సేకరించిబడిన వేలాది టన్నుల కెంపువన్నె ఇసుకరాళ్ళు, పాలరాళ్ళతో నిర్మించబడినటువంటి ఈ కట్టడంలో ఒక అంగుళం మేరకైనా ఉక్కు వాడకపోవడం పెద్ద విచిత్రం. మొదటిదైన అక్షరధామ్ గుజరాత్ ‍కు చెందిన గాంధీనగర్‌లో వెలువగా, ఢిల్లీలోని ఈ అక్షరధామ్ రెండవది. బదరీనాథ్, కేదార్‍నాథ్, సోమనాథ్, కోణార్క్ ఆలయాల భవన నిర్మాణ కళాశైలి ఈ స్మారక భవన నిర్మాణానికి స్ఫూర్తి. వైదిక స్థపత్య శాస్త్రాల (భవన నిర్మాణ కళకు సంబంధించిన) నిబంధనలమేరకే ఈ అక్షరధాంని మలచడం ఒక విశేషం.

గిన్నిస్ బుక్

[మార్చు]

అక్షరధామ్ వంద ఎకరాల భూభాగం హృదయస్థానంలో భక్తిద్వార్, మయూర్ ద్వార్ అనే రెండు పెద్ద గేట్ల రక్షణతో బృహత్ సౌధంలా విరాజిల్లుతుంటుంది. అక్షరధామ్ స్మారక భవనం, పలు గుమ్మటాలతో, 141 అడుగుల ఎత్తు, 316 అడుగుల వెడల్పుతో, 370 అడుగుల నిడివితో చూపరులను దిగ్ర్భాంతికి లోనుచేస్తుంది.

ఎర్రటి ఇసుకరాళ్ళతో నిర్మించబడి, 1660 స్తంభాలతో అలరారే రెండస్తుల "పరిక్రమ" స్మారక భవనాన్ని కంఠాభరణంలా చుట్టివుంటుంది. దాని నిడివి దాదాపు రెండు కిలోమీటర్లు. 145 కిటికీలతో, 154 శిఖరాలతో అది అలరారుతుంటుంది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూదేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.

141 అడుగుల ఎత్తుతో అలరారే అక్షర్ ధామ్ ఆలయం పురాతన నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. ఆలయం గర్భగుడిలో 11 అడుగుల స్వామి నారాయణ్ మూర్తి. చెప్పుకోదగింది. ఆలయం మొత్తం రాజస్థానీ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించబడింది. ఆలయంలో నర్తకీమణులు, సంగీత విద్వాంసులు, కవులు, శిల్పకారుల చిత్తరువులు చూపరుల్ని కట్టిపడేస్తాయి. ఈ స్వామి నారాయణ్ అక్షర్ ధామ్ ని ప్రముఖ్ మహరాజ్ నిర్మించారు. న్యూఢిల్లీలోని ఈ ఆలయాన్ని 2005 లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధాని మన్మోహన్ సింగ్ జాతికి అంకితం చేశారు.

ఇస్లామిక్ తీవ్రవాదుల దాడి

[మార్చు]

2002 సంవత్సరం సెప్టెంబరు 24వ తేదీన ఇద్దరు ఇస్లామిక్ తీవ్రవాదులు అహ్మదాబాద్, గాంధీనగర్‌లో ఉన్న అక్షరధామ్‌‍పై ఆటోమేటిక్ ఆయుధాలు, గ్రెనైడ్లతో దాడి (జీహాద్) చేశారు. ఇందులో 33 మంది చనిపోయారు.[2] వీరిలో 28 మంది సందర్శకులు ఉండగా, ఇద్దరు కమెండోలు, ఒక ఎన్.ఎస్.జి కమెండో, స్టేట్ రిజర్వు పోలీసు‌కు చెందిన ఒక కానిస్టేబుల్ ఉన్నారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. అక్షరధామ్ పై దాడి కేసులో ముగ్గురు ముస్లిం తీవ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తూ పోటా కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది.
ఈ దాడి కేసు విచారణ పోటా కోర్టులో జరుగగా, 2006 జూలై ఒకటో తేదీన అదమ్ అజ్మెరీ, షాన్ మియా అలియాస్ చంద్ ఖాన్, ముఫ్తీ అబ్దుల్ ఖయ్యూమ్ మన్సూరీలకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తులు ఆర్.ఎం.దోషిత్, కేఎం.థకర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సమర్థించింది. పోటా కోర్టు విధించిన ముగ్గురికి మరణ శిక్షలను ధ్రువీకరించడమే కాకుండా, ఈ కేసులో మరో ముగ్గురు నిందితులకు కూడా జైలు శిక్ష విధించింది. [3]

