అస్సాం ఒప్పందం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అస్సాం ఒప్పందం
1985 అస్సాం ఒప్పందం
రకంశాంతి
సందర్భంఅస్సాం ఉద్యమం
సంతకించిన తేదీ15 ఆగస్టు 1985; 39 సంవత్సరాల క్రితం (1985-08-15)
స్థలంన్యూ ఢిల్లీ
ఒరిజినల్
సంతకీయులు
  • ప్రఫుల్ల కుమార్ మహంత, తదితరులు
  • India ఆర్.డి.ప్రధాన్
కక్షిదారులు
భాషEnglish

అస్సాం ఒప్పందం అనేది భారత ప్రభుత్వ ప్రతినిధులు, అస్సాం ఉద్యమ నాయకుల మధ్య సంతకం చేసిన సెటిల్‌మెంట్ మెమోరాండం (MoS). [1] 1985 ఆగస్టు 15 న న్యూఢిల్లీలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. తరువాత, మరుసటి సంవత్సరం, 1986 లో, మొదటిసారిగా పౌరసత్వ చట్టాన్ని సవరించారు.[1][2][3] 1979 లో మొదలైన ఆరేళ్ల ఆందోళన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరింది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU) నేతృత్వంలో, నిరసనకారులు అక్రమ విదేశీయులందరినీ - ప్రధానంగా బంగ్లాదేశ్ వలసదారులను గుర్తించి వారిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన , ఇప్పుడూ కొనసాగుతున్న పెద్ద ఎత్తున వలసలు స్థానిక ప్రజలను ముంచెత్తుతూ, వారి రాజకీయ హక్కులు, సంస్కృతి, భాష, భూమి హక్కులపై ప్రభావం చూపుతున్నాయని వారు భయపడ్డారు.[4] అస్సాం ఉద్యమంలో 855 మందికి పైగా మరణించినట్లు అంచనా. ఈ ఒప్పందంపై సంతకం చేయడంతో ఉద్యమం ముగిసింది.[5]

1966 జనవరి 1 కి ముందు అస్సాంలోకి ప్రవేశించిన వలసదారులందరినీ అంగీకరించడానికి అస్సాం ఉద్యమ నాయకులు అంగీకరించారు [1] భారత ప్రభుత్వం అస్సామీ ప్రజల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ఆందోళనలను గుర్తించి, పై తేదీ ఆధారంగా ఎన్నికల డేటాబేస్‌ను సవరించడానికి అంగీకరించింది.[1] ఇంకా, 1971 మార్చి 25 తర్వాత వచ్చిన శరణార్థులను, వలస వచ్చిన వారినీ అందరినీ గుర్తించి, బహిష్కరించడానికి ప్రభుత్వం అంగీకరించింది [1] 1971 లో, బంగ్లాదేశ్‌లోని లక్షలాది మంది పౌరులు - అప్పుడు తూర్పు పాకిస్తాన్ అనేవారు - అంతర్యుద్ధం, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మారణహోమం సమయంలో అక్కడి నుండి పారిపోయి, అస్సాం, పశ్చిమ బెంగాల్, త్రిపుర, భారతదేశంలోని అనేక ఇతర సమీప రాష్ట్రాలకు శరణార్థుల రూపంలో భారీ యెత్తున చేరుకున్నారు.[6][7]


అస్సాం ఒప్పందం ప్రకారం, భారత ప్రభుత్వం భవిష్యత్తులో చొరబాట్లకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సరిహద్దును "సముచిత ప్రదేశాలలో గోడలు, ముళ్ల కంచెల వంటి భౌతిక అడ్డంకులను" ఏర్పాటు చేయడానికి, బంగ్లాదేశ్-భారత అంతర్జాతీయ సరిహద్దులో అన్ని భూ, జల మార్గాలపై భద్రతా దళాల గస్తీని ఏర్పాటు చెయ్యడానికీ అంగీకరించింది.[1] ఈ ప్రయత్నంలో సహాయంగా, గస్తీ దళాలు, భద్రతా దళాలను త్వరితగతిన మోహరించడం కోసం సరిహద్దు దగ్గర రహదారిని నిర్మించడానికి ప్రభుత్వం అంగీకరించింది. అలాగే పౌరుల జనన, మరణాల జాబితాను తప్పనిసరిగా నిర్వహిస్తుంది.[1] అస్సాం ఉద్యమంలో పాల్గొన్నవారిపై, నాయకులపై ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు, ఒప్పందం తేదీ వరకూ మోపిన అన్ని పోలీసు అభియోగాలను ఉపసంహరించుకున్నారు, మూసివేసారు.[1] అస్సాం ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు ద్రవ్య పరిహారం అందించారు. రాష్ట్రంలో చమురు శుద్ధి కర్మాగారాన్ని తెరవడానికి, పేపర్ మిల్లులను తిరిగి తెరవడానికి, విద్యా సంస్థలను స్థాపించడానికి ప్రభుత్వం అంగీకరించింది.[1]

