శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
జననంఏప్రిల్ 23, 1891
అనపర్తి మండలం పొలమూరు
మరణంఫిబ్రవరి 25, 1961
రాజమండ్రి
ఇతర పేర్లుశాస్త్రి, వాచస్పతి, తార్కికుడు, వసంతుడు, కుమారకవిసింహుడు, భటాచార్యుడు, కౌశికుడు
భార్య / భర్తసీత
తండ్రిలక్ష్మీపతి సోమయాజులు
తల్లిమహలక్ష్మీ సోదెమ్మ
రాజమండ్రిలో వేదగిరి రాంబాబు చే నెలకొల్పబడిన శ్రీపాద సుబ్రహ్మణ్యం విగ్రహం

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత (ఏప్రిల్ 23, 1891 - ఫిబ్రవరి 25, 1961). భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఇతను పేరెన్నిక గన్నవారు.ఇతని జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేడీయన.

వేదవేదాంగాలు తరతరాలుగా అధ్యయనం చేసే కర్మిష్టులూ, పండితులూ అయిన కుటుంబంలో పుట్టి, సంస్కృతానికి స్వస్తి చెప్పి, తెలుగులో చిన్న కథలని రాయటం ప్రవృత్తిగా ఎన్నుకుని ఆ చిన్న కథకి కావ్యప్రతిపత్తి కలిగించిన సాహిత్య శిల్పి, సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన ఆత్మకథ పేరు అనుభవాలూ-జ్ఞాపకాలూనూ.

జీవిత విశేషాలు[మార్చు]

సుబ్రహ్మణ్యశాస్త్రి 1891 ఏప్రిల్ 23తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మహలక్ష్మీ సోదెమ్మ, లక్ష్మీపతి సోమయాజులు. వేదం, జ్యోతిష్యం, ధర్మ శాస్త్రాలను చదివారు.ఇతను గాంధీ, ఖద్దరు, హిందీ - ఈ మూడింటినీ వ్యతిరేకించారు.సుబ్రహ్మణ్యశాస్త్రి 1961 ఫిబ్రవరి 25రాజమహేంద్రవరం లో మరణించారు.

విద్యాభ్యాసం[మార్చు]

రచనలు[మార్చు]

సుబ్రహ్మణ్య శాస్రి 75 కథలు రాసారు.ఇతని కథలలో విషయాన్ని ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబజీవితం, అపరాధ పరిశోధనం, భాషావివాదాత్మకం, అవహేళనాత్మకం, చారిత్రకం అనే విషయాలుగా విభజించచ్చు. ఇవేకాక శ్రీపాద అనేక పద్య రచనలు, నవలలు,నాటకాలు,అనువాదాలు, వైద్య గ్రంథాలు కూడా రాసారు. వాటిలో కొన్ని: ఆత్మబలి, రక్షాబంధనం, రాజరాజూ, కలంపోటు, వీరపూజ, వీరాంగనలు, మహాభక్త విజయము, ఆయుర్వేద యోగ ముక్తావళి, వైద్యక పరిభాష వగైరా. శాస్త్రి తన ఆత్మకథ - అనుభవాలూ-జ్ఞాపకాలూనూ ని ఎనిమిది సంపుటాలుగా ప్రచురించదలిచారు. కానీ శాస్త్రి అకాలమరణంతో అది మూడు సంపుటాల దగ్గర నిలిచిపోయింది. ఈయన రచనలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల, కళాశాలలలో పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. శాస్త్రి తొమ్మిదేళ్ళ పాటు ప్రబుద్ధాంధ్ర పత్రిక నిర్వహించారు. గిడుగు రామమూర్తి లాగా ప్రముఖ వ్యావహారిక భాషావాది. కలం పేర్లతో శతాధిక వ్యాసాలు రాసారు. అనేక అష్టావధానాలు కుడా చేసారు. 1956 లో కనకాభిషేకం అందుకున్నారు.

