పురిపండా అప్పలస్వామి
పురిపండా అప్పలస్వామి ( నవంబరు 13, 1904 - నవంబరు 18, 1982) బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయులు.
జననం
[మార్చు]వీరు విజయనగరం జిల్లా, సాలూరు గ్రామంలో నవంబరు 13, 1904 సంవత్సరంలో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం కొంతకాలం జరిపి, పిదప స్వయంకృషి వలన ఆంధ్ర, సంస్కృతాలలోనే గాక ఒరియా, హిందీ, బెంగాలీ, ఆంగ్ల భాషలలో సమధిక పాండిత్యాన్ని ఆర్జించారు. వీరు మహాత్మాగాంధీ నిర్వహించిన సహాయ నిరాకరణోద్యమం, హరిజనోద్యమం, ఖాదీ ప్రచారము లలో అత్యంత శ్రద్ధతో పాల్గొన్నారు. విశాఖపట్నంలో అఖిల భారత చరఖా సంఘం వారి ఖాదీ భాండాగారంలో నిర్వహకుడుగా కొంతకాలం పనిచేశారు.
పత్రికా రంగంలో వీరు తన ప్రతిభను ప్రదర్శించారు. విశాఖపట్నం నుండి వెలువడిన 'స్వశక్తి' అను జాతీయ వారపత్రికకు సహాయ సంపాదకుడుగా కొంతకాలం పనిచేశారు. 'ఆంధ్రపత్రిక' కు స్వకీయ విలేఖరిగా పన్నెండేళ్ళు వ్యవహరించారు. 'సత్యవాణి' పత్రికను నిర్వహించుచు ఆయన రాసిన సంపాదక వ్యాసాలు పునర్ముద్రణ గౌరవాన్ని పొందాయి. వీరు ప్రచురించిన 'వైశాఖి' మాసపత్రిక సారస్వత ప్రియుల మన్ననలను ఆర్జించింది.
గ్రంథాలయోద్యమంలో వీరు సాగించిన కృషి గణనీయం. మంతెన ఆదినారాయణ స్వామి స్థాపించిన ఆంధ్రప్రదేశ్ ప్రథమ గ్రంథాలయాన్ని, 'కవితా సమితి' గ్రంథాలయాన్ని ఆయన చక్కగా అభివృద్ధి పరచారు. శ్రీరామవరం, పార్వతీపురంలలోని గ్రంథాలయాలను చాలా పెంపొందించారు. మరకాం గ్రామాన ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ యావజ్జీవ గౌరవ సభ్యులుగా వీరు ఎన్నుకోబడినారు.
వీరు సాహిత్యరంగంలో సాధించిన కృషి పరిగణన పొందింది. వీరు 15 ఏళ్ళ ప్రాయంలోనే తెలుగులో గద్యపద్య రచనను మొదలుపెట్టారు. 1928 వరకు ఆయన గ్రాంథిక భాషావాది. గిడుగు వెంకట రామమూర్తిని దర్శించి, ఆయన వలన ప్రభావితుడై తదాదిగ తన సాహిత్య కృషిని వ్యావహారిక భాషలోనే సాగించారు. కందపద్యమయమైన 'రాట్నపతాకం' ఇతని తొలి రచన. వీని ప్రముఖ రచనలలో 'సౌదామిని' ఆంగ్లంలోకే కాక హిందీ, ఒరియా భాషలలోకి కూడా అనువదింపబడి పెక్కు ముద్రణలను పొందింది. కేంద్ర సాహిత్య అకాడమీ కోరికపై వీరు 'అమృత సంతానం', 'మట్టి మనుష్యులు' అనే ఒరియా నుండి తెనిగించారు. వంగసాహిత్య చరిత్ర, ఒరియా సాహిత్య చరిత్రలను వీరు తెలుగులో రచించారు. అలాగే ఆంధ్ర సాహిత్య చరిత్రను ఒరియా భాషలో రచించి తెలుగు సాహిత్యంతో పరిచయాన్ని ఒరియా పండితులకు కల్పించారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వ్యవహారిక భాషలో రచించుటకు పూనుకొన్న సంస్కృత భారతానువాదం శాస్త్రిగారి మరణం వలన అసమగ్రంగా నిలిచిపోగా, వీరు పూనుకొని మిగిలిన పదిహేనున్నర పర్వాలను రచించి పూర్తిచేశారు.
ఆయన విశాఖ రచయితల సంఘానికి కొంతకాలం అధ్యక్షుడుగ పనిచేశారు. అఖిల భారత పి.ఇ.ఎస్. సంస్థ యందు, ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ యందు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో కార్యవర్గ సంఘాలలో వీరు సభ్యత్వాలను పొందారు.
మరణం
[మార్చు]వీరు నవంబరు 18, 1982 సంవత్సరంలో పరమపదించారు. వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ పురస్కారం ప్రదానం చేసింది.
వీరి శతజయంతి ఉత్సవాలు విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరి జీవితచరిత్ర, సాహిత్యం గురించిన ద్వా.నా.శాస్త్రి రచించిన పుస్తకం విడుదలచేశారు. వీరి విగ్రహాన్ని బీచ్ రోడ్డులో ప్రతిష్ఠించారు.
రచనలు
[మార్చు]- రాట్న పతాకం
- మహమ్మద్ చరిత్ర
- సౌదామిని
- ఒరియా పాటలు
- జగద్గురు శంకరాచార్య
- ఛెతిమాణ అఠంగుఠ
- విశ్వకళావీధి
- హంగేరీ విప్లవం[1]
- దేవీ భాగవతం
- పురిపండా భాగవతము ఇంటర్నెట్ ఆర్ఛీవులో అభిస్తుంది
- పురిపండా వ్యావహారికాంధ్ర మహాభారతం
- శ్రీమద్భాగవతము
- వ్యావహారికాంధ్ర వాల్మీకి రామాటణం
- అమృత సంతానం (అనువాదం)
- మట్టిమనుష్యులు (అనువాదం)
- వంగ సాహిత్య చరిత్ర
- ఒడియా సాహిత్య చరిత్ర
- భగవద్గీత
- ఉపనిషత్సారం
బయటి లింకులు
[మార్చు]- avkf లో లభించే పురిపండా పుస్తకాలు
- పురిపండా భాగవతము
- పురిపండా విగ్రహావిష్కరణ గురించి Archived 2012-11-05 at the Wayback Machine
- పురిపండా అప్పలస్వామి సహరచన చేసిన ఉత్తర భారత సాహిత్యములు
మూలాలు
[మార్చు]- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
- తెలుగు తేజం పురిపండా అప్పలస్వామి : జీవితం-సాహిత్యం: (1904-1982) శతజయంతి సంవత్సర ప్రచురణ, ద్వా.నా. శాస్త్రి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 2005.