ఈ ఒప్పందం అస్సాం ఉద్యమానికి ముగింపు పలికింది. ఆందోళన నాయకులకు రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి, అస్సాం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేసింది. ఈ ఒప్పందం ఆందోళనకు ముగింపు పలికినప్పటికీ, కొన్ని కీలకమైన క్లాజులు ఇంకా అమలు కాకపోవడం వల్ల కొన్ని సమస్యలు తీవ్రరూపం దాల్చాయి.[8][9] రాజకీయ శాస్త్ర ప్రొఫెసరైన సంజీబ్ బారువా ప్రకారం, విదేశీయులను గుర్తించే పని రాజకీయంగా కష్టంగా మారింది. ఓటు బ్యాంకులను ప్రభావితం చేసింది. మతపరమైన లేదా జాతి వివక్ష ఆరోపణలు ఎదురయ్యాయి.[10] ఉదాహరణకు, 1990ల ప్రారంభంలో అస్సాం ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హితేశ్వర్ సైకియా తన ప్రసంగాలలో విరుద్ధమైన ప్రకటనలు ఇచ్చాడు.[10] కొంతమంది ముందు, అసలు విదేశీయులు లేనేలేరని చెప్పాడు; మరి కొందరి ముందు, అస్సాంలో వందల వేల మంది అక్రమ విదేశీయులు ఉన్నారని, వారిని బహిష్కరించాల్సిన అవసరం ఉందనీ అన్నాడు.[10] 1997 లో రాష్ట్ర ప్రభుత్వం ఒక అధ్యయనాన్ని పూర్తి చేసి, వారి ఓటరు జాబితాలో అనేక మంది పేర్లను "డి" అంటే "వివాదాస్పద పౌరసత్వం" అని గుర్తు పెట్టింది. వారిని ఓటు వేయకుండా నిరోధించే ప్రణాళికలు ఉన్నాయి.[10][11] ప్రజలు ఓటు హక్కును కోల్పోయారని విమర్శకులు ఫిర్యాదు చేశారు. [11] "d" అనేది అనుమానం పైననే ఆధార పడి ఉందని, డాక్యుమెంటరీ ఆధారాలపై కాదనీ రాష్ట్ర హైకోర్టు నిర్ధారించింది. నివాసితులందరూ - పౌరులు, విదేశీయులు - తదుపరి అస్సాం ఎన్నికలలో ఓటు వేయడానికి అనుమతించబడ్డారు. అస్సాం ఒప్పందాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అస్సాం ఉద్యమ మద్దతుదారులు పేర్కొన్నారు.[10]

సంతకాలు చేసినవారు

[మార్చు]

అస్సాం ఉద్యమ ప్రతినిధులు

  • ప్రఫుల్ల కుమార్ మహంత, అధ్యక్షుడు, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్
  • భృగు కుమార్ ఫుకాన్, ప్రధాన కార్యదర్శి, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్
  • బిరాజ్ కుమార్ శర్మ, జనరల్ సెక్రటరీ, ఆల్ అస్సాం గణ సంగ్రామ్ పరిషత్

భారత, అస్సాం ప్రభుత్వాల ప్రతినిధులు

వీరి సమక్షంలో

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 "Assam Accord" (PDF). United Nations Peace Accord Archives. 1985. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "peacemaker" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. Text of Assam Accord, according to the Part II (A) The Assam Gazette 23 June 2015, pp 7
  3. Assam Accord SATP.org Archives
  4. Sangeeta Barooah Pisharoty (2019). Assam: The Accord, The Discord. Penguin Random House. pp. 1–14, Chapter 2, 9 and 10. ISBN 978-93-5305-622-3.
  5. Sangeeta Barooah Pisharoty (2019). Assam: The Accord, The Discord. Penguin Random House. pp. 1–7, Introduction chapter. ISBN 978-93-5305-622-3.
  6. Yasmin Saikia (2011). Women, War, and the Making of Bangladesh: Remembering 1971. Duke University Press. pp. 40–47. ISBN 978-0-8223-5038-5.
  7. Sarah Kenyon Lischer (2015). Dangerous Sanctuaries: Refugee Camps, Civil War, and the Dilemmas of Humanitarian Aid. Cornell University Press. pp. 24–25. ISBN 978-1-5017-0039-2.
  8. AASU questions Govts’ sincerity on Accord Archived సెప్టెంబరు 28, 2007 at the Wayback Machine, The Assam Tribune, 13 May 2007.
  9. "Union Cabinet clears panel to promote Assam's cultural identity". The Hindu (in Indian English). 2019-01-02. ISSN 0971-751X. Retrieved 2019-01-03.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 Sanjib Baruah (1999). India Against Itself: Assam and the Politics of Nationality. University of Pennsylvania Press. pp. 160–168. ISBN 0-8122-3491-X.
  11. 11.0 11.1 Pinar Bilgin; L.H.M. Ling (2017). Asia in International Relations: Unlearning Imperial Power Relations. Taylor & Francis. pp. 56–60. ISBN 978-1-317-15379-5.