Jump to content

అలాన్ ట్యూరింగ్

వికీపీడియా నుండి
(అలెన్‌ ట్యూరింగ్‌ నుండి దారిమార్పు చెందింది)
అలన్ ట్యూరింగ్
16 ఏళ్ళ వయసులో ట్యూరింగ్
జననంఅలన్ మాథిసన్ ట్యూరింగ్
(1912-06-23)1912 జూన్ 23
మైడా వేల్, లండన్, ఇంగ్లాండ్
మరణం1954 జూన్ 7(1954-06-07) (వయసు 41)
విల్మ్‌స్లో, చెషైర్, ఇంగ్లండ్
నివాసంవిల్మ్‌స్లో, చెషైర్, ఇంగ్లండ్
జాతీయతబ్రిటిష్
రంగములుగణితశాస్త్రము, క్రిప్టనలిసిస్, తర్కము, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటికల్ అండ్ థియరిటికల్ బయాలజీ
వృత్తిసంస్థలు
చదువుకున్న సంస్థలు
  • కింగ్స్ కళాశాల, కేంబ్రిడ్జ్
  • ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)Alonzo Church[1]
డాక్టొరల్ విద్యార్థులుRobin Gandy[1]
ప్రసిద్ధి
  • క్రిప్టనలిసిస్ ఆఫ్ ది ఎనిగ్మా
  • ట్యూరింగ్ యంత్రం
  • ట్యూరింగ్ టెస్ట్
  • LU decomposition
ముఖ్యమైన పురస్కారాలు
సంతకం

ఆలన్ మాతిసోన్ ట్యూరింగ్ (1912 జూన్ 23 – 1954 జూన్ 7) లండన్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, తార్కికుడు, గూఢ లిపి విశ్లేషకుడు, తత్వవేత్త, సైద్ధాంతిక జీవశాస్త్రవేత్త. అతని తల్లి దండ్రులు ఈథెల్, జూలియస్. గణిత పునాదులపై డేవిడ్ హిల్బర్ట్ వేసిన ఓ సవాలుని సాధించే యత్నంలో ఆలన్ ట్యూరింగ్ తలవని తలంపుగా ఆధునిక కంప్యూటర్‌ సైద్ధాంతిక నమూనాని 1936లో ఆవిష్కరించాడు.

కంప్యూటర్ సైన్సులో నోబెల్ బహుమతి లేదు కాని ట్యూరింగ్ పేరు మీద దానికి దీటైన బహుమతి ఉంది. దాదాపు గత యాభై ఏళ్ళుగా ప్రతి సంవత్సరం దీనిని కంప్యూటర్ సైన్సులో చెప్పుకోదగ్గ పరిశోధనలని చేసిన వారికి ఇస్తున్నారు. కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయంలో రొబోటిక్స్ ప్రొఫెసరు దబ్బాల రాజగోపాల్ రెడ్డి కృత్రిమమేధారంగంలో (Artificial Intelligence) చేసిన పరిశోధనలకి 1986 లో ఈ అవార్డుని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఫైగెన్‌బామ్‌తో (Edward Feigenbaum) పంచుకున్నారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో శత్రువులను ఓడించడంలో ట్యూరింగ్ కీలక పాత్ర వహించాడు. జర్మన్ సైన్యాల రహస్య సందేశాలని విప్పే యుక్తులు కనిపెట్టాడు. వాటితో బ్రిటిష్ సైన్యం నాజీ జర్మన్లు చెయ్యబోయే దాడులని ముందే పసిగట్టి, వాళ్ళ నావలని సముద్రంలో కూల్చి విజయం సాధించగలిగింది. అందుకు బ్రిటిష్ ప్రభుత్వం ట్యూరింగ్‌కి అత్యున్నత పురస్కారం (Order of the British Empire - OBE) ఇచ్చి గౌరవించింది. యుద్ధం తర్వాత ఆ ప్రభుత్వమే, అతని స్వలింగసంపర్క ప్రవర్తనని అప్పట్లో అమలులో ఉన్న చట్ట నిబంధనల ప్రకారం తీవ్రమైన అసభ్యతా నేరంగా (gross indecency) పరిగణించి కోర్టు కేసు పెట్టింది. జడ్జి కొంత మానవీయ దృష్టితో జైలు శిక్ష వెయ్యకుండా, లైంగిక కోరికలు తగ్గించే హార్మోనుల చికిత్స విధించాడు. ట్యూరింగ్ కొన్నాళ్ళు వాడి మందులను భరించలేక సైనైడ్‌లో ముంచిన యాపిల్ ముక్క తిని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికతని వయసు 41 సంవత్సరాలు. దాదాపు అరవై ఏళ్ళ తర్వాత, 2013లో ట్యూరింగ్ శతజయంతి సందర్భంగా, ట్యూరింగ్ చేసిన పనులు ఆధునిక కంప్యూటర్ యుగంపై అతని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా తెలియ వచ్చినతర్వాత, బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణ చెప్పుకుంది.

