ఇండస్ మార్టిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండస్ మార్టిన్
జననంగుంటూరు
నివాస ప్రాంతంహైదరాబాద్
ప్రసిద్ధికవి, కథా రచయిత

ఇండస్ మార్టిన్ ఓ తెలుగు రచయిత."కటికపూలు" కథా సంపుటి ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే పలు కవితలు కూడా రాశారు. "కటికపూలు" సంపుటిలో కథలన్నీ బాల్య జ్ఞాపకాల్లాంటి కథలు. ఈ కథల్లో మధ్య మధ్యలో రచయిత తన గొంతు వినిపించడం, అలాగే చివర్లో ముక్తాయింపు ఇవ్వడం బ్రేహ్ట్ ఎపిక్ థియేటర్‌ని పోలి ఉందిʹ అన్నాడు విమర్శకులు గుంటూరు లక్ష్మీ నర్సయ్య. సహజ సిద్ధమైన భాష, ఏ మాత్రం కల్పన లేనట్టుగా కేవలం వాస్తవచిత్రణ పాత్రలు, ఆయా నేపథ్యాలు వీటన్నిటినీ పెనవేసుకున్న దళిత క్రిస్టియన్‌ ఆత్మగౌరవ స్పృహ, అందులోంచి అంతే నిసర్గంగా ధ్వనించే సాంస్కృతిక పౌరుషం ఈ కథల్లో కనిపిస్తాయి. [1]

సాహిత్యం[మార్చు]

మార్టిన్ రాసిన 'కటికపూలు'లో ఇరవైకి పైగా కథలున్నాయి. ఈ కథల్లో గుంటూరు జిల్లా పొన్నూరు  ప్రాంతపు గత నలభై, యాభై ఏళ్ల దళిత జీవితం, వారి కష్టాలు, కన్నీళ్ళు, వెలివేతలు, ఊరుమ్మడి బతుకు, ఆనందాలు, విషాదాలు, వారి ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు కళ్ళకు కట్టినట్టు చిత్రించారు రచయిత. [2]

ఈ కథల్లో మార్టిన్‌ గ్రామీణ కుల సమాజం పోకడలు, కుల వ్యవస్థలో దళితులకు పలు రూపాల్లో నిత్యం ఎదురయ్యే అవమానాలు, వాటికి తోడు పేదరికం, వర్గపరమైన దోపిడీని సందర్భానుసారంగా చిత్రించారు. పెత్తందారీ కులాల పేదరికం, అణగారిన వర్గాల పేదరికం ఒకటి కాదని, దళితుల పేదరికం చుట్టూ వేలాడే 'అలగాతనం', అమానవీయత ఎలా ఉంటుందో ఎరుకల కులస్తుడు మొగిలి వెంకటేశ్వర్లు వంటి పాత్రల ద్వారా చూపించారు. "ఈ కథారచనలో కవిత్వం ఉంది, సున్నితమైన హాస్యం ఉంది, అన్నింటికీ మించి దళిత జీవితం పట్ల ప్రేమ, కన్సర్న్‌ ఉన్నాయి" అని ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి తెలిపారు. [3]

కటికపూలు తరువాత మార్టిన్ రచించిన కథా సంకలనం: 'పాదిరిగారి అబ్బాయి మరికొన్ని కథలు'. ఈ దేశంలో తరతరాలుగా కొనసాగుతున్న కుల వివక్ష, మత ఛాందసత్వం,ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ఇండస్ రచనలు సనాతనవాదులకు,ఛాందస శక్తులకు కన్నెర్రగా మారాయి. విషపు రాతలతో మొదలెట్టి వ్యక్తిత్వ హననం దాకా వీళ్ళు బరితెగించారు. కారంచేడు రుధిర క్షేత్రాల నుంచి, చుండూరు ప్రజా కోర్టుల నుంచి మనిషిగా యెదిగొచ్చిన రచయిత ఇండస్ మార్టిన్. అంటరాని జీవితం ఆయన సాహిత్య వస్తువయ్యింది. తను పేల్చిన మందుపాతరలాంటి కటికపూల ముచ్చట తర్వాత సరికొత్త నిబంధనగా పాదిరిగారి అబ్బాయి మన ముందుకొస్తున్నాడు. మనలో చాలామందికి తెలియనీ, మన చుట్టూతా సజీవంగా ఉన్న మరో ప్రపంచ ఆవిష్కరణే ఈ కథలు. పాదిరిగారి అబ్బాయి కథలు కటిక పూలుకు సీక్వెల్ రచన. ఈ తరానికి ఇండస్ అందిస్తున్న కొత్త సిలబస్. ఈ బియాండ్ టెన్ కమాండ్మెంట్స్ ఇండస్ అందిస్తున్న మరో జీవన ప్రపంచo ఆవిష్కరణే ఈ కథలు, అని సత్యరంజన్ కోడూరు గారు సంక్షిప్తంగా ఈ సంకలనాన్ని పరిచయం చేశారు.[4][5]

