ఆమిర్ ఖాన్
ఆమిర్ ఖాన్ | |
---|---|
జననం | మహ్మద్ అమీర్ హుస్సేన్ ఖాన్ 1965 మార్చి 14 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
జాతీయత | ఇండియన్ |
వృత్తి | నటుడు, నిర్మాత, గాయకుడు, దర్శకుడు
|
క్రియాశీల సంవత్సరాలు | 1984 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | జునైద్, ఇరా, ఆజాద్ రావు |
తల్లిదండ్రులు | తాహిర్ హుస్సేన్ (తండ్రి) జీనత్ హుస్సేన్ (తల్లి) |
ఆమిర్ ఖాన్(జననం 14 మార్చి 1965) ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత. భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటునిగా కూడా ఆయన ప్రసిద్ధుడు.[1][2] ఆమిర్ అసలు పేరు మహమద్ ఆమిర్ హుస్సేన్ ఖాన్. ఆయన నాలుగు జాతీయ పురస్కారాలతో పాటు ఏడు ఫిలింఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు. భారత ప్రభుత్వం 2003లో పద్మశ్రీ, 2010లో పద్మ భూషణ్ పురస్కారాలతో ఆయనను గౌరవించింది.[3]
పెద్దనాన్న నాసిర్ హుస్సేన్ తీసిన యాదోంకీ బారాత్ (1973) చిత్రంలో చిన్నపాత్రలో మొదటిసారి నటించారు ఆమిర్. ఆ తరువాత హోలీ సినిమాలో నటించిన ఆయన హీరోగా ఖయామత్ సే ఖయామత తక్(1988) సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలోనూ, ఆ తరువాత చేసిన రాఖ్ (1989) సినిమాలోనూ ఆయన నటనకు జాతీయ పురస్కారాల ఫంక్షన్ లో ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. 1990వ దశకంలో ఆయన నటించిన దిల్ (1990), రాజా హిందుస్థానీ (1996), సర్ఫరోష్ (1994) వంటి సినిమాలతో బాలీవుడ్ సినీరంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సర్ఫరోష్ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు ఆమిర్. కెనెడా-భారత్ కు చెందిన చిత్రం ఎర్త్(1998) సినిమాలో ఆమిర్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.
2001లో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి మొదటి సినిమాగా లగాన్ ను నిర్మించి, అందులో హీరోగా నటించారు ఆమిర్. ఆ సినిమా ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ పురస్కారం, జాతీయ ఉత్తమ పాపులర్ చిత్రం పురస్కారం అందుకొంది. ఆ తరువాత 4 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న ఆమిర్ 2006లో ఫనా, రంగ్ దే బసంతీ వంటి సినిమాలతో తిరిగి విజయం అందుకున్నారు ఆయన. ఆ తరువాతి సంవత్సరం తారే జమీన్ పర్ చిత్రంతో దర్శకుడిగా కూడా మారారు ఆమిర్. ఈ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం పురస్కారాలు కూడా వచ్చాయి. ఘజిని(2008), 3 ఇడియట్స్(2009), ధూమ్ 3(2013), పికె(2014) వంటి సినిమాలతో కమర్షియల్ గానే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు ఆమిర్. పికె ఆయన కెరీర్ లోనే అతిఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.[4]
తొలినాళ్ళ జీవితం, నేపథ్యం
[మార్చు]14 మార్చి 1965న ముంబైలో సినీ నిర్మాత తాహిర్ హుస్సేన్, జీనత్ హుస్సేన్ దంపతులకు జన్మించారు ఆమిర్.[5][6] ఆయన కుటుంబంలో చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. ఆమిర్ పెద్దనాన్న నాసిర్ హుస్సేన్ ప్రముఖ దర్శక నిర్మాత.[6] నాసిర్ నానమ్మకు భారత స్వంతంత్ర సమరయోధుడు అబ్దుల్ కలాం ఆజద్ కు చాలా దగ్గర చుట్టరికం ఉంది.[7][8] తాహిర్ నలుగురు సంతానంలో ఆమిర్ పెద్దవాడు. ఆయనకు తమ్ముడు నటుడు ఫాసిల్ ఖాన్, ఇద్దరు చెల్లెళ్ళు ఫర్హత్, నిఖత్ ఖాన్.[9] ఆమిర్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ప్రసుతం బాలీవుడ్ లో మంచి నటుడు.[10]