జననం

[మార్చు]

అలన్ తండ్రి జూలియస్ ట్యూరింగ్ భారత దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించే రోజుల్లో ఇంగ్లాండులో ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో మంచి ర్యాంకుతో పాసయ్యాడు. బ్రిటిష్ పాలనా పద్ధతులూ భారతదేశ చరిత్రా చదువుకున్నాడు. తమిళ భాషని నేర్చుకున్నాడు. 1896లో మద్రాసు ప్రెసిడెన్సీకి డిప్యూటీ కలెక్టరుగా ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో భాగంగా పదేళ్ళు పాటు బెళ్ళారి, కర్నూలు, విజయనగరం మొదలైన జిల్లాలలో పల్లెటూళ్ళని విస్తృతంగా పర్యవేక్షించాడు. వ్యవసాయం, నీటివసతి, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, వీటన్నిటి మీదా నివేదికలు రాశాడు. తెలుగు భాషని కూడా నేర్చుకున్నాడు.

పదేళ్ల తర్వాత పెళ్ళి చేసుకోడానికి జూలియస్ తన దేశం ఇంగ్లాండుకు ప్రయాణమయ్యాడు. ఓడలో ఈథెల్ సేరాతో అతనికి పరిచయమయింది. ఈథెల్ తండ్రి ఎడ్వర్డ్ స్టోనీ (Edward Stoney) భారతదేశంలో రైల్వేలకు (Madras and Southern Mahratta Railway) ఛీఫ్ ఇంజనీరుగా పనిచేశాడు. అనేక నదుల మీద కట్టిన వంతెనల్లో, ముఖ్యంగా తుంగభద్ర వంతెన కట్టడంలో కీలక పాత్ర వహించాడు. రైళ్ళకి సంబంధించి చాలా పేటెంట్లు పొందాడు. ఈథెల్ మద్రాసు దగ్గర పొదనూరు లో పుట్టింది. ఐర్లాండులో పెరిగింది. ఆరేడేళ్ళు భారతదేశంలో ఉండి తను కూడా పెళ్ళి చేసుకోడానికి తన దేశాని జూలియస్ ప్రయాణించిన ఓడలో ప్రయాణమయింది. ఓడ తీరాన్ని చేరేటప్పటికి ఇద్దరి మనసులు కలిశాయి. డబ్లిన్‌లో పెళ్ళి చేసుకొని భారతదేశానికి తిరిగొచ్చారు. కూనూరులో మొదటి సంతానం కలిగింది. జూలియస్ ఉద్యోగరీత్యా కుటుంబం దూర ప్రయాణం చెయ్యాల్సొచ్చింది. పార్వతీపురం, విశాఖపట్నం, అనంతపురం, విజయవాడ, కర్నూలు, ఇలా వివిధ ప్రదేశాలు తిరుగుతూ, 1911 మొదట్లో ఇప్పటి ఒరిస్సాలోని ఛత్రపూరులో ఉండగా ఈథెల్ నెల తప్పింది. జూలియస్ సెలవు తీసుకొని కుటుంబ సమేతంగా ఇంగ్లాండు వెళ్లాడు. 1912 జూన్ 23న లండన్లో ఆలన్ ట్యూరింగ్ పుట్టాడు.