వీరి మొదటి కధ "ఇరువరము ఒక్కచోటికే పోదాము"అన్నది 1915లో ప్రచురితమైనది."మిధునానురాగము" అన్నది వీరు మొదటి నవల. 1923 వరకు గ్రాంధికముగా రచనలు చేసి తదుపతి రెండు సంవత్సరములలో సంపూర్ణముగా వ్యావహారిక భాషకు దిగిపోయినారు. 1938నుండి వీరు పద్యరచనను పరిపూర్ణముగా నిషేధించారు. శాస్త్రిగారు హింది-గాంధీ-ఖద్దరు ఈ మూడింటిని గిట్టని వ్యక్తి. తమ వ్యక్తిత్వమును చివరివరకు అట్లే నిలదొక్కుకున్నారు. శాస్త్రిగారు ఒక యుగసంధిలో పెరిగిన వ్యక్తి. శుద్ధ శోత్రియకుటుంబములో పుట్టి ఆ కుటుంబ వ్యవస్థ తాలూకు ఆచారవ్యవహారలనుండి బయటపడటానికి నానా యాతనలు పడి గడిచి గట్టెక్కినవారు. ఈ ప్రశ్నలకు సరియిన సమాధానాలు ఆయన ఆత్మకధలో అనుభవాలూ-జ్ఞాపకాలు చదవాలి. ఈ గ్రంధం మొదటి ప్రచురణ 1955 జూన్లో కూర్పు వెలువడింది. కలాభివర్దినీ పరిషత్తు, రాజమండ్రి దీని ప్రచురణ కర్తలు. తరువాతది 1958లో, మూడవది 1966లో అటుపై శాస్త్రిగారి అకాల మరణం వలన మూడవ సంపుటంతో ఆఖరు.ఈ సంపుటాన్ని అద్దేపల్లి అండ్ కోవారు ప్రచురించారు.కాగా శాస్త్రిగారికి మొదట్లో ఆత్మకధ వ్రాసుకోవాలన్న ఉద్దేశ్యం లేదు. నవోదయపత్రికవారికోసం దాని సంపాదకులు నీలంరాజు వెంకటశేషయ్య గారు వారిచేత బలవంతంగా వ్రాయించారు. అంతకుపూర్వం శాస్త్రిగారు ఆనందవాణి వార్షికపత్రికలో నాదీపావళి ముచ్చట్లు అన్నశీర్షికతో ఇటువంటి రచనలే చేశారట.

శాస్త్రిగారు విద్యార్ధిదశలో వల్లూరుగ్రామంలో వుండగా ఒక డెబ్బయి యేళ్ల వితంతువు వొకావిడ కావాలని పరిచయం చేసుకొని, శాస్త్రిగారి చేత మదనకామరాజు కధలు యేకాంతంగా నాలుగుసార్లు చదివివినుపించుకొందట.ఈపుస్తకమే శాస్త్రిగారికి వచన రచనలో ఆప్యాయత కుదిర్చింది. తరువాత వారు మేడపాడు గ్రామంలో అరేబియన్ నైట్స్ కధలూ, చార్ దర్వీష్ కధలు, శుక సప్తతి కధలు, రేచుక్క పగటిచుక్క కధలు చదివారు. వాటి భాష ఆయనకి నచ్చక మళ్ళీ సులభమైన వచనంమీద అభిమానం ఏర్పడినది. రామకృష్ణ కవుల దగ్గర చేరిన ఆరుమాసాలకే తమలో ఏదో కొత్తదనం ఏర్పడినట్లు అనిపించిందట అక్కడే వీరపూజ రచించినారు.

శాస్త్రిగారు ప్రకటించిన చిన్న కధల సంపుటాలే 27 ఉన్నాయి. అద్దేపల్లి వారికి వీటితాలూకు సంపూర్ణ అధికారం ఉన్నాయి. ఇవికాక శాస్త్రిగారు వ్రాసిన ఇతరగ్రంధాలు అనేకం ఉన్నాయి. నాటకాలు 'వారకంత', 'ప్రేమపాశం', 'నిగళబంధం', 'రాజరాజు' ఇంకా అనేక ఏకాంకికలు (కలంపోటు అనేది ఒకటి). అలాగే అత్తా-అల్లుడు, అలంకృతి, అభిసారిక, బాలిక-తాత మొదలయిన ఖండకావ్యాలు,రేడియో ప్రసంగాలు, స్మశానవాటిక, రక్షాబంధనము నవలలు ఉన్నాయి.దాదాపు 10సం. ప్రబుద్దాంధ్రలో వారు వివిధములయిన రచనలు చేసినారు. నన్నయ శ్రీనాధ జయంతులు నడిపినారట. వారి కవిత్వము గురుంచి ఎన్నో విపుల వ్యాసములు వ్రాసినారు.