చిన్నతనంలో ఆమిర్ రెండు సినిమాల్లో చిన్నపాత్రల్లో కనిపించారు. ఎనిమిదేళ్ళ వయసులో నాసిర్ హుస్సేన్ దర్శకత్వం వహించిన యాదోంకి బారాత్(1973) లో ఒక పాటలో కనిపించారు ఆమిర్.[11][12] ఆ తరువాతి సంవత్సరం తన తండ్రి నిర్మించిన మధోష్ సినిమాలో చిన్నప్పటి హీరో పాత్రలో కూడా నటించారు ఆయన.[11] ముంబైలోని బాంద్రాలో జె.బి.పెటిట్ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించిన ఆయన, 8వ తరగతి సెయింట్ అన్నేస్ హై స్కూల్ లోనూ, 9, 10తరగతులు బాంబే స్కాటిష్ స్కూల్ లోనూ చదువుకున్నారు ఆమిర్.[13] చిన్నప్పుడు చదువు కంటే ఆటలంటేనే ఎక్కువ ఆసక్తి చూపే ఆయన టెన్నిస్ లో రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడేవారు.[13][14] ముంబైలోని నర్సే మొంజీ కళాశాలలో 12 గ్రేడ్ చదివారు.[15] తండ్రి తీసే సినిమాలు అపజయం పాలవ్వడంతో తన కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందనీ, అప్పులవాళ్ళ నుంచీ రోజుకు కనీసం 30 ఫోన్లు వచ్చేవనీ వివరించారు ఆమిర్. ఫీజు కట్టలేదు కాబట్టీ స్కూలు నుంచీ పంపించేస్తారేమోనని ఎప్పుడూ భయపడుతూ గడిపేవాణ్ణని తెలిపారు ఆయన.[16]
వ్యక్తిగత జీవితం
[మార్చు]18 ఏప్రిల్ 1986న ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాలో నటించిన నటి రీనా దత్తాను వివాహం చేసుకున్నారు ఆమిర్. వారికి ఒక కుమారుడు జునైద్, కుమార్తె ఇరా. లగాన్ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు ఆమిర్ కు సహాయం చేశారు ఆమె. డిసెంబరు 2002న విడాకులు తీసుకున్నారు వీరు. ఇద్దరు పిల్లల కస్టడీ మాత్రం రీనానే తీసుకున్నారు.[17]
28 డిసెంబరు 2015న ఆమిర్ కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. లగాన్ సినిమా దర్శకుడు అశుతోశ్ గోవరికర్ వద్ద సహాయ దర్శకురాలిగా పనిచేసేవారామె.[18] 5 డిసెంబరు 2011న వీరికి ఒక కుమారుడు ఆజాద్ రావు ఖాన్ జన్మించాడు. సరోగసీ పద్ధతి ద్వారా బిడ్డను పొందినట్టు వివరించారు వారు.[19][20] 2007లో తన చిన్నతమ్ముడు ఫాసిల్ కస్టడీ కేసులో తండ్రి చేతిలో ఓటమి పాలయ్యారు ఆమిర్.[21] ఆయన తండ్రి తహిర్ హుస్సేన్ 2 ఫిబ్రవరి 2010న మరణించారు.[22]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]- ఆమిర్ ఖాన్ సినిమాల జాబితా చూడండి.
మూలాలు
[మార్చు]- ↑ "Readers' Picks: Top Bollywood Actors".
- ↑ "Powerlist: Top Bollywood Actors".
- ↑ "Padma Awards" Archived 2015-10-15 at the Wayback Machine (PDF).
- ↑ "'PK' highest grosser ever: Aamir Khan to enter Rs 300 crore club".
- ↑ Swarup, Shubhangi (29 January 2011).
- ↑ 6.0 6.1 Arnold P. Kaminsky; Roger D. Long PhD (30 September 2011).
- ↑ "Dream to make a film on Maulana Azad: Aamir Khan".
- ↑ "It's a dream to make a film on Maulana Azad: Aamir Khan".
- ↑ "Aamir's life in pics" Archived 2016-03-04 at the Wayback Machine.
- ↑ Singh, Prashant (February 13, 2012).
- ↑ 11.0 11.1 Verma, Sukanya.
- ↑ "The Most Ambitious Project of Aamir's Career".
- ↑ 13.0 13.1 "Teach India: Good morning Aamir sir".
- ↑ "Aamir, the tennis champ".
- ↑ "Just how educated are these Bollywood actors?"
- ↑ Raghavendra, Nandini (13 June 2011).
- ↑ "Aamir Khan Kiran Rao Wedding Marriage Amir Wife Reena Dutta Divorce" Archived 2010-08-04 at the Wayback Machine.
- ↑ "Grand reception for Aamir Khan-Kiran Rao wedding".
- ↑ "Baby boy for Aamir Khan, Kiran Rao".
- ↑ "We never felt defensive about having a surrogate".
- ↑ "Aamir's family supports him against father" Archived 2013-09-09 at the Wayback Machine.
- ↑ Bollywood Hungama.
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1965 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- పద్మశ్రీ పురస్కార గ్రహీతలు