ఆర్య 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్య 2
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం సుకుమార్
కథ సుకుమార్
తారాగణం అల్లు అర్జున్
కాజల్ అగర్వాల్
నవదీప్
ముకేష్ రిషి
సాయాజీ షిండే
శ్రద్ధా దాస్
బ్రహ్మానందం
శ్రీనివాస రెడ్డి
నిర్మాణ సంస్థ ఆదిత్య ఆర్ట్స్
విడుదల తేదీ 27 నవంబర్ 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆదిత్య ఆర్ట్స్ పతాకం పై ఆదిత్య బాబు నిర్మించిన చిత్రం ఆర్య 2. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్, శ్రద్ధా దాస్, బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పొషించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అల్లు అర్జున్-సుకుమార్ ల గతచిత్రం "ఆర్య"కి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2009 నవంబరు 27 న విడుదలైంది. తెలంగాణ, సమైక్యాంథ్ర గొడవలు, విశ్లేషకుల మిశ్రమ స్పందనలను చవిచూసినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద లాభాలు గడించి విజయం సాధించింది కానీ మొదటి భాగం సాధించిన విజయాన్ని పొందలేక పొయింది. ఈ చిత్రం మలయాళంలో ఇదే పేరుతో అనువదించబడి భారీ విజయన్ని సాధించింది.[1]

అజయ్ (నవదీప్) గాయపడిన తన స్నేహితుడు ఆర్య (అల్లు అర్జున్)ని ఆసుపత్రిలో స్ట్రెచర్ పై తీసుకువెళ్ళే సన్నివేశంతో చిత్రం మొదలవుతుంది. తన జీవితాన్ని ఆర్య ఎలా మార్చేశాడో అజయ్ ప్రేక్షకులకు చెప్పటం మొదలు పెడతాడు.

ఆర్య-అజయ్ ల బాల్యం

[మార్చు]

ఫ్ల్యాష్ బ్యాక్ లో ఒక అనాథాశ్రమంలో ఆర్య అనే అబ్బాయి చేరతాడు. పరిగెడుతూ అనాథలందరూ దిగే మెట్లలో ఒకదానిపై తను నమిలే బబుల్ గంని అతికించి దానిని ఎవరు తొక్కితే వాడే తన బెస్ట్ ఫ్రెండ్ అని ఆర్య మనసులో అనుకొంటాడు. అజయ్ దానిని తొక్కుతాడు. అప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ పేరుతో అజయ్ ని ఆర్య వేధిస్తుంటాడు. ఆర్యకి ఈత వచ్చు కాబట్టి అజయ్ కి కూడా రావాలని నీటిలో తోసివేస్తాడు. తన చేయి తెగి గాయం అయినందుకు ఆర్య అజయ్ చేయిని కోసి గాయం చేస్తాడు. స్నేహితుడిని ఎంచుకొనే విధానం, స్నేహం చేసిన తర్వాత స్నేహితునితో వ్యవహరించే తీరు లోనే ఆర్య తన లోని శాడిస్ట్ స్వభావాన్ని చిన్ననాటి నుండి బయటపెడుతూ ఉంటాడు. ఒక సంపన్న కుటుంబం ఒక బాలుణ్ణి దత్తత తీసుకోవటానికి అనాథ శరణాలయం వస్తుంది. అజయ్ ఆర్య లలో ఎవరిని దత్తత తీసుకోవాలో సతమతమయిన వారి కోసం అజయ్ ఆర్యలు బొమ్మా బొరుసూ వేసుకొంటారు. ఆర్య గెలిచినా తన గెలుపూ అజయ్ గెలుపూ ఒకటే అని ఆర్య అజయ్ నే దత్తునిగా వెళ్ళ మంటాడు. పైకి బాధ నటించినా ఆర్య వేధింపు ల నుండి విముక్తి దొరికినందుకు లోలోపల సంతోషిస్తాడు అజయ్.