ఈ పుస్తకాన్ని సారంగ సాహిత్య పక్ష పత్రికలో సమీక్షిస్తూ డా. ఏ.కె. ప్రభాకర్ ఈ విధంగా వ్రాసారు, "ఇండస్ మార్టిన్ ‘కటికపూలు’ చదవక ముందు నుంచీ సోషల్ మాధ్యమంలో అతని రచనలు అడపా తడపా  చదివినా  కటికపూలు  కథనాలన్నీ ఒకచోట  చూసినప్పుడు వాటిలోని పచ్చి జీవన వాస్తవికత నన్ను కట్టిపడేసింది. ఆ వాస్తవికత  అతని  భాషలోని పదును  సృజించినదే.  ఇండస్ వాక్యంలో వాడి  వుంది.  అందులో ధిక్కారం వుంది. తిరుగుబాటు వుంది.  ఆత్మ గౌరవం వుంది. సత్యముంది. నిబద్ధత వుంది. అతని ఆలోచనల్లో స్పష్టత దృక్పథ పటిమ అతని సృజనాత్మకతని తీక్ష్ణం చేశాయి అని బలంగా అనిపించింది.   అప్పటి నుంచీ అతనేం రాసినా చదివాను. అలా దృష్టికి వచ్చినవే పాదిరిగారి అబ్బాయి కథలు. ‘సారంగ’లో (డిసెంబర్ 2018 లో) మొదలైన యీ కాలమ్ తర్వాత యెందుకో కొనసాగలేదు. కవిత్వంలో మద్దూరి నగేష్ బాబు చేసిన పని వచనంలో ఇండస్ మార్టిన్ చేస్తున్నాడు. రచయితగా సామాజిక వ్యాఖ్యాతగా దీని  కొనసాగింపు అవసరాన్ని అతను తీరుస్తున్నాడని కూడా అనిపించింది. అందుకే అనేక జీవన వ్యాపకాల్లో వొకచోట నిలవని మనిషిని సాహిత్య ‘గుడారం’ కిందికి గుంజుకు రావాల్సి వచ్చింది.  దాని ఫలితమే ‘ఇంతపర్యంతం’.

భాష కేవలం భావ వినిమయం కోసమో సమాచార ప్రసారం కోసమో మాత్రమే వుపయోగపడదు. సంస్కృతికి అది వాహిక కూడా. అంతేకాదు; అసమ సమాజంలో ఆధిపత్య వర్గాల చేతిలో భాష అణచివేత సాధనమైంది. వర్గ స్వభావాన్ని సంతరించుకుంది. దాన్ని ప్రజాస్వామ్యీకరించుకొని   పోరాట పరికరంగా మలచుకోవాల్సిన అవసరం వుంది. ఈ  యెరుకతో మార్టిన్ తన భాషని సానపట్టాడు. మౌఖిక కథన శైలిని ఆశ్రయించి అమ్మ యాసను అద్దాడు. దాంతో  పనిముట్టు ఆయుధమైంది. ఆ విద్య  అతనికి జీవితం నుంచి సహజంగా అలవడింది. అందువల్ల  అతని ప్రతిరచనా పాఠకులతో పేగుబంధం యేర్పరచుకుంది. ఇప్పుడీ కథలు కూడా అందులో భాగమే."[6]


సూచికలు[మార్చు]

  1. "ఎట్టి మనుషుల మట్టి కథలు, [[విరసం]] వెబ్ పత్రిక, తేది: 2.05.2018". Archived from the original on 2019-03-31. Retrieved 2020-03-25.
  2. "ప్రజాశక్తి పత్రిక వ్యాసం, రాజాబాబు కంచర్ల సమీక్ష".
  3. ప్రజాశక్తి పత్రికలో వ్యాసం, తేది: 11.02.2018
  4. మార్టిన్, ఇండస్ (2021). పాదిరిగారి అబ్బాయి మరికొన్ని కథలు. Hyderabad: Perspectives. p. 174. ISBN 978-9-38-117223-0.
  5. "పాదిరి గారి అబ్బాయి మరికొన్ని కథలు పుస్తక పేజీ".
  6. "బియాండ్ టెన్ కమాండ్ మెంట్స్ – సారంగ". magazine.saarangabooks.com. Retrieved 2022-01-03.

ఇవికూడా చూడండి[మార్చు]