అరవింద్ స్వామి దక్షిణ భారతదేశానికి చెందిన సినీ నటుడు, మోడల్, పారిశ్రామికవేత్త, టీవీ వ్యాఖ్యాత. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు, మలయాళ సినిమాల్లో కూడా నటించాడు.[1] 1991 లో మణిరత్నం తన సినిమా దళపతిలో అరవింద్ స్వామిని వెండితెరకు పరిచయం చేశాడు. మణిరత్నం దర్శకత్వంలోనే వచ్చిన రోజా (1992), బొంబాయి (1995) సినిమాల్లో కథానాయకుడి పాత్రతో మంచి పేరు సంపాదించాడు. అనారోగ్య కారణాలతో 2000 నుంచి సుమారు 13 సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉండి 2013 నుంచి మళ్ళీ క్రియాశీలకం అయ్యాడు.[2]
అరవింద్ స్వామి చెన్నైలో జన్మించాడు. అతన్ని పెంచిన తల్లిదండ్రులు పారిశ్రామికవేత్త వి. డి. స్వామి, భరతనాట్య కళాకారిణి వసంతస్వామి. అతని అసలు తండ్రి ఢిల్లీ కుమార్. శిష్య స్కూల్లో, డాన్ బాస్కో మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. 1990 లో చెన్నై లయోలా కాలేజీ నుంచి బీ.కాం డిగ్రీ పూర్తి చేశాడు. తరువాత అమెరికా లోని నార్త్ కరోలినా రాష్ట్రం, వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషన్ల్ బిజినెస్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు.
అరవింద్ స్వామి చిన్నప్పుడు వైద్యుడు కావాలనుకున్నాడు. పాకెట్ మనీ కోసం చిన్నప్పుడు ప్రకటనల్లో నటించేవాడు.[3] లయోలా థియేటర్ సొసైటీలో అతన్ని స్టేజీ మీద నుంచి కిందకు వెళ్ళిపొమ్మన్నారు. తరువాత ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం అతన్ని ఒక ప్రకటనలో చూసి తనను ఓ సారి కలవమని అడిగాడు. తరువాత మణిరత్నం, సంతోష్ శివన్ అతనికి సినిమా నిర్మాణంలో మెలకువలు నేర్పించారు.[3]
అరవింద్ స్వామి 1991 లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతి సినిమాతో తన నటనను ప్రారంభించాడు. 1992 లో వచ్చిన రోజా చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి మంచి గుర్తింపు సాధించాడు. రోజాతో బాటు 1995 లో వచ్చిన బొంబాయి చిత్రం రాష్ట్ర స్థాయిలోనేకాక జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నాయి.