అజయ్ జీవితంలోకి ఆర్య పున:ప్రవేశం

[మార్చు]

సంపన్న కుటుంబంలో పెరిగి పెద్దయిన తర్వాత అజయ్ తన పేరిట ఒక సాఫ్ట్ వేర్ సంస్థ నడుపుతూ ఉంటాడు. అజయ్ ని ఒక రౌడీమూక గాయపరచటంతో ఆర్య వారికి దేహశుద్ధి చేస్తాడు. కృతజ్ఞతగా తన సంస్థలో ఉద్యోగం ఇమ్మని బలవంతపెడుతున్న ఆర్యని తన స్నేహితుడిగా ఎక్కడా చెప్పుకోకూడదు, మంచి వాడిగా పేరు తెచ్చుకోవాలి అన్న అజయ్ షరతులకు ఒప్పుకోవటంతో ఆర్యకి ఉద్యోగమిస్తాడు. ఒక వైపు సిగరెట్టుకి సగంలో గీత గీసి అక్కడి వరకు ఒకరు తర్వాత ఇంకొకరు కాల్చాలని వింత నియమాలని పెడుతూనే మరొక వైపు సంస్థలో మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకొంటుంటాడు ఆర్య. ఏ లోపం లేని మిస్టర్ పర్ఫెక్ట్ గా వ్యవహరిస్తున్న ఆర్య ఆ సంస్థ మానవ వనరుల నిర్వాహకుడు దశావతారం (బ్రహ్మానందం) అభిమానాన్ని చూరగొనటమే కాక సహోద్యోగిని శాంతి (శ్రద్ధా దాస్)ని కూడా ఆకర్షిస్తాడు. గీత (కాజల్ అగర్వాల్) కొత్తగా ఆ సంస్థలో చేరగానే ఆర్య, అజయ్ లిద్దరూ గీతని ప్రేమించటం మొదలుపెట్టటంతో కథ ముదిరి పాకాన పడుతుంది.

ఆర్య-గీత-అజయ్ల ప్రేమాయణం

[మార్చు]

గీత టీంకి లీడ్ ఆర్య నే. ఒకరోజు కేవలం ఆర్య ఉన్న లిఫ్టులో గీత ఎక్కుతుంది. మిస్టర్ పర్ఫెక్ట్ తో గుక్క తిప్పుకోకుండా మాటాడుతున్న గీతని ఆర్య్ చుంబిస్తాడు. ఎవరికీ తెలియకుండా గీతకి తన ప్రేమని వ్యక్తపరుస్తుంటాడు. అప్పటికే ఉత్తమ ఉద్యోగి పతకాన్నందుకున్న ఆర్య పై ఇవన్నీ భ్రమలని దశావతారం తోసిపుచ్చుతాడు. ఆర్యని సంస్థ నుండి పంపేయాలని ఎత్తు వేసిన అజయ్ తన కారుని ఆర్య కావాలనే ఢీ కొట్టినట్లు అందరినీ నమ్మిస్తాడు. అయితే ఇది తెలుసుకొన్న గీత అజయ్ తన ప్రేమ పొందటానికే అలా చేశాడని భావించి తను కూడా అజయ్ ని ప్రేమించటం మొదలు పెడుతుంది. స్నేహితుడి కోసం ఎంతటి త్యాగానికైనా ఒడిగట్టగలిగిన ఆర్య అజయ్-గీతల పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాడు.

ఫ్యాక్షన్ నేపథ్యం గల గీత

[మార్చు]

