కవితా సమితి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కవితా సమితి
కవితా సమితి
స్థాపన1926 మే 6 (1926-05-06)
వ్యవస్థాపకులుమారేపల్లి రామచంద్ర శాస్త్రి
కేంద్రీకరణసాహిత్య, సాంస్కృతిక సంస్థ
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
ముఖ్యమైన వ్యక్తులుపురిపండా అప్పలస్వామి,
శ్రీరంగం శ్రీనివాసరావు,
వడ్డాది సీతారామాంజనేయులు,
సబ్నవీసు సత్యకేశవరావు

కవితా సమితి విశాఖపట్నం కేంద్రంగా స్థాపించబడిన ఒక సాహిత్య సంస్థ. జాతీయోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో ఉత్సాహవంతులైన ముగ్గురు యువకవులు - శ్రీశ్రీ, పురిపండా అప్పలస్వామి, వడ్డాది సీతారామాంజనేయులు ఈ సంస్థను 1926, మే 6న స్థాపించారు.[1] "కవిగారు"గా ప్రసిద్ధులైన మారేపల్లి రామచంద్ర శాస్త్రి ఈ సంస్థకు శాశ్వత అధ్యక్షులు.

కవితా సమితి సారథులు

చరిత్ర[మార్చు]

ఈ సంస్థ తొలి సమావేశం 1926, నవంబర్ 20వ తేదీన మారేపల్లి రామచంద్ర శాస్త్రిగారి నివాస స్థలం "ధర్మాశ్రమం"లో జరిగింది. మారేపల్లి రామచంద్ర శాస్త్రిగారిని అధ్యక్షులుగా, భమిడిపాటి చిన యజ్ఞనారాయణ శర్మగారిని ఉపాధ్యక్షులుగా, పురిపండా అప్పలస్వామిని కార్యదర్శిగా, సబ్నవీసు సత్యకేశవరావును కోశాధికారిగా ఎన్నుకున్నారు. పద్య, గద్య, గేయాలలో రచనలు చేయగలిగినవారు ఈ సంస్థలో సభ్యులుగా చేరవచ్చు. సభ్యులు రచించిన గ్రంథాలను కార్యనిర్వాహకవర్గం ఆమోదిస్తే కవితా సమితి ప్రచురిస్తుంది. ఈ సంస్థలో 50 మందికి పైగా సభ్యులు ఉండేవారు. సుమారు 30 గ్రంథాలను ఈ సంస్థ ప్రకటించింది.

కార్యక్రమాలు[మార్చు]

రవీంద్రనాథ్ టాగూర్‌తో కవితాసమితి సభ్యులు

కవితా సమితి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికి కనకాభిషేకం జరిపింది. మారేపల్లి రామచంద్ర శాస్త్రి షష్టిపూర్తి ఉత్సవాన్ని ఘనంగా చేపట్టింది. 1933లో గిడుగు రామమూర్తి అధ్యక్షతన ఈ సంస్థ మల్లంపల్లి సోమశేఖరశర్మ సమక్షంలో "ఆంధ్ర కవుల ఛాయాచిత్ర ప్రదర్శన"ను నిర్వహించింది. 1933, డిసెంబర్ 10న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ విశాఖపట్నం వచ్చినప్పుడు ఈ సంస్థ ఏర్పాటు చేసిన సన్మానసభ పురజనుల ప్రశంసలను అందుకుంది. అనకాపల్లి, మద్రాసులలో ఈ సంస్థ తన శాఖలను ఏర్పరిచింది. ఈ సంస్థ వజ్రోత్సవాన్ని కూడా జరుపుకుని తరువాత అచేతనమయ్యింది.

సభ్యులు[మార్చు]

ఈ సంస్థ సభ్యులలో ఆచంట సాంఖ్యాయన శర్మ, కేతవరపు వేంకటశాస్త్రి, తాపీ ధర్మారావు, సెట్టి లక్ష్మీనరసింహం, గొబ్బూరి వెంకటానంద రాఘవరావు, తెన్నేటి విశ్వనాథం, పరవస్తు లక్ష్మీ నరసింహస్వామి, ఇచ్ఛాపురపు యజ్ఞనారాయణశాస్త్రి, మొసలికంటి సంజీవరావు, వెంపటి సత్యనారాయణ, స్థానాపతి సత్యనారాయణశాస్త్రి, స్థానాపతి రుక్మిణమ్మ, శ్రీశ్రీ, ఆరుద్ర మొదలైనవారు ఉన్నారు.

ప్రచురణలు[మార్చు]

ఈ సంస్థ ప్రచురించిన వాటిలో కొన్ని:

  • ప్రభవ - పద్యకవితా సంపుటి - రచన: శ్రీశ్రీ
  • వ్యవహారికాంధ్ర మహాభారతము - రచన: పురిపండా అప్పలస్వామి
  • తెలుగు తోబుట్టువులు[2] - రచన: మారేపల్లి రామచంద్ర శాస్త్రి
  • నన్నయ్య నుడులు[3] - రచన: మారేపల్లి రామచంద్ర శాస్త్రి
  • కాదంబిని - రచన: స్థానాపతి రుక్మిణమ్మ
  • ఆంధ్ర వేణీసంహార విమర్శము
  • యుక్తిమాల - రచన: చిలకమర్తి లక్ష్మీనరసింహం
  • వత్సంరాజు - రచన: కొమ్ము దమయంతీదేవి
  • చతుష్పథం - రచన: బసవరాజు
  • పాలకడలి - రచన: దత్తి చిన్నికృష్ణ
  • వైశాఖి - వివిధ కవుల రచనల సంకలనం - రెండు సంచికలు
  • వార్షికోత్సవ సంచికలు

మూలాలు[మార్చు]

  1. ద్వా.నా. శాస్త్రి. సాహిత్య సంస్థలు. pp. 24–25. Retrieved 6 December 2023.
  2. ఆర్కీవ్స్‌లో తెలుగు తోబుట్టుబులు
  3. ఆర్కీవ్స్‌లో నన్నయ్య నుడులు