ఆనందమఠ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆనందమఠ్
Title page of the second edition of the books
రెండవ ఎడిషను టైటిలు పేజీ
రచయిత(లు)బంకిం చంద్ర ఛటోపాధ్యాయ
మూల శీర్షికআনন্দ মঠ
అనువాదకులుజూలియస్ లిప్నర్
దేశంభారతదేశం
భాషబెంగాలీ
శైలి(జాతీయతావాదం)
ప్రచురణ కర్తరామానుజన్ యూనివర్సిటీ ప్రెస్, భారతదేశం
ప్రచురించిన తేది
1882
ఆంగ్లంలో ప్రచురించిన తేది
2005, 1941, 1906
మీడియా రకంముద్రణ (పేపర్‌బ్యాక్)
పుటలు336 pp

ఆనందమఠ్ అనేది బెంగాలీ చారిత్రక నవల. దీనిని బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించాడు. 1882 లో మొదటిసారి ప్రచురించారు. 18 వ శతాబ్దపు చివరిలో జరిగిన సన్యాసి తిరుగుబాటు నేపథ్యంతో ప్రేరణ పొంది, ఈ రచన చేసాడు. బెంగాలీ లోనే కాక, భారతీయ సాహిత్య చరిత్రలో అత్యంత ముఖ్యమైన నవలలలో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు.[1]

వందేమాతర గీతం ఈ నవలలోనే మాతృభూమి పేరుతో ప్రచురించారు.[2]

కథ సారాంశం

[మార్చు]

ఈ కథ 1770 లో బెంగాల్‌ కరువు సమయంలో జరుగుతుంది.[3] కరువు సమయంలో ఆహారం, నీరు లేకుండా తమ గ్రామమైన పదచిన్హాలో చిక్కుకున్న మహేంద్ర, కళ్యాణి దంపతుల పరిచయంతో ఇది ప్రారంభమవుతుంది. వారు తమ గ్రామాన్ని విడిచిపెట్టి, మనుగడ కోసం సమీప నగరానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అలా వెళ్తూండగా కళ్యాణి దొంగల బారిన పడకుండా తప్పించుకోటానికి తన పసిపాపతో సహా అడవిలో పరుగెత్తడంతో దంపతులు విడిపోతారు. అలా పరుగెత్తి, ఆమె నది ఒడ్డున స్పృహ కోల్పోతుంది. జిబాన్ అనే హిందూ "సన్యాసి" (నిజమైన సన్యాసులు కాదు సన్యాసుల చిహ్నాన్ని ధరించి, ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి తమ ఇంటిని విడిచిపెట్టిన సాధారణ ప్రజలే) ఆ శిశువును తన ఇంటికి తీసుకెళ్లి, తన సోదరికి అప్పగించి, కల్యాణిని తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు.

భర్త, మహేంద్ర, ఈ సమయంలో సన్యాసులతో చేరి, జాతికి సేవ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతాడు. కళ్యాణి, అతనికి తన అడ్డు లేకుండా చేసి, అతని కలలను సాధించుకోవడంలో సహాయపడాలని ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో, మహాత్మా సత్య ఆమెను కలుస్తాడు. కానీ అతను ఆమెకు సహాయం చేసే లోపే, ఇతర సన్యాసులు కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నందున, ఈస్టిండియా కంపెనీ సైనికులు అతన్ని అరెస్టు చేస్తారు. సైనికులు ఈడ్చుకుంటూ వెళుతున్నప్పుడు అతను సన్యాసి వస్త్రాలు ధరించని మరొక సన్యాసిని చూసి, ఒక పాట పాడతాడు. అది

"నది ఒడ్డున, పైరగాలిలో,
అడవిలో, ఓ మహిళ ఉంది."