కానీ అదేరోజు గీతని పెద్ద ఫ్యాక్షనిస్టు అయిన తన తండ్రి పెద్ది రెడ్డి (ముఖేష్ రిషి) పంపిన మనుషులు వారి సొంతూరైన కర్నూలుకి తీసుకెళ్ళిపోతారు. ఎలాగైనా గీతని తీసుకువస్తానని కర్నూలు బయలుదేరతాడు ఆర్య. గీతకి జరుగుతోన్న మరో పెళ్ళి ఆగిపోవటంతో, అనివార్య పరిస్థితులలో ఆర్య గీతని పెళ్ళాడతాడు.ఎలాగైనా అజయ్, గీతలను కలపాలనుకునే ఆర్య మొత్తానికి గీతతో సహా హైదరాబాద్ బయలుదేరతాడు. కానీ అజయ్ పెద్ది రెడ్డి చేతుల్లో ఇరుక్కున్నాడని ట్రైను కదిలాక తెలుసుకుంటాడు. వెంటనే ఆర్య గీతను తీస్కుని రాజి రెడ్డి ఇంటికి వెళ్తాడు. గీతని రాజి రెడ్డికి అప్పజెప్పిన ఆర్య తన కొడుకైన సుబ్బిరెడ్డిని కిడ్నాప్ చేసానని, మరుసటి రోజు పెద్ది రెడ్డి మనుషులను అజయ్ ని తీస్కురమ్మని చెప్తాడు. ఈలోపు సుబ్బిరెడ్డితో ఆర్య తామిద్దరూ గీత లవర్స్ అన్న వంకతో స్నెహితుడౌతాడు. ముందుగా అనుకున్నట్టుగానే ఆర్య సుబ్బిరెడ్డి సహాయంతో గీత, అజయ్ లను తీస్కుని కారులో పారిపోతాడు.

గీత హృదయాన్ని గెలుచుకొనే ఆర్య

[మార్చు]

ముగ్గురూ ఒక హోటలుకు చేరుకున్నాక ఆర్య అజయ్, గీత లను తనతో గడపబోయే ఈ రెండు రోజులూ అన్నీ మర్చిపోయి స్నేహంగా ఉండమని అడుగుతాడు. గీత స్నేహంగా ఉన్నప్పటికీ అజయ్ లేని స్నేహాన్ని నటించి గీతతో ఆర్య లేని సమయం చూసి తమ ప్రయాణ వివరాలు చెప్తాడు. నిజానికి ఆర్య ప్లాన్ ప్రకారం 2 రోజుల్లో అజయ్ మరియూ గీత అమెరికా వెళ్ళాలి. కానీ అజయ్ ఆ మరుసటిరోజు తెల్లవారుజామున గీతను తీస్కుని ఆస్ట్రేలియా వెళ్ళలనుకుంటాడు. అప్పటికే తన తండ్రి నుంచి ఆపద పొంచి ఉన్న ఆర్యకు ఈ విషయం చెప్పలనుకున్న గీత ఆర్య రూముకి వెళ్తుంది. ఐతే ఆర్యకు అజయ్ కదలికలన్నీ తెలుసన్న నిజం తెలుసుకున్న గీత నివ్వెరబోతుంది. గీత కళ్ళ ముందే నిద్రమాత్రలు మింగిన ఆర్య గీతను సాగనంపి తను నిద్రపోతాడు. అనుకున్న సమయానికి అజయ్ బయలుదేరబోతుండగా పెద్ది రెడ్డి తన మనుషులతో అక్కడికి చేరుకుంటాడు. ఆర్య స్నేహానికీ, త్యాగానికీ లొంగిన గీత ఆర్యను కాపాడుకొవడానికీ, తన తండ్రితో అజయ్ ని పెళ్ళిచేసుకోవాలన్న విషయాన్ని చెప్పాలన్న ఆలోచనతో గీతే పెద్ది రెడ్డిని ఫోనులో రమ్మని పిలుస్తుంది. అజయ్ ను కొడుతున్న శబ్దాలు విని ఉలిక్కిపడి ఆర్య అక్కడికి చేరుకుని అజయ్ ని కాపాడుతాడు. ఆర్యకీ పెద్ది రెడ్డికీ మధ్య వాదోపవాదాలు జరిగాక పెద్ది రెడ్డి అజయ్ ని కత్తితో పొడవాలని వెళ్తాడు కానీ ఆ కత్తికి అడ్డుపడి ఆర్య బలౌతాడు. ఇదంతా చూసిన గీత మనసు మారి ఆర్యను ప్రేమిస్తుంది.