Turing by Stephen Kettle

బాల్యము

[మార్చు]

భారతదేశంలోని వాతావరణానికి, వేడికి తట్టుకోలేక జబ్బుల పాలవుతారని, అలాగే ఇక్కడ చదువుకోడానికి తగిన సదుపాయాలుండవని, పిల్లలు ఇంగ్లాండులోనే పెరగాలని తల్లిదండ్రులు నిశ్చయించారు. రెండేళ్ళయినా నిండని ఆలన్, నాలుగేళ్ల వయసున్న జానీలని పదవీ విరమణ చేసిన మిలిటరీ దంపతుల సంరక్షణలో పెట్టి వాళ్లమ్మ 1913లో భారతదేశానికి వెళ్ళి కొన్ని నెలల్లోనే జూలియస్‌తో కలిసి తిరిగి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం మూలంగా ప్రయాణం అపాయం కావడాన వాళ్ళమ్మ ఇంగ్లాండులో నిలిచి పోయింది. 1917 లో రీడింగ్ వితౌట్ టియర్స్ (Reading without Tears) అన్న పుస్తకం చూసి మూడు వారాల్లో తనంతట తానే చదవడం నేర్చుకున్నాడు. 1919లో వాళ్లమ్మ ఇండియా వెళ్తూ ఆలన్‌ని రిటైరయిన దంపతుల సంరక్షణలో మళ్ళీ పెట్టింది. తల్లిదండ్రులు చుట్టపుచూపుగా మాత్రమే వస్తూ పోవడంతో, పిల్లలు సరైన ఇంటి వాతావరణం అనేది లేకుండా పెరిగారు.

పాఠశాల చదువు

[మార్చు]

1921లో ట్యూరింగ్ వాళ్ళమ్మ ఇండియా నుండి తిరిగి వచ్చేటప్పటికి కొడుకు సరిగా ఎదగలేదని బాధపడింది. ఇతరులతో పెద్దగా కలవకుండా తనలో తను ఉండేవాడు. చదువు నిర్లక్ష్యం చేశాడు. తొమ్మిదేళ్లు వచ్చినా తగు విద్య అబ్బలేదు. తల్లిదండ్రులు అలన్ ని హేజెల్‌హర్స్ట్ ప్రిపరేటరీ బోర్డింగ్ పాఠశాలలో చేర్చి మద్రాసు వెళ్లి పోయారు. సగటు మార్కులతో ట్యూరింగ్ చదువు సాగించాడు.

A blue plaque marking Turing's home at Wilmslow, Cheshire

పదేళ్ళ వయసున్న ట్యూరింగ్‌కి 1922లో ఎవరో ఎడ్విన్ బ్రూస్టర్ (Edwin Brewster) వ్రాసిన పుస్తకం (Natural Wonders Every Child Should Know) ఇచ్చారు. చిన్న పిల్లలకి కుతూహలం పెంచడానికి, సందేహాలు-సమాధానాల రూపంలో వ్రాసిన పుస్తకం అది. ప్రపంచంలో మనం చూసే ప్రతి దానికీ కారణమంటూ ఉంటుందనీ, దానికి దేవుడు కాక సైన్సు ఆధారమనీ ఆ పుస్తకం చెప్తుంది. ఈ పుస్తకం ట్యూరింగ్‌ని ఎంతో ప్రభావితం చేసింది. మొదటిసారిగా సైన్సు అనేదొకటి ఉందని దీని ద్వారానే తెలుసుకున్నాడు అలన్.

1926 మే నెలలో పధ్నాలుగేళ్ళ వయసులో షెర్‌బోర్న్‌ బోర్డింగ్ పాఠశాలలో చేరాడు. షెర్‌బోర్న్‌ వాతావరణం అతని స్వతంత్ర భావాలకి సరిపడలేదు. – పరిశుభ్రత తెలియదనీ, షర్టు మీద ఎప్పుడూ సిరా మరకలుంటాయనీ, చేతివ్రాత చదవలేమనీ ఇచ్చిన పాఠశాల రిపోర్టులు చూసి తండ్రి మండిపడేవాడు. అంత డబ్బు ఖర్చు చేసి పంపిస్తే కొడుకు సద్వినియోగ పరచుకోవడం లేదని బాధ పడేవాడు. చాలా సబ్జెక్టులు శ్రద్ధగా చదివేవాడు కాదు. కాని కొన్నిసార్లు చదవకపోయినా పరీక్షల్లో అందరికన్నా మంచి మార్కులు తెచ్చుకునేవాడు – అది చూసి ఉపాధ్యాయులకీ చిరాకు కలిగేది. తనకిష్టమైన గణితంలో బాగా చదివినా గుర్తించిన వాళ్ళు లేరు. అక్కడ ఆటలకిచ్చిన ప్రాధాన్యం చదువుకి, ముఖ్యంగా గణితాని కివ్వలేదు.