గజారూఢ భవనం

[మార్చు]
యోగి హ్రాడే కమల్, ఒక లోటస్ ఆకారంలో పల్లపు తోట

స్మారక భవన రూప విషయానికొస్తే అహ్మదాబాద్ వాస్తు శిల్పి వీరేంద్ర త్రివేది రూపొందించిన ఆ కట్టడాన్ని 148 రాతి ఏనుగులు తమ భుజాలపై మోస్తుంటాయి. 148 ఏనుగులు భారత పురాణాలకు, పంచతంత్రానికి చెందిన గాథల ప్రతిరూపాలు, కాంగ్రా చిత్తరువులు, 20, 000 దేవతా విగ్రహాలు, పురాణ, ఇతిహాసాల కథలు, గాథలతో ఈ భవనం లోని ప్రతి చదరపు అంగుళం, కళాత్మకంగా కనువిందు చేస్తుంది. భవనం గర్భభాగంలో 11 అడుగుల ఎత్తుతో బంగారం తాపడం చేసిన స్వామి నారాయణ్ పంచలోహ విగ్రహం దర్శనమిస్తుంది.

కెంపు రంగులో వున్న ప్రహరీ గోడలు చాలా ఎత్తైనవి. దాటరానివి, ఈ బృహన్మందిర నిర్మాణానికి రాళ్ళెత్తిన వారి సంఖ్య 11, 000 అయితే, వ్యయం దాదాపు రెండువందల కోట్లు. ప్రపంచమంతటా విస్తరించివున్న స్వామి నారాయణ్ అనుయాయుల నుంచి లభించిన విరాళాలే అందుకుపకరించాయంటే దాని వైభవం, విస్తృతి, శిల్ప శోభ ఎంత మహొన్నతమైనవో ఊహాతీతం.

యజ్ఞపురుష్ ‍కుండ్

[మార్చు]
సంగీత ఫౌంటైన్, దాని నేపథ్యంలో నీలకంఠ వర్ని విగ్రహం

ప్రధాన మందిరం పక్కనే "యజ్ఞపురుష్ ‍కుండ్" అనే జలాశయం తారసపడుతుంది. మతాచార కర్మకాండల నిమిత్తం నిర్మించినఈ జలాశయం, 300x300 అడుగుల కొలతతో, 2870 మెట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద యజ్ఞకుండమని చెబుతారు.[4] రాతి మెట్ల దిగుడు బావి వంటి ఈ తటాకంలో వేదోక్తమయిన యజ్ఞకుండం కూడా ఏర్పాటైవుంది. దాని నడుమ రంగు రంగులుగా వుండి సంగీత స్వరాలు ప్రతిధ్వనించే నీటి ఊట ఆనందకారం. ఆ కాసారమేగాక స్మారకభవన సముదాయంలో ఆకర్షణీయమైన స్థావరాలు మరికొన్ని ఉన్నాయి. అందులో "నారాయణ్ సరోవర్" ఒకటి. స్వామి నారాయణులవారు క్రుంగు విడినవిగా భావించబడిన 151 పుణ్యనదీజలాలు ఈ సరోవరంలో నిక్షిప్తమై వున్నాయని ప్రతీతి.

భారత్ ఉపవన్

[మార్చు]

ఢిల్లీ నుండి యమునా నది మీదుగా అక్షరధాం వస్తే మొట్టమొదటగా ఈ విశాలమైన ఉద్యానవనం. ఈ ఉద్యానవనంలో పొదలు, ఫౌంటెయిన్లతో పాటుగా బోలెడన్ని కంచు విగ్రహాలు కూడా ఉన్నాయి. స్వాతంత్ర్యోద్యమంలో అమరులైన వీరుల, జాతీయ నాయకుల, శాస్త్రజ్ఞుల, పురాణాలలోని పిల్లల, స్త్రీపురుషులలు కంచు విగ్రహాలు ఈ ఉద్యానవనంలో ఉన్నాయి.[5] దాదాపు 9, 00, 000 పొదలు, మొక్కలు నాటిన ఈ వనం ధ్యాన ప్రదేశంగా ఉపయోగిస్తారు.