వ్యక్తిగతం[మార్చు]

సుబ్రహ్మణ్యశాస్త్రి వ్యక్తిగతం గురించి తన స్వీయచరిత్ర పుస్తకాలైన అనుభవాలూ-జ్ఞాపకాలూనూ లో వివరంగా రాసుకొన్నారు. దాని ప్రకారం చిన్నతనం నుండి బాగా అల్లరి చిల్లరిగా పొలాల వెంట తన స్నేహితుడు ఆనంద్ తో తిరిగేవాడినని రాసారు. చాలాకాలం మునికూడలి (మురమళ్ళ) లో వారాలు చేసుకొంటూ విద్యాభ్యాసం కొనసాగించారు. చిన్న వయసులోనే అత్త కూతురు సీతతో వివాహం జరిగింది. వీరికి సంతానం లేదు.

ప్రఖ్యాత సందేశాలు[మార్చు]

  • తెనుగుదేశమే దేశం, తెనుగు భాషే భాష
  • తెనుగు మనుష్యులే మనుష్యులు, తెనుగు వేషమే వేషం.
  • ఏ జాతి యెదటా ఏ సందర్భంలోనూ ఎందుకున్నూ నా తెనుగుజాతి తీసిపోదు

కథలు[మార్చు]

  • వీరపూజ
  • కలుపు మొక్కలు
  • గులాబీ అత్తరు
  • శుభికే శిర ఆరోహ
  • తాపీమేస్త్రి రామదీక్షితులు బి.ఏ.
  • మార్గదర్శి - (విద్యార్థులు తప్పక చదవాల్సినది )
  • ఇలాంటి తవ్వాయి వస్తే
  • షట్కర్మయుక్తా
  • పుల్లంపేట జరీచీర
  • ఇల్లుపట్టిన వెధవాడపడుచు
  • అన్నంతపనీ జరిగింది
  • విమానం ఎక్కబోతూనూ
  • కీలెరిగిన వాత
  • గూడుమారిన కొత్తరికం
  • అరికాళ్ళకింద మంటలు
  • కన్యాకాలే! యత్నా ద్వరితా!
  • కొత్త చూపు
  • గుర్రప్పందాలు
  • జాగ్రత్త పడవలసిన ఘట్టాలు
  • తల్లి ప్రాణం
  • కూతుళ్ళ తల్లి
  • ముళ్ళచెట్టూ-కమ్మని పువ్వూనూ
  • బ్రాహ్మణాగ్రహారం
  • యావజ్జీవం హోష్యామి
  • కలంపోటు
  • ప్రబుద్దాంధ్ర వ్యాఖ్యానాలు
  • మీగడ తరకలు (భారతి లో ప్రచురితం)
  • విజయనగర రాజుల కథలు[1] అనే ఈ పుస్తకం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి బాలురకు చరిత్ర లోని నీతి కథలు తెలియుటకు వ్రాసిన విషయాల సంపుటం. ఈ పుస్తకముతో పాటు గోల్కొండనవాబు కథలు, ఓరుగంటి రాజుల కథలు , చిత్తూరు రాజుల కథలు, ఢిల్లీ రాజుల కథలు వెలువడ్డాయి.

నవలలు[మార్చు]

నాటకాలు[మార్చు]

  • వారకాంత
  • ప్రేమపాశం
  • నిగళబంధనం
  • రాజరాజు
  • కలంపోటు (ఏకాంకిక)

వీటిలో ఏదీ రంగస్థలం ఎక్కలేదు.

ఖండకావ్యాలు[మార్చు]

  • అత్త-అల్లుడు
  • అలంకృతి
  • అభిసారిక
  • బాలిక-తాత

విమర్శలు[మార్చు]

  • పాణిగృహీతా శ్రవణానందశృంఖల (వేంకటశాస్త్రి గ్రంథం పై విమర్శ)
  • గళహస్తిక (రామకృష్ణశాస్త్రి చింపేసేరు)

సంపాదకత్వం[మార్చు]

  • ప్రబుద్దాంధ్ర

తొమ్మిది ఏళ్లు నడచి ఆగిపోయింది.

ఇతర రచనలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఆర్కివులో విజయనగర రాజుల కథలు పూర్తి పుస్తకం.