సుఖాంతం

[మార్చు]

ఆర్య బ్రతకాలనుకుంటున్న గీత కోరికను గ్రహించిన అజయ్ ఆసుపత్రిలో ఆర్యను కలుస్తాడు. ఆర్యను క్షమాపణలడిగి ఆ కారు ప్రమాదం తన పనే అని గీత ముందు నిజం ఒప్పుకుంటానంటాడు. అజయ్ చెడ్డవాడు అవ్వడం ఇష్టంలేని ఆర్య అజయ్ ని పక్కనే ఉన్న బటన్ ను నొక్కమంటాడు. అది ఆక్సిజన్ స్విచ్ అన్న విషయం తెలియని అజయ్ అలాగే నొక్కుతాడు. దానితో ఆర్య ఊపిరి అందుకోవడంలో విఫలమౌతాడు. చివరికి డాక్టర్ల వల్ల బ్రతుకుతాడు. గీత అపార్ధం చేసుకుని అజయ్ ని కొట్టి ఆర్య చేతిని తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఆర్య అజయ్ వంక చూసి "సారీ రా" అని అంటాడు. ఆర్య అంతరార్ధాన్ని గ్రహించిన అజయ్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

తారాగణం

[మార్చు]

సంభాషణలు

[మార్చు]
  • ఉద్యోగులు భ్రమ పడుతుంటే దానిని దశావతారం హ్యాలుసినేషన్ - ఫస్ట్ లెవెల్ ఆఫ్ హ్యాలుసినేషన్ అని తన అభిప్రాయాన్ని చెప్పటం.
  • అజయ్ గీతలు వెళ్ళిపోయాక ఆర్య పెద్ది రెడ్డికి లొంగిపోతానని హోటల్లో గీతకి చెప్తాడు. గీత తన తండ్రి ఆర్యను చంపేస్తాడని చెప్తే అందుకు ఆర్య, "చంపనీ. తనకి చంపేంత కోపముంటే నాకు చచ్చిపోయేంత ప్రేముంది" అని జవాబిస్తాడు.

విశేషాలు

[మార్చు]
  • ఈ చిత్రంలో అల్లు అర్జున్ టైట్ ఫ్యాషన్ సాంప్రదాయిక దుస్తులని వాడాడు. టైలు సైతం చాలా సన్నగా ఉంటాయి.
  • హెచ్ ఆర్ కం సైకాలజిస్ట్ గా బ్రహ్మానందం కామెడీ, అల్లు అర్జున్ డాన్సులు, సుకుమార్ సృజన, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం విశేషంగా ఆదరించబడ్డాయి.
  • తెలుగు రెడీని అదే పేరుతో హిందీలో నిర్మించబడ్డ సినిమాలో ఝింక చికా పాటకి ఈ చిత్రంలోని రింగ రింగ పాటే స్ఫూర్తి

పాటలు

[మార్చు]
  • మిస్టర్ పర్ఫెక్ట్ , రచన: కేదారనాథ్ పరిమి, గానం. బాబా సెహగల్, దేవీశ్రీ ప్రసాద్, రీటా , సచిన్ ఇయ్లేర్ సదా చరణ్
  • గుప్పెడంత ఈ ప్రేమలో చెప్పలేని ఊసులెందుకో, రచన: బాలాజీ , గానం. కె . కె
  • మై లవ్ ఈజ్ గాన్ , రచన: చంద్రబోస్, గానం. రంజిత్
  • బేబీ హీ లవ్స్ యూ , రచన: చంద్రబోస్, గానం. దేవీశ్రీ ప్రసాద్
  • కరిగే లోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం , రచన: వనమాలి, గానం. కూనాల్ గంజ్వాల, మేఘ
  • రింగ రింగ, రచన: చంద్రబోస్, గానం. ప్రియా హిమేష్
  • మిస్టర్ పర్ఫెక్ట్ ,(రీమిక్స్) కేదారనాథ్ పరిమి , దేవిశ్రీ ప్రసాద్
  • కరిగే లోగా 2 , రచన: వనమాలి, గానం. సాగర్

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-24. Retrieved 2013-02-23.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆర్య_2&oldid=4000993" నుండి వెలికితీశారు