సినిమా ప్రదర్శనశాలలు

[మార్చు]

సినిమా ప్రదర్శనశాలల్లో అత్యాధునికమైనది "ఐమాక్స్" భవన సముదాయంలోని మూడు ప్రదర్శనశాలల్లో ఒకటైన "నీలకంఠ్ దర్శన్"లో ఈ ఐమాక్స్ ధియేటర్ నెలకొల్పబడివుంది. ఈ ధియేటర్‍లో స్వామి నారాయణ్ 11 ఏళ్ళ బాలయోగి బాల్యం 45 నిమిషాల సిన్మాగా అవిష్కృతమౌతుంది. దాని పేరు "మిస్టిక్ ఇండియా- యాన్ ఇన్‍క్రెడిబుల్ జర్నీ ఆఫ్ ఇన్‍స్పిరేషన్". ఆ చిత్రానికి దర్శకుడు హాలీవుడ్‍కు చెందినటువంటి కెయిత్ మెల్ట్‍న్. బాలయోగినుంచి ఒక మతశాఖకు వ్యవస్థాపకుడిగా స్వామి నారాయణ్ ఎదిగిన తీరుకది చిత్రణ. మానససరోవర శోభ, ఆహారం కోసం మృగరాజు తపన, కొండకోనల మీదుగా విమాన విహారాలు- ఆయౌగి ప్రస్థానంలో తారసపడే ఈ దృశ్యాలన్నీ సందర్శకుల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి.

ఈ సినిమా విశేషమేమంటే అందులో 45, 000 మంది కళాకారులు పాల్గొనడమేగాక, అది 108 యాత్రా కేంద్రాలలో చిత్రీకరించబడడం, జనవరి 2005 సంవత్సరంలో ప్యారిస్ నగరంలో నిర్వహించబడిన పదవ అంతర్జాతీయ లార్జ్‍ఫార్మాట్ ఫిలిం ఫెస్టివల్ (విస్తృత పరిమాణంలో చిత్రాల ప్రదర్శనోత్సవం) లో ప్రేక్షకుల ఎంపిక పురస్కారాన్ని గెలుచుకోవడంకూడా ఆ చిత్రం ప్రత్యేకతే.

సహజానంద దర్శన్

[మార్చు]

రెండు తటాకాల చూట్టూన్మించబడిన ఈ మూడు ప్రదర్శనశాలల్లో రెండవది "సహజానంద దర్శన్". సజీవ భ్రాంతి కలిగించేటటువంటి మట్టి ప్రతిమలతో, చాకచక్యంగా వెలుగు శబ్దాల వినియోగంతో, స్వామి నారాయణ్ భగవాన్ జీవితాన్ని అక్కడి ప్రదర్శన అవిష్కరిస్తుంది. అందుకుగాను పదిహేను త్రీడైమెన్ష్‍న్ డయోరమాలు (వర్ణ చిత్ర ప్రదర్శన యంత్రాలు) ఉపయోగించబడుతున్నాయి. పెద్ద సెట్టింగులు, శిల్పాలు, రోబోటిక్స్, పైబర్ ఆప్టిక్స్ వంటి సంకేతిక శబ్ద సాధనాలు, సంభాషణలు, సంగీతం కూడా నియోగించబడడంతో ప్రేక్షకుల కనులముందు 18వ శతాబ్ద వాతావరణం పునఃసృష్టించారు.

సంస్కృతి విహార్

[మార్చు]

మూడవ ప్రదర్శనశాల " సంస్కృతి విహార్ " భూగర్బంలో ఏర్పాటైన ఒక కృత్రిమ నదిలో ఒక పడవలో మీరు ప్రయాణించవలసివుంటుంది. ఆ పడవ షికారు ద్వారా పదివేల సంవత్సరాల భారతీయ సంస్కృతీ నాగరికతలు మీకు ఆనదీ తీరాన పరిచయమవుతాయి. పన్నెండు నిమిషాల పాటు సాగే ఆ శ్రవ్య-దృశ్య ప్రదర్శన మిమ్మల్ని ఊహాలోకంలోకి తీసుకువెళ్తుంది. అంత సుదీర్ఘకాలంలో మనదేశంలో కొనసాగిన ఆధ్యాత్మిక, శాస్ర్తీయ, చారిత్రక పరిశోధనలు, పరిణామాలను మీరు దర్శించడమేగాక ఆనాటి ఋషి శాస్త్రజ్ఞుల పరిశోధనా ఫలితాలు మీకు సుగ్రాహ్యమవుతాయి. అజంతా-ఎల్లోరా శిల్పాల నమూనాలతో బాటు ప్రపంచపు ప్రప్రథమ విశ్వవిద్యాలయమైన తక్షశిలకూడా మీకు అక్కడి శ్రవ్య-దృశ్య ప్రదర్శన ద్వారా దృగ్గోచరమవుతుంది.