ఆ రెండో సన్యాసి ఆ పాట లోని అంతరార్థాన్ని అర్థం చేసుకుని, కళ్యాణినీ, శిశువునూ రక్షించి, వారిని తిరుగుబాటు చేసే సన్యాసుల రహస్య ప్రదేశానికి తీసుకువెళతాడు. అదే సమయంలో, మహేంద్రకు కూడా సన్యాసులు అక్కడే ఆశ్రయం ఇస్తారు; ఆ విధంగా మహేంద్ర, కళ్యాణి మళ్లీ కలుస్తారు. తిరుగుబాటుదారుల నాయకుడు మహేంద్రకు భారత మాత (మదర్ ఇండియా) మూడు ముఖాలను మూడు వరుస గదులలో పూజించబడుతున్న మూడు దేవత విగ్రహాలుగా చూపాడు:

  1. ఒకప్పుడు తల్లి అంటే – జగద్ధాత్రి దేవి విగ్రహం, బెంగాల్/భారతదేశ గత వైభవాన్ని సూచిస్తుంది
  2. ఇప్పుడు ఆ తల్లి - కాళికా దేవి విగ్రహం, కరువుకూ, భూమి ఆర్థిక దోపిడీకి సూచన
  3. ఇకపై ఆ తల్లి - దుర్గా దేవి విగ్రహం, భవిష్యత్తు భారతదేశం పట్ల వారి ఆలోచనను సూచిస్తుంది.

క్రమంగా, తిరుగుబాటు ప్రభావం పెరుగుతుంది. వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఆ ధైర్యంతో, వారు తమ ప్రధాన కార్యాలయాన్ని ఇటుకలతో కట్టిన చిన్న కోటకు మార్చారు. ఈస్టిండియా కంపెనీ సేనలు పెద్ద బలంతో కోటపై దాడి చేస్తాయి. తిరుగుబాటుదారులు వారిని సమీపంలోని నదిపై అడ్డుకట్టలు కడతారు. కానీ వారికి ఫిరంగి శిక్షణ గానీ సైనిక శిక్షణ గానీ లేదు. పోరాటంలో, దళాలు వంతెనపై వ్యూహాత్మక తిరోగమనం చేస్తాయి. సన్యాసుల సైన్యం, సైనిక అనుభవం లేకపోవడంతో, శత్రువును వెంబడించి వాళ్ళు పన్నిన కుట్రలో చిక్కుకుంటారు. తిరుగుబాటుదారులతో వంతెన అంతా నిండిపోయిన తర్వాత, ఈస్టిండియా కంపెనీ సైనికులు వారిపై ఫిరంగి కాల్పులు జరిపి తీవ్ర ప్రాణనష్టం చేస్తారు.

అయితే, కొంతమంది తిరుగుబాటుదారులు కొన్ని ఫిరంగులను పట్టుకోగలుగుతారు. కంపెనీ సైనికులపై ఎదురు కాల్పులు జరుపుతారు. కంపెనీ దళాలు వెనక్కి తగ్గుతాయి., తిరుగుబాటుదారులకు తొలి విజయం సాధిస్తారు. మహేంద్ర, కళ్యాణి మళ్లీ ఇంటిని నిర్మించుకోవడం, మహేంద్ర తిరుగుబాటుదారులకు మద్దతు ఇవ్వడంతో కథ ముగుస్తుంది,

వందేమాతరం గేయాన్ని ఈ నవలలోనే ప్రచురించారు. 20 వ శతాబ్దంలో భారత స్వాతంత్ర్య సమరయోధులను ప్రేరణ నిచ్చిన గేయం ఇది. స్వాతంత్ర్యం తర్వాత దాని మొదటి రెండు చరణాలు భారతదేశ జాతీయ గీతంగా మారాయి.

అనుసరణలు

[మార్చు]

సినిమా

[మార్చు]

ఈ నవల తరువాత 1952 లో ఆనంద్మఠ్ అనే సినిమాగా వచ్చిండి. హేమేన్ గుప్తా దర్శకత్వం వహించాడు. ఇందులో పృథ్వీరాజ్ కపూర్, భరత్ భూషణ్, ప్రదీప్ కుమార్, అజిత్, గీతా బాలి నటించారు. లతా మంగేష్కర్ పాడిన వందేమాతరం గేయానికి హేమంత్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇది గొప్ప ప్రజాదరణ పొందింది.[4]

మూలాలు

[మార్చు]
  1. Julius, Lipner (2005). Anandamath. Oxford, UK: OUP. pp. 27–59. ISBN 978-0-19-517858-6.
  2. Bhattacharya, Sabyasachi (2003). Vande Mataram. New Delhi: Penguin. pp. 68–95. ISBN 978-0-14-303055-3.
  3. "Bengal famine of 1770". cambridgeforecast.org. Retrieved 2020-01-16.
  4. Pradeep Kumar Rediff.com.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆనందమఠ్&oldid=4339624" నుండి వెలికితీశారు