కాని ఒక టీచరు మాత్రం, ట్యూరింగ్ తెలివితేటలు గుర్తించి అతని మానాన అతన్ని వదిలి పెట్టాడు. అప్పుడు, 1928లో ట్యూరింగ్ ఐన్‌స్టయిన్ సాపేక్ష సిద్ధాంతం మీద సామాన్య పాఠకుల కోసం వ్రాసిన పుస్తకం చదివాడు. ఐన్‌స్టయిన్ కొన్ని వందల సంవత్సరాలగా వాడుకలో ఉన్న యూక్లిడ్ ప్రతిపాదించిన స్వయంసిద్ధ సత్యాలు (Euclid axioms) వాస్తవమా కాదా అని సందేహించడం ట్యూరింగ్‌కి నచ్చింది. కొన్ని సూత్రాలని ట్యూరింగ్ స్వయంగా రాబట్టి వాళ్ళమ్మకి వ్రాశాడు. 1929లో సర్ ఎడింగ్‌టన్ (Arthur Eddington) వ్రాసిన ది నేచర్ ఆఫ్ ఫిజికల్ వర్ల్డ్ (The Nature of Physical World) కూడా చదివాడు.

అదే సమయంలో ట్యూరింగ్‌కి క్రిస్టఫర్ మార్కమ్ (Christopher Morcom) అనే తోటి విద్యార్థితో పరిచయం అయింది. క్రిస్టఫర్ కూడా ఆలన్ లాగే సైన్సూ గణితాలలో దిట్ట. అంతే కాదు, అతను మిగిలిన సబ్జెక్టులలో కూడా రాణించాడు. తనకన్నా అన్నిట్లోనూ మిన్నగా ఉన్న క్రిస్టొఫర్‌పై ఆలన్‌కి ఇష్టం కలిగి, ఆకర్షణ పెరిగి, గాఢమైన ప్రేమగా మారింది. కాని, ఫిబ్రవరి 1930లో ఉబ్బసపు వ్యాధితో క్రిస్టఫర్ చనిపోయాడు.

కాలేజి చదువు

[మార్చు]

ట్యూరింగ్ ఆపైన షెర్‌బోర్న్‌లో చివరి సంవత్సరాని కొచ్చేటప్పటికి చదువులో బాగా రాణించి, 1931లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం కింగ్స్ కాలేజీలో స్కాలర్ షిప్ సంపాదించాడు. ఉన్నత పాఠశాల వాతావరణం కన్నా కేంబ్రిడ్జ్ వాతావరణం ట్యూరింగ్‌కి నచ్చింది. లిబరల్ విలువలు, అన్నింటికన్నా ముఖ్యంగా విజ్ఞానశాస్త్ర భావనలని ప్రోత్సహించే వాతావరణం అతని స్వభావానికి సరిపడింది. ఉన్నత పాఠశాలలో ఎవరి పుస్తకాలు చదివి ప్రభావితమయ్యాడో వారిక్కడ తనకి ప్రొఫెసర్లు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వాళ్ళు. వారిలో ఒకరు శ్రీనివాస రామానుజన్ని తెప్పించుకున్న హార్డీ – సంఖ్యాశాస్త్రంలో ఉద్దండుడు. మరొకరు గణిత భౌతికశాస్త్రవేత్త సర్ ఆర్థర్ ఎడింగ్‌టన్ – ఐన్‌స్టయిన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించిన వాడు. (అతనికీ అప్పుడే మన దేశం నుండి వచ్చిన యువ శాస్త్రవేత్త చంద్రశేఖర్‌కీ మధ్య నక్షత్రాలపై సిద్ధాంతాల గురించి పెద్ద వివాదాలు జరిగింది ఈ కాలం లోనే.)