స్వామి నారాయణ్

[మార్చు]
స్మారక కేంద్ర గోపురం

ఉత్తరప్రదేశ్‍లోని అయోధ్యకు సమీపంలో వున్న ఛాపయ్యా గ్రామంలో 1781 లో ఆయన జన్మించాడు. ఏడవ ఏటనే పవిత్ర గ్రంథాల్ని పఠించి వాటి సారాన్ని గ్రహించాడు. నాలుగేళ్ళ తర్వాత ఆధ్యాత్మిక యాత్రీకుడిగా ఇల్లు వదిలి వెళ్ళాడు. ఏడేళ్ళ పాటు కాలినడకన భారతదేశమంతా సంచరించి, వివిధ సంస్కృతీ రూపాల్ని ఆకళింపుజేసుకుని, చివరకు గుజరాత్‍లో స్థిరపడ్డాడు. సాంఘిక- ఆధ్యాత్మిక విప్లవానికి నాందిపలికి ' స్వామి నారాయణ సంప్రదాయానికి వ్యవస్థాపకుడయ్యాడు. లక్షలాది జనులు ఆ సంప్రదాయానికి అనుయాయులయ్యారు. ఆ తర్వాత నలబైతొమ్మిదేళ్ళు ఈ భూమ్మీద జీవించి, తన వారసుల దీక్షవ్వారా, తన బోధనల ప్రాచుర్యం ద్వారా, తాను అమలుపరచిన సంప్రదాయం "అక్షరం" (వినాశనం లేనిది) గా కొనసాగే మార్గం సుగమం చేశాడు. అందుకే ఆ భవనసముదాయం "అక్షరధామ్"గా ప్రసిద్ధిపొందింది. అదెలాగ సంభవమైందీ అంటే, ఆ సంప్రదాయానికి చెందిన బ్రహ్మ స్వరూప్ యోగీజి మహారాజ్ 1968 లో ఒక కోరిక వెలిబుచ్చాడు. యమునాతీరాన ఒక స్మారక భవనం నిర్మించబడాలన్నదే ఆ అకాంక్ష. అయినా ఆయన జీవితకాలంలో అది జరగలేదు. ఆయన వారసుడు బొచాసన్‍వాసి శ్రీ అక్షర పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బ్యాప్స్) కు ఆధ్యాత్మిక గురువైన ప్రముఖ్ స్వామి మహారాజ్ (83) ద్వారా ఆ కోరిక నెరవేరింది. కేవలం ఆయన చొరవతో, ఆశీస్సులతో రెండు దశాబ్దాల కృషి ఫలితంగా నేటి స్వామి నారాయణ్ అక్షరధామ్ వెలిసింది.

ఆ బ్యాప్స్ సంస్థ ఢిల్లీలోనే కాదు విశ్వవ్యాప్తంగా అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలలో అలాంటి స్మారకభవన సమూదాయాలను 600 లకు పైగా నిర్మించింది. ప్రముఖ్ స్వామి ఆధ్వర్యంలో 200 కోట్ల వ్యయంతో, 11, 000 మందికి మించిన పనివారితో 7000 వాలంటీర్లు రాత్రింబవళ్ళు శ్రమించి, అయిదేళ్ళలో ఆ సాంస్కృతిక విద్యా ప్రబోధ, వినోద కేంద్రం నిర్మించారు. ఆ నిర్మాణం ఎంత దృఢమైందంటే, ఎలాంటి భూకంపాలనైనా తట్టుకొని, వెయ్యి సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా మనగలదు. ఇంత పరమాద్భుతమయిన స్వామి నారాయణ్ అక్షరధామ్ యుగయుగాలుగా పరిఢవిల్లుతోన్న భారతీయ సంస్కృతీ, ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఆ సంస్కృతి సౌందర్యాన్ని, దానిలో నిక్షిప్తమైవున్న అపారవిజ్ఞానం, పరమానందాలను ఆ భవనసందర్శనం ద్వారా మనం ఆకళించుకోగలుగుతాము. ప్రాచీన భవన నిర్మాణ శిల్ప సంప్రదాయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మిళితమై నయన మనోరంజకత్వం కల్పిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. http://www.akshardham.com/
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-05-26. Retrieved 2010-09-12.
  3. http://telugu.webdunia.com/newsworld/news/national/1006/01/1100601029_1.htm
  4. అక్షరధాం వెబ్‌సైటులో యజ్ఞపురుష కుండం వివరాలు Archived 2008-09-15 at the Wayback Machine. సేకరించిన తేదీ: జూలై 6, 2007.
  5. హిందూఇజంటుడే.కాంలో అక్షరధాంపై Archived 2007-09-29 at the Wayback Machine, రాజీవ్ మాలిక్ రాసిన ఒక వ్యాసం. సేకరించిన తేదీ: జూలై 6, 2007.

బయటి లింకులు

[మార్చు]