గణితం పై పరిశోధనలు

[మార్చు]

1933 మార్చిలో ట్యూరింగ్, బెర్ట్రాండ్ రస్సెల్ (Bertrand Russel) గణితతాత్వికతపై వ్రాసిన పుస్తకం (An Introduction to Mathematical Philosophy) చదివాడు. రసెల్ పుస్తకం ముగిస్తూ అందులో చివరగా ఒక్క విద్యార్థి అయినా ఈ పుస్తకం చేత ప్రభావితుడైతే లక్ష్యం నెరవేరినట్లే నని వ్రాశాడు. ఆ మాటల ప్రభావముతో నవంబరుకల్లా ట్యూరింగ్ దాని మీద పెద్ద పెద్ద ప్రొఫెసర్ల ముందరే ఉపన్యాసమిచ్చాడు. దానితో గణితంలో అతని కున్న ప్రతిభ అందరు గుర్తించారు.

ట్యూరింగ్ కాలం నాటికి కంప్యూటర్లు లేవు. మనుషులే అన్ని లెక్కలు చేసేవాళ్ళు. ఎట్లా చేస్తారో ట్యూరింగ్ వారిని చూసి జాగ్రత్తగా ఆలోచించాడు. ట్యూరింగ్ తన పేపర్లో క్లిష్టమైన లెక్కలని చేసే యంత్రాలని చూపి, చివరకి, స్పష్టంగా వివరించిన పని – యాంత్రికంగా చేసే కంప్యుటేషన్ ఆల్గరిదమ్, (ఉదా: గ.సా.భ.) ఏదైనా సరే ట్యూరింగ్ యంత్రం చెయ్యగలదు అని నిరూపించాడు. ట్యూరింగ్ యంత్రం చెయ్యలేని సమస్య ఉంటే, ఆ సమస్యకి ఆల్గరిదమ్ లేనట్లేనన్నాడు.

ఆలెన్ ట్యూరింగ్ తన యంత్రానికి సంబంధించిన వివరాలన్నిటితోపాటు ముందు ముందు ఇంకా చెయ్యవలసిన పరిశోధన గురించి – అంతా ఓ పెద్ద పేపరు రాసి, మొదటి డ్రాఫ్టు న్యూమన్‌కి 1936 ఏప్రిల్ మధ్యలో ఇచ్చాడు. మే నెల మధ్యలో ఆ పేపరు చదివి న్యూమన్ నివ్వెరపోయాడు. గోడెల్ సిద్ధాంతం వచ్చిన తర్వాత ఈ అయిదేళ్ళూ ఎంతో మంది మేధావులు తలమునకలవుతున్నారు. అంత సులభమైన యంత్రంతో హిల్బర్ట్ ప్రశ్నకి సమాధానం ఇవ్వొచ్చంటే నమ్మశక్యం కాలేదు. ట్యూరింగ్ ఊహ తప్పేమో, ట్యూరింగ్ యంత్రం సాధించలేని సమస్యని సాధించే మరికాస్త శక్తివంతమైన యంత్రం ఉందేమో, అని అనుమానం వచ్చింది. కాని చివరకి ట్యూరింగ్ యంత్రాన్ని అధిగమించే యంత్రం లేదని న్యూమన్ రూఢిపరచుకున్నాడు.

ఇంతలో అనూహ్యంగా అమెరికా నుండి ప్రచురితమయ్యే గణితశాస్త్ర పత్రిక (American Journal of Mathematics) సంచిక న్యూమన్‌కి చేరింది. దాంట్లో, ప్రిన్స్‌టన్ విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ చర్చ్ (Alonzo Church) రాసిన An Unsolvable Problem of Elementary Number Theory, అన్న పేపరు ఉంది. అది 1936 ఏప్రిల్ 15న ప్రచురితమయింది. ఇద్దరు గణితవేత్తలూ దాదాపు ఒకే సమయంలో హిల్బర్ట్ సమస్యకి పరిష్కారం లేదని కనుక్కున్నారు. ట్యూరింగ్ పేపరు ఇంకా డ్రాఫ్టు రూపంలోనే ఉంది. ప్రతిష్ఠాత్మక పత్రికలలో కొత్తగా కనుక్కున్న విషయలకే ప్రాముఖ్యత ఇస్తారు కావున ట్యూరింగ్ పేపరు ప్రచురణ సందిగ్దంలో పడింది. కాని చర్చ్, ట్యూరింగ్‌ల మార్గాలు చాలా వేరు వేరు. ట్యూరింగ్ నిరూపించిన తీరుకీ చర్చ్ నిరూపించిన తీరుకీ పోలిక లేదు. గణితంలో యంత్రాల గురించిన ప్రస్తావనే ఉండదు కావున ట్యూరింగ్ మార్గం వినూత్నమైనది. అందువలన దానిని ప్రచురించాలని న్యూమన్ లండన్ మేథమేటికల్ సొసైటీకి సిఫార్సు చేశాడు.

అంతే కాక, మరీ స్వతంత్రంగా ఒంటరిగా పనిచేసే ట్యూరింగ్ అమెరికా వెళ్ళి కొన్నాళ్ళు చర్చ్తో పనిచేస్తే పరిశోధనలో లోటుపాట్లు తెలుస్తాయని భావించి, చర్చ్‌కి న్యూమన్ ఉత్తరం రాసి ఖర్చులకి కొంత స్కాలర్షిప్ వచ్చేటట్లు చూడమని కోరాడు. ప్రిన్స్‌టన్ వాళ్ళు ట్యూరింగ్‌ని రమ్మని ఆహ్వానించారు కాని స్కాలర్షిప్ మాత్రం వేరొకరికి ఇచ్చారు. అయినా ట్యూరింగ్ అమెరికాకి ప్రయాణమయ్యాడు.

హిల్బర్ట్ ఏ గణిత సమస్యనైనా సరే నిరూపించగలమో లేదో చెప్పే ఆల్గరిదమ్ ఉందా అని అడిగాడు. ట్యూరింగ్ యంత్రం సాధించలేని సమస్య ఒక్కటున్నా సరే, హిల్బర్ట్ ప్రశ్నకి లేదు, అలాంటి ఆల్గరిదమ్ లేదు. ఆ విధంగా యంత్ర సహాయంతో లెక్కలు వేసే మార్గాన్ని కనుకొన్నాడు. అదే ఈనాటి కంప్యూటర్ కు మూల కారణమైనది.

మరణం

[మార్చు]

1952 లో, టూరింగ్ ఒక పురుషునితో లైంగిక సంబంధము పెట్టుకోవడము వలన "అసభ్య ప్రవర్తన", అనే నేరం ఋజువైంది. అతనిని ప్రొబేషన్ లో పెట్టి, హార్మోన్ థెరపీ తీసుకోమని అదేశించారు. 1954 జూన్ 8 లో ఒక ఆపిల్ లో సైనైడ్ ను పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు 42 సంవత్సరాలే.[3]

కంప్యూటరు సైన్స్ పిత

[మార్చు]

ఏలన్ మ్యాథిసన్ టూరింగ్ ను కంప్యూటర్ సైన్స్ పితగా పిలువబడతాడు. ట్యూరింగ్ యంత్రముతో అల్గోరిథమ్ అనే భావనకు ప్రభావాత్మకమైన రూపాన్ని తీసుకువచాడు. ఏ కంప్యూటర్ నమూనాను తీసుకున్నా దానిని టూరింగ్ యంత్రముగా కాని, దాని సామర్థ్యము గల ఉపసమితిగా గాని వ్యక్తపరచవచ్చును.

ఒక యంత్రము ఆలోచించగలుగుతుందా, దానికి చేతన రాగలుగుతుందా అని టూరింగ్ పరీక్షతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు, ముఖ్యమైన వాదనను చేర్చాడు.

ఆ తరువాత ఇంగ్లండులో జాతీయ భౌతికశాస్త్ర పరిశోధనాశాలలో చేరి, ప్రోగ్రామ్ ను గుర్తు ఉంచుకునే కంప్యూటర్ (ఈనాటి కంప్యూటర్) కు మొదటి రూపకల్పన చేశాడు. 1947లో విక్టోరియా యూనివర్శిటీ అఫ్ మాంచెస్టర్లో చేరి సాఫ్ట్‌వేర్ మీద పనిచేస్తూ, మాంచెస్టర్ మార్క్ I, అప్పటిలో ప్రపంచములో మొదటి నిజమైన కంప్యూటర్ ను తయారు చేశాడు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 అలాన్ ట్యూరింగ్ at the Mathematics Genealogy Project
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; frs అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2016-07-08.

వెలుపలి లంకెలు

[మార్చు]